ఆర్తి

వాన రానున్నదని చెప్పాను
తను చూస్తున్న చెట్టు,
తానూ తలవూచినట్లుగా ఉంది

కొమ్మల అంచున ఆకులు,
గుమ్మానికి కట్టిన తెరలు కదుపుతూ
చిన్న గాలి
ద్వారం దాటుకుని తాకిపోయింది

విడివిడిగా
పగలంతా దూదిపింజలై
ఎగిరిన మేఘాలు
మూకుమ్మడిగా
నల్లరాతి గుట్టలై
పేరుకుపోతున్నాయి

తేలికపడలేని తానూ
వాన మబ్బులా మారినట్లు
తెలియనేలేదు

మెరుపు రెక్కలు కట్టుకుని
నేలకి వాలిన నల్ల మబ్బుల
ఉరిమినట్లు వీచే ఈదురుగాలుల మోత
వెక్కిళ్ళ లో కలగలిసి,
మాటలు జారిపడుతున్నాయి
మనసు నుంచి...

తడి స్పర్శ
వాననీటి నుంచి,
తనని తట్టిన నా వేలి కొస నుంచి
వెచ్చగా చలిస్తున్న నాలోకి ఇనుకుతూ

దుక్కిచినుకులు నింపుకున్న
దుఃఖపు నేలనై

నాలోన ఉప్పెన ఊపు
ఓదార్పు కా/లే/దని
ఒప్పుకుంటూ

వరదలై పారుతున్న
విషాదపు నదులలో
మునిగిపోయాను

No comments:

Post a Comment