జాడ

కాలాంతరం లో
మది కి
దర్పణ బింబం కాగలది
నది మాత్రమే!
నెర్రెలు బారిన
నేలవంటి బ్రతుకులో
ఒకప్పుడు-
నిగనిగలాడే నీటి
సొబగుతో
ఉప్పొంగి పారేటి
నది ఉండేది.
ఇంకాస్త చెప్పాలంటే,
వరద భీభత్సాలకి
నిస్పృహలో నిలిచి,
గండి పడని గట్ల మీద
తనువు బద్దలు కొట్టుకుంది...
అంతలోనే
సుడులు తిరుగుతూ
ఉప్పెన గాట్లకి చీలిపోతూ
కలవని కయ్యల్లో ముగిసిపోతూ
మౌన చాతుర్యం మరిగిన ఒడ్డుకి
మరణ వాంగ్మూలం చెప్పుకుంది
నది నిజానికి హత్య చేయబడింది
ఇప్పుడిక
గగనాంకిత దృక్కుల్తో
విగతనది
ఎండిన ఒండ్రులో
ఇనికిపోయింది
నిమజ్జనానికి నది కావాలి
మరి,
ఆ మది ఆచూకీ ఎక్కడ?

No comments:

Post a Comment