వేసవివాన

ఒకానొక రేతిరిలో కమ్మని కలకన్నాను...
చిక్కని నేరేడు వన్నె మబ్బులు

నా పానుపుని అంటిపెట్టుకున్న
కెంజాయ ని కమ్ముకుని
ఆ జిలుగుని గుట్టుగా దాచి
తెలవారలేదని నమ్మజూపుతుంటే
వనదేవత వాకిలి లో
ఒక గారడీ చేసారెవరో;
మబ్బు ని కరిగించి
చషకం నిండుగా పట్టి
పుడమి పైకి విసిరారు.
గిన్నె నుంచి నల్ల ముత్యాలు
ధారలుగా జారుతున్నాయి,
వాటి మెరుపుల్లో
పచ్చని రంగు దాచుకుని ఆకులు
రవ్వల వాన నీటి చుక్కలుగా మారుస్తున్నాయి.
నేలకి వాలిన గాలులు
ఆకు ఊయలలో
ముత్యాల జల్లులో తడిసిపోతున్నాయి.
వెచ్చని ఊపిరితో
చప్పున లేచి పరుగులు తీసిన
నన్ను చూసి "అదిగో పగటి బాలుడు," అంటూ
కాలం కలకలా నవ్వింది.

No comments:

Post a Comment