వినిపించే గతం

ఈవేళ ముసాబు నిదుర లేపింది.
'అర్జున ఫల్గుణ కిరీటి పార్దా'
ఉరుము తో మెదిలే గ్యాపకం-
చెవులు మూస్తూ,
చేరువగా పొదుపుకుంటూ
ఓ హస్తం.
అమ్మ కప్పే చెంగు
వాన కురవక మునుపే
విచ్చుకునే ఛత్రం.

పదిలం గా గుండె తలుపు తీసుకుని
వెలికి వచ్చే గతకాలం-
పడవ పందేలతో,
పిల్లకాలువల్లో చిందులతో
ప్రాయం ఎరుగని మనసుల
పనుల తొందర..
మందలిస్తూ, మన్నిస్తూ,
వేడినూనె మర్దిస్తూనో,
వసాట్లో వేసిన పక్కలు మడుస్తూనో,
అమ్మకి, వాళ్ళమ్మకి, నానమ్మకి, నాన్నకీ
వానాకాలపు పనుల ఊదర.

సందెచీకట్లో-
కట్టెలపొయ్యి వెలుగులో
ఆరీఆరని బట్టల రెపరెపలు
రేగివడియాల చప్పరింపులు.
కిటికీ రెక్కల సందు,
ద్వార బంధాల మీదుగా
రేయంతా తేమగాలి విసురులు.
చెప్పుకోవాలని, చెప్తూనే
చెవులురిక్కించి వినాలనిపించే
గతించని మంద్రస్వరాలు
వానతో కలిసి కురుస్తూ.
ఇక, యీ పగలంతా
తడితడిగా లోపలా వెలుపలా...

5 comments:

 1. బయట నిజంగానే వర్షం పడుతోంది. అఫ్కోర్స్, ఉరుములు లేవనుకోండి :)
  కానీ మీ కవిత జ్ఞాపకాల జల్లుల్లో పూర్తిగా తడిపేసింది.

  ReplyDelete
  Replies
  1. నెనర్లు! జ్ఞాపకాలని మించిన పెన్నిధి ఏదీ ఉండదుగాండి...

   Delete
 2. Usha gaaru,'అర్జున ఫల్గుణ కిరీటి పార్దా'
  ఉరుము తో మెరిసే జ్ఞాపకం-
  చెవులు మూస్తూ,
  చేరువగా పొదుపుకుంటూ ఓ హస్తం.
  పదిలం గా గుండె తలుపు తీసుకుని chaalaa chaalaa bagundi:-):-)

  ReplyDelete
  Replies
  1. సంతోషమండి, ఈ వాన తాలూకు బాల్యం అందరిదీ కదా!

   Delete
 3. శానా బాగా పాడీస్నారండీ ప్చ్ అంతే తలుచుకుని మురిసిపోవాల్సిందే వానచుసి మురిసే టైమెవరికుంది..... అలాగే ఆ వానకూడా రానా వద్దా అంటు వచ్చింది కొన్నిరోజులుగా అదీ లేదు....

  ReplyDelete