అగ్నిపునీత - ఆత్మవంచన

అగ్నిపునీతవి కమ్మని నిను నిలదీసిన మగని
నీ ప్రేమజ్వాలలో ప్రక్షాళనకమ్మని అడగవైతివి.
మారు ప్రశ్నలేయక స్త్రీ ఆత్మాభిమానానికి చిహ్నమైతివి.
యుగయుగాలు తరిచినా తరగని ఉన్నతిని పొందితివి.
నీవు లేని సీతారాముడు ఇనకుల యశస్వి కాగలడా?

ఉపరితలాన దావానలమై, కడలి గర్భాన బడబానలమై
చెలరేగినా అవని మీద అంగుళంమైనా దహించలేని అగ్ని,
అయోనిజవి నిన్ను తాకలేని అబలుడు కాదా?
నిజానికి నీ పాదస్పర్శతో పునీతుడు అయింది ఆ అగ్నే కాదా?
అమ్మని మించిన క్షమచూపగ మహిలో మణిపూసవి నీవుకాదా?

ఎవరికి ఆదర్శమని మరల నిన్ను కారడువుల పాల్చేసాడు?
నిండు చూలాలివి ఎంత మనోనిబ్బరాన తరలివెళ్ళితివి!
నిను ఎడబాసి అశ్రుకడలిలో శోకతప్తుడాతడైతే,
కవలల పెంపకాన మునిగితేలిన ధీరోదాత్తురాలివి నీవైతివి.
వాల్మీకి రామాయణ అగ్రతాంబూలం నీకు కాదా తగినది?

ప్రేమిక నిను తనరూపుగ నిరతం నిలుపలేదా?
రామునికై అనురాగకోవెల నీ హృదయమె కాదా?
ఆత్మసౌందర్యాన నీకు ఉపమానం ఎవరమ్మా జానకమ్మా?
మాయాసీతగా నీ రూపు లోకానికి చూపగ ఒరిగినదేమి?
తన పడతిని పతితగ ముద్రవేసిన లోకానికి అతను చూపినదేమిటి?

వనవాసాలు, అసురుని చెరలు, ఆశ్రమజీవనాలు, అంతఃపుర దాపరికాలు
ఎన్ని విధాలు నీ సహనానికి పరీక్షలు?
నీ మనసున నిలిపిన మూర్తిని నీవు విడనాడినది ఎప్పుడు?
విరహాన, విలాపాన ఆతని స్మరణ మరిచినది ఎపుడు?
గుణగణాలు ఎన్ని గణించినా ఆత్మవంచన చేసుకున్నది ఎవరిట?

45 comments:

  1. మారుమాటాడక అగ్నిపునీతయైన సీతమ్మ
    జనావళి జీవితాల నిత్య తులసి కదా!
    ఎదురు తిరిగి మాటాడిన మగని మదిని గెలువగలదా?
    బెదురి పోయి చెదరిన రాముని చరిత ఏమయ్యెడిది?

    స్త్రీ జాతికి జాతిరత్నమీ జానకి
    యుగయుగాల చరితన
    చరిత్ర పుటల్లో ఏ యోనిజ సరిసాటి ఈ అయోనిజకి?
    ఏ మానవాళి ఒసగిన మణిపూస ఈ మహిమాన్విత

    కారడవుల నిలచింది కట్టెలాంటి శరీరమే కదా
    మగని చెంతనే కదా ఈ జీవమున్న శరీరం
    కానలందు కన్నది సీతారాముల చరితనేకదా

    సహనమున్న సీతమ్మలెక్కడ నేడీ భారతావనిన
    విడిపోవు కాపురాలకు సీతారామ చరిత తెలుసునా?
    వదిలించు కొనే తల్లులకు లవకుశ జన్మము తెలిసేనా?
    రామాయణమడుగంటితే భారతావని నిలిచేనా?

    ReplyDelete
  2. wonderful expressions.

    so deep and so touching

    ReplyDelete
  3. అప్పుడెప్పుడో చదివాను, విశ్వనాధవారు రామాయణకల్పవృక్షంలో ఈ ఘట్టాన్ని బహుచక్కగా వర్ణించారని. వర్ణిస్తూ ఆ అగ్నిప్రవేశంలో ఆర్ద్రతను పలికించారని విన్నాను. అయితే ఆ గ్రంధం చదివే భాగ్యం ఇంతవరకు కలుగలేదు. కనుక ఎవరైనా ఆ గ్రంధాన్ని చదివినవారుంటే అగ్నిప్రవేశఘట్టంపై వ్యాఖ్య రాయగలరు.

    ఇహ చూడబోతే, ఈ కవిత లోతు చాలానే ఉన్నట్టుంది. ఇలాంటి కవితలు, ప్రశ్నలు మగజాతిమీద వస్తూనే ఉన్నాయి, దానికి ఉత్తమపురుషుడు రాముడు బలికావడమన్నది వైపరీత్యమే. అయితే, ఇదొక నిందాస్థుతి అనుకోవాలి అంతే.
    ఏమి చేస్తాం.. ప్చ్.
    అయితే, భర్తను తిడుతూ భార్యను పొగడుతూ ఉంటే ఏ భార్య ఆనందిస్తుందో, కరుణిస్తుందో నాకు తెలియదు కానీ, జానకమ్మ మాత్రం కరుణించదేమో.

    ReplyDelete
  4. దీని గురించి చాలా చాలా వాదోప వాదాలు ఇది వరకే జరిగి పోయాయి, అప్పటి వ్యవహారాన్ని మనం ఇప్పటి లెన్స్ లో చూడకూడదు కాబట్టి కామెంటే లేదు సీతా రాముల మీద.. ఇప్పటి కాలానికి అప్పటిది అన్వయిస్తే మాత్రం సుద్ద దండుగ. ఇప్పటి రాములోర్లకు అంత నిబద్దత లేదు ఆడదాన్ని చులకన చేసి సీత కన్నేయ గల పురుషోత్తమత్వం తప్ప. ఇంక ప్రదీప్ గారన్నట్లు మా మీద అభాండం అని వాపోతే... ఏమో నేను తక్కువ మంది ని చూసేను కాబట్టి మంచోళ్ళు లేరని కాదు, మీరు చూడలేదు కాబట్టీ చెడ్డోళ్ళు లేరనీ కాదు...

    ఉషా ప్రేమించటమంటే... నువ్వు పైన కవితలో చెప్పినవన్నీ చెయ్యటమా????????


    భా.రా.రే: నీకు బాగా నిద్రచ్చినట్లుంది గా ఇష్టమొచ్చినట్ళు కవిత రాసేసేవు గా అబ్బయ్..
    "మారుమాటాడక అగ్నిపునీతయైన సీతమ్మ
    జనావళి జీవితాల నిత్య తులసి కదా!
    ఎదురు తిరిగి మాటాడిన మగని మదిని గెలువగలదా?
    బెదురి పోయి చెదరిన రాముని చరిత ఏమయ్యెడిది?"

    అహా అంటే ఆమె నిత్య తులసయ్యింది మారు మాట్లడనందుకా?
    ఎదురు తిరిగి మాట్లాడితే మగని మది గెలవలేదని మాట్లాడలేదా. నిజం గా నిద్రొచ్చిందా?
    "కారడవుల నిలచింది కట్టెలాంటి శరీరమే కదా
    మగని చెంతనే కదా ఈ జీవమున్న శరీరం
    కానలందు కన్నది సీతారాముల చరితనేకదా"
    :-| :-| :-| రామచంద్రా ఈ మాట్లేమిటి రా బాబోయ్..
    "సహనమున్న సీతమ్మలెక్కడ నేడీ భారతావనిన
    విడిపోవు కాపురాలకు సీతారామ చరిత తెలుసునా?
    వదిలించు కొనే తల్లులకు లవకుశ జన్మము తెలిసేనా?
    రామాయణమడుగంటితే భారతావని నిలిచేనా?"
    హే భగవాన్ ... నాకు ఏడుపొస్తోంది ఈ కవిత చూసి.. ఈ కవిత చదివి ఇంకా భా రా రే మీదకు కత్తులు విసర కుండా నాకు సహనాన్ని ప్రసాదించు తండ్రి..

    ReplyDelete
  5. భా రా రె గారు,

    సహనమున్న సీతమ్మలెక్కడ నేడీ భారతావనిన
    విడిపోవు కాపురాలకు సీతారామ చరిత తెలుసునా?
    వదిలించు కొనే తల్లులకు లవకుశ జన్మము తెలిసేనా?
    రామాయణమడుగంటితే భారతావని నిలిచేనా?"

    Excellent expressions!!!!!

    ఒక వంద వీరతాళ్ళు నా తరుపున.

    మరువం గారు చాలా చాలా నచ్చింది మీ కవిత.

    ReplyDelete
  6. చాలా బాగుంది ఉష గారు.

    ఎన్ని విధాలు నీ సహనానికి పరీక్షలు?
    సీతమ్మవారిని తలచుకున్నపుడల్లా నామదిని కూడా కదలాడే ప్రశ్నే ఇది.

    ReplyDelete
  7. ఆమె పుట్టిన మిథిల ధన్యం ( సహనం )
    ఆమె మెట్టిన అయోధ్య పావనం ( క్షమ )
    ఆమెని తాకిన అగ్ని పునీతం ( నమ్మకం )
    ఆమె ఏతరం వనితకైన ఆదర్శం ( ధైర్యం )
    ఉష గారూ ! ఏదో చెప్పాలనుకొని ఏదో రాశాననుకుంటా ..భావవ్యక్తీకరణ అస్సలు చాతకాదు ..
    భర్తమీది నమ్మకం ,ప్రేమా ఆమెని అన్ని పరీక్షల్లో గెలిపించాయి ...ఆమె సహనం ఆమెను స్త్రీలందరికీ ఆదర్శంగా నిలిపింది .ఐనా సాటి స్త్రీగా మనకు ఆమె కష్టం పట్ల ఉక్రోషం వస్తుంది ...నిజం ఇప్పటికీ లవకుశ సినిమా చూసినప్పుడల్లా .....ఎన్టీ రామారావు గారిమీద భలే కోపం వచ్చేస్తుంది నాకు :)

    ReplyDelete
  8. ఇక్కడ నేనేమన్నా అంటే హిందూ ద్వేషినని దాడి చేస్తారేమో, మొన్నొక సైట్ లో అలానే జరిగింది. ఏదేమైనా మీరు నిజం రాసారు. సహనం ఒక్క స్త్రీ మూర్తికే ఎందుకు ఉండాలి. దీనిని ఇంత బలవంతంగా రుద్ది తమ పురుషాధిక్యాన్ని, అధికారాన్ని నిలిపుకునే క్రమంలో సృష్టింపబడ్డాయి ఇటువంటి పాత్రలు అన్నది నా అభిప్రాయం. ఇంతకంటే ఎక్కువ రాస్తే తమ భావాలు దెబ్బతింటాయేమో?...

    ReplyDelete
  9. పలువిధాలుగా వ్యక్తమైన స్పందనలకి ధన్యవాదాలు. సీతారాముల్లో ఎవరు గొప్ప, ఎవరిది ఒప్పు అన్నది కాదు ఇక్కడ నా కవిత ఉద్దేశ్యం. నేను చూసిన కోణం నాకు తెలిసిన రీతిలో చెప్పాను, అంతే. భర్తని ప్రశ్నించటం/తెగనాడటం, భార్యని అభినందించటం/పొగడటం కానేకాదు. ఇలా వ్రాసి సీతమ్మ కరుణకి పాత్రురాలను కావాలనుకోవటం అంతకన్నాకాదు.

    భా.రా.రె, తొలి వ్యాఖ్యకి సంతోషం. మీ సమాధానం కొరకు చూస్తాము.

    బాబా గారు, ధన్యవాదాలు.

    వేణు, నేను కూడా దైవాల చరితల్లో కాస్త వివరణ, వితరణ వెదుక్కునే తత్వమున్నదాన్ని కనుక అపుడపుడు ఇలా ఆ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటాను.

    పరిమళం, భలేవారే, అంత చక్కగా ఆమె సుగుణాలు ఏమిటో వ్రాసి అలా అంటారేమి?

    భావన, ఇక్కడ నేను ప్రధానంగా తెలపాలనుకుని అలాగే చెప్పానేమోనని బాబా గారి వ్యాఖ్యతో సమాధానపడి, నీ ప్రశ్నతో సంశయంలో పడ్డది - (౧)సీత జీవితంలో ఎన్ని విపత్కర పరిస్థితులు, వత్తిళ్ళు ఎదురైనా నిబ్బరంగా తన భాధ్యతలన్నీ నెరవేర్చిన ఆమె సామర్థ్యం [అది మనకి ఇప్పటికీ ఆదర్శం] (౨) అన్నిటా ఆమెకి రాముని పట్ల గల ప్రేమలో ఏమీ మార్పు రాకపోవటం. ప్రేమంటే ఆ పనులు చేయటం కాదు. ప్రేమించగల మనసుకి ఆ ఇతర గుణాలూ వస్తాయి, ప్రేమలో బలం అంటే విరహాన స్మరిస్తూ కూర్చోవటం కాదు, విలాపాన నిస్సహాయమవటం కాదు.

    ప్రదీప్, మగవారిని నిందించటం లేదిక్కడ. సీతమ్మ కరుణకి అర్రులూ చాచటం లేదు. పైన వివరణ ఇచ్చాను. మీకు "అగ్ని ప్రవేశం" మీద వచ్చిన ఈ వ్యాసం, చర్చ నచ్చవచ్చు - http://uniqcyberzone.com/svennela/?p=66

    నా కవిత వ్రాసాక ఈ శీర్షిక ఎవరైనా వాడారా అని చూసినపుడు కనపడింది.


    నీహారిక, చాలా కాలానికి రాక. సంతోషం.

    శ్రీనివాస్, థాంక్స్.

    ReplyDelete
  10. రామాయణంలో సీత పాత్ర ఎలా ఎదిగిందీ అని ఒక అధునాతన విశ్లేషణ చదవాలంటే వోల్గా రాసిన మృణ్మయ నాదం కథ చూడండి. ఇది కథా సాహితి వారు ప్రచురించిన కథ2006 సంకలనంలో ఉంది.

    ఉషగారు, స్పెల్లింగుల్ని కొంచెం పట్టించుకోండి .. దావానలం, బడబానలం.

    ఇంకోమాట: పాత కథల్ని ఆధునిక దృష్టితో చూసినా, పాత్రౌచిత్యాన్ని పాటించాలి. ప్రియురాలి పాదస్పర్శ కృష్ణుడికి రాధతోనూ సత్యభామతోనూ జరిగినట్టు కథలున్నాయి గానీ, రాముడికి సీత పాదస్పర్శ జరిగిందంటే ఎబ్బెట్టుగా ఉంది.

    ReplyDelete
  11. కొత్తపాళీ గారు, ఓల్గా గారి "విలుకత్తె సీత" చదివానండి. మీరన్న కథ చదవాలి. ఇక పాద స్పర్శ అన్నది "అగ్నిపునీత" అన్న పరంగా "అగ్ని" అమె వలన పునీతమయ్యాడు అని ఉద్దేశ్యించినది, మీరన్నట్లు కాదు. పాత్రౌచిత్యాన్ని ఎక్కడా విస్మరించలేదనే అనుకుంటున్నాను, గురువు గారు. పావనమైన ఈ చరితలో నాకు అగుపించిన మరో చిత్రం ఇది అంతే. స్పెల్లింగ్ మిస్స్టేక్స్ చూస్తాను. ధన్యవాదాలు.

    సంఘమిత్రన్, మీ అభిప్రాయానికి థాంక్స్. స్త్రీ పురుష పరమైన సంవాదాలకి లోటురానీయనివే మన పాత చరితలు, నడుస్తున్న కథలు.

    ReplyDelete
  12. ఇక్కడ ఆత్మ వంచన అనే మాటే లేదు. మొదటి నుంచీ కాస్తంత ఎక్కువే అపార్థం చేసుకోబడ్డ విషయం ఇది.

    That was a case study for 'values, and hero worship' too. She gave her best to him. Whether she was reciprocated or not is to be understood by one's own metaphysical value judgements. I HAVE TO WRITE A POST ON THIS TOOPIC.

    నేను వ్రాసింది కాదు కానీ, ఇదొక్కసారి చదవండి.

    http://priyamainamaatalu.blogspot.com/2008/08/blog-post_08.html

    ఎవరో ఒకరి తరఫునుంచే ఆలోచిస్తే వచ్చే సమస్య ఇది.

    ReplyDelete
  13. అగ్ని పునీత అయి బయటకు వచ్చిన సీతమ్మవలె ఉద్వేగం ఊపిరాడనంతగా వణికించేసిన విచిలితమైన స్థితినుంచి బయటపడ్డ మీకు అభినందనలు.మీ కవితకు వ్యాఖ్య సరిఅయినది కాదని అనిపిస్తే తొలగించండి.

    ReplyDelete
  14. అనాల్సినదంతా అనేసి, మళ్ళా మగవారిని నిందించలేదంటరా...హన్నా
    " ఎవరికి ఆదర్శమని మరల నిన్ను కారడువుల పాల్చేసాడు? "
    " మాయాసీతగా నీ రూపు లోకానికి చూపగ ఒరిగినదేమి?
    తన పడతిని పతితగ ముద్రవేసిన లోకానికి అతను చూపినదేమిటి? "
    " గుణగణాలు ఎన్ని గణించినా ఆత్మవంచన చేసుకున్నది ఎవరిట? "
    ====
    ఇక,
    " అయోనిజవి నిన్ను తాకలేని అబలుడు కాదా?
    నిజానికి నీ పాదస్పర్శతో పునీతుడు అయింది ఆ అగ్నే కాదా? " - ఇక్కడ సాక్షాత్తు అగ్నిదేవుడినే తక్కువ చెయ్యలేదా ?
    అగ్నిని తండ్రివలె స్మరించి అగ్నిప్రవేశం చేసిన సీత పాదస్పర్శతో అగ్నిదేవుడు పునీతుడవ్వడమేమిటి?
    పిల్లల పాదాలను చేతిలో పెట్టుకుని నడిపించిన తండ్రి పునీతుడా పిల్లలపాదస్పర్శతో?
    ===
    ఇక, ఒక గీతను పెద్ద గీత చెయ్యాలంటే పక్కన చిన్న గీత రాయాలనే ఫార్ములాతో పాత్రలను తక్కువ చేస్తూ రాయడమేల? అందునా మీ వంటి రచయిత్రుల కవితలు ఎక్కువ మంది చదువుతారు.

    " మీకు విషం పెట్టారు, లక్క ఇంటిలో కాల్చడానికి ప్రయత్నించారు, నీ భార్య గుడ్డలూడదీసారు. లే సంహరించు" అని కృష్ణుడు అంటే గీత అవసరం ఉండేదా ?
    రెచ్చగొడితే పోయేదానికి ఎందుకు ఎంచుకున్నాడు అంత పెద్ద గీత ?
    ===
    పైవి నా సందేహాలు మాత్రమే. తప్పులు నావి కావచ్చు, మీవైనా కావచ్చు.

    ReplyDelete
  15. హమ్మయ్య నాకిప్పుడు ప్రశాంతంగా వుంది. మరువపు వనం కాస్తా రామాయణంలో కిష్కిందకాండగా మారినందుకు :)
    ఉషగారూ మీ బ్లాగులో కొంచెం ఎక్కువ స్పేస్ ను వాడుకుంటుంన్నందుకు ముందుగా మన్నించాలి.
    ఇకపోతే, మీ కవితకు ప్రతిగా నేను వ్రాసిన వ్యాఖ్య రాములోరిని తక్కువచేసో లేక సీతమ్మని ఎక్కువచే్సో చెప్పాలని నా వుద్దేశ్యం కాదు. అసలు వారిరువురు వేరు వేరు అనే భావనేలేదు నాకు. కాకపోతే సందర్భం సీతమ్మ గురించి కాబట్టి, సీతాదేవి గురించే వ్రాసాను. ఆమెకు మీరన్నట్టు ఆత్మవంచన చేసుకోని రామునికోసం వేచిచూడాల్సిన అవసరం కూడా లేదు. వేచి చూసింది కాబట్టి ఇక ఆత్మవంచన ఎక్కడ?

    ఇకపోతే హమ్మో భావన గారూ కత్తులన్నీ గుత్తుల గుత్తుల విసిరేసి మళ్ళీ "ఈ కవిత చదివి ఇంకా భా రా రే మీదకు కత్తులు విసర కుండా నాకు సహనాన్ని ప్రసాదించు తండ్రి" అని ప్రార్ధనొకటి. ఇంకా విసరని కత్తులేమన్నా వుంటే సానపెట్టి విసరండి :)విషయం ఎలాగూ పదిముందు చర్చకొచ్చింది కాబట్టి నేనూ ...
    అవునండీ మారుమాటాడక అంటే " నేనెందుకు దూకాలి అని అడగకుండా అని కదా " ? అసలు సీతమ్మవారిని ఆ ప్రశ్న అడగకుండా అడ్డుకున్నారా ఎవరైనా? ఎందుకు మాటాడలేదు? "కనిపించకపోతే పోయింది యువరాజంతటి వాడిని నాకు యువతి(లు ) కొదువా అని రాముడనుకోని వుంటే? పరిస్థితి ఏంటి? తనను వెదకకపోతే అడ్డుకొనేదెవరు? ఇవన్నీ సీతమదిలో రాని ప్రశ్నలని మీరనుకుంటున్నారా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం తనకు కనిపించిన సమాధానం రాముని ప్రేమ ఒకటే.... అందుకే మారు మాటాడని మహిమాన్విత.

    ఇక రెండోది

    ""కారడవుల నిలచింది కట్టెలాంటి శరీరమే కదా
    మగని చెంతనే కదా ఈ జీవమున్న శరీరం
    కానలందు కన్నది సీతారాముల చరితనేకదా" :-| :-| :-| రామచంద్రా ఈ మాట్లేమిటి రా బాబోయ్..

    :-):--)

    ఏమీ బాగాలేవా? చెప్పండి నేస్తం ఏం నచ్చలేదో. మీ ప్రశ్న బట్టి మా సమాధానం :)

    ఇక మూడోది

    "సహనమున్న సీతమ్మలెక్కడ నేడీ భారతావనిన
    విడిపోవు కాపురాలకు సీతారామ చరిత తెలుసునా?
    వదిలించు కొనే తల్లులకు లవకుశ జన్మము తెలిసేనా?
    రామాయణమడుగంటితే భారతావని నిలిచేనా?" హే భగవాన్ ... నాకు ఏడుపొస్తోంది ఈ కవిత చూసి..

    మీకు అర్థమయ్యే ఇలా అనిపించిందేమో మరి. సంసారంలో సహనం లేకపోతే ఒక్కొక్కరు నెలకో కాపురం చేయాలి. కాదంటారా? లవకుశల జననం గుర్తుంచుకుంటే పసికందు మరణాలు, అనాధ బాలల సంఖ్య అంతగా పెరగదేమో. ఇక రామాయణం లేని భారతావనిలో నాకు కనిపించేవన్నీ డేటింగ్, మ్యారేజ్, నచ్చలేదా ఓకే డైవర్స్ .. తరవాత నాకిద్దరూ నీ కిద్దరూ పిల్లలు.అందరూ కలిసి మనపిల్లలు. ఇదీ నాకు రామాయణం లేకుండా కనిపించే భారతావని.

    ReplyDelete
  16. హ్మ్... నిజం గానే మన అందరం కలిసి మరువపు వనాన్ని కాస్తా కిష్కింద కాండ చేస్తున్నాము..
    ఐనా తప్పేది ఏమి వుంది భా. రా.రె నేను కత్తులు విసురుకోవటం మొదలు పెట్టేక... ఉష కు తప్పుతుందా రెఫరీ పని. ఆమె ఈల వేసి ఆపే వరకు ఆగదు ఈ సమరం...
    మొదటి పేరా కు:
    సీత మహిమాన్విత అందులో అనుమానమే లేదు రాముడూ ఒక మహా పురుషుడూ నాకైతే అందులో అనుమానమే లేదు కాని 'ఎదురు ప్రశ్న లడగకుండా దూకినందుకో' లేక 'ఆమె కోసం నాకెందుకు ఇంకో ఆమె ను వెతుక్కుందాము' అనుకోనందుకో కాదు.. ముందు నేను నెగిటివిటీ మాట్లాడతాను కోపం తెచ్చుకోవద్దు. ఎందుకనో నాకు తెలియదు రామాయణం లో సీతమ్మ పాతివ్రత్యమో లేదా రామయ్య అనురాగమో..... 'ఆమె నిప్పులలో దూకటమో' లేదా 'ఆమె కోసం ఆయన ఏడవటమో' కొలమానం గా తీసుకుని చెపుతారు. నాకెందుకో ఈ కాలం లో ఆడవాళ్ళను ఎక్స్ ప్లాయిట్ చెయ్యటం కోసం వాడుకున్న సంఘటనలు అవి అనిపిస్తాయి. ఆ కాలానికి (అది సత్య యుగమనుకుంట కదు).. అప్పటి విలువల ప్రకారం అప్పుడనే కాదు ఏ కాలానికైనా నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది.. నేను చేస్తున్నా అనే భావన తో( అందరం అలానే చేస్తాము ఎక్కడో మహానుభావులు తప్ప) చేసిన ప్రతి పని ఆ కర్మ ప్రభావాన్ని మన మీద వదులుతుంది మంచైనా చెడు ఐనా.. అది ఎంత తొందర గా తిరిగి వస్తుంది అనేది నాకు తెలియదు. సీతమ్మ అనుక్షణం రామయ్య తోటి వుండటమే తన జీవితానందం గా వున్న ఆమె (అది తప్పా ఒప్పా అనేది కాదు ఇక్కడ చర్చ... అది మొదలు పెడితే అప్పుడు ఈ చర్చ స్వరూపం వేరై పోతుంది) బంగరు లేడి కోసం ఆయనను తనను వదిలి వెళ్ళమంటుంది ఆ ప్రలోభానికి శిక్షే ఆ ఎడబాటు అట.. ఆమె రాముడు 'హా లక్ష్మణా' అని అరవగానే అంతటి మహిమోన్వితుడైన ఆయన గొప్ప తనాన్ని మర్చి పోయి లక్ష్మణుడిని వెళ్ళమంటుంది అది ఒక తప్పు, తప్పు అంటే ఆమె నమ్మకం సడిలింది అది అక్కడ విషయం, ఆమె పరుగున వెళ్ళకుండా లక్ష్మణుడిని వెళ్ళమంది.... అంతే కాక క్షణికమైన వుద్రేక దుఖఃలకు లొంగి పోయి లక్ష్మణుడిని అనరాని మాటలతో తూలనాడుతుంది.. ఆ మాటల దోష పరిహారం ఆమెను చుట్టుముడుతుంది... అందుకే ఆమె రాముడి తో ఆ మాదిరి నిందా పూర్వక మాటలను పడుతుంది.. ఎంతటి వారికైనా ఆ అనుభవాలు తప్పవు అని చూపించటం కోసం రాసిన సంఘటనలను మనం వేరే గా అర్ధం చేసుకుంటున్నాము. ఇవి అన్ని నాకు గురు ముఖం గా తెలిసినవే.. ఇక రాముడంటే ఆయన ఎందుకు బాధ పడ్డాడు అనే దానికి కూడా నాకు మా గురువు గారు చెప్పేరు కాని ఇప్పటికే చాలా రాసేసేను అందుకే ఆపేస్తున్నా.. ఇప్పుడూ ఈ కోణం నుంచి చూడు భా రా.రే

    ఇక ఆఖరి పేరా
    మీరన్నది నిజమే సర్దుకోవటం సహనం అనేది ప్రతి సంసారం కు ఇద్దరికి వుండవలసిన లక్షణాలు. కాని మన పవిత్ర భారతావని లో (వ్యంగ్యం గానే అంటున్నా ఈ మాట) ఏ రోజైతే స్త్రీ చేసే శ్రమ కు విలువ లేకుండా పోయిందో ఆమె ఇంట్లో వుండే సెకండ్ క్లాస్ సిటిజెన్ గా పరిగణించటం మొదలు పెట్టెరో ఎప్పుడైతే ఎంత అధ్బుతమైన జంట లో కూడ 'నేనేమన్నా వుద్యోగం చేస్తున్నానా' అని స్త్రీ తనను తాను అనుకున్న క్షణం వచ్చిందో అలా ఆమె అనుకునే పరిస్తితి ని తర తరాలు గా నెమ్మది గా ఆమె మెదడు లోకి ప్రవేశ పెట్టటం జరిగిందో, ప్రపంచం లోకే అధ్బుతమైన విషయం ఇంకొక జీవానికి ప్రాణమివ్వటం అనేది ఒక విలువ లేని పని గా స్త్రీ పురుషులిద్దరికి ఐపోయిందో, వాళ్ళను పెంచటం అనేది స్త్రీ కు ఒక గుర్తింపు లేని భాద్య త గా అంట గట్టబడిందో, మళ్ళీ తిరిగి చెపుతున్నా బయటకు వెళ్ళి సంపాదించటమే శ్రమ కు గుర్తింపు గా విలు వ గా ఈ సమాజం గుర్తించటం మొదలు పెట్టిందో అప్పటి నుంచే కుటుంబమన్న పదం విచ్చిన్నమవుతూ వస్తోంది కొత్త గా ఇప్పుడు అయ్యేదేమి లేదు.. దానికి సీతమ్మ సహనానికి ముడి పెట్టకండి. ఒక వస్తువు కు వుండే రెండూ ముఖాలు గా రెండూ స్వరూపాలుగా మెలగవలసిన స్త్రీ పురుషులిద్దరి లో ఎవరు ఎక్కువ అనే ప్రశ్న మొదలయ్యిందో ఆ రోజే పోరాటమూ మొదలయ్యింది. ఇది నా అభిప్రాయం మాత్రమే నచ్చక పొటే వదిలెయ్యండి కత్తులు దుయ్యాలనుకుంటే దుయ్యండీ కాని వ్యక్తిగతం గా మాత్రం దయ వుంచి వద్దు...

    ReplyDelete
  17. భావన, ఇంతకు ముందు టపాలో నిషిగంధకి చెప్పాను "వీర గంధం" దిద్దుకున్నానని. చదివావా? ;) నా వ్యాఖ్య కూడా రంగంలోకి వస్తుందిక.

    గీతాచార్య, మీరేమిటండి "రామాయణం లో పిడకల వేట" అన్నట్లు నా బ్లాగు విజిటర్ కౌంట్ కథ తెచ్చారు తెర మీదకి. ఒక్కోసారి అది భయం పుట్టిస్తుంది. నా రచనా స్వాతంత్ర్యం పోనుందా అనని, ఇక్కడకి వచ్చే మహామహుల ముందిక కుప్పిగంతులేయలేమోనని. ;)

    ReplyDelete
  18. రానివ్వండి రానివ్వండి అన్నీ వ్యాఖ్యానాలను.చదువుతూ వున్నాను. భావన అన్నట్లువ్యక్తిగత వివరాలలోకి వెళ్ళకుండా చర్చిద్దాము. మరొక రామాయణం వ్రాద్దాము.తుదకు రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని ఎవరి అభిప్రాయాల్లో వారుంటారు అనుకోండి.కానివ్వండి.

    మీరు యుద్ధకాండానికి వచ్చేదాకా నే కామెంటను.వర్కింగ్ ఆన్ హారం.
    రేప్పొద్దున మంత్రాలన్నీ గుర్తుతెచ్చుకోని అప్పుడు వస్తా.

    ReplyDelete
  19. వీరగంధము దిద్దుకున్న వీరవనితలందరూ ఆహ్వానితులే :)

    ReplyDelete
  20. నేను కూడా వ్యాఖ్యలన్నీ కాస్త బుర్రపెట్టి చదువుతున్నానింకా. మాకు మేము దిద్దుకోనూగలము. రానివారికి [ఎవరో వారు ;)] దిద్దనూగలము "వీర గంధం". మా నారీ లలానామణులంతా మా ఇద్దరి మీద ఇంత నమ్మకం వుంచారు. చూసారా? అది మా ఐకమత్యత. :)

    ReplyDelete
  21. గీతాచార్య, ఇక్కడ ఆత్మవంచన చేసుకున్నది ఆ దంపతుల చరితని ఇన్ని యుగాలుగా ఇంచుమించు ఒకేరీతిలో అందించిన రచయితలది. రాముని, సీతని సృజించిన రచనలది. అవి ఇంకా ప్రాచుర్యంలో వుండి, ఆదరణ పొందగాలేనిది ఈ ఒక విశ్లేషణని స్వాగతించలేమా? ఇదే రాముని పరంగా వ్రాస్తే స్పందన మరోలా వుండేదేమో?

    ReplyDelete
  22. విజయమోహన్ గారు, మీదైన హుందాతనంతో మంచి మాట అన్నారు. చాలు. ఎందుకు తీసివేయటం. నా రూపు సీతమ్మని వర్ణించినట్లే వుంటుంది [సాధుశీలిగా] తీరే సత్య రీతి. :) ధన్యవాదాలు.

    ReplyDelete
  23. ప్రదీప్, నాదీ అదే మాట. ఇవి సందేహాలే. తప్పు నాది కావచ్చు కాక పోవచ్చు. "అశోకవనమున సీత శోకించే వియోగము చేత" అన్న మాట నుండి మారని కథని కాస్త మలుపు తిప్పాలనే ప్రయత్నం తప్ప, గీతలు గీసి చిన్న పెద్ద అని విబేధాలు చూపటానికి కాదు.

    నాకు పాదం అంటే అమిత మక్కువ. మనని మోసి, మనకి కావాల్సిన ప్రదేసానికి చేర్చే అంగం అది. ఆ పాదం, పాదస్పర్శ అన్నవి కించపరిచే ధోరణిగా మాత్రం వాడలేదు.

    "ఈ పాదం ఇలలోన నాట్య వేదం
    ఈ పాదం నటరాజుకే ప్రమోదం
    కాల గమనాల గమకాల గ్రంధం"

    "బ్రహ్మ కడిగిన పాదము ..బ్రహ్మము తానేనీ పాదము"

    అంటూ ఆ హరిపాదాల్ని నుతించగా లేనిది, జగన్మాతగా సీతని దర్శించి, ఆమె పాదస్పర్శతో తనని పునీతం చేయమని అగ్ని ఆమెని వేడుకుంటే తప్పేమిటి?

    ఏమి ఆ త్రేతాయుగపు కథని అంతగా నమ్ముతాము, మరి ఈ కలియుగ/సంధి కాలంలో మరొక కోణం తగనిదా?

    దూర్వాస మహర్షి [గర్వభంగం తర్వాత] హరిపైన కాలు విసిరినా అదేమీ ఆక్షేపణ కాదు. మరి సీత పాదం సోకిన అగ్ని అనగానే ఎందుకంత అభ్యంతరం?

    ఎన్ని చదివినా, ఎవరి తర్కవితర్క పరిజ్ఞానాన్ని బట్టే కానీ, నేను అన్నానని తమ అభిప్రాయం ఎంతమంది మార్చుకుంటారు?

    మీ చివరి పరుషపద ప్రయోగం కాస్త ఇబ్బందిగా వుంది. అంత ప్రభావం చూపిందా నా కవిత మీ పైన? ;)

    నిజానికి కాస్త సంయమనం కనపడితే తర్వాతి టపా వచ్చేది. ఇక ఆ వైపు దృష్టి లేదు. థాంక్స్.

    ReplyDelete
  24. భా.రా.రె. ఇక్కడ ఆత్మవంచన విషయంలో మీరు అందరిలా పొరబడ్డారు. పైన వివరణ ఇచ్చాను.

    సీతారాముల్లా కలిసిమెలిసి కాపురం చేయమంటారు. వారు కలిసి సుఖసంతోషాలతో వున్నదెన్నాళ్ళు?

    "నాకెందుకు ఆ అరణ్యవాసం, ఇక రాని వాడిని గూర్చి ఆలోచించక ఇక్కడ లంకా రాణీవాసం చేయనా?" అని సీత ఎందుకు ఆలోచించలేదో, రాముడూ అంతేవిధంగా ఆమెకోసం వెదికి, యుద్దం చేసాడు - అని అనుకోవచ్చుగా మీరు?

    వంతులు మానితే, కాలానుగుణంగా, యుగాంతరాలని పరిగణలోకి తీసుకుని చూస్తే అన్నీ సరైనవే. కానీ ఎక్కడో ఒక వర్గాన్ని నొక్కిపెట్టిన చరిత మనది. అది వర్గ, లింగ, వర్ణ సహితమైనదేదైనా కావచ్చు. ఇంతకు మించి వాదన పొడిగించాలనిలేదు.

    ReplyDelete
  25. హమ్మయ్య, భావన, కర్మఫలాలు నమ్మే నువ్వు నాకు భలే నచ్చావు. రామావతారం మానవాంశ ఎక్కువగా వున్న అవతారం. ఆ ప్రకారంగా ఇరువురు వారి వారి కర్మలకి బద్దులైనారు. మరి అటువంటపుడు ఎవరూ వారిని నిమిత్తమాత్రులని చేయలేదు. దైవాంశసంభూతులుగానే వర్ణించారు. అదే అసలు గొడవ. ఒకసరి మానవ రాగద్వేషాలు చూపటం, ఒకపరి మహిమాన్వితులుగా చూపటం. ఈ చిక్కుముడుల్లో నా వంటి సందేహపరులకి బోలెడు మేత మెదడుకి.

    ఇక నీ రెండో పేరా కి హాట్స్ ఆఫ్. కత్తిలాంటి మాటలు, పదునైన బాణాలు. సమాజం సగం చెక్కి వదిలిన శిల్పాలం. ఎప్పుడో వ్రాసుకున్నాలే ఆ గోడు. "సగం చెక్కిన శిల్పాలు?" http://maruvam.blogspot.com/2008/12/blog-post_28.html

    ఇక ఈ వేళ్టకి యుద్దం చాలించి మళ్ళీ రేపు రాత్రికి రంగంలోకి వస్తాను. నెనర్లు.

    ReplyDelete
  26. Nenu kashtapadi kavithaki comment pedithe meeku maatram aa sub comment maatrame kanipinchindaa? Paigaa Raamaayanam lo pidakala veta antaaraa?

    Hmm. No more comments. I'm hurt. Nenu kooda ka kavitha raasthaanu. jaagratta.

    ReplyDelete
  27. "ఇదే రాముని పరంగా వ్రాస్తే స్పందన మరోలా వుండేదేమో?"
    *** *** ***

    మీ ఆరోపణ దారుణంగా ఉంది. అంటే ఎదుటి వాళ్ళు వ్రాసిన దాన్ని ఖండించటమే నా పననా మీ ఉద్దేశ్యం? మీరు రాముని తరఫున వ్రాసినా నా స్పందన ఏమీ మారదు. మాటి మాటికీ మారటానికి నేనేమైనా ఋతువునా? వాతావరణాన్నా? షేర్ మార్కెట్ సూచీనా?

    నా వాదనని కూడా వ్రాస్తాను. వ్రాసినాక ఇష్టముంటే చూసి అప్పుడు కూడా ఇదే అభిప్రాయానికి మీరు కట్టుబడి ఉంటే ఓకే.

    I am one of the few persons with consistent views in the blog world.
    ఇతిహాసం, ఇలా జరిగింది. అని చెప్పే "రామాయణం" నిజంగానే జరిగితే అందులో మార్పులు ప్రతిపాదించటం అనవసరం. ఒకవేళ అది జరుగని కథైతే అసలు వదిలేయటం ఉత్తమం.
    *** *** ***

    నాకొక్క చిన్న డౌట్. ఆ మధ్య వోల్గమ్మ గారు దేవదాసు (అదే ఏఎన్నార్ నటించిన ఫక్తు slapstick comedy నవల) ని సినిమాగా తీసేటప్పుడు మార్చినందుకు తెగ బాధ పడ్డారు. మరలాంటప్పుడు రామాయణాన్ని మార్చే అర్హత ఎవరిచ్చారు?

    Let me write a complete post. Otherwise ikkada chepthe poorthi vivaraalu ivvalenu kadaa.

    ReplyDelete
  28. I reread my comment again. I find nothing wrong with it. I did never supported SriRama, nor did I condemned those supported SitaDevi.

    She gave her best to Him...

    I donno whether she was reciprocated...

    See those statements again!

    ReplyDelete
  29. ushagaaru

    i always wonder about your energy levels

    kudos

    bollojubaba

    ReplyDelete
  30. గీతాచార్య, నా వ్యాఖ్య నా కవితని నేను సమర్థిస్తూ వ్రాసుకున్నది. మీ కామెంట్లకు ధన్యవాదాలు. ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించటం/విబేధించటం సహజం. మీ అభిప్రాయాలు వేటినీ నేను ఖండించటం లేదు. విమర్శ/చర్చ స్థాయి వరకు మాత్రం పొడిగించాను[ [అనే నా నమ్మకం].

    "ఇదే రాముని పరంగా వ్రాస్తే స్పందన మరోలా వుండేదేమో?"

    అన్నది ఓ సందేహం/ప్రశ్న - చర్చని ముందుకు జరపటానికి. మీ మాటవరస మారుతుందని కాదు.

    ఇక్కడ ఎప్పుడూ అపార్థాలకి తావు లేదు, రాదు అని నా విశ్వాసం. నెనర్లు.

    ReplyDelete
  31. బాబాగారు, :) థాంక్స్.

    బహుశా మాటలు వచ్చేవరకు "అమ్మ" "అత్త" "తాత" అని నేర్పి, చదవటం, వ్రాయటం కూడా నేర్పాక, నాకు వచ్చే సందేహాలకీ, అనుమానాలకీ నివృత్తి, వివరణ ఇవ్వని వారి నుండి "నీకెక్కడలేని ఆలోచనలు" "ఇప్పుడా గోల ఎందుకు?" విని వినీ నాకు పంతం పెరిగి ఇలా శక్తిమంతురాలనయ్యనేమో సార్! ;)

    ReplyDelete
  32. భా.రా.రె., మీ వ్యాఖ్యల వలన సాగిన ఆలోచన ఈ అభిప్రాయం వ్యక్తం చేయటానికి తావిచ్చింది. నీ జీవితం నేర్పిన పాఠం కనుక అందరికీ నేను అన్న విధంగానే బోధపడనవసరం లేదు.

    ఒక ఇద్దరు సన్నిహితులై, కలిసివుండటానికి ఆ అనుబంధం ఏర్పడటానికి పెళ్ళి ఒక సౌలభ్యం మాత్రమే. వారిరువురినడుమ - పరస్పరావగాహన, అనురాగం, నమ్మకం, సహనం, క్షమ లేనిదే ఆ అనుబంధం మనలేదు. పెళ్ళి పట్ల వ్యతిరేకత/విముఖత లేదా డేటింగ్ పట్ల సుముఖత కాదిది. ఇద్దరిని పరిచయం చేసే యాత్రకి ఆరంభం పెళ్ళి. కానీ "పెళ్ళి" ఒకటే ఒక అనుబంధానికి సూత్రం కాదు. ఐదు రోజుల వేడుక గా, ఒక మంగళ సూత్రం ప్రాతిపదికగా మాత్రం బంధం ఏర్పడిపోదు. జీవితమన్న క్షేత్రంలో కాపురం/కలిసి సాగించే జీవనం అన్న బంగారు పంట పండాలంటే అందులో పాత్రులైన జంట ఇద్దరూ కృషీవలులై ఆ నేలని ఫలవంతం చేసి, సాగు చేయాలి. కలవటం, విడిపోవటం మొదటి చివరి ఘట్టాలు. నడుమ మరెంతో వుంది. అదేమిటన్నది ఎవరికి వారు వితరణతో తెలుసుకోవాల్సింది.

    అంతా చదివి బీద రైతులు, దళారులు మాటో అంటే నాకిక సమయం లేదు. ;)

    ReplyDelete
  33. " ఆ పాదం, పాదస్పర్శ అన్నవి కించపరిచే ధోరణిగా మాత్రం వాడలేదు.

    "ఈ పాదం ఇలలోన నాట్య వేదం
    ఈ పాదం నటరాజుకే ప్రమోదం
    కాల గమనాల గమకాల గ్రంధం"

    "బ్రహ్మ కడిగిన పాదము ..బ్రహ్మము తానేనీ పాదము"

    అంటూ ఆ హరిపాదాల్ని నుతించగా లేనిది, జగన్మాతగా సీతని దర్శించి, ఆమె పాదస్పర్శతో తనని పునీతం చేయమని అగ్ని ఆమెని వేడుకుంటే తప్పేమిటి? " ----- పాదస్పర్శకు కాదు నా విమర్శ. పాదస్పర్శతో పునీతమన్నందుకు. సరే, ఇది ఎలాగూ తేలే విషయంలా కనిపించటం లేదు.
    ===
    ఇక చివరలో నేను వాడిన పరుషపదప్రయోగం!!!! ఆ పదాలేమిటా అని వెతుకుతూ వెతుకుతూ మూర్చపోయి, లేచి వచ్చి రాస్తున్నా ఇప్పుడు వ్యాఖ్య.
    పరుషపదాలు కాదు, కొంచెం ఘాటైన భావం అంతే.
    ===
    " నిజానికి కాస్త సంయమనం కనపడితే తర్వాతి టపా వచ్చేది. ఇక ఆ వైపు దృష్టి లేదు. థాంక్స్. " -- ఇది మరీ బాగుంది, ఎవడో నాలాంటివాడు ఒక్కమాట అన్నందుకు మీరు మరో కవిత రాయడానికే ఆలోచిస్తున్నారు, మీకు మీరు దీన్ని సంజాయిషీ (లేదా సాకు) గా చూపుతున్నారు. ఇక, .... (తర్వాతి పదాలు మీ ఊహకే వదిలేస్తున్నా)
    ====
    ఇది అవధానమూ కాదు, మీరు దోషీ కాదు. మిమ్మల్ని విమర్శిస్తూ మేమున్నామనుకోవడానికి. నేనూ సామాన్యుడినే, కొన్ని విషయాలలో సనాతనవాదినే. just like a scientist, who refuse to believe "Newton's theorems are wrong".
    After all, I'm also a common person

    ReplyDelete
  34. @భావన మీమొదటి పేరా బాగుంది. గురుముఖః మీరు విన్నదీ బాగుంది. ఆధ్యాత్మిక కోణమూ బాగుంది. కానీ మనము రామాయణాన్ని అర్థం చేసుకోవడంలోనే పొరపాటు. రామాయణ సారం భవసాగర రసం అని ఎందుకు అనుకోకూడదు? అలాగే సీతమ్మ లక్షణుని దూషించింది అనడం కంటే అన్న తమ్ముల అనుబంధంలో అన్నకు ఆపద వస్తే వెళ్ళని తమ్మునికి తన కర్తవ్యం గుర్తుచేసింది అనుకుంటే ఏమైనా పొరపాటా? సీత పరుగెత్తుకు ఎందుకు వెళ్ళలేదౌ అంటారా. తరువాత పెరా చదవండి. తరువాత పేరా మీ రెండవ పేరాకి కూడా సమాధానం.

    అవును సంసారంలో సర్దుకోవడం అనేది ఇద్దరికీ వుండాలి. ఆ నావలో ఎవరు ఎక్కువ బరువైనా నావ మునిగిపోతుంది. ఐతే మహిళా సమాజాన్ని ఒక సూత్ర ప్రకారం మగవారు అనగతొక్కారు అని మీ అలోచనా ధోరణి అంగీకారం కాదు. ఇంటిపని పనికి మాలిన పని అని ఎవరన్నారు? బండ పనులు చేయాలంటే మహిళ అబల ( శారీరక పరంగా ) అని దూరంగా వుంచారని అనుకోవడంలో తప్పు ఏముంది. అలాంటప్పుడు ఆపద సమయంలో వున్న రాముని రక్షించడానికి లక్ష్మణుని ఇంటిలో పెట్టి సీత వెళ్ళి చేయగల సహాయం ఏంటి?

    మీరన్న పనులన్నీ తనకున్న పరిణతితో, బహుశా తరతరాలనుండి వచ్చిన సాంప్రదాయ శక్తితో ఒక్క మహిళమాత్రమే చేయగలదు. కాదంటారా? అలాంటప్పుడు ఇవన్నీ చేసే మహిళ జీతం లేని వుద్యోగస్తురాలు కాదా? సందర్భం కాబట్టి చెప్తున్నాను, ఒక పురుషుడు ఇంట్లో వుండి ఈ పనులన్నీ చేస్తే ఇంట్లో ఇల్లాలు అయ్యో మా ఆయన ఇంట్లో ఎంత కష్టపడుతున్నాడో అని ఆనందించి మురిసిపోతుందా లేక చేతకాని సన్నాసోడా, ఆడదాన్ని బయటకు పంపి... ఇంకా బోలెడు. అందరూ అలా అని కాదు కానీ ఎక్కువ శాతం ఇంతే. కాదంటారా? ఇలాంటి ఉద్యోగం లేని పరిస్థితే ఉందా ఇంటిలో వుండి ఇంటిల్లపాదినీ సక్రమ మార్గంలో నడిపే మహిళకు? ఇంకా చాలా వ్రాయాలని వుంది కానీ ఇది ఎంతకూ తెగని చర్చకాబట్టి ముగిస్తున్నాను.

    @ఉష, మీరేంటండీ నేనడిగిన ప్రశ్ననే తిరిగి నన్నడిగారు?

    >>నాకెందుకు ఆ అరణ్యవాసం, ఇక రాని వాడిని గూర్చి ఆలోచించక ఇక్కడ లంకా రాణీవాసం చేయనా?" అని సీత ఎందుకు ఆలోచించలేదో, రాముడూ అంతేవిధంగా ఆమెకోసం వెదికి, యుద్దం చేసాడు - అని అనుకోవచ్చుగా మీరు?

    ఇదేకదా నా ప్రశ్న. "కనిపించకపోతే పోయింది యువరాజంతటి వాడిని నాకు యువతి(లు ) కొదువా అని రాముడనుకోని వుంటే? పరిస్థితి ఏంటి? తనను వెదకకపోతే అడ్డుకొనేదెవరు? "

    ఇక మీ రెండవ ప్రశ్న

    >> ఒక ఇద్దరు సన్నిహితులై, కలిసివుండటానికి ఆ అనుబంధం ఏర్పడటానికి పెళ్ళి ఒక సౌలభ్యం మాత్రమే. వారిరువురినడుమ - పరస్పరావగాహన, అనురాగం, నమ్మకం, సహనం, క్షమ లేనిదే ఆ అనుబంధం మనలేదు. పెళ్ళి పట్ల వ్యతిరేకత/విముఖత లేదా డేటింగ్ పట్ల సుముఖత కాదిది. ఇద్దరిని పరిచయం చేసే యాత్రకి ఆరంభం పెళ్ళి. కానీ "పెళ్ళి" ఒకటే ఒక అనుబంధానికి సూత్రం కాదు. ఐదు రోజుల వేడుక గా, ఒక మంగళ సూత్రం ప్రాతిపదికగా మాత్రం బంధం ఏర్పడిపోదు. జీవితమన్న క్షేత్రంలో కాపురం/కలిసి సాగించే జీవనం అన్న బంగారు పంట పండాలంటే అందులో పాత్రులైన జంట ఇద్దరూ కృషీవలులై ఆ నేలని ఫలవంతం చేసి, సాగు చేయాలి. కలవటం, విడిపోవటం మొదటి చివరి ఘట్టాలు. నడుమ మరెంతో వుంది. అదేమిటన్నది ఎవరికి వారు వితరణతో తెలుసుకోవాల్సింది.


    అవును ఇందులో నాకు విబేధాలు లేవు. నా వ్యాఖ్య సహనము-- పెళ్ళి-- సంసారానికి అనువదించుకోని చదువుకోవాలి. అది డేటింగ్ అయితే నచ్చకపోతే వెంటనే విడిపోవచ్చు. పెళ్ళి అయినా పెద్దగా తేడాలేదు. ఉన్న తేడాఅల్లా "సహనం లేకపోయినా విడిపోవడం అంత సులభం కాదు". పెళ్ళికి సహజీవనానికి ఉన్న సన్నని పొర అది. ఎందుకు విడిపోలేరంటే, పెళ్ళి సంఘం ఆమోదించింది. మనమెంత తీవ్రవాదులమైనా సంఘంలేకుండా బ్రతకడం అసాధ్యం. ఏదో చెప్పాలనుకొని ఏదో చెప్తున్నట్టుంది. ఇప్పటికే చాలా చాలా టైపు చేసాను.ఇక ఓపిక లేదు :)

    ReplyDelete
  35. భా. రా.రే నేను చెప్పిందే నాకు చెపుతున్నావు నువ్వు మళ్ళీ నేను అనేది అదే బాబు ఇంట్లో పని చాలా పెద్ద పని దానిని మీరు గుర్తించరు మీరేంటి ఆడవాళ్ళే గుర్తించరు వుద్యోగమంటేనే గొప్ప ఐనట్లు.. సీత వెళ్ళి నిజం గా రాముడూ ఆపద లో వున్నట్లు చూస్తే లక్ష్మణుడి కంటే ఆమె శక్తి సంపన్ను రాలు కాదా ఆమె తలచుకుంటే చెయ్యలేనిది ఏమిటీ. అదే మారాలి అనేది మొత్తుకుని నేను ఎవరు ఏ పని చేసినా విలువ సమానం గా వుండాలి అని. ఇంట్లో వుండి పని చెయ్యటమే మొగవాడికి తటస్తిస్తే ఏమి మహారా జులా చెయ్యొచ్చు చేసే కుదురు వుంటే. ఎవ్వరు నవ్వరు ఎవ్వరు ఏమి అనరు ఎందుకంటారు పని లేక అంటారా అంటే మాత్రం ఎందుకు పట్టించుకోవటం శ్రమ విభజన ఎలా జరగాలి అని నేను మాట్లాడటం లేదు ఇక్కడ శ్రమ విభజన లో స్త్రీ చేసే దానికి విలువ లేకుండా పోయింది అంటున్నా.. ప్రదీప్ గారు గీతా చార్య, ఉష, నువ్వు నేను అందరం ఒకే మాట ను తిప్పి తిప్పి చెపుతున్నట్లు వున్నాము సరే ముగించేద్దాము సంభాషణ.. జైహింద్..

    ReplyDelete
  36. ఉష గారు !
    ఆత్మీయునిగా ఎప్పటినుంచో ఒకటి చెప్పాలనుకొంటున్నాను.
    మీరు గ్రాంథికం, వ్యావహారికం కలగలిపి వ్రాస్తున్నారు. ఏదైనా ఒకటే ఎంచుకొంటే బాగుంటుంది.
    కవిత బాగుంది - అభినందనలు !

    ReplyDelete
  37. ఆచార్య వారికి, మీ అత్మీయతకి సంతసం. మీ సద్విమర్శకి కృతజ్ఞతలు. కవిత నచ్చినందుకు ఆనందం. నిజానికి నాకు గ్రాంథికం వచ్చు ఆన్నది నాకు తెలియదు. ఇది నిజాయితీగా చెప్తున్న మాట. ఏదో వచ్చిన భావాన్ని తెలిసిన భాషలో వెలికి తేవటమే కాని, ఇంతగా ఆలోచించలేదు. అలవాటు పడిపోయాను, ఇప్పుడు మార్చుకోగలనంటారా? ఇంతకు మునుపొకరు కాస్త సందడి చేసి తీరా నేను సంసిద్ధత వ్యక్తం చేసాక వెనక్కి తప్పుకున్నారు. ప్రయత్నిస్తాను కానీ కొన్నాళ్ళు మీ వంటివారు చెప్తేనే కానీ ఆ తేడాలేవో తెలియవేమోనండి.

    ReplyDelete
  38. భా.రా.రె., భావన, ప్రదీప్, ఇప్పుడే జుంబా + సల్సా డాన్స్ నుంచి వచ్చానేమో "టో, హీల్ హీల్" మాత్రమే తారకమంత్రం మాదిరి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ;) అవన్నీ ఎందుకంటే వ్యాయామం శారీరకంగా ఎంత మంచిదో తెలియచెప్పినా ఈ క్రొత్త పరిశోధనలు ఇంకెన్నో మంచి విషయాలని తెలియజేస్తూనేవున్నాయి. ఉదా: http://well.blogs.nytimes.com/2009/11/18/phys-ed-why-exercise-makes-you-less-anxious/

    ఇక పుస్తక పఠనాలు, కవితలన్నీ మానసిక ఆనందం, ప్రశాంతతని కూర్చటానికి. నా కవితల్లో ఎమోషన్ వుండదని ఒకరి అభియోగం. చదివిన వాటిలో నాకు తోచింది చెప్పటం, నేను నమ్మింది ఆచరించటం, వాదించటం. నాకు నమ్మిక కలిగే వరకు శోధన చేయటం. అపుడపుడూ వేదన పడటం. ఈ కవిత అదే ఉద్దేశ్యంగా వ్రాసాను. మిగిలినవారి దృష్టిలో మరోవిధంగా కనపడుతుందని తెలుసు. అదే జరిగింది.

    ఇక స్త్రీ శారీరక బలహీనత, ఉద్యోగాల ప్రసక్తి అని ఈ మాట చెప్పాలనిపించింది. చాలా సం. క్రితం చదివాను కనుక పూర్తి వివరాలు ఇవ్వలేను. ఒక తల్లి చాలా వేగంగా వస్తున్న ఒక వాహనాన్ని ఆపేసింది. ఆ క్షణంలో ఆమెకు ఆ వెయ్యి ఏనుగుల బలం, తన బిడ్డ దాని క్రింద పడతాడనే ఆదుర్దా నుండి జనించింది. కనుక అవసరం ఎదురైతే ప్రతి స్త్రీ ఆమెకు మాదిరే మారగలదు. ;)

    ఇక నా స్వానుభవం. నేను పిల్లలిద్దరి ప్రసవంలోనూ చివరి రోజు వరకు పనిచేసాను. అది మానసికబలం ఒక్కటే కాదు నా శారీరకదారుడ్యం కూడా కావచ్చు. సున్నితత్వాన్ని ఆపాదించి స్త్రీని దుర్బలురాలిని చేసారేమో కూడా ... :)

    ఆ మధ్య ఒక వ్యాసం ఇది. ఒక పురుషుడు తన శక్తి మొత్తం వాడి భరించగల నెప్పి అర యూనిట్ అయితే, స్త్రీ ప్రసవ సమయంలో ఆరు యూనిట్స్ పడుతుంది. దాన్ని బట్టి అంచనా వేయండి "ఆది శక్తి" అని ఎందుకు అన్నారో, మాతృస్థానానికి మొదటి "దేవోభవ" అని స్తుతించారో.

    ఈ మధ్య నా స్నేహితురాలు ఒకరు రామాయణం వ్రాసిందెవరు అని అడిగినపుడు చాలా బాధ వేసింది. ఎందుకు అందులోని సారాంశం అందరికీ చేరదు అని. ఈనాటి తరం మన ధర్మాన్ని విస్మరించటానికి కారణం ఏమిటి? అది నా ఆలోచన. అలాగే ఆ కథలు యధాతధంగా చెప్తే నా పిల్లలూ నమ్మరు. కనుక నాకు అవగతమై, సమకాలీనంగా అన్వయించి వాళ్ళకి చెప్పగలగటం నా అభిలాష. నేను అపుడపుడూ ఈ రకపు విశ్లేషణలు వ్రాసేది మరింత నేర్చుకోవటానికే.

    మీ అందరికీ చాలా థాంక్స్.

    సరదాకి మరువం కౌంటర్ మీద ఓ కన్ను వేసాను. దాదాపుగా ఐదువందల పైన పెరిగింది. అందులో పది శాతం మాత్రమే విజిటర్స్ అనుకున్నా యాభై మంది. అందులో పసి శాతం అంటే ఐదుగురైనా నా ఉద్దేశ్యం తెలుసుకున్నారో లేదో. :(

    నేను సనాతన ధర్మాల్లో విలువలు తెలుసుకుని, వాటితో పాటు నా జీవితావసరాలు, స్వేఛ్ఛ నిర్వచించుకున్నాను. అందుకే ఇప్పుడు బ్రౌన్ రైస్/దంపుడుబియ్యమన్నం తింటూ ;) పాత క్రొత్త కలగలుపు మాటలు చెప్తున్నాను. ఇక ఇది తుది వ్యాఖ్య. కసుర్లు, విసుర్లు ఇక తిరిగి మీకు మీరు వేసుకునే శరాలు. :) యుద్ద విరమణ జరిగి ఓ నిమిషమైపోయింది. శ్వేత అశ్వం గుర్రపుశాలకి తెల్ల పతాకం పుచ్చుకుని మళ్ళిపోయింది.

    ఓమ్ శాంతి. ;)

    ReplyDelete
  39. hmmm.. ఏడి నుంచి ఏడికో ఎల్లిపోయారు అందరూ,i would like to be a spectator in such issues :)

    ReplyDelete
  40. ఏంటో లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాననుకుని యుద్ధం లోకి అడుగు పెడదామంటే , మూసుకో రా పులసోక్కా, పక్కనే కూర్చుని బటానీలు తింటూ యుద్దాన్ని విక్షించుము అని మనసు చెప్ప బట్టి వూరు కుంటున్నా ఉష గారు .

    ReplyDelete
  41. కనుక యావన్మందికీ/నిజానికి ఈపై ముగ్గురికీ తెలియజేయునది ఏమనగా...

    కలలో సీతారాముల గానమిది:

    "నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
    వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
    ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
    ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
    ఇగిరిపోని గంధం "

    ఇలలో మా ఇద్దరం ఆలాపిస్తున్నదిది:

    "జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడూ
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడూ
    ఆనాడు ఎవరూ అనుకోనిదీ ఈనాడు మనకూ నిజమైనదీ
    ఆ రామాయణం మన జీవన పారాయణం
    .
    .
    సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
    ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం
    సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
    ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం"

    మనసారా కలిసి మెలిసి సహజీవనం సాగించే జంటలందరికీ నా వందనం!

    శుభం!!!!!!!!!!!!!

    ReplyDelete
  42. ఉష గారు !
    గ్రాంథికం, వ్యావహారికం గురించి మీరంతగా confuse కానక్కర లేదు. సాధారణంగా నిత్య వ్యవహారంలో వాడని పదాలను వదిలేసి, వాక్య నిర్మాణం (ముఖ్యంగా క్రియాపదాలు) మనం రోజూ మాట్లాడుకొంటున్నట్టుగానే ఉంటే ... అదే వ్యావహారిక భాష ! ఈ రోజుల్లో వచన కవితలన్నీ వ్యావహారిక భాషలోనే ఉంటే, సహజంగా అనిపిస్తాయి. లేదంటే, తెచ్చిపెట్టుకొన్న పదాలతో ఎబ్బెట్టుగా ఉన్నట్టుంటుంది. అదేం పెద్ద బ్రహ్మ విద్యేమీ కాదు. ఇప్పుడు మనం comments లో వ్రాస్తున్న భాష వ్యావహారికమే ! కవితలలో కూడా అదే తరహా భాషను ప్రయోగించండి. అంతే !
    మీ అవగాహన కోసం మీ కవితలోని మొదటి stanza ను మార్చి వ్రాస్తున్నాను ... గమనించండి.

    అగ్నిపునీతవి కమ్మని నిన్ను నిలదీసిన మొగుణ్ణి
    నీ ప్రేమజ్వాలలో ప్రక్షాళన కమ్మని అడగలేదు.
    మారు ప్రశ్నలేయక స్త్రీ అత్మాభిమానానికి చిహ్నమయ్యావు.
    యుగయుగాలు తరచినా తరగని ఉన్నతిని పొందావు.
    నువ్వు లేకుండా సీతారాముడు ఇనకుల యశస్వి కాగలడా ?

    ఇంతే ! అర్థమైందనుకొంటా. ఇంకా ఏమైనా సందేహాలుంటే అడగండి.

    ReplyDelete
  43. ఫణీంద్ర గారు బలే మార్చేరే వ్యవహారిక భాష లో మీరు రాసేక అది, ఉషా రాసినది పక్క పక్కన పెడితే అప్పుడు అర్ధం అయ్యింది. అవును కాని కవితా రూపం లో రాసేప్పుడు కొంచమైనా అక్కడక్కడా గ్రాంధికం పడుతుందేమో కదా చాలా ఆలోచించి ప్రత్యమ్నాయ పదాలు పెట్టాలేమో.. :-(

    ReplyDelete
  44. డా.ఆచార్య ఫణీంద్ర , మీ సూచనకి కృతజ్ఞతలు. ఇకపై వచన కవితల్లో అవి దృష్టిలో పెట్టుకుంటాను. భావన కి వచ్చిన సందేహమే నాకూను. కొన్ని అచ్చంగా వాడుక పదాలే ఉపయోగించగలమా?

    భావన, మాట అందుకున్నందుకు థాంక్స్.

    ReplyDelete