ఎవరివో?

బొల్లోజు బాబా గారి స్ట్రీట్ చీమలు కదిలించిన స్మృతి
/
*******************************************
ఎండలో తడిసిన ఎర్రమందారానివో
వానల్లో పొడారిన ఉమ్మెత్తపూవువో
వెన్నెల్లు వేకువలు యెరుగని వెఱ్ఱిదానివో
రేయింబవళ్ళు రాజుకున్న ఆకలిమంటవో?

ముగ్గురాళ్ళు నీ కండని పిండేసాయో
బండరాళ్ళు నీ కాళ్ళని కరిగించాయో
నీవడుగిడని వీధి వుందో లేదో
నీ గంప దింపని ముగ్గు కలదో లేదో?

నాచేతి చిత్రాలు మా ముంగిలి వైనాలు
పూలగొబ్బిళ్ళ అలరారు రంగవల్లులు
వాడందరికీ తెగ మురిపాలు
మరి నీవి కాదా సగపాలు?

నీవు పంచినదే కష్టంలోని సుఖం
నిన్ను కాంచని శ్రమజీవి దుర్లభం
ఆరణాల వెలకై నీ యాచనానాడు
ఆరంకెలు గడిస్తూ రేపు భయం నాకీనాడు

మిగిలున్నావో, తరలిపోయావో
పేరే చెప్పని నీకు వుంటే ఆ వూరేదో?
ముద్దులొలుకు ఏ ముగ్గైనా నీ రూపేనేమో?
తిరిగి పరిచయం చేయబోను నేనెవరినో నీవెవరివో?
*******************************************/
నా పదేళ్ళ వయసులో తొలిసారి "శ్రమజీవి" అనే కులాన్ని పరిచయం చేసి జీవనంలోని లోతుని తరిచి చూసేలా చేసిన ముగ్గవ్వ - ఒక కంటితో, గ్రహణపు మొఱ్ఱి నోరుతో, వంగిన నడుంతో, ఒక విధమైన వెరపు బ్రతుకు పట్ల కలిగించిన ఆ అవ్వ నాకింకా గుర్తే. ఆ అవ్వ వంటి ఎందరో వృద్దులకి ముసలితనాన కూడా కష్టించే దైన్యాన్ని సహిస్తున్న వేవేల మందికి వందనాలతో ఈ చిరు జ్ఞాపిక.

25 comments:

  1. ఎండలో తడిసిన ఎర్రమందారానివో
    వానల్లో పొడారిన ఉమ్మెత్తపూవువో

    మంచి వ్యక్తీకరణ.

    ఈ కవిత చదువుతున్నపుడు, మీ ముగ్గవ్వ లానే, మా చిన్నప్పుడు, బొప్పాయి,బూడిదగుమ్మిడి కాయలు, అమ్మే ఓ బోదకాలు అవ్వ గుర్తుకు వస్తూంది.
    మనుషులు దూరమైనా జ్ఞాపకాలు మాత్రం ఏదో మూల నక్కి, అప్పుడప్పుడూ ఇలా బయటకు వచ్చి ఆశ్చర్యపరుస్తూంటాయి.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  2. *** భా.రా.రె, ఆ ఒక్కమాట వేయి ప్రశంసల పెట్టు. ఇది నా తొలి జీవితానుభవం అదీ నిజాన్నుంచి నిలకడగా నాతోనే ఎదిగిన జీవన సత్యం. నెనర్లు.
    *** తృష్ణ, కొన్ని కల్పనల్ని కోరుకున్నా మనసు వాస్తవాన్నే అంగీకరించే విషయాలు కొన్ని వుంటాయి ఇది అటువంటిదే. థాంక్స్.

    ReplyDelete
  3. నేను ఊళ్ళో ఉన్నప్పుడు చాలా దూరం నుండి వచ్చి రోజూ పూలు ఇచ్చి వెల్తుండేది ఒక తమిళ బామ్మ. నేనంటే చాలా అభిమానం. ఎలా ఉందో ఇప్పుడు. కాస్త గుర్తుచేశారు మీరు.

    ReplyDelete
  4. హత్తుకునేలా వ్రాశారు. ఇలాంటి అనుభవాలు నాకూ కొన్ని ఉన్నాయి. ఙ్ఞాపకాలని తట్టిలేపినా... నా పనిలో పడిపోక తప్పదు కానీ, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే మనసంతా అదోలా అయిపోతుంది.

    ReplyDelete
  5. *** బాబా గారు, జ్ఞాపకాల తేనెతుట్ట కదలాలంటే ఏదైనా రాయి దాన్ని తాకాలి. మీ కవిత చేసిన పనదే. అందుకే నా ఈ "ముగ్గవ్వ" చేదు మధువు నింపుకుని వచ్చిన తీయని జ్ఞాపకం. బుద్దునికి నిర్వాణం కలిగించిన వ్యక్తుల వలనే ఆమె నా ఆలోచనలని తీవ్రంగా ప్రభావితం చేసిన మనిషి. మీ జ్ఞాపకాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు. మీ కవితని ఉటంకించేలోపుగానే మీరు వ్యాఖానించేసారు. కానీ ఈ స్ఫూర్తి మీరిచ్చిన స్పందనే.

    ReplyDelete
  6. మీరు #1 అర్థాన్ని సరిగానే అనువదించారు. ఇంతకీ నేననుకున్నది

    1)చిరు ప్రాయంలో చిన్ని బుఱ్ఱలో మొలకెత్తిన తొలి ఆలోచన
    2)కవిత బాగుందనీ
    3)హాజరు పట్టీలో ఎట్టకేలకు నా రోల్ నంబరు 1 అయినందుకు ,Of cource ముందుగా చీటీ అందిందనుకోండి :)

    ReplyDelete
  7. సృజన, గీతాచార్య, అలా మరిచిపోలేనంత అనుబంధంవున్న వారు జీవితంలో మరెంతో మంది వున్నారు. "పీచుమిఠాయి అమ్మే సాయిబు తాత", ఉత్తరం లేదంటే [నాకు కలం స్నేహితులు ఎక్కువ, దాదాపు రోజుకొక ఉత్తరం అన్నట్లు వుండేది కొన్నాళ్ళు] మీద పడతానని దాక్కుని పోయే "పిల్లి గడ్డం పోస్ట్ మాన్", నా బొడ్డు కోసిన మంత్రసాని "బాపనమ్మ", తిరిగ్ మా అబ్బాయికి కూడా నలుగు స్నానాలు చేయించేది....this goes on and on. నాకూ వారంతా గుర్తుకొస్తే మనసంతా ఏదోలా అయిపోతుంది, అలా వ్రాసుకున్నదే నా "శీర్షిక పెట్టాలని లేదు" http://maruvam.blogspot.com/2008/12/blog-post_21.html టపా. ప్చ్ అయినా సాగించాలి కదా జీవితం.

    ReplyDelete
  8. భా. రా.రె,
    1) తనకి ముందు ఇంకొన్ని అనుభవాలు వున్నా ఆ అవ్వ మాత్రం చాలా సార్లు ఆలాపనలకి వస్తుంది. ఆమె నాపై చూపిన ప్రభావం కావచ్చు.
    2) థాంక్స్, ఈ కవితలో ఆ అవ్వే జీవని.
    3) ఏదో మిత్రలాభం :)
    నెనర్లు.

    ReplyDelete
  9. మీకు మా కృతజంతాభి వందనాలు. శ్రమజీవి పట్ల మీ కారుణ్యానికి మరిన్ని వందనాలు.

    ReplyDelete
  10. వెంకటరమణ గారు, ఇదేమి అభాండమో నాకు తెలియదండి. ఇంతవరకు ఏ వ్యాఖ్య నేను తొలగించలేదు. ఇప్పుడు కూడా పైన తొలగించబడినది మీ వలనే అనుకుంటాను. నా బ్లాగు లో there is no moderation on comments. కనుక మీ వ్యాఖ్యగా నాకు చేరిన పదాలివి.
    ****************
    ఉష గారు,
    నేను ఇంతకుముందు వ్రాసిన వ్యాఖ్యను అనుమతించలేదేంటండీ ! అది మీకు చేరలేదా లేక ప్రచురించటానికి తగదనా ?

    ReplyDelete
  11. వర్మ, భూతదయ అన్నది మానవ నైజం. అందులో లేని పోని గౌరవం నాకు ఆపాదించకండి సార్. :) శ్రమజీవి పట్ల నాకున్నవి భక్తి, గౌరవమూను. వారి కారుణ్యంతోనే మనకీ సౌఖ్యాలు, కాదంటారా? నెనర్లు.

    ReplyDelete
  12. ఎందుకో తెలీదు కానీ ఇలాంటి కవితలు చదవగానే నాకు మొదట గుర్తొచ్చేది శ్రీశ్రీ భిక్షువర్షీయసి.. చాలా బాగా రాశారు...

    ReplyDelete
  13. మురళి, తొలిసారి శ్రీశ్రీ గారి ప్రస్తావన నా కవిత తెచ్చింది [ఓయ్ చదివావా? ఇది నా పట్ల తన expectation "ఇంకా బాగా వ్రాయాలి ఇంకా వన్నె తెచ్చుకోవాలి" అని, అందుకే ఒకమాట అనేస్తే ఆ కంటికి ఆనుతుందని..] మీ వలన ఎన్నో రచనలు పరిచయం అవుతున్నాయి. చదవటం ఆసక్తి, సమయం పెడతాను కానీ పుస్తక సేకరణ పట్ల మక్కువ చూపలేకపోయాను. ఇక్కడ ఈ విదేశంలో కూడా ప్రయత్నించి తెచ్చి చదువుతుంటాను. మీ వ్యాఖ్య చూసి వెదికి http://nutakki.wordpress.com/2009/06/15 చదివి వచ్చాను. కృతజ్ఞతలు. నచ్చినందుకు నెనరు-నెయ్యం.

    ReplyDelete
  14. వుష గారు , మీ భావ వ్యక్తీకరణ బాగుంటుంది.మీ ముగ్గవ్వ ను చూసాను . నేను వ్రాసిన కృష్ణార్పణం లో సంక్రాంతి హరిదాసు గుర్తు వచ్చాడు. జ్ఞాపకాల పొరల్లో కి తరచి చూస్తే వాటిలో నిక్షిప్తమై ఎందఱో వ్యక్తులు ,ఘటనలు కవితలై కావ్యాలై వెలువడుతాయి, కవితా దృక్పధం వుండాలే కాని .

    ReplyDelete
  15. నూతక్కి వారికి, స్వాగతమాలలు. వ్యక్తీకరణ నచ్చినందుకు ఆనందం. తప్పకుండా మీ హరిదాసుని దర్శిస్తాను, మా అమ్మమ్మ గారి వూరి దాసు గారు నాకొక ప్రియనేస్తం, నా కోసం గుమ్మంలో నడయాడి నన్నూ గంతులేయించి, వొంగి పాత్ర నింపుకుని వెళ్ళేవాడు, ఎవరూ చూడ కుండా భారీ దక్షిణలు ఇచ్చేదాన్ని [అదీ తాతా, నాన్నల సొత్తేననుకోండి...] :) . మీ వివరాలని బట్టి మీ పట్ల పితృవాత్సల్యం చూపాల్సినదానను. కనుక ఆ "అండి" తొలగించమని మనవి. నా వన విహారానికి వస్తూవుండమని ఆహ్వానం. తొంగి చూసి మా విజయమోహన్ గారి మాదిరి "హన్నా" అని మందలించే హక్కు కూడా ఇచ్చేస్తున్నాను. లేదా మా చిత్తా ప్రసాదు గారి మాదిరి "ముందది చదువు, నేనన్న అహాన్ని వీడు" అని గదమాయించే అధికారమూ ఇచ్చేస్తున్నాను. కాకపోతే దబాయిస్తాను అందుకు కూడా సిద్దంగావుండండి. జ్ఞాపకాలను వీడలేకే ఇలా కవితలనే నా నెచ్చెలులని చేసుకు జీవించేస్తున్నాను. కృతజ్ఞతలు.

    ReplyDelete
  16. great

    వినాయక చతుర్ధి శుభాకాంక్షలు

    ReplyDelete
  17. హరేకృష్ణ, హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే .... ఇంతకీ ఆ "వినాయక చతుర్ధి శుభాకాంక్షలు" ఎవరికో ఆ వ్యక్తిని కూడా నేను "ఎవరివో" అని అడగాలో? ఏమో....;) నా "ముగ్గవ్వకి" చెందితేనే సబబు ఈ కవితలో కథానాయిక ఆమే. కాదూ కూడదు నాకు చెందాలి అంటే, పిండివంటలు కూడా చేయించి, పత్రి, పూలు, ఫలాలు, పాలవెల్లి పంపేయండి సార్. :) నెనర్లు.

    ReplyDelete
  18. వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete
  19. శివ, మీకు కూడా హాజరు పట్టిలో టిక్కువేసింది నా ఈ "ముగ్గవ్వ." :) అలాగే పాపం ఎప్పుడైనా ఈ సంబరం జరుపుకుందో లేదో కానీ తన తరఫున పండుగ శుభాకాంక్షలు నేను తెల్పుకుంటున్నాను. ;) పండుగ వంటలు మాత్రం ఆమె ఎక్కడైనా కనపడితే కాస్త పంచండి.

    ReplyDelete
  20. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

    పిండివంటలు కూడా చేయించి, పత్రి, పూలు, ఫలాలు, పాలవెల్లి..మెయిల్ చేస్తాను ..happyweekend

    ReplyDelete
  21. హృదయాన్ని తాకింది ఉషాగారు !

    ReplyDelete
  22. *** పరిమళం, జీవితంలో కలల్ని, వూహల్ని ప్రక్కకి పెడితే మిగిలిన వాస్తవాల్లో తప్పని సరిగా ఈ "ఎవరివో" కి ప్రతి ఒక్కరికీ ఓ సమాధానం దొరుకుతుంది. అదే నా కవితకి ఆత్మ. నెనర్లు.

    ReplyDelete
  23. కొత్త పాళీ గారు, ధన్యవాదాలండి.

    ReplyDelete