కాలసర్పం కక్కిన గరళం గతం
ప్రాణవిహీన సదృశం జీవనం
అనురాగం పంచిన భాగ్యం ఆయుస్సు
కాలమిచ్చిన భవిత తన వరం
ప్రేమ పునర్జీవి ఆమె ప్రమద్వర
మౌనభూషితం ఓ మానసం
రాగరంజితం ఓ హృదయం
ఇరువురి యెడం ఓ విలాపం
సమాంతరాలు ఆ జీవితాలు
శోకతప్త తపోవనాన ఆమె ప్రవహిత
విరహాతిశయాలు విరజాజి వగపులు
వనమాలి వైనాలు వసంతకేళీలు
వయ్యారి అలకలు వలరాజు మురిపాలు
వనకన్నె విలాసం ఇల కన్న వైభోగం
వేవేల పలుకులల్లి వలపు చిలుకు ఆమె ప్రవల్లిక
వెన్న చిన్నబోవు మేని తాకిళ్ళు
తబ్బిబ్బుల నవ్వు లొలుకు అధరాలు
పరాజిత తనువు ప్రియుని తల్పం
పున్నమి రేయి అమాస చేరు సమాగమం
మహిలో దివ్య శోభల ఆమె పరవశ
కలువకాంత గుసగుసలు ఆ అందాలు
చంద్రకళ అరువడుగు ఆ చందాలు
సూర్యప్రభ చెలిమిచేయు ఆ సోయగాలు
నీలమేఘ శ్యాముని అభిసారిక ఆ యామిని
సంతృప్త సౌగంధి ఆమె పరిమళ
కనుసన్నల నాయికని చెరబట్టిన నాయకుడు, అతడెవరు?
******************************************
గమనిక: ఈ క్రిందివారు ప్రతీకలే కానీ పూర్తి సామ్యం లేదు పైన కవితలోని నాయిక రూపులకి.
ప్రమద్వర
ప్రవహిత
ఉషగారు, మిగిలిన వారి సంగతెలా వున్నా.. నేను చదివిన మీ కవితల్లో వ్యాఖ్య వ్రాయడానికి కూడా ఆలోచనలు రాకుండా కట్టివేసిన కవిత ఇదే..
ReplyDeleteఏ చిన్న లోపం నాకు కనిపించినా వేరే వాక్యాల వ్యాఖ్యగా వచ్చేదేమో.. అద్భుతం.
భా.రా.రె., 'మీ కవితల్లో వ్యాఖ్య వ్రాయడానికి కూడా ఆలోచనలు రాకుండా కట్టివేసిన కవిత ఇదే' ఈ ఒక్క వ్యాఖ్యతో నిన్న రాత్రి నుండి మనసుని నలిబిలి చేసి ఈ రాత్రి వురికిన నా కవితా వాగుకి వరవడి ఇంకా పెరిగింది. మీ విమర్శ, ప్రశంస రెండూ విలక్షణంగానే వుంటాయి. ధన్యవాదాలు.
ReplyDeleteఅతడు మహేష్ బాబు కదా ..just kidding
ReplyDeleteముమ్మాటికి ఇది ఊహ కాదు అని అనిపిస్తోంది
చాలా కస్టపడి రాసారు కదా..చాలా బావుంది
**వెన్న చిన్నబోవు మేని తాకిళ్ళు
తబ్బిబ్బుల నవ్వు లొలుకు అధరాలు
పరాజిత తనువు ప్రియుని తల్పం
పున్నమి రేయి అమాస చేరు సమాగమం
మహిలో దివ్య శోభల ఆమె పరవశ
కలువకాంత గుసగుసలు ఆ అందాలు
చంద్రకళ అరువడుగు ఆ చందాలు
సూర్యప్రభ చెలిమిచేయు ఆ సోయగాలు
నీలమేఘ శ్యాముని అభిసారిక ఆ యామిని
సంతృప్త సౌగంధి ఆమె పరిమళ
ఇది ఇంకా బావుంది ..పరిమళం is part of మరువం అనుకుంటా..మీ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ
సూపర్ గా రాసారు,మళ్లీ మళ్లీ చదివాము అనుకోండి,
ReplyDeleteమొదటిసారికి అంతా అర్ధం కాలేదు.., చాలా బాగా రాసారు..
ఇంత బాగా అల్లడానికి మీకు ఎంత టైం పడుతుందండి..., క్లిష్ట పదాల వివరణ బావుంది.
ప్రమద్వర, ప్రవహిత ఇలాంటి పదాలు ఎలా తెలుస్తాయి..!!! సోర్స్ చెప్పగలరా...
మౌనభూషితం ఓ మానసం,
వేవేల పలుకులల్లి వలపు చిలుకు ఆమె ప్రవల్లిక,
సూర్యప్రభ చెలిమిచేయు ఆ సోయగాలు... ఈ లైన్స్ అయితే సూపర్బ్.
చాలా బాగా వ్రాశారండి. కాని, నేను అర్థం చేసుకోవడానికి మాత్రం చాలా కష్టపడ్డాను.
ReplyDeleteమొత్తం మూడు సార్లు చదివాను.. కొత్తగా నేను చెప్పే మాట ఏముంది.. పదాల అల్లిక అతికినట్టు అమరింది..
ReplyDelete"సమాంతరాలు ఆ జీవితాలు
శోకతప్త తపోవనాన ఆమె ప్రవహిత" అన్నారు
అతగాడి గురించీ చెప్పండి మరి.. :)
కాని క్లిష్టమైన పదాలు వాడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది.. అదే మీ కవితలకు అందం కూడా..
మీ నించి ఒక తేలికైన .. రచనను ఆశిస్తూ.. అభినందనలు ..
Interesting.
ReplyDeleteకొన్ని కొన్ని వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి.
"కాలసర్పం కక్కిన గరళం గతం" .. అదిరింది. నిజం చెప్పాలంటే, అటూవంటి ఓపెనింగ్ స్టేట్మెంట్ తరవాత మిగతా పద్యం కొంచెం పేలవం అనిపించింది.
మొత్తమ్మీద ఒక సాంద్ర శృంగార చషకం
హరేకృష్ణ, కాదు అతడు మహేష్ కాదు, నేను లావణ్యనీ కాదు ;) వేల మహేష్లు కలిసి వచ్చినా నా నాయకుడుకి సాటి రారు. ఇతడు "కోటి సూర్య ప్రకాశుడు". నిజం, ఇందులో నటన లేదు. నాయిక-నాయక భావన ని ఉదాత్తంగా వెలికి తేవటానికి మధించాను కానీ కష్టపడలేదు. మీదైన బాణీకి నెనర్లు.
ReplyDeleteకాలసర్పం కక్కిన గరళాన్ని కంఠంలో దాచిన శంకరుడా ఆతడు ?
ReplyDeleteమౌన భూషితుడై అతను శంకరుని తలపిస్తే, రాగరంజితమై గౌరిని తలపించె ఆమె.
"నీలమేఘ శ్యాముని అభిసారిక ఆ యామిని
సంతృప్త సౌగంధి ఆమె పరిమళ" - నీలమేఘ శ్యాముడు రాముడు కదా.. ఆ ఏకపత్నీవ్రతుని యామిని ఇంకెవరు సీతేనా??? ఎన్నడూ ఇలాంటి వర్ణన వినలేదు. కొంచెం వివరించండి
veera sekhar Aditya, saipraveen ప్రమద్వర, ప్రవహిత, ప్రవల్లిక, పరవశ, పరిమళ నాయికా భావనలు పుణికిపుచ్చుకున్న "ఆమె" పలికించిన ఈ పంచామృతం మీకు నచ్చినందుకు ఆనందం. :) నాకు వివరణ ఇచ్చే అవకాశం ఇస్తున్నందుకు సంతోషం. నేను స్పందించటానికీ కవితగా వెలవరించటానికీ మధ్య గడువ చాలా తక్కువ [కొన్ని సార్లు అంతా కలిపి 5 నిమిషాలే], అందుకే ఒక్కోసారి ఆ భావావేశం నా వరకు మాత్రం అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఇక ఈ కవిత వరకు శుక్రవారం రాత్రి ఈ ఐదు పేర్లు తలపుకొచ్చాయి. కానీ కవితగా వెల్లువయ్యే భావన, స్పందన శనివారం రాత్రి వచ్చింది. మధ్యలో మధనపాటు నేనేమి వ్రాయగలను, జన మన్ననగా మనోరంజకంగా రాగలదా అని [నాకు భాష మీద పటుత్వం తక్కువ]. ఇదిగో ఇలా వెల్లువయింది. నా స్వీయ జీవితానికి దగ్గరగా కాస్త కావ్య కల్పన జోడించి వ్యక్తమయింది. జిజ్ఞాస వలన చదవటం, సాధారణంగా చదివినవన్ని యధోచిత రీతిగా జ్ఞాపకంవుండి పోవటం అవి అలా అలలుగా తిరిగి రావటం నాకు భవవంతుడిచ్చిన వరం, శాపం. మనసుని కలిచివేసేవి కూడా వదలవు. తిరిగి భాదిస్తాయి. పోతే source అన్నారు. వివిధాలు, ఇంతకు మునుపు పుస్తకం చదవనిదే పడుకునేదాన్ని కాదు. ఇపుడు random గా web search చేయటం హత్తుకున్న పదాల వెంబడి పరుగిడటం. అంతే. ప్రమద్వర కథ నాకు ఇష్టం. నా జీవితంలో మానసిక మరణం, పునర్జీవనం సంభవించాయి అందుకు వాడాను. ప్రవహిత సప్తర్షి సాటి. ఉన్నతికి, శొకోదృతిలో కలిగే నిర్వాణానికి ప్రతీకగా తీసుకున్నాను. ప్రవల్లిక ప్రబంధాల్లోని ఏ నాయికైనా కావచ్చు. పరవశ ప్రకృతికి ఆ సహజ స్పందనకీ మూలం. పరిమళ మనో సౌందర్యానికి సుగంధభరిత వ్యక్తిత్వానికి ప్రతిరూపు. అది నా పంచ కన్నియల ఏకత్వమైన నాయిక రీతి. నెనర్లు.
ReplyDeleteశివ, "పదాల అల్లిక అతికినట్టు అమరింది" - ధన్యవాదాలు. "అతగాడి గురించీ చెప్పండి మరి" అన్నారు. మరి ఆగి చూడండి అతడూ అడుగిడతాడు మరువపు వన వీహారుల మనోమందిరాన. నా 'కన్నా' ఎందరికన్నానో మిన్న అయిన నాయకుడు. నాయికకి తగినవాడు. ఇక "క్లిష్టమైన పదాలు వాడుతున్నారు" - నిజమంటారా, కావచ్చేమో. ఇది నా రెండో ఇన్నింగ్స్. ముందు పదేళ్ళు ఇష్టపడి భాష నేర్చుకున్న వైనంగా ఇలాగే వ్రాసేదాన్ని. అవీ ఎక్కువగా ప్రేమ అనురాగం ప్రకృతి కరుణ ఆవేదన మిళితాలే. {ఏమిటో SD వుంది సుమీ ;) } మచ్చుక్కి... మొదటిది చదవకండేం, ఆయాసం వచ్చింది అంటారు ;)
ReplyDelete1. ఈ శీర్షిక మీరే పెట్టాలి http://maruvam.blogspot.com/2008/12/blog-post_21.html
2. గోదారమ్మ పరవళ్ళు, కృష్ణమ్మ ఉరవళ్ళు అచ్చంగ నావేనమ్మా! http://maruvam.blogspot.com/2009/05/blog-post_30.html
3. మంచు పూల పేరంటం http://maruvam.blogspot.com/2008/12/blog-post_16.html
ఈ రెండవ ఇన్నింగ్స్ మొదలే తేలిక స్థాయిలో వచ్చింది. తనకి అర్థం కావాలని తన అభిప్రాయం కనుక్కోనిదే టపా కూడా వ్రాయను సాధారణంగా. అపుడపు ఇలా అభిమతం తీర్చుకున్నాగానీ. మీకు తప్పక అర్థమయ్యి, నచ్చేంత సరళంగా నా నేస్తం అడిగిన తేలిక పదాల అల్లిక ఇది,
(1) నన్ను మరణించనీయవవి! http://maruvam.blogspot.com/2009/07/blog-post_26.html
కనుక ఎక్కువగా మనదైన బాణీలో అపుడపుడూ ఇలా నా మనోవాంఛితాలు వ్రాస్తానని మనవి చేస్తూ - మీ మిత్రురాలు ఉష.
కొత్త పాళీ గారు, ఈ చషకం సాంద్ర మధువు నింపుకుని వచ్చింది కానీ అది - అనురాగం, అనుభూతి, పరవశం, సరసం, శృంగారం - పంచామృతాల అభిషిక్తి నా పంచ కన్నియల మేలు కలయిక ఈ నాయిక మనోభావన [చివరి భావన ఒకటే కాదని నా మనవి]. మీకు నచ్చినందుకు ఓ సార్థకత ధన్యవాదాలు. కొంత పేలవం అన్నది తప్పదనుకుంటానండి ఆ రససిద్ది కలగటానికి కలిగించటానికీ నాకు ఇంకా సాధన కావాలి.
ReplyDeleteప్రదీప్, మీ మొదటి అన్వయింపు బాగుంది. కానీ ఇది నిజ మృతి నుండి ప్రియుని సగం ఆయుస్సు పొందిన ప్రమద్వర కథకి దగ్గరగా మానసిక మరణం పాలైన నాయిక, నాయకుని అనురాగంతో, పునర్జీవి అవటానికి అన్వయింపు. నా నాయిక నాయకులు స్వీయ, కల్పనల మేళవింపు. మీరు కని విని ఎరుగరు అందుకే. ఇక నీల మేఘ శ్యాముడు, యామిని అన్నది ఎప్పుడో విన్న (భానుచందర్, అర్చనల "నిరీక్షణ" లోది అనుకుంటాను) "...యమున! ఎందుకె నీవు ఇంతా నలుపెక్కినావు రేయి కృష్ణయ్యతొ కూడావా,నల్ల నల్లని వాడు నిన్ను కవ్వించెనా, వలపు సయ్యాటలోన ఇంతా నలుపెక్కినావా,.." పాటనుండి వచ్చిన స్ఫూర్తి, కొంచం స్పందన కలిపి వచ్చిన భావన. శివుడు, రాముడు ఇద్దరూ మాత్రం నా మనోచిత్రంలో లేరు.
ReplyDeleteఅయ్య బాబోయ్ ఇది కవితా... కావ్యమా.....
ReplyDelete"వాక్యం రసాత్మకం కావ్యం"= రసవంతమైన వాక్యం ఒక్కటైనప్పటికీ అది కావ్యంతో సమానం. ఈ లెక్కన మీకవిత నాకు కావ్యంలాగా తోస్తోంది.
సూపరండీ.... మీరుతగ్గదంతే..... కానీ పరిపూర్ణత ఇంకారాలేదనిపిస్తోంది.
మీరు కావ్యాలంకార సంగ్రహం చదివారా.... చదవకుండానే ఇలా రాశారనుకోను. మీకు ప్రాచీన సాహిత్యంపై పట్టు చాలానే ఉన్నట్టు కనిపిస్తొంది. అడిగానని కాదుగాని మీకో 50 యేళ్లు ఉంటాయా....? :-)
చదవక పోతే తప్పకుండా చదవండి. అందులో నాయికా, నాయకుల లక్షణాలు మొదలగు వాటి గురించి విపులంగా ఉంటుంది. ఇది చదివితే మీరచనలకు పరిపూర్ణత వస్తుందని నా నమ్మకం.
ఇంతకీ ఆ నయకుడెవరూ...? నా క్రిష్ణుడేనా...?
"నాకు భాష మీద పటుత్వం తక్కువ..."
ReplyDeleteఅవునా...!
అసలు మీ కవితలు అలా వుంచితే విశ్లేషణ కూడా అస్సలు అర్ధం కావట్లేదు అంటే నమ్మండి. తెలుగు పైన ఇంత పట్టా...!!!
"ఉన్నతికి, శొకోదృతిలో కలిగే నిర్వాణానికి ప్రతీకగా తీసుకున్నాను"... నిర్వాణం అంటే ఏమిటి...?
"అది నా పంచ కన్నియల ఏకత్వమైన నాయిక రీతి"...అంటే పంచ ప్రాణాల రూపు అని అర్ధమా...?
"యధోచిత" ... ఈ పదం ఇపుడే వినటం,"యదావిధిగా"అని అర్ధమా..!!!
భావావేశంతో రూపు దిద్దుకున్న మీ ఈ మరువపు పూలు సప్తవర్ణాలు అలుముకుని, చూడ(చదువ)ముచ్చటగా వున్నాయి. బాబోయ్...!
పునర్జన్మ పొందిన మీరు కూడా ప్రమద్వర లాగ పరిమళ భరితం అవ్వాలని కోరుకుంటూ...
beautiful
ReplyDeleteonce again proved that you have very very very good vocabulary.
here and there i had to search dictionary :-)
bollojubaba
చాలా బాగుంది ఉషగారు. మీకు భాష మీద పటుత్వం తక్కువా, అంటే నాకు భాషే రాదు అని చెప్పుకోవాలేమో !!
ReplyDeleteఏమండి ఉషగారు, మిమ్ములను మరల వివరించమని గనక నేను అడిగితే అది మీచే నేను ఈ బ్లగులో ఒక తెలుగు క్లాసు మొదలుపెట్టినట్టు అవుతుంది. అది సబబు కాదు. అందుకే నేను తెలుగు బాగా నేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాను. మీరు ఇలాగే వ్రాస్తూ మాకు మరింత విజ్ఞానాన్ని పంచండి. నెనర్లు!!(ఇది కూడా మీనుండి నేర్చుకున్నదే)
ReplyDeleteతన భాగమే అరువిచ్చి తనలోనే కలుపుకున్న
ReplyDeleteరుద్రుడు, సముద్రుడు.
శోకసాగర హృదయాన ఉవ్వెత్తున అలలు రేపి
తనను తాక కవ్వించిన ఆ చంద్రుడు.
వనకన్నెను ఆవహించి మది కోకిల గొంతుకలో
మైమరపుని నింపిన వసంతుడు.
చెలియ నగవు వెలుగులలో తన ఉనికిని
లయం చేయు కాళరాత్రి పురుషుడు.
కనుసన్నల నాయికని చెరబట్టిన నాయకుడో
ప్రణయ వర్షాన తడిసి మురిసిన ఒక బాలకుడో
ధన్యుడు అతడు !
ఉషగారూ.....ఇది కవిత్వమా! కాదు కాదు...
ReplyDeleteకావ్యామృతధార కాదు అందామంటే వేరొక పదం నాకు రాదు...
veera sekhar Aditya, saipraveen, వేణూ శ్రీకాంత్, ధన్యవాదాలు.
ReplyDeleteఆదిత్యా, "యధోచిత" - = accordingly, we remember each thing in a different way, some in context some as we perceive, some as we are forced etc.. That's the closest యదావిధిగా=as usual "ప్రమద్వర, ప్రవహిత, ప్రవల్లిక, పరవశ, పరిమళ నాయికా భావనలు" all have due influence on this naayika. Her personality resembles each of them in a given context. పోతే భాష మీద పట్టు విషయం - నిజాయితీగానే చెప్పిన మాట అది. నాకు ఇంకా ఆసక్తి వుంది కాని సమయం, నిత్యజీవితావసరాలు సహకరించటం లేదు. కనుక అందరం ఇలా బ్లాగుల్లో మాటలు పంచుకుంటూ [పెంచుకుంటూ కాదు సుమీ] ఎదిగేద్దాం. వస్తూవుండండి.
పద్మార్పితా, ధన్యవాదాలు. భలే ప్రాసతో వ్యాఖ్యానించారు ఎంతైన మనసున్న, మాట మీద పట్టున్న కవయిత్రి కదా మీరు. ;)
ReplyDeleteబాబా గారు, ఈ ప్రోత్సాహంతోనే కాస్త గురి కుదిరింది నా మీద నాకు. ఎంతైనా అంత లేదు సార్, మీచేత ఆ పని చేయించగలిగానా? you referring to a dictionary for my words, nope not at all a possibility, you must be kidding me ;) ధన్యవాదాలండి.
ReplyDeleteవిశ్వ ప్రేమికుడు, కావ్యమని ఈ నాల్గు పంక్తులని ప్రమోట్ చెసినందుకు ఆనందం. ఇక మీ ప్రశ్నలొకటొకటిగా..
ReplyDelete"ఇంతకీ ఆ నయకుడెవరూ...? నా క్రిష్ణుడేనా...?" నా నాయకుడు నా సృష్టి. మీరు చూసిన లోకంలోని వ్యక్తి కాదు. వాడు నా వాడు, నేను మెచ్చి ఈ రూపుగ తెచ్చిన వాడు ;)
"అడిగానని కాదుగాని మీకో 50 యేళ్లు ఉంటాయా?" - అడిగేసారుగా ;) లేవు, ఇప్పట్లో రావు. అసలు చెప్పను ఇంత చిన్నదా మీరు చిన్నపోతారు ;) నాన్న గారి చేతి ముద్దలు తింటూ నా పిల్లలకి ముద్దలు తినిపించే తీరింకా మారలేదు. ఇవన్నీ నిజమా అని అడకకండి. అబద్దమేమో అని అనుమానపడకండి. కవయిత్రిగా [అసలంటూ ఆ అర్హత వుంటే] ఇది రెండో సంవత్సరం. ఇంకా ఎదగాలి ఎంతో.
"కావ్యాలంకార సంగ్రహం" - చదవలేదు. ఇదే వినటం. జాలంలో వెదికి చూస్తాను. "చదివితే మీరచనలకు పరిపూర్ణత వస్తుందని నా నమ్మకం" అన్న మీ అభిప్రాయం సవినయంగా స్వీకరిస్తున్నాను. నాకు ప్రాచీన సాహిత్యంపై పట్టు, పరిపూర్ణత సాధించాలనే ఆకాంక్ష.
"చదవకుండానే ఇలా రాశారనుకోను" - నమ్మి తీరాలి. ఆవేశం దిగాక నాకు కూడా అపనమ్మకమే, నేనేనా ఇలా వ్రాసేసాను అని ;) అందుకే ఆ స్థితికి "కవితాదేవి పూనకం" అని పేరు పెట్టాను. ఆ భారతీదేవే నాతో ఈ కవనం సృష్టిస్తుంది.ఆ తల్లికి ప్రణమిల్లుతున్నాను. నెనర్లు.
వేమన, సాదర స్వాగతం. తొలి వ్యాఖ్యే ప్రతి-కవిత. అమోఘం. నా నాయకుడు అదృష్టవంతుడు. నేనే మురిసి ఎంతో వైనంగా ఎన్నో విధాలుగా [ నేనూ నండూరి ఎంకికేం తీసిపోను - http://maruvam.blogspot.com/2009/03/blog-post.html ] వర్ణిస్తుంటే అంతకు మించి మీరు సముద్రుడంత విశాలంగా, చద్రుడిగా, వసంతునిగా ఇంకెన్నో విధాలుగా భలే తీర్చి దిద్దారు. నాయిక మనము ఝల్లుమంది, ఉల్లము వెల్లువైంది. మీ భాషా పటిమకి జోహార్లు. తరుచుగా రావాలండి. మరువానికి మీ విహారాలు మరవరానివి. చాలా కృతజ్ఞతలు.
ReplyDeleteఉషగారూ,
ReplyDeleteమీరు ప్రతి-కవిత అని అనాయాసంగా అనేశారు. మీ దగ్గర ఉన్నంత అక్షర భాండాగారం నా దగ్గర లేదేమో :)
ఏదో నా వైరాగ్యంలో నేను ఉన్నవాణ్ణి మీ మరువపు వనంలో ఆగి ఈ కవిత చూశాక ఆ నాలుగు ముక్కలూ రాయకుండా ఉండలేకపోయాను.
భావం చెడగొట్టాననుకోకుండా మన్నించినందుకు ధన్యవాదాలు.
వేమన, "మీ మరువపు వనంలో ఆగి ఈ కవిత చూశాక ఆ నాలుగు ముక్కలూ రాయకుండా ఉండలేకపోయాను. " - అదే ప్రేమ భావనకున్న బలం. మనసు తలుపు తట్టి మరీ తెరుస్తుంది. మీరన్న నైరాశ్యం ఎందుకో మీ బ్లాగుకొచ్చినపుడు చూస్తాను. ఒక్కటి మాత్రం నిజం. నిరాశ చవిచూడని ఆశాజీవి వుండడు. ఒకేవిధంగా వున్నా జీవితమూ బాగోదు. వెలుగునంటి చీకటి, కలయిక వెంట ఎడబాటు మాదిరే. ఈ నాల్గు మాటలు మరోసారి వింటూండి వుంటారు అయినా మీకు రవ్వంత సాంత్వన ఇవ్వొచ్చు. అతడెవరూకి మరో కవిత మీరు కలుపవచ్చునిక... :)
ReplyDeleteఎంత అధ్బుతం గా వున్నరండీ మీ నాయికలు...
ReplyDeleteఎంత చక్కని పేర్లో... ఇన్ని అధ్బుత నామాలు, లక్షణాలు కల
నాయికల మనోనాధుడెంత అధ్బుతమో... అబ్బురమో... తొందర గా చూడాలని వుంది
అందరు అధ్బుతం గా వున్నా ప్రవహిత, పరిమళ మరీ బాగున్నారు..
తొందర గా నయకుడెవరో చెప్పండి మమ్ములను వూరించక...
మీ కవిత చదివేక కాసేపు నాకు పని చెయ్యబుద్ది కాదు ఏదో లోకాలలో వున్నట్లు వుంటుంది... కొంచం కష్టం గా వుంటుంది వెనకకు రావాలంటే.. నిజం...
ప్చ్.. చివరగా వచ్చాను. భారతీదేవి కవనాన్ని వ్యాఖ్యానించడానికి నాకర్హత ఉందా?
ReplyDeleteభావన, మీ వ్యాఖ్య కి చాల చాలా ఆనందమేసింది. ఈ యాంత్రిక జీవితాన్నుంచి అలా కాస్త వూహలోక విహారాలకే ఈ ఇరువురినీ సృష్టించుకున్నాను. కాస్త అతిశయం పెంచేస్తున్నారు మరి. నిజం చెప్పాలంటే నా నాయిక కన్నా నాయకుడి మీదనే ఎక్కువ మక్కువ. ఇంతటి నాయికని గ్రక్కున చేపట్టిన వాడు మరి. నిజానికి నాయిక పోకడలు మరెన్నో ;) నెనర్లు.
ReplyDeleteవిజయమోహన్ గారు, దగ్గరుండి నాకు దెబ్బలేయించే కార్యక్రమంలో వున్నారు కదూ! మంది గగ్గోలెత్తి నా మీద దండెత్తరాండి? :) అయినా క్రొత్తగా ఈ అర్హతలేమిటండోయ్, ఒకప్పుడు హన్నా అని మందలించిన వారు మీరు. మీది ఆ స్థాయే ఎప్పటికీను. అంత ఆదరణకి, మీరిచ్చిన పోలికకి నేను తగుదునా? మీ మన్ననని మనసారా సవినయంగా స్వీకరిస్తున్నాను. మీరు రాని వనం చిన్నబోదాండీ? రాకపోకలు ఆలస్యానికి అతీతాలు. ఈ తీరిక లేని కాలంలో అలా వచ్చిపోవటమే నా భాగ్యం. కృతజ్ఞతలు.
ReplyDeleteఏదో తెలియని మంత్రముగ్దత్వం నన్ను నా పద్దెనిమిది సంవత్సరాల వయస్సుకు లాక్కెళ్ళింది.
ReplyDeleteఅప్పుడు
ఆమెకోసం కలగన్నానో
కలియ తిరిగానో
పోటీ పడుతున్న నేస్తగాళ్ళతో
కలబడ్డానో
ఎన్ని పగలు రాత్రులు
ఆమె తిరిగే దారులువెంట చూపులు నిలిపి
ఎదురుచూసానో
చివరికి ఆమెను దక్కించుకుంది నేనే
జాన్‌హైడ్ కనుమూరి, ముందుగా సాదర స్వాగతం. "ఏదో తెలియని మంత్రముగ్దత్వం నన్ను నా పద్దెనిమిది సంవత్సరాల వయస్సుకు లాక్కెళ్ళింది.."చివరికి ఆమెను దక్కించుకుంది నేనే" ఆ అనటంలోనే మీ సంతృప్తి స్పష్టంగా కనపడుతుంది. మిమ్మల్ని ఓ మారు ఆ మనస్థికి తీసుకుపోయిన నా కవితకి మరో ధన్యత చేకూరింది. ప్రతి కవితలు వచ్చాయి కానీ నిజానుభూతిలో మునిగి స్వీయనుభవం ఇదే ఈ కవితకి. నెనర్లు.
ReplyDeleteMee postullannee chadivaaka.. naaku maata padipoyindi.. :) ante.. matlaadaaniki emi migalledu.. ani anthe.. :)
ReplyDeleteI felt u to be an all rounder ..
"ప్రాణవిహీన సదృశ్యం జీవనం" konchem ee line explain chestaara.. Adagaalanukuni marchi poyaa...
ReplyDeleteశివ, Thanks for calling me an all rounder. That is what I like to be ;) మీరడిన వివరణ ఇది. ప్రాణం లేని జీవనం వంటిది అనని అర్థం అండి. జీవం లేని మనిషికి పోలికిది ఆ నాయిక ముందు. గతమంత క్రూరంగా జీవితాన్ని అదిమేసిందని వాడాను. తిరిగి అతని ప్రేమతో ఆయుస్సు పోసుకుని పునర్జీవి అయింది. విడివిడిగా
ReplyDeleteప్రాణవిహీన - ప్రాణం లేనిది
సదృశ్యం - సమానం, like that
జీవనం - life
అతడెవరో మీకు తెలియదా? ప్రతిసారి ఒక్కో తీరుగా మీ నీలమేఘశ్యాముడ్ని ఆవాహిస్తుంటారు. మీరు బ్లాగులోకంలో మరో కవయిత్రి మొల్లగా ప్రశిద్ధులవుతారని నా ఆశాభావం.
ReplyDeleteవర్మ, నా నాయకుడిని ఇంకా ఇంకా తీర్చిదిద్దాలనే ఇలా పలు పోకడల్లో ఆవాహనచేస్తాను. ఆతడు నా బలిమి మరువానికి కలిమి. ;) సంతోషమండి, ఇంత వరకు అపుడపుడూ నా కవితల్లో “దేవులపల్లి”, “విశ్వనాథ” “టాగోర్” వంటి వారి ఛాయలున్నాయని మిత్రులు ప్రశంసించారు. మీరొక్కరూ “మొల్ల” అంత దాన్ని కావాలని, కనుక ఒక స్త్రీ మూర్తి తో [ఆ కవయిత్రి మాననియమైన మహనీయురాలు నిజానికి, ఈ ఒక్క అభినందన చాలు నాకు ఆ రకంగా] సామ్యం కుదిర్చి ఆశాభావం వ్యక్తం చేసారు. ఆ దిశగా ప్రయతం వుంది, కానీ దైనందిన జీవిత వత్తిడి, సమయాభావం నన్ను నత్త నడకకి కుదించివేస్తున్నాయి. ఇది కలగా మిగిలిపోకూడదని మన ముందు తరానికి మనం అంతా ఈ సాహిత్య బాటని పరవాలనే నా ఆశాభావం. నెనర్లు.
ReplyDelete"సదృశ్యం" అనేది సరి కాదేమో ?
ReplyDeleteసమానం అనే అర్ధాన్ని ఇవ్వడానికి "సదృశం లేదా సాదృశ్యం" అని ప్రయోగించాలేమో....? అని నా అనుమానం.
విశ్వ ప్రేమికుడు, చాలా థాంక్స్. ముద్రారాక్షసాన్ని సరిదిద్దాను. అసలు అది కంటిచూపుని ఎలా ఏమార్చిందో? ;) ఇలాగైనా మీకు పని చెప్పాను. ఇంత లోతుగా ఒకరన్నా తరిచి చదివారంటే ఆనందమే కదా! నెనర్లు.
ReplyDeleteక్షమించండి.. నాకు ఒక్క పదం కూడా అర్థం కాలేదు..(నేను తెలుగులో చాల వీక్)...మీ కవితలు చదువుతూ స్వచ్చమైన తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను..ధన్యవాదములు
ReplyDeleteఅతడెవరు? : Prabhakar ఇందులో అర్థం కావాల్సింది ఒకటే, నాయిక తన అనుభవాల్లోంచి ప్రియుని elivate చేసి వ్యక్తపరచటం. ఆమె మరణయాతనని అతను అనురాగం అనే ఆయుస్సు పోసి ఒకరూపులో, అతని మౌనంతో ఆమెలో వైరాగ్యాన్ని కలిగించి మరోవిధంగా, అందీ అందక వూరించి విరహంలో ముంచి ఓ పరి, వలపులో కరిగించి మరోసారి ఆమెని పలురూపాల్లోకి పరకాయప్రవేశం చేయించాడు. ఆ అన్నులమిన్న అతని కొరకు ఎదురు చూస్తూనే తిరిగి పునారావృతం అయ్యే ఈ భావనలన్ని తలుచుకుని సంతృప్తి పడటం మరో విధం. ఇన్నిటా మౌనంగా నోరు విప్పకనే ఆధిపత్యం చూపిన వాడే నాయిక మనోహరుడు నాయక. చూడాలనుంది కదూ? ;)
ReplyDeleteమీ వివరణ చక్కగా అర్థం అయినది.. మీ తెలుగు బాష ప్రావీణ్యం అమోఘం ..కృతజ్ఞతలు
ReplyDeleteకళ్ళముందు కనపడుతున్నారు మీ నాయికలు !
ReplyDeleteఏం కనికట్టు చేశారో మరి !
పరిమళం, మనలోని మనిషే ఆ నాయికా భావనలు. మరి త్వరగా చెప్పేయండి ఎవరెవరికి మీతో సామ్యం వుందో? ;)
ReplyDelete