మాయో, మర్మమో, మోక్షమో, సఫలమో ఈ జీవితం?

చలనరహిత శిలలో ఏదో మర్మం
చలనసహిత హృదిలో అదే మర్మం
రూపెరుగని నదిలో ఏదో మర్మం
రూపొందిన మదిలో అదే మర్మం

సడిలేని నడిరేయిలో ఏదో మాయ
పడిలేచే కడలిలో అదే మాయ
మండిపడే సూరీడులో ఏదో మాయ
మండిపొయే కాష్టంలో అదే మాయ

ఉనికిలో, ఉలికిపాటులో ఏదో నిగూఢం
బ్రతుకులో, బ్రతుకుతెరువులో అదే నిగూఢం
భ్రమలో, భ్రాంతిలో ఏదో నిగూఢం
ముక్తిలో, విముక్తిలో అదే నిగూఢం

మార్పు, కూర్పు, చేర్పు సతతం
ఓరిమి, కూరిమి, చెలిమి అనంతం
గానం, కాలం, పయనం అతీతం
శాంతం, సహనం, సోయగం అనితరం

మార్మికం, నిభిడీకృతం, సంక్లిష్టం జీవితం
ధార్మికం, దయామయం, సాంఘికం జీవనం
ఉత్తమం, ఉత్కృష్టం, సఫలం ధ్యానం
శరణం, స్మరణం, మోక్షం గమ్యం

8 comments:

  1. చాలా బాగుంది ఉష గారు.మీ ఊహకి జోహార్లు!!!

    ReplyDelete
  2. ఉష గారూ! మొదటి 12 లైన్లలో తీసుకున్నంత శ్రద్ధ తరువాత 8 లైన్లలో తీసుకోలేదేమో అనిపిస్తోంది. ఎందుకంటున్నానంటే...
    ఈ లైన్లలో పదాలు ఏదో అందం కోసం ప్రయోగించినట్లుగా ఉందే గానీ, అంత భావుకత కనిపించక తేలి పోతున్నాయి.. అలాగే ఒకే అర్ధం వచ్చే పదాలు అదే లైన్లో కనిపిస్తున్నాయి...
    "కూర్పు, చేర్పు
    కూరిమి, చెలిమి "

    నాకు తోచింది చెప్పాను .. అన్యదా భావించకండి...
    అలా రాకుండా జాగ్రత్త తీసుకుంటే మరింత బాగుంటాయి మీ కవితలు.
    కవిత చాలా బాగుంది. all the best :)

    ReplyDelete
  3. ఉష గారు బాగుంది. విజయ్ గారు మంచి పరిశీలన చేశారు. దీంట్లోనూ ఇంతకు ముందు దాంట్లోనూ మీరు మీ శైలిని మార్చారు.. బాగుంది. కొనసాగించండి. .. అభినందనలు.

    ReplyDelete
  4. మొత్తానికి అంతా మాయా మర్మంగా ఉందండీ :)

    ReplyDelete
  5. కొత్తపాళీగారి వ్యాఖ్యకి ఒక డిట్టో కొట్టుకోండి ;)

    ReplyDelete
  6. మీ కవితలన్నీ మిస్ అయ్యాను ఇన్నాళ్ళు గా చాలా బాగా రాస్తున్నారు ఉషగారు ఇప్పుడే అన్నీ చదివి వస్తున్నా కాని ఈ కవిత లో మిగిలిన వారిలాగే చివరి వాక్యాలు పదాలు తప్ప అర్దం తెలియలేదు :(

    ReplyDelete
  7. భాస్కర రామి రెడ్డి గారు, తొలి వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    విజయ్ గారు, మీ సద్విమర్శకి సంతోషం. ఇకపై తగు జాగ్రత్త తీసుకుంటాను. ఒకటే చెప్పాలి, నేను పదాలు ఏదో అందం కోసం ప్రయోగించను, ఒక ధారగా జాలువారే భావాలు నా కవితలు. నేను సమయం వెచ్చించి వ్రాయను, మనసు వెల్లువగా పొంగినపుడు అవే వెలికి వస్తాయి. తప్పక తిరిగి రావటం మానకండి. ఇలా నాకు చురకలు వేయటమూ మానకండి. ధన్యవాదాలు.

    ఆత్రేయ గారు, మీ నిశిత దృష్టికి అదే సంకేతం, నా శైలి మారింది అన్నది గమనించటం. తప్పక ఇలా, అలా కూడా కవితలు కొనసాగిస్తాను. ధన్యవాదాలు.


    కొత్త పాళీ, రాఘవ, నేస్తం గార్లు, మాయ, మర్మం అని ముందే చెప్పాగాండి. కొద్దిగా నిగూఢత కోసం శ్లేష వాడానేమో, ఆలోచించండి.

    అన్నమయ్య అన్నట్లు "నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము" అని నేను మరో విధంగా చెప్పాను. ఎదో కాస్త ఓ "తన్మయి" వూసులనుకోండి. ముందు 12 పంక్తులు నాకు మాయగా, మర్మంగా, నిగూఢంగా తోచినవి చెప్పి, తదుపరి 4 లో, కాస్త తెలుస్తున్న వాటిని వర్ణించి, కడపటి 4 పంక్తుల్లో, చివరగా జీవితం, జీవనం మోక్షమనే గమ్యాన్ని చేరటానికి సాధనంగా ధ్యానాన్ని ఎంచుకోవాలని చెప్పాను. ఈ ముక్తి మార్గ గమనంలో, ఆ స్వామిని శరణుజొచ్చి, స్మరించి, మోక్షం అనే గమ్యానికి చేర్చమని అర్థించమని చెప్పాను. ఇపుడు మరోసారి చదివిచూడండి, ఆ అర్థం గోచరించవచ్చు. భాషాపటిమ లేదు కాని నా వద్ద కాస్త భావసంపద వుందనే నా ఆశ/నమ్మకం.

    మీఅందరకూ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కవితలిలా చర్చా వేదికలు కావటం మరింత ఆనందాన్నిస్తుంది.

    ReplyDelete
  8. భాగుందండి.నేను ఒక భ్లాగ్ ను ఒపెన్ చేసానండి దాంట్లో వ్రాసే భావాలను ఇలా పదిమందికి ఎలా తెలిసేది.కావున నా భ్లాగ్ అడ్రెస్ ను మీకు పంపిస్తున్నాను వీలైన సహాయం చెయండి.


    భ్లాగ్.sriravireddy21.blogspot.com
    & sriravi.reddy21@gmail.com

    ReplyDelete