ఆ తార మళ్ళీ మా ఇంటికొచ్చింది, ఈ మారు తళుకు తారనంది!!!

ఆ తార మళ్ళీ మా ఇంటికొచ్చింది, మాట మీద నిలబడింది.
ఈసారి మినుకుమనే చూపుల్లేవు, తళుకుమనే నవ్వులేకాని.
మునుపటిచోటే నిలబడి నావంక చూసి నవ్వింది.
తోడొచ్చిన తన మావ వంక చూపి మురిసిపోయింది.
నావోడూ వస్తాడని, నాకు తోడవతాడని నొక్కిచెప్పింది.

చెలిమిచేయను చిట్కాలు చాలానే చెప్పింది,
బెట్టుచేయను గుట్లు విప్పిపోయింది.
అదొకపరి ఇదొకపరి సాగించపమని సరసమాడింది.
వంతులొద్దు పంతమొద్దు ఆపై వగచబోకని వైనంచెప్పింది.
నివ్వెరపోయిన నన్ను చూసి మళ్ళీ మళ్ళీ నవ్వింది నాపసాని.

అరమరికల్లేని తనని చూస్తే అంతేలేని సంబరం.
ఏ దిక్కున తానున్నా వెంటపడిపోవాలన్న కలవరం.
వరమీయగ వచ్చిన వేలుపుమల్లే తన దరహాసం,
వీడక వెంటాడే నీడలా పోనా అందుకోను అంబరం.
మరిరాదేమోనని మది గదుల్లో మరేదో సంశయం.

మాలిమిచేయను నావాడు తనవాడి మాదిరి చంద్రుడు కాదు,
ఆకలివేళల అలుపెరుగక నను నలిబిలిచేసెడి విలుకాడూ,
వాదనమీరగ నా లోటుపాట్లు లోతుగ ఎరిగినవాడు,
సాధనచేయగ పట్టువిడుపు పాఠాలు నేర్పినవాడు.
అంతా చెప్పాక అలాగే అని మావంక కనుగీటి ఫక్కున నవ్వింది.

ఆరిందా చూపుల అల్లరి అలవోకలు వుల్లముఝల్లన విసిరింది.
తీరిందా నీ సంశయమని తీరిగ్గా వాకబు చేసింది.
తనువు మనము మనువాడిన మావకికాక ఎవరికిస్తావేమనింది.
చనువు నెయ్యం గూడిన కలయికకాదా కాపురమని నిలదీసింది.
నీవాడొచ్చాక చెప్పినవన్నీ సరిచూసుకోమనీ చెప్పి చక్కాపోయింది.

**********************************************
"
ఆకాశంలో నా వలెనే ఒక ఒంటరి తార ఇంత వానలోనూ, బహుశా నే బిక్కు బిక్కు మనటం తాచూసిందేమో. తోటి చుక్కలకేం చెప్పి వచ్చిందో, వెన్నెల్లో తడిసే ఒంటిని వానధారలకి అప్పచెప్పి, నా వంక మినుకు మినుకున చూస్తూ నాకు తోడువున్నానంటుంది. నీకన్న అదే నయం, గగనాలనుండి స్నేహహస్తం అందిస్తోంది"

పైన పంక్తుల్లోని ఆ తారే ఈ కవితకి ప్రేరణ. నాదే మరో రచన, ఈ శీర్షిక మీరే పెట్టాలి [డిసెంబరు 2008] లో నేను ప్రస్తావించిన ఆ ఒంటరి తార ఈ మారు జంటగా వచ్చి నా మడిసి మీద కినుకలోవున్న నాతో కబుర్లాడినట్లు కలిగిన వూహాజనిత భావావేశం ఇది.

8 comments:

  1. తార, శాశాంకుడితో కలిసి వచ్చి మరువపు వనం పై వెన్నెల వాన కురిపించి వెళ్ళిందన్న మాట.. ఆ వానలో మమ్మల్నీ తడవనిచ్చినందుకు ధన్యవాదాలు...

    ReplyDelete
  2. ఇన్నాల తర్వాత తను జంట గా వస్తే మీరు కూడా జంట గా కనబడతారని మినుకు మినుకు ఆశతో వచ్చి తెల్లారే దాక మీరు కంప్యూటర్ ముందు కునుకు తీస్తుంటే చూసి చక్కా పోయింది.

    ReplyDelete
  3. తారాచంద్రులను ఉషోదయంలో చూసే భాగ్యం కలిగింది. పద ప్రయోగాలు బాగున్నాయి.

    ReplyDelete
  4. బాగున్నాయి మీ తార ముచ్చట్లు :)

    ReplyDelete
  5. చాలా బాగా రాసారు ఉష గారు,,ఇంత చక్కని ఆలోచనలు మీకే సొంతమేమో

    ReplyDelete
  6. చాల బాగుంది మీ పద ప్రయోగం.

    ReplyDelete
  7. మురళి, అవునండీ ఆ జల్లుల్లో ముందుగా నేనే తడిసిపోయాను సుమీ...

    రవిగారు, ఇప్పటికే మీకు అర్థమైవుండాలే మాకు రెండు కప్యూటర్లువున్నాయనీ, ఇంకా చంద్రుడితో తనకి కౌన్సలింగ్ అవలేదనీని? మనదంతా న్యాయపరమైన వాదనండి. ఒకరికే కాదు, ఏ విషయంలోనైనా భాగస్వామ్యం అన్నది సమంగా వర్తించాలి కదా?

    ప్రదీప్, నిజమేనండీ, నాకూ చాలా అరుదుగా ఆ దర్శనం లభిస్తుంది, వాళ్ళదీ మా తంతేనేమో?

    అశ్వినిశ్రీ, "నీ మాటే చాలు చేమంతి..." పెద్దరికం సినిమానుండి కాపీకొట్టిన పాటని ఇలా కొంచం రీమిక్స్ చేసా..

    వేణూ గారు, అంతే కదండి మరి ఏ వయసులోనైన చుక్కలు లెక్కలేనన్ని వూసులూ, ముచ్చట్లూ వినిపిస్తూనేవుంటాయి.

    నేస్తం, మళ్ళీ అదేమాటా? నాకేదీ స్వంతం కాదు, ఈ భావావేశం, ఆలోచన అంతా కవితాదేవికే స్వంతం!

    సాయి గారు, సాదర స్వాగతం, మరెన్నో గీతాలు నా మరువం మీకు ఆలాపిస్తుంది, మరిన్ని పదాలు, పదప్రయోగాలు మీకు అగుపడతాయ్, రావటం మరువకండి మరువపువనానికి.

    అందరికీ మరో మారు హృదయపూర్వక ధన్యవాదాలు! కృతజ్ఞాభివందనాలు.

    ReplyDelete