వేసట ఎరుగని విరహిత

కనులు విశాలమైన ద్వీపాలు దాచుకున్నాయేమో
రానున్నవారిని అక్కడే పట్టి బంధించాలని,
రాకలు ఎరుగని క్షణం, వీడ్కోలుతో పందెం వేస్తుందప్పుడే.
చూపులు స్వర్గచిత్రాన్ని అలుపెరుగక దిద్దుతున్నాయదేమో..
తెలిసిన పూలన్నీ తెలియని అత్తరు వత్తుగ అద్దినట్లు,
గతపు పుట తెరిచి తిరిగి చదివినట్లుగా...

పుప్పొళ్ల జాజర, జాజిపూల జాతర,
సవ్వళ్ల ఉవ్విళ్ళు, సరిగంచు మురిపాలు,
తెలవారితే కలల సందళ్ళు,
సందెవాలితే కనుల కలవరాలు.
కలిసున్నా దాహమే, ఎదురుచూపులోనా మోహమే..
విరహాన వేగేటి జీవితం, వేసట తెలియని పయనం.

********************************
"
కనులు విశాలమైన ద్వీపాలు దాచుకున్నాయేమో
రానున్నవారిని అక్కడే పట్టి బంధించాలని,
రాకలు ఎరుగని క్షణం, వీడ్కోలుతో పందెం వేస్తుందప్పుడే."

ఇవే ఈ కవిత రాయటానికి ఉద్యుక్తురాలిని చేసిన పంక్తులు, నిజానుభూతులు.

ఒక విధంగా పేలవమైన కవిత అనదగిన ఈ రచన ఇక్కడ పెట్టటంలో ఉద్దేశ్యం ఇది. మొదటి మూడు పంక్తులు ఒక విధమైన మానసిక స్థితిలో దాదాపు ఆర్నెల్ల క్రితం, ఫెబ్రువరి పదకుండున రాసినవి. ఏ కవికైనా వెలికి వచ్చేసిన భావనలు, ఒక పాఠకు/డు/రాలు/గా చదివితే అమూర్తంగానో, అపరిచితంగానో తోస్తే, అది వేర్వేరు ప్రయోజనాలని చూపినట్లు. ఇవాళ నేను ఆ కవితని పూర్తి చేయాలని చాలా విఫల, పేలవమైన ప్రయత్నం చేసినట్లే. ఆ ముందు మూడు పంక్తుల లోతుల్ని పలుచన చేసినట్లే... ఎందుకంటే ఇప్పుడా ఎమోషనల్ ప్లేన్ లోకి వెళ్లలేని వైఫల్యం.. సానబెట్టి రాయాల్సిన కవిత అయినా నా పరిమితి దాటి నేను న్యాయం చేకూర్చలేకపోయినదిది. కవిత ప్రక్రియ పట్ల అవగాహన కోసం నాకు నేను రాసుకున్న, చదివినవారిలో కొందరికైనా కాస్త ఉపయోగపడుతుందని ఈ అంగ వైకల్యం ఉన్న రచన ఇక్కడ పెట్టాను.

10 comments:

 1. కనులు విశాలమైన ద్వీపాలు దాచుకున్నాయేమో
  రానున్నవారిని అక్కడే పట్టి బంధించాలని,
  చాలా బాగుందండి.
  ఇప్పటివరకూ ఎదో పుస్తకాలలో ఒకటో రెండో చదవడమేకానీ, ఇలా మీకవితలు రోజూ చదవడం నాకు చాలా ఆనందంగా ఉందండి . నాకు ఈబ్లాగ్స్ వల్ల , మీలాంటి వాళ్ళందరి వలన చాలా మంచి అభిరుచి దొరికింది.ధన్యవాదాలు ఉషగారు.

  ReplyDelete
 2. angavaikalyam antoone andaanni antha chupinchaaru !very very nice poetry!

  need ur comments on my blog
  http://lalithayamini.blogspot.com/

  ReplyDelete
 3. అంత బాగుంటే..పేలవంగా వుందంటారేంటండీ..?

  ReplyDelete
 4. వీడ్కోలే అక్కర్లేని చిత్రమొకటి కను రెప్పల వెనుక వూగినప్పుడు వర్తమాన భవిష్యత్తులను గతమొక గళమై నిలువరిస్తుంది లే బుజ్జి... :-) బాగుంది.. ఏంటో ఇలా కవితలు రాయటమేమిటో వాటికి మళ్ళీ హేండీకేప్డ్ అని పేరెట్టటమేమిటో అంతా కృష్ణ మాయ. ;-)

  ReplyDelete
 5. ఇది పేలవమైన లేదూ అంగవైకల్యం కల కవిత ఎందుకు అన్నది రాసేసాను. ఆ మూడే దీనికి ఆత్మ..మిగిలినవి అతకలేదు సరిగ్గా.. ఇత్తడి కుండకి రాగి మాటేసినట్లుగా ఉంది. ఒక్కటైనా సువర్ణాక్షరం రాయగలననే నిర్ధాక్షిణ్యంగా దీన్ని దానికి తగు స్థానాన నిలుపుతా!

  రాధీక[నాని], మంచి అభిరుచి.

  సావిరహే, చూస్తానండి. నేను పైపైన చదవలేను. నా టూడూ లిస్ట్ లే పెట్టుకున్నాను.

  ప్రణీతస్వాతి, తొలివాఖ్యకి నెనర్లు.

  భావన, నీ మాట చల్లగా నా కల తీరగా, "తీరెను కోరిక తీయ తీయగా.." కావాలని ఆశ పడుతూ.. ఇలా ఇంకెన్నో ...తూ తూ లు.

  ReplyDelete
 6. What is "జాజర" ?

  GK penchukundam ani.. :D

  ReplyDelete
 7. సుజ్జి.. జాజర అనేది లెత ఎరుపు రంగు నుండి ఎరుపు వర్ణం లోకి మారుతున్న పుప్పొడి.. గ్రాంధికం గా జాజర అంటారు... గాజర అనే పదం కూడా ఇంకోటి వుంది. గాంభీర్యం అని, గాదెర అని ఇంకో పదం ధాన్యం పోసుకునే గాదె అని అర్ధం వున్నాయి కాని సంధర్బానుసారం ఉష వాడిన పుప్పొళ్ళ లేత ఎరుపుదనం పాకిన బుగ్గలు అనే సంధర్బం లో వాడినట్లు అనిపించింది. అవునా ఉష. ఇది నాకు అర్ధమైనది సుమా.. వేరే అర్ధం, సంధర్బం లో వాడితే నన్ను తిట్టు కోకుండా చెప్పు.

  ReplyDelete
 8. భావన, ఇది విరహిత మీద వచ్చిన కవిత కనుక, ఆమె వర్ణన/భావనల రీత్యా నేను "జాజర" మీద చేసిన ప్రయోగం సరీగ్గా పట్టావు, థాంక్స్.

  ReplyDelete
 9. ఉష గారికి, నమస్కారములు.

  కవిత చాలా చాలా బాగుంది.

  భవదీయుడు,
  మాధవరావు.

  ReplyDelete
 10. madhavarao.pabbaraju, మునుపొకసారి చెప్పానండి. మీ చేత నమస్కారములు చెప్పించుకునేంత వయసు, అనుభవం నాకు లేవు. కనీసం పనుల ద్వారాగా ఆ గౌరవానికి అర్హురాలినా అన్నా మనకా పరిచయం లేదు కనుకా, దయుంచి ఆ మాట వదలండి. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. కానీ నా వరకు ఇదో వైఫల్యమే.

  ReplyDelete