ఉమ్మడి చరిత్రకారులు

మునిమాపులో ఈ గాలివాన ఊపిన మానస ఘోష

ఈ చిత్రం నా పెరటిలో తీసినది


*** యువతరానికి కొందరు ఆలుమగలు సెట్ చేస్తున్న బాడ్ ఎక్జాంపుల్ ఈ కవితకి ప్రేరణ



లెక్కతప్పిన చుక్కల రంగవల్లిలా
అసంబద్ద కలయిక కాబోలు,
తప్పక పురుడుపోసుకున్న అనుభూతి,
నిత్యం అర్థాకలితో నలిగే అనాథశిశువు,
పరవశాల పాలబువ్వ తెలియని పసికందు.

అసంపూర్తి కల అర్థరాత్రి గాలివానలా,
నిదురలేపి మరీ కలవరపెడుతుంది.
నిరీక్షణలన్నీ తెలవారి రాలిపడిన పారిజాతాలు,
నిట్టూర్పులన్నీ దిగుడుబావి పాకుడుమెట్లు.
ఇరువురూ ముక్తసరి మురిపాల ఆత్మవంచకులు

పణాలు, ఋణాలు, అరణాలు
అనుబంధాలకీ తప్పని బేరసారాలు.
అనుమతులు, బహుమతులు, దిగుమతులు
అనుభూతి తలవొగ్గిన లాంఛనాలు,
మనసారా విజేత, పరాజిత ఒకరి సగపాలు మరొకరు

15 comments:

  1. విసిరిన గాలివాన చందం
    రేపిన ఎదలోని గాయం ... బాగుందని చెప్పనా నొప్పెట్టిందని ఏడ్వనా.. :-|

    ReplyDelete
  2. మొదటి పేరా గుండెలో ముల్లులా గుచ్చుకుందండీ.....తెల్లారితే న్యూస్ లో డ్రైనేజీలలో పసికందుల శవాలు , చెత్తకుండీలపక్కన పసిగుడ్డులూ ...చిరునామా ఎరుగని చిరుకూనలు ! నిన్న , నేడు , రేపూ ....చరిత్ర పునరావృతంఅవుతూనే ఉంటుంది .ఈ పుట్టుకలు ఆగవు ఈ చరిత్రమారదు.

    ReplyDelete
  3. @భావన, ఇంకాసేపు ఆగుదామన్నా బండి పక్క త్రోవ పట్టేట్లుందని.. :) నిజానికి ఇది నా/నీ వ్యక్తిగతం కాదు. నీకూ తెలుసు. అలా షాపింగ్ ల్లోనో, ఇతరత్రా స్థలాల్లోనో చిలికి చిలికి గాలివాన పోట్లాటలు పడే వారు గుర్తొచ్చిలా..

    ReplyDelete
  4. @పరిమళం గారు, పిచ్చితల్లీ ఎదగాలి మీరు, ఇక్కడ మన కవిత చెప్తున్నది - అనాథ అనుభూతి ని గూర్చి. దంపతులయ్యే యువతరానికి ఇప్పటి ఆలుమగలు సెట్ చేస్తున్న బాడ్ ఎక్జాంపుల్ నా ప్రేరణ. ఆ మొదటిపాదం ఎత్తినది కలిసీ కలవని మనసుల "అసంబద్ద కలయిక". ఇది వివాహ వ్యవస్థ మీద కవితనే కానీ మీరు కాస్త ప్రాపంచిక ధోరణిలో పోయారు. మీలాంటి జాలిగుండె గలవారు ఎక్కడ కన్నీరు మున్నీరు అవుతారోనని నేను దూకక తప్పలేదు. నాకు మీరన్న శిశివుల పట్ల జాలి/సానుభూతి ఉన్నా ఈ కవిత మరొక ప్లేన్ రాసినదండి. గతంలో రాసిన "గోడ గుండె పగిలింది! http://maruvam.blogspot.com/2009/06/blog-post_08.html మాదిరిదే ఇదీను. నెనర్లు.

    ReplyDelete
  5. సగపాలు ఎందులో...
    అనుభూతి లోనా...అనుభవంలోనా...
    ఒకటి మానసికం..
    మరొకటి భౌతికం..
    అసలు విషయం తెలియని అనాగరికులయిపొయ్యారుగా...

    ReplyDelete
  6. మీ కవితలు ఎలా అర్ధమవ్వాలి. ఇంత చక్కటి తెలుగు మీకెలా వచ్చింది? (అసూయ). ఎంతటి అభినందనలు మీకు సరిపోవని నా అభిప్రాయం.

    ReplyDelete
  7. Last night my city is not any different than this..http://www.dailymail.co.uk/news/worldnews/article-1289162/Lightning-strikes-Willis-Tower-Trump-Tower-Chicago.html The very atmosphere that made me pen down this kavita/whatever.

    ReplyDelete
  8. అక్షరాలలో పెట్టే ప్రతి అనుభవం మనదే అవ్వాలంటే కష్టం కదా. ఎక్కడో చూసిన ఒక చిత్రమో ఎప్పుడో విన్న ఒక మాటో...భావాన్ని భావుకతను.. వేదనను వెన్నల ను రంగరించి కలం నుంచి బయటకు రాక పోతే ఇంక రాయటమెందుకు కదా. ప్రతి ది మన ఇంట్లో నో మనకో జరగాలి అంటే... వు... కష్టమే... కొట్టుకుని పోతాము బ్లాగ్ రాయటానికి కూడా వుండమేమో... ;-)

    ReplyDelete
  9. అనుబంధాలకీ తప్పని బేరసారాలు ...ప్చ్

    ReplyDelete
  10. శ్రీలలిత గారు, ఎంతైనా మాకన్నా ముందు జీవితాన్ని చూసినవారు. మీ మాటకి తూకం రాయి పెద్దదే పడాలి. అనుభూతి వేరు, అనుభవం వేరు అసలు మానసికానందం లేని భౌతికభావన ఎంతసేపు నిలవడగలదు. జీవిత పాఠశాలలో సగం పైన నిరక్ష్యరాసులేనండి. ఏంచేద్దాం మరి. థాంక్స్.

    ReplyDelete
  11. @జయా, నిజమేనా? మరికొన్నాళ్ళు షూస్ మార్చుకుందామా? :) థాంక్యూ.

    @ అశోక్ పాపాయి, మీ తొలివ్యాఖ్యకి థాంక్స్. మీ బ్లాగు అలా ఓసారి స్కిమ్ చేసాను. మళ్ళీ వస్తాను వీలుని బట్టి. నేను చూసినంతలో బాగా రాసారు. కామెంట్స్, హిట్స్ అనే రెండిటి బారిన పడకుండా బండి లాగించమని నా శుభాశీస్సులు.

    ReplyDelete
  12. విజయమోహన్ గారు, మన చుట్టూ గమనించేవేగాండి ఇవన్నీను.

    భావన, నువ్వన్నది సరే, మరి నాకు సీతాకోకచిలుకలా ఎగరాలని, చేమంతి పువ్వులా నవ్వి రాలిపడాలని ఉంటది, అవయితే బావుండు.. :) ఇక తిట్టు.

    ReplyDelete
  13. డా. మైలవరపు శ్రీనివాసరావు గారి వ్యాసంలో చాన్నాళ్ళ క్రితం చదివాను. అందులో ఐదుగురు ఆదిదంపతుల ప్రస్తావన ఉంది. ఆ పుస్తకం లేదు, గుర్తున్నది రాస్తున్నాను - బ్రహ్మ, ఆయన వాక్కు, భారతి, విష్ణు, హృదయవాసిని లక్ష్మి, అర్థనారీశ్వరులు, ఆదిత్యుడు, ఆ వేడిమినుంచి ఉపశమనం ఇచ్చే ఛాయ; చంద్రుడు ఆ చల్లదనానికి గోరువెచ్చన కలిపే రోహిణి. ఇక వివరణ అవసరం లేదు. నేను గుడ్డిగా ఏదీ చేసేయను, కానీ ఆపై వారిని మన పెద్దవారిగా, ప్రపంచాన్ని మనకి పరిచయం చేసేవారిగా భావిస్తే కొంతైనా నేర్చుకోవాల్సినది ఉందిగా. దాంపత్యం - అదీ అన్యోన్యం తప్పా మరి దేనికీ తావులేనిది, అరమరికలు లేనిది సాధ్యమా - నా దృష్టిలో "కాదు". ఇరువురి నడుమా ఏమి కావాలి? అది ఆ ఇద్దరికే తెలియాల్సినది. ఇదిగో చెక్ లిస్ట్ ఈ రకంగా పోండి అనేది కాదు. కనుక, అన్నిటికీ పరిష్కారం ఎవరూ చూపలేము. చూసినదాన్ని ఎత్తిచూపి, తగు చర్చ చేయటమ్ తప్పా. ఇంతవరకు శ్రద్దగా చదివినవారు స్వీకరించ తగిందేమన్నా వుందంటే, స్వీకరించండి. ధన్యవాదాలు.

    ReplyDelete