కవి హృదయం: భిన్న స్వర గానం?

ఓ సారి హృదయం లోకి తొంగిచూస్తే నా వైపు విసరబడ్డ పదాలివి. ప్రత్యేకానుభూతి జనిత ధాతువులివి. ఇక్కడితో ఆగలే/వ/ని ముందే తెలిసిన అనేక వచనాలివి. ఇంకా ఎలా మాల అల్లాలో, ఏ స్వరం కట్టాలో, ఎవరికా గానం వినిపించాలో తెలియదు. కనుక ఇది ఓ అసంపూర్తి కవిత. కానీ, ఇలా ఎదరపెడితే మరో ఎద గేయం వినపడదా అని.. కనుక ఈ తరుణాన ఈ పదబంధన మీ మదిలో కదిపిన భావం తక్షణం ఇక్కడ పెడ్దురూ..ఇది ఒంటరిగా మిగిలిపోయినా భిన్న స్వర గానాలు సంపాదించకపోయినా తప్పక ఓ "భిన్న స్వర గానమే" కదూ?



ఓ శీతువు ఉదయాన ఎగిరే పక్షి నిలబడి, కదిలే సరస్సు స్తంభించి, ఓ చిత్రమైన జగతిని నా కనులెదుట నిలిపితే నేను పదిలిపరుచునున్న ఈ చిత్రం వలేనే, ఈ పదాలూను.. ఎలా ఆకృతి తెచ్చుకున్నాయో, ఇలా విడివడి నామీద కాదు కాదు మన మీద పడ్డాయి. ఆ పక్షి బింబం మాదిరిగా మరొక్క కవి హృదయం ఇదే రూపు కనదా? హృదయానికి ఋతువేవిటి అది అనునిత్యం పదికాలాల్లో సంచరించగల నేర్పరి. బహు గడుసరి
.

*** *** *** *** *** *** *** *** *** ***

నిర్ణయాత్మక క్షణం
నిమ్మదించిన మానసం

నిట్టూర్పు వీడిన నిస్వరం

నివురు తొలిగిన రూపం

నిర్మాల్యం తీసిన గర్భాలయం


విభ్రమ గొలిపిన వాస్తవం

విశదమయిన పాఠం

వినిపించిన మౌనం

విరబూసిన కుసుమం

విశ్వాత్మలో లీనమైన అనురాగం

8 comments:

  1. నిట్టూర్పువీడిన నిస్వరం.. కొద్దిగా అర్దమవలేదుకానీ
    వింబ్రమ గొలిపిన వాస్తవం
    విశిదమైన పాఠం
    వినిపించిన మౌనం
    చాలాబాగుంది.

    ReplyDelete
  2. రాధిక(నాని), "నిస్వరం" - కవుల/మనుకునేవారి/కి కాస్త ఓ లక్షణం ఉంటుంది..అదే సృజన..నేను అలా రాసినదే ఆ మాట! స్వరం, సుస్వరం మాదిరే స్వరం, నిస్వరం [ఆశ, నిరాశ ని అనుకరిస్తూ..]
    నెనర్లు.

    ReplyDelete
  3. కవిత్వం గుఱించి ఛందస్సు గుఱించీ తెలుసుకోవాలనిపిస్తే ఈ క్రింది లింకును ఫాలో కండి.
    http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF%28%20%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%83%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%20%29

    ReplyDelete
  4. నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు, కృతజ్ఞతలండి. నిజానికి గత ఏడాది మార్చి పదకుండున [నాకీ మెమరీ టెస్టులు ఇష్టం] మీరు పద్యకవితలు వ్రాయమని సూచించారు. అప్పటి నుంచీ చాలా నిదానంగా సాగుతున్న ఆ సాధన పూర్తి క్రియాశీలక ప్రణాలికగా ఎప్పుడు రూపొందుతుందో తెలియదు. వేగవంతమైన జీవితాలు వృత్తిపర వత్తిళ్ళ కారణంగా తెలిసిన ప్రకియ, తెలియని ప్రయోగం అన్నట్లుగా ఆగుతుందా ప్రయత్నం. తప్పక తెలుసుకుంటాను. రాస్తాను అనే నమ్మకం. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ఆదమరచిన ఈ క్షణంలో
    అనంతాకాశం జారిపడింది.
    అనంతంగా సాగే ఈ జీవనభ్రమణంలో
    ఆనందించాలని చూస్తే ఏముంది?
    తోడుగా నడిచే నానీడతప్ప
    పలుకరించే మనసే లేదు.

    ReplyDelete
  6. భా.రా.రె. శభాష్.. "తోడుగా నడిచే నానీడ తప్ప" ఇన్నాళ్లకి ఇంత లోతైన కవితాధార. అంతే మానసిక భావనలో మనలో మనం.. భౌతిక లోకంలో మనకి మనం. మనిషి మౌలికంగా ఒంటరి. నెనర్లు.

    ReplyDelete
  7. విసిరిన కవిత నవ్విన పెదవి నవ్వని ముక్కు అర్ధం కాని బుర్రా.. హి హి హి (అర్ధం అయ్యి వుంటుంది నాకు కవిత లోని లోతు తెలియలేదని)

    ReplyDelete
  8. భావన, ఇంతకన్నా విభిన్నస్వరం అవసరం లేదు. ఈ అర్థ కవిత ఇంతటితో సంపూర్తి! :) నెనర్లు.

    ReplyDelete