ముందుమాట: దాదాపుగా నాలో అణగారిపోయిన భావుకతకి, కవితాధోరణికీ స్ఫూర్తి నా జీవితం, తను పోగొట్టుకున్నదాన్ని తిరిగి వెదుక్కున్న ప్రేమభావన, దాని తాలూకు భావావేశం. అందుకే నా ఈ నూటొక్క కవితల మరువానికి ఆ చివురు తొడిగాను. ఈ అఘ్రాణింపు చవిచూడండి. ప్రేమ అమరం, ప్రేమికులు చరితార్ధులు. మీ మనసులోని భావనలు నాతో పంచుకోండి. ఈ క్రింది వచన కవితలో మునుపటి 100 కవితల్లోని పంక్తులు ఉటంకిస్తూ లింకులు ఇచ్చాను. ఇష్టమున్నవారు అవీ చూడొచ్చు. నా మొదటి ప్రేమ కావ్యం చదివారా ఇంతకీ?.
*******************************************************
కన్నా, ఇది మన మరో ప్రేమకావ్యానికి శ్రీకారం. పదిలంగా దాచేసానా నిన్ను, ఈ చంటి చూడు "నల్లనయ్య" అని తలపుల తేనెపట్టు చెదరగొట్టేసాడు. ఎంచక్కా తన దార్న తాను తన నెచ్చెలి చెంతకి సాగిపోయాడు.
"తలచి, తరిచి, తిరిగి తిరిగి నాలో నేను తలపోసుకున్నా.
వలచి, వగచి, సుడులు తిరిగి వలయమై నన్ను నేను కమ్ముకున్నా.
విసిగి, విడిచి, తిరిగి రాకన్నా నను వీడని ప్రశ్నలే మరలా వేసుకున్నా.
నేను రాధనా లేక ఊర్మిళనా? నీచెంత నేచేరనా? నావొడిని నిను సేదతీర్చనా?
ాధ యమునా తటిలో తన నల్లనయ్య కొరకు వేచి,
ఆ వెన్న దొంగ వూసుల్నే వెచ్చగా కప్పుకుని పవళించి వుండివుంటది.
ఊర్మిళ తనవాడ్ని వలపులోలలాడించిన పానుపుపై వాలి తిరిగి,
ఆ మధురస్మృతులు నెమరువేసుకుంటూ నిదురలో వుండివుంటది."
అయినా నల్లనయ్య వలపుల్ని అంతా కొల్లగొట్టేసారుట.
అందుకని మనవే కొన్ని తనకి పంచేస్తా. అతిశయం అన్నా కానీ అదే నిజం.
"నేను నేనే, నేనెవరో కావటమేమిటి? నాలోని పరవశం విహంగమై స్వేఛ్ఛగా రెక్కవిప్పుతోంది
నీ చెలిమే గంధమల్లె అద్దుకున్నా, నీవు పంచిన అనుభూతులే చీరగా కట్టుకున్నా.
మనమాటలు అందియలుగా కట్టుకున్నా. మనకలల గీతాలాలపిస్తున్నా.
నీసడిలేని మరెవరూ రాని ఈ తోటలో, ఒంటరినై, రంగవెల్లినై నర్తిస్తున్నా."
నిదురమ్మ ఆ మలుపులో ఆగి నను చూసి కనుగీటి నవ్వుతోంది, నీ వాడ్ని చేరదీసుకో అని.
ఒక్కసారి అలా వనవిహారం చేసివద్దామా? పోని ఓ లేఖ వ్రాసేయనా? ఎన్ని లేఖలు వ్రాసుకున్నాం,
మరోసారీ అదే లేఖా అంటావు.
..
మనం కలిసుండే లేఖల్లో మళ్ళీ మళ్ళీ కలుస్తాం.
లక్ష జన్మల కోటి లేఖల్లో ఒకరినొకరు తెలుసుకుంటాం.
మనం అలా సాగర తీర సమీపాల్లో చేపల్లా ఆడామే గుర్తుందా, అపుడు పోగేసిన ఆలిచిప్పలు మా వూరి నదికి ఆమె ఇష్ట సఖుని కానుకని చదివించాము గుర్తుందా. చేపపిల్లలా చిందేసి "అస్థిరవై, అంచలంచల అనీషవై దరిలేని తీరాలకడుగులేస్తూ, ఏ అదృశ్యప్రియునితోనో గుసగుసల గుంభన నవ్వు లొలికిస్తూ, ఒరవడిలోనూ తడబడుతూ ఏ ఓడిని చేరేవు." అంటున్నా వినక పరుగులిడింది కదూ?
నా మోవి నీ భుజాన వాల్చి అపుడేమన్నాను...అదైనా చెప్పు..
స్మృతుల అక్షయం నుండి తొణికే, క్షణపు బిందువులన్నీ ఏరి,
జీవనసాగరతీర భావరేణువుల తళుకులద్ది,
గుండె ఆళువలో గుత్తంగా చేర్చి, ఓ రూపునిస్తే
మేలిమి ఆణిముత్యమై మెరిసి, నా మీద రువ్విన,
మెరుపుల జడికి ప్రతీకవై నిలిచిన, నా అపురూప నేస్తం,
కంటి బాస, గుండె వూసు, జతగూడి గుస గుసలాడితే,
నీ కలకంఠి నోట పలికే పాటకి పల్లవి నీ స్ఫూర్తే.
ఈసరికి నా స్పందన నిను చేరివుంటుంది. మళ్ళీ మనవూసుల్ని
రేపే కాదు కాదు ఈ క్షణమే కలబోసుకుందాం. రావా కన్నా త్వరగా నీ చెంత లేనిదే నా మనసు పలుకనంటుందిక...
:) :)
ReplyDeleteమీ కవితలోని ప్రతి అక్షరంలోని భావుకత నా మనసుని హత్తుకుంది...ఉషగారు చాలా బాగా వ్రాసారండి.
ReplyDeleteలక్ష జన్మల కోటి లేఖల్లో ఒకరినొకరు తెలుసుకుంటాం..
ReplyDeleteచాలా అందంగా చెప్పారు..!:)
బాగుందండి మీదైన శైలి లో..
ReplyDeleteనిదురమ్మ ఆ మలుపులో ఆగి నను చూసి కనుగీటి నవ్వుతోంది
ReplyDeleteఅద్భుతమైన ప్రతీక మరువపు పరిమలం అద్దారు.....
నూటొక్క కవితల మరువపు చివురు పరిమళం గుబాళిస్తోంది.
ReplyDeleteమీ అందరికీ ధన్యవాదాలు. ఇది శ్రీకారం మాత్రమే. అసలు కావ్యానికి మీరంతా తప్పక చదువరులై తిరిగి రావాలి సుమా!
ReplyDeleteహరేకృష్ణ, మీ చిరుదరహాసపూరిత తొలివ్యాఖకి,
పద్మార్పిత, నా భావుకతకి మీ హృదయంలో చోటిచ్చినందుకు,
సుజ్జీ, ఆ లేఖలే ఇరువురి నడుమ వారధులని గమనించినందుకు
నెనర్లు.
మురళి, శైలిని ప్రస్తావించినందుకు ఆనందం. నాదంటూ ఓ ప్రత్యేకతవుండాలని లోలోపల అదీ ఇదీ అనిచెప్పలేని ఏదో ఇది. నా నేస్తం నా భావోద్రేకానికి అడ్డు పడకపోతే ఇది ఓ ప్రబంధం అవుతుంది. మళ్ళీ రావటం మరవకండి.
ReplyDeleteసాగర్ గారు, నా బ్లాగుకి సాదర స్వాగతం. ఇదో కలగూరగంప వంటి కుదురు. మీక్కావాల్సిన కొమ్మని ఆఘ్రాణించవచ్చు. నిదురమ్మకి నాతో చాలా సయ్యాటలు సాగుతాయి. ఒక్కోసారి దరికి రాదు, మరో సారి వచ్చినట్లే వచ్చి తప్పుకుపోతుంది. కానైతే నా విహారాలకి మాత్రం అడ్డు రాదు. తనని గురించి ఓ మాట చెప్పాలనిపించిందందుకే. నెనర్లు.
ReplyDeleteచిలమకూరు విజయమోహన్ గారు, మీరు ముద్రవేసాక అది శిలాశాసనమే. కాసింత సంశయం ఈ రచనని ఎలా నడపగలనా అని. ఒక చిన్న అంచు దాటితే ఈ భావనలోని ఉదాత్తత కనుమరుగయిపోయే ప్రమాదం వుంది కనుక కాస్త కసరత్తు చేయాల్సివస్తుంది. ప్రేమ, సరసం,శృంగారం కలిసిన త్రివేణీసంగమం కానుంది ఈ రచన. పొడిగింపు చదవటం మానకండి మరి. పృధ్వితోను, మీతోను ఒక చిత్రం గీయించే రచన ఏనాటికైన చేయాలనుంది. ధన్యవాదాలు.
ReplyDeleteఇది చాలా అన్యాయం. ఒక్క టపా కోసం నాలుగు చదవమనడం.
ReplyDeleteనాకొక్క ధర్మ సందేహం, మొదట నల్లనయ్యతో మొదలు పెట్టారు, తరువాతి పేరాలో
"నీ చెలిమే గంధమల్లె అద్దుకున్నా, నీవు పంచిన అనుభూతులే చీరగా కట్టుకున్నా" అని రాసారు. చీరల దొంగ చీరలు పంచింది ఎవరికి?
సరే లెండి, రెంటికీ సంబందం లేదు అంటారా!!
====
"మరోసారీ అదే లేఖా అంటావు" --- ప్రేయసి రాసే ఒక్క లేఖ చాలదూ జీవితమంతా మల్లెలా గుబాళించే పరిమళం వెదజల్లడానికి?
====
చిన్న సలహా, వీలైతే పాత కవితలను జాగ్రత్తగా కలపండి, లంకెలు ఇస్తూ... పాఠకులు లంకెల లంకెల బిందెలు మొయ్యడం వల్ల మీ రచనను ఆస్వాదించలేరు అని నా అభిప్రాయం.
ప్రదీప్, అందుకేగా ముందే చెప్పాను, కావాల్సిన వాళ్ళే ఆ లంకెల్లోకి తొంగి చూడమని. తర్వాతి టపాలో మరోవిధంగా ప్రయత్నిస్తాను. చదువరులని తికమక పెడతానేమోనని కాస్త నేనూ తొట్రుపడ్డాను సుమా. ఇక నా "నాయికానాయకులు" నల్లనయ్య ఆతని ప్రేయసులు కారు, స్పష్టంగానే చెప్పననుకున్నానే పైగా "నల్లనయ్య వలపుల్ని అంతా కొల్లగొట్టేసారుట. అందుకని మనవే కొన్ని తనకి పంచేస్తా" అని నాయిక చేత చెప్పించాను కూడా.
ReplyDeleteఇక లేఖల మాట. ఏం చేద్దాం చెప్పండి మన నాయకులవారికి కాస్త జడత్వం ఆపై నిర్లిప్తతతో/మౌనమో. ఈ రచన పూర్తిగా వ్యక్తిగతం కాకపోయినా కొంత స్వానుభవం/స్వానుభూతికి వూహ కలేసుకు జనించింది. కనుక నాయికలోను, నాయకునిలోను నిజ జీవిత పోకడలు జొప్పించాల్సివస్తుంది. నిజానికి పరిమళం ద్విగుణీకృతం చేయను ఒకే లేఖ పలుమార్లు పయనించింది అంతే.
మీ సునిశిత వ్యాఖ్యకి ధన్యవాదాలు.
[గమనిక - మీ వ్యాఖ్య స్థానం 11, మీ పుట్టినరోజు నెలది ;) ]
'నీ చెలిమే గంధమల్లె అద్దుకున్నా, నీవు పంచిన అనుభూతులే చీరగా కట్టుకున్నా'.......
ReplyDeleteమీరు రాసే ప్రతి అక్షరం నాకిష్టం ....అతిశయోక్తి కాదు సుమా!...........
చిన్నీ, మీలో ప్రేమని సృజించే మనసుంది కనుకనే నా అనుభూతిలో మమేకం కాగలిగారు. ప్రేమైక జీవన సారమది. మనిషున్నా లేకున్నా మనసులోని భావనదే పై చేయి. మీ అభిప్రాయాన్ని సవియంగా స్వీకరిస్తున్నాను. నెనర్లు.
ReplyDeleteఅద్భుతమీఅనుభవం ....అనుబంధం !
ReplyDeleteపరిమళం, ఈ వలపు చిందు పరిమళం మీరు అస్వాదిస్తున్నందుకు మహదానందం. ఇంకా విరిసీ విరియని మొగ్గ ఈ రచన. మలి రచనలో వికసించనుంది, ఆ సౌరభాలు గ్రోలను మళ్ళీ రండి. నెనర్లు.
ReplyDelete" ఒకే లేఖ పలుమార్లు పయనించింది అంతే " - వాహ్ భలే చెప్పారుగా ...
ReplyDeleteబహుశా నేనే తికమక పడ్డానేమో అందుకే అలా అన్నాను
ఒకటిలో ఉండాల్సిన వ్యాఖ్య పదకొండుకి పోయిందన్నమాట.... పర్లేదు..
పదకొండు అయిననేమి పదిమందికి ముందు ఒక్కడిగా నిలిచిననేమి
ప్రదీప్, మిమ్మల్ని సమాధానపరిచినందుకు నాకూ ఆనందమే. 11 అన్నది నాకు ఆ సంఖ్యాపరంగా మీ విషయంలోని విశేషం గుర్తుందని చెప్పేందుకే కానీ మీ రాక ఆలస్యమని అనటం కాదు. గమనించగలరు. మీ ప్రత్యేకత మీదే. ఎవరి స్థానం వారే భర్తీ చేయాలి, మరువపు వనాన ఎవరి విహారమైనా నాకు ప్రమోదమే. :)
ReplyDeleteమరువపు వనంలో మీరు ఒంటరిగా గతజ్ఞాపకాలనే పచ్చని పందిరిగా చేసుకొని నర్తిస్తున్నారా? అలలు అలలుగా వెలువడే మీ అందెల రవముల రవళి, కవితా గానం గా నలుదిక్కుల వెలువడుతుంటే వినిపించకుండా ఆపగ ఎవరి తరము? మీ మరువపు వనంలో కి ప్రవేశం నిషిధ్దమైనా ఆ గుభాళింపు ఆస్వాదించి ఆనందించడానికి ఎంతమంది వున్నారో చూడండి. అది ఆపగ ఏ దేవునితరము, ఒక్క మీ నెయ్యము వల్ల తప్ప?
ReplyDelete"నీ కలకంఠి నోట పలికే పాటకి పల్లవి నీ స్ఫూర్తే" ఎంత చక్కని భావన ఉష గారు. అలా చదువుతూ వుండిపోయాను.
భాస్కర రామి రెడ్డి [భా రా రె] గారు, మీబాణీకి తగిన అభిమానపూరిత వ్యాఖ్యకి కృతజ్ఞతలు. నా మరువపు వనానికి మీరెపుడూ ఆహ్వానితులేనండి. నా భావనలకి స్ఫూర్తి తనేనయినా ఉత్తేజం మీ వంటి మిత్రులే. నా నాయిక చెప్పే సౌగంధికా సుమమాలలు, తన "కన్నయ్య" వూసులు, పంచుకోను మళ్ళీ రావాలి. అదే మన సాహితీ నెనరూ నెయ్యానికి ప్రతీక.
ReplyDeleteస్మృతుల అక్షయం నుండి తొణికే, క్షణపు బిందువులన్ని ఏరి...
ReplyDeleteఇలా ఈ కవితను ఇప్పటికి 3 రోజులుగా చదువుతూనే వున్న. కామెంట్ రాస్తే మల్లి మరిచీపోతానేమో అని ఈ రోజు వరకు రాయలేదు. ఈ వెధవ ఇంకా చూడలేదని అనుకుంటారని ఇప్పుడు రాస్తున్నా.
ఉష గారు ఇక లాభంలెదు మీ వనంలో ఒమూల నాకు ఓ చిన్న పర్ణశాల కట్టి ఇవ్వరాదూ.. మాఇంటికీ ఇటు తిరగలేక చస్తున్నాను.. ఓ పడక కుర్చీ, మంచినీళ్ళ కూజా కూడా మరవకండి. హాయిగా ఉంది.. ఇక్కడ..
ReplyDeleteవర్మ గారు, నా భావనలు మీకు, మీరు చెప్పిన విధమైన, అనుభూతి కలిగిస్తే అది ఆ కవిత నోచుకున్న భాగ్యం. చక్కగా వ్యక్తీకరించారు. ఇకపోతే మీమీద మీరు ప్రయోగించిన పదం రెండు సందర్భాల్లో వెలికి వస్తుంది - చనువు, అభిమానం వున్న చోట, లేదా ఆగ్రహం వెళ్ళగ్రక్కేవేళాను. మన స్నేహితం నుందుదే కనుక, నేనలా అనుకునేదాన్ని కాకపోయినా మీరు నాకు అలా అన్వయించినా ఫర్వాలేదు. నెనర్లు.
ReplyDeleteఆత్రేయ గారు, మరువం కనుక మనిషిగా మారి ఓ గీతం ఆలపిస్తే అది ఇలా వుంటుంది ఈ క్షణం "ఎన్నో జన్మల పుణ్యఫలం..." ;) అంతటి సిరి మీ వ్యాఖ్యతోకలిగింది. పర్ణశాల కాదు గానీ మరోమాట చెప్పండి, సగం వనం రాసిచ్చేయనా? నేను సరికాని వైనాలు మీరు జోడించవచ్చు. నా కళ్ళకపుడే పడక్కుర్చీలో వాలి చల్లటి నీరు సేవిస్తూ సాలోచనగా ఓ కవిత లిఖిస్తున్న మీ మూర్తి గోచరమౌతుంది. బహు చక్కని బాంధవ్యం ఆ భావన. ధన్యవాదాలు.
ReplyDeleteనిదురమ్మ ఆ మలుపులో ఆగి నను చూసి కనుగీటి నవ్వుతోంది, నీ వాడ్ని చేరదీసుకో అని.
ReplyDeleteఒక్కసారి అలా వనవిహారం చేసివద్దామా? పోని ఓ లేఖ వ్రాసేయనా? ఎన్ని లేఖలు వ్రాసుకున్నాం,
ఎంత బాగా రాసారండి బాబు ... :)
నేస్తం, అసలు ఈ కవితకి ఆయువు పట్టు అదే కదా! ;) అలా నిదుర రాని రాత్రుల్లోనే కదా వూహల విలాసాలు, అనుభూరుల సల్లాపాలు - ఈ రెండిటిలో ఏదో ఒకదానిలో మనో స్వేచ్చా విహంగం ఆకాశ పయనాలు, భూభ్రమణాలు చేసేది. పైన మరో వ్యాఖ్యలో వ్రాసాను నిదురమ్మ గురించి మరి కొన్ని మాటలు. ఇకపోతే అనురాగం ప్రధానంగా, వలపు సరాగంగా అల్లుతున్న ఈ కవిత, మలి రచన మీకు నచ్చాలనే ఇందులో మరే పలుచన భావం తావుచేసుకోకాడదనే నా ఆకాంక్ష. పవిత్రమైన ఈ దివ్యత్వం కూడా దైవత్వం సాటిదే. మనిషిని మనిషిని ముఖ్యంగా స్త్రీ, పురుష సంభందం కనపడకుండా కలిపివుంచేది మాత్రం ప్రేమాభిమానాలే. తను నాకు జీవితకాలానికి రాసిచ్చేసిన ధనం అదే. ఈ కవిత ఆత్మ అదే. నెనర్లు.
ReplyDeleteప్రేమ అనే శ్వాసను లోనికి తీసుకున్న ప్రతీసారీ కవిత అనే శ్వాసని ఇలా విడుస్తున్నారన్నమాట!
ReplyDeleteప్రేమకవితాశ్వాసాస్వాదన!
కావ్యానికి ద్వితీయ విఘ్నం రాకూడదంట.. త్వరగా రెండో కవిత వ్రాయండి.
ReplyDeleteolammoe! chaanaa roejulaipoenaadi! inta baagaa raaseastea ihaa pogaDakunDaa vunDeadeTlaa gopammaa!
ReplyDeleteమరువపు చిగుర్ల కోసం వెదుకుతున్నాను నేస్తమా .....వెలితిగా వుంది
ReplyDeleteపన్నెండు రోజులా? ఇంతకాలం వేచి వుండలేం మిత్రమా....
ReplyDeletethe day of 13....unbearable...
ReplyDeleteఆనంద్, అశ్వినిశ్రీ, ఈ నాలుగు పొడి మాటలనే ఆస్వాదించటం మీలోని ఆర్ధ్రతకి గుర్తు. అది అలాగే కలకాలం నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఉపోద్ఘాతం నిజ రచనకి నాంది. నాలో ఏదో వెరపుకి శ్రీకారం. త్వరలో కలవగలనని అనుకుంటున్నాను.
ReplyDeleteభా.రా.రె. గారు, చిన్ని, వర్మ, మనసులో సడికి, హృదయ స్పందనకి ఏదో అంతరం. ఒకటి తడిగా, మరొకటి వేడిగా నన్ను రెండుగా చీలుస్తున్నాయి. అలిసిపోయిన భావన. విరామాన్ని అడిగిన ఈ అలసట నన్ను అలసత వైపు నెట్టేలోపు సాధారణస్థితికి రాగలనని అనుకుంటున్నాను. నను నిలవరిస్తున్నందుకు, నా లక్ష్యం నిర్దేశిస్తున్నందుకు సంతోషం. ప్రస్తుతానికి సెలవు. త్వరలో...
ReplyDeleteమీ పునరాగమనం ఎప్పుడండీ ! బిజీ గా వున్నారా రోజూ చూస్తున్నాం పోస్ట్ రాసారా ఈరోజైనా అని
ReplyDeleteహరే కృష్ణ, మీ అభిమానానికి ధన్యవాదాలు. అది నిష్టూరంగా మారే లోపుగా మరువపు కొమ్మని మరోసారి మీ అఘ్రాణింపుకై తేవటానికి ప్రయత్నిస్తాను.
ReplyDelete