నే వెళ్ళాలిక పరాధీన జీవితరేఖ వెంట

"వెళ్ళాలిక" నాల్గు స్వరాల ఈ పదం
నాకు నీకు నడుమ వేదమా? నిన్ను నన్నూ కలిపిన బంధమా?
ఋతువై వస్తే కాలంతో కనుమరుగౌతావు
పక్షివై అగుపిస్తే గూడు వదిలిపోతావు
పూవై పూస్తే నేల వాలిపోతావు
మనిషివై పలుకరిస్తే మనసు మార్చుకుంటావు
వెళ్ళేందుకే నీ ఆగమనమైతే
అసలెందుకు వస్తావని నిలదీయనందుకా?
వెళ్ళనాని నీ అనుమతి అడగక
ఇచ్చివెళ్ళాలనుంది నా వీలునామా

వచ్చే ఘడియలకై వేచి
వెళ్ళిన వేదన మరవలేక నిలిచి
వచ్చిపోతున్న ఋతువుల్ని విస్మరించి
వీడిపోయిన ప్రాయాన్ని మరిచి
నీ స్పర్శిచ్చే గగుర్పాటుకై
మరో మలుపున మరో పిలుపుగ
మరో రేపులో మరో రూపువై
ఏ కదలికవై కవ్విస్తావో అని
ఏ తీరుగ నన్నలరిస్తావో అని
నీకు దారులు పరుస్తుంటాను

గుండె సడి స్తబ్దతకి విడిదిచ్చి
ఏ క్షణాన వీడిపోతావో అని
కంటి తడి పొడి మాటల్లో ఇగిర్చి
నీ సన్నిధి ఎడబాటుగ మారుస్తావని
నీ భాషల నిఘంటువు వెదుకుతాను
"వెళ్తానిక నిను విడిచి" అన్న ఆ ఒక్కమాట చెప్పలేక
ప్రేమ! నీ "వెళ్ళాలిక" పదాన్ని “తిరిగి వచ్చేందుకు" అని పొడిగిస్తూ
నే వెళ్ళాలిక సాధికార వూహల్లోకి
ఈ వాస్తవ పరాధీన జీవితరేఖ వెంట
రమ్మని నేనడుగకనే వచ్చే నీకొరకు

44 comments:

 1. "నీ "వెళ్ళాలిక" పదాన్ని “తిరిగి వచ్చేందుకు" అని పొడిగిస్తూ
  నే వెళ్ళాలిక సాధికార వూహల్లోకి
  ఈ వాస్తవ పరాధీన జీవితరేఖ వెంట
  రమ్మని నేనడుగకనే వచ్చే నీకొరకు"

  Now, it's a thing not to be ignored. Sure, I'l come again to recomment. :-) Something like haunting.

  ReplyDelete
 2. super andoyi.....kevvu keka,
  each word from heart anipistundi..
  meeku maa chappani atlu,i mean chappatlu(claps)

  ReplyDelete
 3. ఉష గారూ, మీ పెరటిలో ఏదైనా పువ్వు రాలుతూ మీ కంట పడిందా లేక మీ బురుజు గుమ్మం పైనున్న పక్షి పిల్లకు రెక్కలొచ్చి ఎగిరి పోయిందా? :)

  ReplyDelete
 4. గీతాచార్య, మీరన్నాక నాకు ఆ నాలుగు పంక్తులు మరీ మక్కువని పెంచాయి. "రమ్మని నేనడుగకనే వచ్చే" తన కొరకే, తను పంచే ప్రేమ కొరకే నా ఈ గమనం.

  ReplyDelete
 5. సుభద్ర, ఈ కేకలేమిటో సూపరని అరుపులేమిటో కానీ ఇది మాత్రం హృదయంలోంచి అక్షరానికొక లక్ష కన్నీటి చుక్కల్ని వెంటేసుకుని తోడేసుకుని వచ్చిందే. అయినా ప్రేమని మాత్రం నాతోనే వుంచుకోలేకపోయానేమో...

  ReplyDelete
 6. భా.రా.రె. భలే తొంగి చూసారండీ నా మదిలోకి మథనపాటులోకి, నాదైన మనసు కూడా నను విడిచిపోతుందేమోనని ముందే కలవరపడి ఇలా వెల తెల పోతున్నాను, వెతల పాలౌతున్నాను. ఆ మనసొక్కటీ అదే ప్రేమని నా ఒక్క మనసుతోనే పంచుకుంటే బాగుండు. ఏమిటో అందరికీ అనీ ఇచ్చేరకాన్ని ఈ ప్రేమని మాత్రం పంచుకోలేకపోతున్నాను.. ప్చ్...

  ReplyDelete
 7. విరహానికి వాస్తవికతను జోడించిన మీ కౌశల్యానికి ధన్యవాదాలు....

  ReplyDelete
 8. mee bhaavaavEsaaniki 'Apt' rupam vachchinattLundanDi...baagundi!!

  ReplyDelete
 9. అద్భుతమైన భావన..!
  అంతే.. ఇంక మాటల్లేవ్ :)

  ReplyDelete
 10. వర్మ, విరహం కూడా సుఖమే అని అదీ దాటేసాను. కానీ ఇవి వియోగాన్ని నాపైకి ఎక్కుపెట్టి వెళ్ళిన ముగింపులు. మళ్ళీ కనరాని ప్రేమ చిరునామాలు. దొరికినవి అస్వాదించి వదిలి వెళ్ళినవి మరవలేక ఈ ఆక్రందనలు. ఇది ప్రకృతి పట్ల ప్రేమావేశం. అందులో తను కూడా ఒక భాగం. ఈ ఆక్రోశం మునుపు నా గుండె సడిగా వినపడకున్నా ఈ అక్షర శకలంగా కనపడుతుందని ఓ ప్రయత్నం.

  ReplyDelete
 11. తృష్ణ, అంటే మీకు కూడా ఎపుడో ఒకప్పుడు ఇటువంటి స్పందన కలిగేవుండాలి. అపుడే ఈ భావంలోని రూపం మీకు అందుతుంది. నెనర్లు.

  ReplyDelete
 12. "నే వెళ్ళాలిక సాధికార వూహల్లోకి
  ఈ వాస్తవ పరాధీన జీవితరేఖ వెంట
  రమ్మని నేనడుగకనే వచ్చే నీకొరకు"
  మధుర, అతిశయం కాకపోయినా ఒక్కోసారి ఓ ఊపులో వ్రాసేసాక నాకు కవితని మళ్ళీ మళ్ళీ కంఠోపాఠమయ్యేదాక చదువుతాను. నాకు నచ్చిన పంక్తులు జపిస్తూ కలో/వూహలోకో జారిపోతాను. అది నిజం కావాలని మళ్ళీ స్వప్నాలు వెదుకుతాను. ఇలా సాగే ఈ గానాన.. నిజమవనున్న ఆ పై వూహ గాలి కబురు నేడే అందింది. నా కవిత మీ వల్ల నా కల తన వల్లా సాకారం. ;)

  ReplyDelete
 13. Last two Stangas r more than excellent..!

  ReplyDelete
 14. భావుకుడన్ గారు, చాన్నాళ్ళకి మీ రాక. "చరక సంహిత" చదివారా లేదా? మరువం, తులసి మిళిత గాలి ఆరోగ్యానికి మంచిదట. తులసీవనమంత మంచి మీ బ్లాగుకి నా మరువాన్ని తోడుచేసుకోండి మరి. నచ్చినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 15. సుజ్జీ, మనసు స్పందనని బట్టి ఈ ఆస్వాదనలు వుంటాయి కదా? నాకూ అవే బాగా నచ్చాయి అందుకే అక్కడితో వెల్లువైన ఈ కవితగా నా భావావేశం ముగిసింది. నెనర్లు.

  ReplyDelete
 16. ఉషగారు,

  పైనది సమ్మరీ మెయిల్....కిందిది మీకు నేరుగా పంపుదామనుకున్నాను...మీ మెయిల్ లేదు..కాబట్టి ఇక్కడే పెట్టాల్సొస్తోంది. ఇది రాసి పెట్టేలోపే మీరు కృతఙ్ఞతలు కూడా చెప్పేసారు. ఇఫ్పుడు ఇంకోసారి రాకండి అంటారేమొ :-)  1. "వెళ్ళాలిక" నాలుగు స్వరాలు కాదండి నాలుగు అక్షరాల పదం.

  స్వరం=వర్ణం= ఒకేసారి ఉచ్చరించగలిగే ధ్వని (=అచ్చు) గా తీసుకుంటాము సాధారణంగా
  వెళ్ళాలిక= వ్+ఎ + ళ్+ళ్+ఆ + ల్+ఇ + క్+అ =తొమ్మిది స్వరాల పదం

  అక్షరం= ఒకేసారి ఉచ్చరించగలిగే వర్ణ/స్వర సుముదాయం
  వెళ్ళాలిక=వె + ళ్ళా +లి + క = నాలుగక్షరాల పదం

  2. "నీ స్పర్శ ఇచ్చు గగుర్పాటుకై" బదులు
  "నీ స్పర్శిచ్చు గగుర్పాటుకై" లెదా
  "నీ స్పర్శిచ్చే గగుర్పాటుకై" అంటే ఇంకా బావుంటుందనిపిస్తుంది. ఏమంటారు?

  "ఇచ్చు" అనేది శిష్ట వ్యవహారికమో ఎదో అంటారు నాకూ సరిగా తెలీదు కాని మీ మిగితా కవిత "మూడ్" తో ఆ రకమైన పద ప్రయోగం అంతగా ఇమడటం లేదు.


  3. "ఏ కదలికవై కవ్విస్తావా అని//ఏ తీరుగ నను అలరిస్తావాని" బదులు
  "ఏ తీరుగ నన్నలరిస్తావా అని" అన్నది ఇంకా బావుంటుందనిపిస్తుంది.

  ఇక్కడ్ అ "మాత్రలు" సరిపోతాయి ఆ విధంగా మారిస్తే అదొక్కటే తేడా. కాని లయ ఎంత బాగా కుదురుతుందో.

  4.
  ఏ కదలికవై కవ్విస్తావా అని
  ఏ తీరుగ నను అలరిస్తావాని
  ఏ క్షణాన వీడిపోతావాని

  ఇక్కడ ఈ మూడు ప్రయోగాల్లో...... మిగితా కవిత మొత్తం మీలొ మీరు అతని? గురించి అనుకుంటున్నారు కాబాట్టి "స్వగతం" లో.... ప్రశ్నార్థకమైన "వా అని" బదులు స్వగతమైన "వో అని" అనే..... ప్రయోగమే సరి అనుకుంటాను.  ఇలాటి పంటి కింద రాళ్ళు భవిష్యత్తులో రానీకుండా మీరు వడ్డిస్తే విందు భోజనం కావించాలన్న ఆశతోనే మొత్తం మీ కవితలో మెళుకువళ పైనే కామెంటాను. నాకేదో తొచింది చెప్పాను. ఆపై మీ ఇష్టం.

  భావంలో కాని, చెప్పే విధానంలో కానీ, భావుకతలో కానీ, అసలు చెప్పాల్సిందేమీ లేదు...."భేష్" అని మెచ్చుకోవటం తప్ప.

  మరో మలుపున మరో పిలుపుగ
  మరో రేపులో మరో రూపువై ..........ప్రయోగం సూపర్.

  సహృదయంతో తీసుకుంటారని ఆశిస్తూ

  ReplyDelete
 17. "చరక సంహిత " ఏంటండీ? చదవలేదు.

  ReplyDelete
 18. Really the last four lines are haunting. Humming all the time after reading it.

  "మరో రేపులో మరో రూపువై
  ఏ కదలికవై కవ్విస్తావా అని
  ఏ తీరుగ నను అలరిస్తావాని
  నీకు దారులు పరుస్తుంటాను"

  :-) I know. No words.

  ReplyDelete
 19. It's just like that.
  Just like that. Haunting.

  @Bhavakudan,

  S. I too felt it. But the meaning conveyed made my analysis to take a back seat.

  ReplyDelete
 20. BTW, are you a physicist or any researcher at some point r at present...?

  Seems like that. No other person can express these sophisticated...

  అంటే మిగతావారు చేయలేరని కాదు. ఇల్లంటి వారికి ఆ అవకాశం ఎక్కువ.

  ReplyDelete
 21. Hehehe. మీ పరిచయం నాకు సంతోషాన్నిచ్చింది. ThankQ.

  కానీ ఆ ప్రశ్న ఉష గారికి. :-)

  ఉష గారు,

  ఇప్పుడే నింపేశానన్నావు. మల్లా ఇదేంటంటే... నేనేమీ చేయలేను సుమండీ :-)

  ReplyDelete
 22. హర్ ములాఖాత్ క అంజాం జుదాయీ క్యోం హై?
  అబ్ తొ హర్ వక్త్ యహీ బాత్ సతాతీహై హమే! :)

  ReplyDelete
 23. భావకుడన్ గారు, తీవ్రంగా ఖండిస్తున్నాను ;) ఏమండి సద్విమర్శ నేనెపుడు స్వీకరించలేదు చెప్పండి. నాది కూడా ఎన్నో ఏళ్ళ విరామం పిదప 8 నెలలుగా చివురేసిన కవితా వనం. నేను నేర్చుకున్నది, చదివింది చాలా తక్కువ. అసలు వ్యాకరణం, అలంకారాలు, ఛందస్సు వంటివి మరపులోకి జారిపోయాయి. మరువంతోనే నేనూ ఎదుగుతున్నాను. భావావేశం తన్నుకు వచ్చినపుడు ఇలా జాలువారుతున్నాను. అంతే. అంతకుమించి నేనో కవయిత్రిని అని కూడా నాకు తోచదు. తన వత్తిడి లేకపోతే ఈ బ్లాగే లేదు. ప్రశంసలు ఈ వనాన్ని సారవంతం చేస్తుంటే, విమర్శలు ప్రతి కుదురూ పొందిగ్గా ఎదిగేలా చేస్తున్నాయి. మరో వ్యాఖలో మీకు సమాధానం వస్తుంది. కృతజ్ఞతలు.

  ReplyDelete
 24. భావకుడన్ గారు, శుశ్రుతుడు రాసిన పురాతనమైన ఆయుర్వేద గ్రంథం చరక సంహితం. నేను అంతా చదవలేదు, దాన్నుండి గ్రహించిన ప్రధాన ఆరోగ్య సూత్రాలు ఉటంకించిన రచన ఒకటి చదివాను. ఆ రచన పతంజలి యోగ సూత్రాలు ముఖ్యంగా రాజయోగాని గురించి చెప్తుంది. నేను సహజమార్గ్ ద్వారా రాజయోగ అభ్యసిస్తున్నాను. ఇది back ground ఏదో మీకు మాదిరే కాస్త బడాయి పోయాను. ;)

  ReplyDelete
 25. భావకుడన్ గారు, "..మీరు వడ్డిస్తే విందు భోజనం కావించాలన్న ఆశతోనే మొత్తం మీ కవితలో మెళుకువళ పైనే కామెంటాను" కళ్ళు చెమర్చాయి నా పట్ల మీకున్న నమ్మకానికో/అభిప్రాయానికో. తను కూడా [పెద్దగా ఏవీ పట్టించుకోని రకం] అచ్చెరువుగ ఈ ప్రసక్తి తెచ్చ్హాడు. ఇంత శ్రద్దగా నా కవితని విశ్లేషించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వయసు అన్నది ప్రక్కన పెడితే గురుతుల్యులుగ ఎంచి పాదాభివందనం కూడా చేయొచ్చును. ఈ తీరిక లేని లోకంలో ఎంతమందికి నాకు పట్టిన అదృష్టం పడుతుంది చెప్పండి. ఇంత అభిమానంగా అంత మృదువుగా చెప్పటం మీకే చెల్లింది. నిజం చెప్పేయనా - ఎందుకో వ్రాసేప్పుడు కొందరు నా మీదకి దండయాత్రకి రావచ్చు అనిపించింది. ఆ లిస్ట్లో మీరూ వున్నారు. ;) అందుకే "వ్ నిచె" అన్నది ముందు "వ్యంగ్యమా" అని కూడా అనుమానించాను. ;)

  నేను స్వరం అన్నది స, రి, గ, మ,ప, ద,ని లను ఉద్ద్యేశించి వ్రాయలేదు. అలాగే "వె ళ్ళా లి క" "వ స్తు న్నా" ఈ ఏడు నా భావ స్వరాలుగా ప్రయోగించాను. వివరణ ఇద్దామా అని కాస్త నీరసపడివున్నందున ఈ కవిత చాలా ఉద్వేగంలో వ్రాసినందున సొమ్మసిల్లాను. సొక్కి సోలిపోయాను, మీకు దొరికిపోయాను.

  కానీ మీ (1) వివరణ నాకు చాలా నచ్చింది. నేనూ కాస్త వ్యాకరణం తిరగతోడతానిక. [అదీ నాకు సమయం ఆ పైవాడు ప్రసాదిస్తేనే]

  (2) మీరన్నది బాగుంది, మార్చాను.

  (3, 4) కాదనటానికి నాకు సరైన వాదన లేదు. ఇదంతా స్వగతం కనుక మీరు సూచించిన మార్పు చేసాను. ఏమిటో బెత్తం పుచ్చుకు ఎదురుగ వున్న మా వెంకట రమణ మాస్టారు గుర్తుకొస్తున్నారు. ;)

  మాటలకందని అవ్యక్తమైన ఆనందాన్ని ఇంకా ఆస్వాదిస్తూ..

  ReplyDelete
 26. గీతాచార్య, భావుకుడన్ గారు, ఈ రోజు మరువానికొక నూతన కళ తెచ్చారు. ;)

  సృజన, నన్ను haunt చేసినా ఆ భావాలు మీకు అలాగే convey అయినందుకు సంతోషం.

  చివరి చరణం భావం నాలోకి పరకాయ ప్రవేశం చేయనిదే అంతుపట్టదండి. ఇది కేవలం తనని ఉద్ద్యేశించి వ్రాసినది కాదు, ప్రేమ అన్నది నాకు అనుభవంలోకి వచ్చినదేదీ నిలవదేమి అన్న అవేదన. తనని కాస్త నిష్టూరమాడిన వైనమూను. నా వూహల మీద నాకు అదుపు, హక్కు వున్నాయి కానీ నా జీవ్తంలోని వాస్తమ్మిద కాదు కదా? కానీ ఆ వాస్తవమే ఒక్కోసారి వూహల్ని నిజం చేసే మార్గం. ఈ భావన అలా వ్యక్తీకరించాను. లోకరీతులెన్నో నాకు సమ్మతం కాదు అదే "పరాధీన" అనటంలోని అర్థం.

  నెనర్లు.

  ReplyDelete
 27. గీతాచార్య, మరిన్ని వ్యాఖ్యలు వ్రాసినా నాకు సమ్మతమే మరువానికి మోదమే. ఎవరు చెప్తారు ఇన్ని వూసులు అభిమానం కలబోసిన ఆప్తులు నేస్తాలు తప్పించి...

  ReplyDelete
 28. కొత్తపాళీ గారు, నా మీద మీకు ఈ కొత్త భాషా ప్రయోగం చేయాలని ఎందుకు అనిపించందండి? ;) తెలుగే రాదని మొట్టికాయలు వేస్తుంటారు కదా, ఆ పని భావుకుడన్ గారి చేతిలోకి వెళ్ళిందనా మీరీ పని చేసారా ఏమి? ఏదో కాస్త పరిజ్ఞానం వుండి అర్థం అయింది. అంతే కదండి మనసున్న మనిషికీ సుఖం లేదు, ప్రేమించే మనసుకీ వేదన తీరదు. ప్రతి కలయికలోను చివరికి వ్యధే మిగులుతుంది. ఆ గాయాలే పదే పదే ప్రతి క్షణం నిలవరిస్తాయి సతాయిస్తాయి శక్తిహీనుల్ని చేస్తాయి. ఇలా కవితలుగా వెల్లువవుతాయి. కాస్త కదలిక కలవరం తొతౄపాటు మళ్ళీ జీవనం సాగాలి, జీవితం గడపాలి. లేదా అదే గడిచిపోతుంది. అన్నీ ముగిసిపోతాయి.

  ReplyDelete
 29. చివరి చరణం సంగతి .....వివరణ చూసాను కాని నాకు నా అనుభావానుగత అన్వయం దొరకనంత వరకు ఆ కుస్తీ సాగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు.

  ReplyDelete
 30. ఉషగారు,
  నా పాళీ ఎందుకో నిన్న అలా ఐపోయింది..మీకు గీతాచార్య గారు ప్రశ్నిస్తే నేను సమాధానమిచ్చాను, మీరు తీసుకోరు అన్న ఉద్దేశం వ్యక్తం చేయాలనుకోలేదు కానీ నా కామెంటు చూస్తె అలాగే వచ్చింది...అందుకే ఎమోషనల్గా ఉన్నప్పుడు వెంటనే పనులు చేయకూడదు (ఒక్క కవితలు రాయటం తప్ప :-) అనుకుంటూ ఉంటాను...మళ్ళీ మళ్ళీ అదే చేస్తుంటాను.

  ReplyDelete
 31. భావుకుడన్ గారు, నేనూ అనుకుంటాను నా ఎమోషన్ కాస్త అదుపులోవుంచాలేమోనని కానీ కవితాదేవి పూనినట్లు అలా వ్రాసేసేవరకు ఇదీ అదీ అని చెప్పలేని ఓ ఊపు. మీరు అంత వివరణం ఇవ్వటం not definitely warranted, I am with you totally even otherwise.

  ReplyDelete
 32. గీతాచార్య, మీరంత సరిగ్గా వూహించినందుకు చాలా అబ్బురపడుతున్నాను. నేను ఒకప్పుడు రీసర్చ్ సంబంధిత వృత్తి [శాస్త్రవేత్త అన్న భాధ్యత] నిర్వహించాను. అంతకు మునుపే మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని "sophisticated expressions" కొందరినుండి సంపాదించాను. ఉత్తరాలు బాగా ఆలోచించి వ్రాసేదాన్ని చాలా చిన్న వయసునుండి, అదీ కారణం కావచ్చేమో? మిరపకాయ బజ్జీల మహిమా కావచ్చు... ;)

  ReplyDelete
 33. ఒకొక్కప్పుడు మాటలకన్నా మౌనం మంచి భాష్యం చెబుతుంది ...కానీ కామెంట్స్ విషయంలో కుదరట్లేదు .స్తబ్దమైన మనసుతో ఎం రాయగలను ?
  ********************************

  ReplyDelete
 34. "వెళ్తానిక నిను విడిచి" అన్న ఆ ఒక్కమాట చెప్పలేక...

  ReplyDelete
 35. పరిమళం, మీరేనా స్తబ్దతకి లోనయింది. ప్రేమ, సడి లేని నా తావున నెలవుండడానికి సవ్వడి చేస్తూ రావటం, స్తబ్దత తొలగగానే కనుమరుగవటం నా జీవితాన పునరావృతం. ఈ నిరీక్షణ, అన్వేషణ వదలనీయని నా మనసుకి నేను బానిస.

  ReplyDelete
 36. శివ, నేను వదిలివెళితే తాను వచ్చే దారులు మూసివేస్తానని నా భయం. అందుకే వున్న చోటనే ఈ పడిగాపులు. అరుదుగా వచ్చే మీ వ్యాఖ్యలు ఈ సవ్వడికి జాలువారాయి. నెనర్లు.

  ReplyDelete
 37. కొత్తభాషా ప్రయోగం ఏమీ లేదు. ఆ మాటకొస్తే ఆ భాష నాకూ రాదు. అది ఉమ్రావుజాన్ (రేఖ సినిమా)లో ఒక గజల్ పాటలో ఒక లైను. మీ పద్యం చదవగానే ఆ భావమే స్ఫురించి అలా రాశాను. నేనా మొట్టికాయలా .. ఛా, ఎంతమాట! :)

  ReplyDelete
 38. కొత్త పాళీ గారు, నిజంగా నన్ను ఆ రెండు పంక్తులు చాలా వెంటాడాయి. ఇపుడా గజల్ వినేవరకు మనసాగదు. "ఎటోవెళ్ళిపోయింది మనసు" అని ఇపుడు బొట్టు తీసుకోనువెళ్ళేవాళ్ళందరి ఇంటా మంగళ హారతిగా పాడి వస్తాను. మీరెన్నన్నా మీరంటే "బెత్తం మా తెలుగు మాస్టారు" మాత్రం గుర్తుకి రాక మానరు, అయితే ఎపుడూ ఆ భాగ్యం కలుగలేదు, అంతే! నెనర్లు.

  ReplyDelete
 39. http://www.youtube.com/watch?v=Q_aH7NcQUf0
  the quoted line is in last stanza. Hope you had an enjoyable festival day. I am neithe telugu master nor do I have bettam :) take it easy.

  ReplyDelete
 40. కొత్త పాళీ గారు, ఇక భయంపోయింది కనుక, "భలే ముమ్మారు పలుకరించారు." ;) నాకు నిజంగా పాటలు వినటం పిచ్చండి. వినటమో పాడుకోవటమో నిత్యం శ్వాసతో పాటే సాగుతుంది, నిదురమ్మ కరుణించేవరకు. గజల్ వింటూ మీకు మరో మారు ధన్యవాదాలు ;) Yep I just got back from పేరంటాలు. "ఏమిటండి ఏమీ మాట్లాడటం లేదు కనీసం పాటైనా పాడటం లేదు" అని అడిగించుకున్నాను కూడా ;)

  ReplyDelete
 41. బాగుంది, విరహం వచ్చేది ప్రేమను కలుపడానికే..
  గెలుపు అందం దర్పం చూపనంతవరకే....ఓటమి భయం వెన్ను చూపినంతవరకే
  వెళ్తానని చెప్పే మాట వసంతం వెళ్ళాక మరో వసంతం కోసం ఎదురు చూస్తూ
  వరద నీరులా కన్నీళ్లు కారుస్తూ
  గుండెను హేమంతంలా దిటవు చేసుకుంటూ
  శిశిరంలా వేదన పడలేక ఆకుల ఆశలు రాల్చేట్టు చేస్తే
  వచ్చానన్న మాట కొత్త చిగుర్లతో కొత్త శక్తి ఇస్తుంది
  అయితే ఈ ఆట, దాచి ఇవ్వడంలో ఉండే ఆనందం....విలువ తెలుసుకునే అపురూప క్షణం
  బహుశా వసంతం వెళ్ళలేనని వెళ్తూ గుండె లోతుల్లో వేడెక్కి కన్నీళ్లు కారుస్తూ వెళ్తుందేమో...
  పరాధీన జీవిత రేఖ కలిపేది ఇలా వెళ్తానని చెప్తూ తిరిగి వచ్చేవారినేనేమో... అలా చూస్తే అది రేఖ కాదేమో ఒక అనంత వృత్తమేమో. ఈ అనంత వృత్తంలోని ప్రతీ చోటా లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తాం.. విధి మాత్రం బయటకు లాగుతుంటుంది. ఎంత తిరిగినా ఆ వృత్తం పైనే ఉంటాం.
  (Number 43)

  ReplyDelete
 42. ప్రదీప్, మన ఇరువురి నడుమా పొగడ్తలు, ప్రశంశలు వుండవన్ని అనదికార ఒడంబడిక వుండి కనుక - మీ అంత ప్రత్యేక శైలిలో ప్రతి వ్యాఖ్య వ్రాయలేను కనుక - ఆ అనంత వృత్తం చూటూ ప్రదక్షిణాలు చేస్తూ మళ్ళీ వస్తున్నా అన్న పిలుపు కోసం చూస్తానిక. పొతే మీ 43 తో నాకు సమస్య లేదు. ముందు 4 "వెళ్ళాలిక", తర్వాతి 3 "వస్తున్నా" కి అన్వయించేసుకుని మీ కోసం అదే మీ వ్యాఖ్య కోసం కూడా చూస్తుంటాను. మీ సమయాభావం లోను, ఇతరత్రా పనుల్లోనూ మరువాన్ని పలుకరించినందుకు నెయ్యం కూడిన నెనర్లు.

  ReplyDelete