03/27/09, శుక్రవారం, ఉగాది పర్వదినాన సాయంత్రం 5 గంటలకు జరిగిన మొదటి సమావేశం, గురుపూజ కార్యక్రమం ముందుగా దీపారాధనతో మొదలిడాము. ఈ కార్యక్రమానికి హాజరైనవారు. చిరంజీవులుః అనిరుధ్ అనీష అలేఖ్య నేహ వైష్ణవి స్నేహ సాహితి ప్రఙ సంహిత్ స్ఫూర్తి శ్రీకర్ శ్రీవల్లి అంతా కలిసి ముక్తకంఠంతో వల్లించిన ప్రార్ధనా శ్లోకాలుః "శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే" "సరస్వతి నమస్తుభ్యం - వరదే కామ రూపిణి విధ్యారంభం కరిష్యామి - సిద్ధిర్భవతు మే సదా." "గురుబ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" తరువాత పుస్తకాలలో "ఓం" అన్న శుభప్రదమైన అక్షరం వ్రాయటంతో పిల్లలు తెలుగు బడిని లాంఛనంగా మొదలుపెట్టారు. తల్లితండ్రులకు తరగతి జరుపబడు విధి విధానాలను గురించి పూర్తి వివరాలు అందించబడ్డాయి. ప్రసాదాలు స్వీకరించి అంతా ఇళ్ళకు మళ్ళారు.
గాలి నాదస్వరం వూదుతూ తానూ తాండవమాడుతున్నది. వాన తనసర్వం జార్చేస్తూ తానూ తక్కువకానంటున్నది. ప్రకృతి తనమర్మం ఏమిటో ఎపుడూ తెలియనీయదు. ఋతువు మాత్రం వతను తప్పక వస్తూపోతుంటుంది.
అవునసలు ఆకాశమే అందమైన అతివ ఎందుక్కాకూడదు? తననిచూసి పుడమి తరుణి ఉడుక్కోవటం ఎందుకవకూడదు? పర్వాతాలు పైకి ఎదిగేది ఆ ఆకసాన్ని అందుకోవాలని ఎందుక్కాకూడదు? తరువులు పైకి సాగేది ఆ మగువ మీదికెగబ్రాకాలని ఎందుకనుకోకూడదు? వెన్నెలలు తన వయ్యారిమేని ఛాయలు, చుక్కలు తన జడపూలు ఎందుక్కాకూడదు?
తన సంపదలెంచగా నా తరమా! ఆ వనరులెంచగా నీ తరమా! ఎంతనేతలల్లినా ఆకసానికున్నావన్నెలన్నీ తేగలరా ఎవరన్నా? వనకన్నె చిన్నబోదా వన్నెవన్నెల మబ్బుకోకలుచూసి? రంగురంగు రెక్కల పూలు కినుకపోవా తన రంగులు చూసి? ఎన్నిదిక్కులెదికినా ఆపతరమా ఆశ్చర్యానుభూతిని ఎవరికైనా?
తన స్పందన వర్ణించగ తగునా నా పదకవితా పటిమ! తళుకు తారల హారాలు ఓ మారు, నిశీధి ఛాయలు పలుమార్లు, నిర్మల వదనాలు వేయిమార్లు, వడగళ్ళవిసుర్ల వురుములోమారు, అలవోకనవ్వుల అపురూపమేఘజలతారు అతిశయాలు లెక్కలేనన్నిమార్లు, అవేవీ కనరాని నిండునిశ్చల రూపు వేవేలమార్లు.
తన సౌందర్యం రూపుదిద్దగ చాలునా ఏ మేటిచిత్రకారుడైనా? ఏచోట మొదలిడి ఏ రంగు కలిపి ఏ కుంచెవాడి తనని చూపగలడు? సరిగంచు చుక్కల బుటాపట్టు చీరలు, చందమామ సింధురాలు, క్రిందున్నవారి రాయబారాలు మోసుకెళ్ళేటి పక్షిగుంపు బారులు, మెరుపు కలల జవాబులు, వలపు తాలూకు ఎర్రెర్రని తనువు అందాలు.
ఇపుడు మళ్ళీ అడుగుతున్నాను అసలు ఆకాశమే అందమైన అతివ ఎందుక్కాకూడదు?
తన భాష, బాస బాసట మూడే మూడు. వర్ణించమంటే ఇంతకన్నా ఏమివ్వను వివరం? లాస్యమాడే హాసం, ద్యోతకమయ్యే మౌనం, తొణికిసలాడే మార్దవం. దరహాసంతో మౌనం, మౌనంగా ధ్యానం, ధ్యానంలో ప్రశాంతవదనం. ధ్యాసలో వుంటే మన మాటకి బదులుగ ఓ సమాధానం.
లోతైన ఆ కళ్ళు చెప్పేవి పలుభాష్యాలు. నవ్వేటి ఆ కళ్ళు నింగంత విశాలం, ఆ కొలనుల్లో నిండేటి నీరు ఓ జలాశయం. కొలనులా కాదు లోతుకొలిస్తే అఖాతాలు. తోడేటి కొద్దీ నీరు నింపింది కరిగిన కలల దుఃఖాతిశయం.
తను నాకుచెప్పిన కథలు అపుడు తప్పుగావిన్నానేమో! ఎంతమంది నరకాసురల్ని వధించానని సంబరపడ్డా, ఇంతకాలానికి అవగతమైంది, నేను సత్యనవ్వాల్సింది నా మనసనే రాకాసిని మట్టుబెట్టటానికని, కాదంటే నవరసాల నరకాసురులు నన్నే కబళిస్తాయనీ.
తన లోకాన్ని తానే రచించుకుందా? అసంపూర్తిగా నాకందించిందా? తాను చూసిన లోకాన్ని పరిచయవ్యాఖ్యగా వ్రాసిచ్చిందా? నేను కొనసాగించనా, ఈ వరకే ప్రచురించనా? ఏ విధంగానైనా అది కాదా ఓ సంచలనం? అందుకేనా లోకాన్ని వీడిపోతూకూడా నన్ను చూసి నవ్వింది? తెలుసా మీకేమైనా?
ఎగిరే పక్షిలో ఎంత ఉత్సాహమో, రెక్కలార్చుకు బయటకొచ్చే పిల్లలోనూ అదే తీరు. ఉరికే లేడికాళ్ళలో ఎంత వేగమో, పడిలేచే పిల్ల కళ్ళలోనూ అంతే జోరు. చివురేసే మొక్కలో ఎంత పచ్చదనమో, ఆకురాల్చే చెట్టులోనూ అదే సిరి. పూతరాలినా, పిందె రాలినా, పండూ రాలిపోయినా కొమ్మల్లో మొక్కవోని అదే గురి.
అలలతో అల్లికలల్లి నిత్యం ఆకసానికి అందించే ఘన ప్రయత్నం ఆపదు అంబుధి. నురుగుముత్యాలు అంచలంచెలుగా ధరపైవొలికిస్తూ తన గమనమూ ఆపదు నది. చిరుగాలీ ఆపదు చలనం, సుడిగాలీ ఆపదు ప్రభంజనం. మేఘమూ ఆపదు వర్షించటం, తిరిగి తనలోకి ఆకర్షించటం.
కావా అవన్నీ మూగజీవాలు? కావా అవన్నీ మౌన చలనాలు? ఎవరు ఇచ్చారు వాటికి గమ్యం, వేగం, నిర్దేశం, సంకల్పం? ఎవరు మెచ్చాలని వాటి సంబరం? ఎవర్ని నెగ్గాలని వాటి తాపత్రయం? త్వరపడతాయా? తోసుకుపోవాలనిచూస్తాయా? తమ విధులు మరొకరికి బదిలీచేస్తాయా?
మాట వచ్చు, భాష వుంది, మనసు వుంది, మార్గం వుంది, యోచన తెలుసు, శోధన వచ్చు, భావం తెలుసు, భావ్యం తెలుసు, అయినా మనిషికి ఏమిటి లేదు? మనిషికి మనిషికీ నడుమ సఖ్యతెందుకులేదు? సంకల్పానికి బలిమి ఎందుకు లేదు? కలిమిలేముల కలవరమెందుకు పడతాడు?
తల్లికో, తండ్రికో తన ఓటమి అప్పచెప్పి, పరుల ప్రజ్ఞాపాఠవాల్ని చూసి నొచ్చుకుంటాడు. తనకు తాను పలుపుతాడు కట్టుకుని, వంకల పలాయనం చిత్తగించి ఆపై పాశ్చత్తాపడతాడు. వాయిదాలు వేసుకుని, వంతులు వేసుకుని సామర్ధ్యాన్ని చంపుకుంటాడు. ప్రాయాన్ని జార్చుకుని, పయనాన్ని ఆపుకుని, ప్రయాస పడననుకుంటాడు.
ఒక్కటంటే ఒక్కసారి తిరిగి ఏ ఏకలవ్యుడో ఇలకు దిగివస్తే ఇలా చెప్పడా? "నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది. కాలాతీతం కానీకు, కానరాని శోకాన్ని వెదకకు, ఓటమికి వెరువకు. ఆ గమ్యాన్ని అందుకో, నువ్వు చేరాల్సిన తీరాన్ని చేరుకో" అని
మనిషీ! నిక్షిప్తమైన నీ పటిమను వెలికి తీయ్, నిద్రాణమైన నీ ప్రతిభకు సాన పట్టు. ఆ ప్రకృతే నీకు స్పూర్తి నీ కీర్తికి నాంది నీ విజయానికి పునాది. మన వెనుకతరం మాదిరే మనంకావద్దా ముందుతరానికి మార్గదర్శకం? వినరా మన విజయగాథలు రానున్న తరం? కృషితో నాస్తి దుర్బిక్ష్యం.
ఉప్పెనగా ఉరికినా క్షణపాటే ఆ జడి, సుడిగాలై చెలరేగినా క్షణికమే ఆ హోరు. కానీ, నిశ్శబ్దంగా, నువ్వుచేస్తున్న ఈ గాయం, ఉప్పెనై ఊపి ఓక్షణం, సుడిగాలై త్రోసి మరోక్షణం, క్షణాలకి వెనకడుగిస్తూ నన్ను బెదిరిస్తోంది. ఎవరిదో వికటాట్టహాసం కాలమేనేమో? నీవెంత? అని అది అడిగేది నన్నేనేమో? కానీ, నేనిలా పోరాటం సాగిస్తూనేవుంటాను నా గుండెలో తగిలే గాయం నాకో జీవితకాలం సరిపడే కసవుతుందే కానీ క్షణభంగురం కాదు.
నాలో నువ్వున్నా నీలో నేనుండలేను, నింగీనేలా కలిసున్నాయంటే చిత్రమేగా! అయినా ఎవరా పిచ్చిమాట చెప్పింది? తూర్పూ పడమరే కలిసుంటాయి. నిన్నింకా నాలోనే దాస్తాను, నువ్వు నిప్పై కాల్చినా నేను మంచై నిన్నార్పేస్తాను. నువ్వు నన్నెంత మోసగిస్తే నేనంత ప్రేమికనౌతాను. ఎవరన్నారామాట అలౌకికబంధమసాధ్యమని? బహిర్గతం కాని స్వచ్చతని వెన్నలా కరిగిస్తున్నారెందుకో? ఈ నేతి ఆజ్యంతోనే నా ప్రేమ హోమం చేస్తాను. యాగఫలం నీకే అంకితమిస్తానేమో!
ముల్లువంటి నిన్ను పచ్చిగానే వుంచాలి, ఎండితే విరుగుతావు. పక్కలో బల్లెమై నాకే వెన్నుపోటు పొడుస్తావు, ఎమో అదీ కావచ్చేమో? మరందుకే అంటున్నానికపై నీలోని పచ్చిదనం నేనౌతాపచ్చదనం సాక్షిగా. కళ్ళు దేముడిని చూస్తూ కపటాన్నెదుంకు పెంచాలి? అసలు దేముడేడి? దేవేరి ఏది? నాకెవరూ కానరారేమి? నువ్వే నాఇలవేల్పువి, నీ నిర్లిప్తతే నీవు బోధించే భగవద్గీత. నేనదే నిత్యం పఠిస్తాను, నిన్ను ప్రసన్నం చేస్తాను. నిన్నావహింపచేసే ఈ యాగాన్ని మొదలిడతాను, మన స్నేహమే ఫలంగా వేయి యజ్ఞయాగాదులు ముగిస్తాను.
పుఠని నింపుతుందే కానీ నా కలం, నా భావన జీవనకి పోస్తోంది తులసీతీర్థం. కాలం పంపుతున్న క్షణం బాధకి తిరిగి ఇస్తుంది వూపిరి. భావన బాధని అధిగమించినా అది క్షణికం. బాధే నన్ను ముగించితే మటుకు అది శాశ్వతం. కానీ ఈ బాధ పెద్దదీ కాదు, ఆ భావన చిన్నదీ కాదు. బాధనణిస్తే భావన పొంగుతోంది, భావన మరిస్తే బాధ పెరుగుతోంది.
పదే పదే అదే అదే క్షణం, నువ్వు చూసిన ఆ చూపే, నువ్వు అన్న ఆ మాటే, నువ్వు చేసిన ఆ గాయమే, తలచినా తలవకున్నా తిరిగి పరిహసిస్తోంది. ఆశని నివురుచేస్తుంది, నా గొంతు నులిమేస్తోంది. నా చివరి కేకలో ధ్వనించేది బాధ కాదు, భయమూ కాదు, నన్ను నేను సంభాళించుకొని, నిన్ను నిన్నుగా చేయాలన్న తపన.
ఆర్తిలేదు, తృప్తి లేదు, అన్నీ కరిగి నీరయాయి. ఆవిరైన అనురాగం, బండరాయై మండిపోతున్న గుండెని చల్లార్చి, తానూ నీరై, తిరిగి నన్ను చల్లబరిస్తే, నేనొక వూపిరి తీసి, అది నీ గుండెలోనింపుతాను. నిన్నీ లోకబంధాల నుండి దూరంగా నా ప్రేమతీరాల్లో చేర్చి, సేద తీరుస్తాను, నీ ఎదపైనే నేనూ అలసట తీర్చుకుంటాను. అపుడేమంటుందీ కాలం, ఖచ్చితంగా ఓటమినొవ్వకా? కానీ అందాకా నా గుండె ముక్కలవదనేమిటి నమ్మకం?
తొలిబీటే పూడని నాకు వంద దెబ్బలు నీవిచ్చిన మలి కానుక. స్వాంతన నేవెదకను, నాలో వున్న నిన్నే గమనిస్తుంటా క్షణక్షణం. ద్విగుణీకృతమయ్యే నీ రూపే చూస్తుంటాను అనుక్షణం. అనాఘ్రాతమైన గడ్డిపూవే నాకిష్టం, నాపక్కన నడిచే నీవంటేనే ఇష్టం. కానీ జాజిమల్లెల జలతారు నీవు, పలువురి మది మెచ్చిన ద్రువతారవీవు, ఎదురుగా నువ్వు, ఎవరూ కాని నువ్వు, ఎదలో నువ్వు, అసలు నేనే నువ్వు.
ఎవ్వరికీ తెలియకుండా పోతుంటాను ఎవరూయెరుగని నా వూహాతీరాలకి, నీకూ తెలియని నిన్నూ తీసుకుపోతుంటాను నా వెంట తప్పనిసరిగా. జావళి పాటంటి ప్రేమ మనది, జాలువారే వెన్నెల తెర మన వలపు. నీ రాక ఉల్కపాటు, నీ తీరు మెరుపువేటు, నాకు తెలియని వేగం ఆ రెండు. వస్తా నీ వెనుక తీసుకుపో నాకూ నేర్పించు నీలా నడచుకోవటం. నీరింకిన నీ ఎద చెలమలో నా చెలిమిదాహం తీర్చాల్సింది నీవే, బీటిచ్చిన నా ఎద పాత్రలో ప్రేమ నింపాల్సిందీ నీవే. అందుకే కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం.
ఆ తార మళ్ళీ మా ఇంటికొచ్చింది, మాట మీద నిలబడింది. ఈసారి మినుకుమనే చూపుల్లేవు, తళుకుమనే నవ్వులేకాని. మునుపటిచోటే నిలబడి నావంక చూసి నవ్వింది. తోడొచ్చిన తన మావ వంక చూపి మురిసిపోయింది. నావోడూ వస్తాడని, నాకు తోడవతాడని నొక్కిచెప్పింది.
చెలిమిచేయను చిట్కాలు చాలానే చెప్పింది, బెట్టుచేయను గుట్లు విప్పిపోయింది. అదొకపరి ఇదొకపరి సాగించపమని సరసమాడింది. వంతులొద్దు పంతమొద్దు ఆపై వగచబోకని వైనంచెప్పింది. నివ్వెరపోయిన నన్ను చూసి మళ్ళీ మళ్ళీ నవ్వింది నాపసాని.
అరమరికల్లేని తనని చూస్తే అంతేలేని సంబరం. ఏ దిక్కున తానున్నా వెంటపడిపోవాలన్న కలవరం. వరమీయగ వచ్చిన వేలుపుమల్లే తన దరహాసం, వీడక వెంటాడే నీడలా పోనా అందుకోను అంబరం. మరిరాదేమోనని మది గదుల్లో మరేదో సంశయం.
మాలిమిచేయను నావాడు తనవాడి మాదిరి చంద్రుడు కాదు, ఆకలివేళల అలుపెరుగక నను నలిబిలిచేసెడి విలుకాడూ, వాదనమీరగ నా లోటుపాట్లు లోతుగ ఎరిగినవాడు, సాధనచేయగ పట్టువిడుపు పాఠాలు నేర్పినవాడు. అంతా చెప్పాక అలాగే అని మావంక కనుగీటి ఫక్కున నవ్వింది.
ఆరిందా చూపుల అల్లరి అలవోకలు వుల్లముఝల్లన విసిరింది. తీరిందా నీ సంశయమని తీరిగ్గా వాకబు చేసింది. తనువు మనము మనువాడిన మావకికాక ఎవరికిస్తావేమనింది. చనువు నెయ్యం గూడిన కలయికకాదా కాపురమని నిలదీసింది. నీవాడొచ్చాక చెప్పినవన్నీ సరిచూసుకోమనీ చెప్పి చక్కాపోయింది.
********************************************** "ఆకాశంలో నా వలెనే ఒక ఒంటరి తార ఇంత వానలోనూ, బహుశా నే బిక్కు బిక్కు మనటం తాచూసిందేమో. తోటి చుక్కలకేం చెప్పి వచ్చిందో, వెన్నెల్లో తడిసే ఒంటిని వానధారలకి అప్పచెప్పి, నా వంక మినుకు మినుకున చూస్తూ నాకు తోడువున్నానంటుంది. నీకన్న అదే నయం, గగనాలనుండి స్నేహహస్తం అందిస్తోంది"
పైన పంక్తుల్లోని ఆ తారే ఈ కవితకి ప్రేరణ. నాదే మరో రచన, ఈ శీర్షిక మీరే పెట్టాలి [డిసెంబరు 2008] లో నేను ప్రస్తావించిన ఆ ఒంటరి తార ఈ మారు జంటగా వచ్చి నా మడిసి మీద కినుకలోవున్న నాతో కబుర్లాడినట్లు కలిగిన వూహాజనిత భావావేశం ఇది.
మళ్ళీ మళ్ళీ ఆ మాటలే నేనూ చెప్తుండేది, అవన్నీ వింటూనే వుంటాయి మా కథ అలా సాగుతూనేవుంది. నాకలుపు రాదు, నేనూ నండూరి ఎంకికేం తీసిపోను, వింటానంటే మీ చెవినా వేస్తా, వలదంటే నాకేం కాదు! కోవెల్లో బళ్ళున పగిలి నీరు కారిపోయిన కొబ్బరికాయకి చెప్తుంటా నా మావ ఇంతే వంగనూగుకి నా వొళ్ళు తృళ్ళినా నావల్లకాదు నీబాధచూడనని వాపోతాడని. శివ శివా నా తప్పు కాదిది చిత్తం నీ పై నిలువకున్నది నీ వంటి మీద నీరుగా అలముకున్న గంగమ్మవోలే నా మావా నీరంటివోడే నన్ను చుట్టేసేవేళ అని లింగాభిషేకాన ఒ చిన్నమాట చెప్పేస్తా. పంటికి తగలంగానే వగరుగా తోచి కసింత నిభాయించుకుంటే అమ్మో ఎంతబావుందోననిపించే ఉసిరి కాయకి చెప్తా నా మావ కొంటెమాటలింతే మామంచి రుచే అచ్చం నీ మాదిరేనని. సిగలోకి ఓ చిన్ని పూవిమ్మంటే ముల్లుతో గుచ్చి ముద్దుగా ఓ మొగ్గకొమ్మ నామీదకు వాల్చే ఆ గులాబీ కొమ్మకు చెప్తా మావా ఇంతే అలక చూపాక నా వొళ్ళోనే తలవాల్చి సిగ్గుపడతాడని.
అపుడపుడూ కల్లోకి వచ్చి కంగారు పెట్టేటి సింహంకి అరమూత కళ్ళతో ఆగాగి అదను చూసి చెప్తా నావోడు సింహ మథ్యముడు, వాడి సిరి నీకెక్కడిదని.
సేదతీరగా రావేం అని చల్లగా పిలిచే మఱ్ఱిమానుకి మెల్లగా చిన్నబుచ్చకుండా మురిపెంగా చెప్తా ఆడి తనువూ నీమల్లే మేరుగంభీరం, ఆడే నా మహా వృక్షమని. మొగ్గనీ వదలక మధువుగ్రోలేటి తుంటరి తుమ్మెదకి కాసింత తటపటాయించి వూసు విప్పేస్తా మావోడు నీకేం తక్కువ కాదు, మొగ్గలు త్రుంచేటి మొండాడేనని.
పెరట్లోని మావి కొమ్మల్లో దాగి కూజితాలు పోయేటి గండుకోయిలకి నేనూ ఓ గడుసు సమాధానమిస్తా నా మావ మాట నీకన్నా మంద్రం, మరింత మధురమని. నా వంటికధిపతి, నా ఇంటి నాయకుడు, పడకింటి మన్మధుడు, ఇంకొన్ని కాదు ఇంకెన్నెన్నో వున్నాయి నా మావకి నేనెట్టుకున్న పేర్లు. ప్రకృతిగా పుట్టిన నాకు అదే చెప్తుంది మరి కొన్ని పేర్లు, మీకు తెలియనివివుంటే మీ వాడి కొరకు కొన్నట్టుకెళ్ళండి...