పేరులో ఏముంది!?

చెప్పేస్తే ఒక పనై పోతుంది- నాకు హాయి, నలుగురికి నవ్వు లేదా ఎకసెక్కం కాదూ మూతివిరుపు కసింత ఊదాసీనత కొండొకచో యేదో భావన కలుగుతుందిగా!?




పుట్టగానే నాకు ఇవ్వబడిన పేరు "పార్వతి" అది మా సీతమ్మామ్మ పెట్టారు కనుక, నేను నానమ్మ కూచిని కనుక, క్రమేణా అమ్మ మార్చుకున్న 'ఉష' కన్నా "చిన్న సీతమ్మ" గా చలామణి అయ్యాను, ఆ పేరు విన్నప్పుడు కోపం వచ్చినా, "నేను 'పారు' ని లేదా 'ఉష' ని," అని అరిచి చెప్పినా ఆగలేదు కాలం.."జగన్మోహిని" చిత్రం సమయంలో కొత్తగా 'జూజ' అనేవారు "జూనియర్ జయమాలిని" :) బహుశా నా దెయ్యం చూపులో, మోహనాకారమో, రమణీయమైన నృత్యమో కారణం. నడుమ యూనివర్సిటీ లో DJ usha దుబ్బు జుట్టు ఉష అన్న నామధేయం కూడా దాటి వచ్చాక ..ఇంతలో ఎన్ని వింతలో అన్నట్లు ఒక పుష్కరం గడిచిపోయాక ఎవరో "రోజా" చూసి వచ్చి "ఉషాంటీ మధుబాల లా ఉన్నారు," అనేసరికి అలాగ..అలా అలా మళయాళీ, స్పానిష్ మార్కు పేర్లు/వైనాలు అద్దబడి, అతకబడి బొద్దుగానో/బక్కచిక్కిన భామిని గానో ఉంటుండగా "సమంత లా ఉన్నావు మొహం చూస్తే, వెనక జుట్టు రమ్యకృష్ణ స్టైల్," అంటూ నాకొక అహం, అస్తిత్వం ఉండనీయని రొదలు తాకి పోయాక (అవన్నీ కృత్రిమమైనవేనని తెలిసిపోతుండగా) పండుగ ఉదయం పరవాణ్ణం వంటి మాట వదిన నోటి వెంట వచ్చింది "నిన్ను చూస్తే అచ్చం మీ నాన్న గారు చుట్టూ ఉన్నట్లే ఉంది, నీ స్వభావం అంతా మావయ్యగారిదే, ఆలోచనలు, ప్లానింగ్ భలే భరోసాగా ఉంది," అని. ఎంత హాయిగా ఉంది నాన్న నాలో మూర్తీభవించడం..అదీ ఆహార్యం లో ఆహారపు అలవాట్ల నుంచి మొదలుకుని ఆలోచనాతీరు వరకు నాన్నగారిని పోలిన కారణం గా నేను ముచ్చటగా 'JK' aka (also known as) 'Junior Kesava' అని పిలుచుకునే నా బిడ్డ నాతో ఉన్న క్షణాల్లో-ఆ క్షణం నుంచి అలా తడిసిన కళ్ళలో ఒక కంట సీతమ్మ లోకం, ఒక చూపు ఆవరణ నాన్న ప్రపంచం లోకి త్రోవలు పరుస్తుంటే నా ముద్దుల కూతురు "నా పిల్లలకి అమ్మమ్మ కుడుములు, పొంగల్ చేసిపెడతా," అంటూంటే (ఆ ధ్వని తనకి నేను చెప్పి తినిపించిన అమ్మమ్మ వంటలది కావచ్చు, లేదా నాకు రాబోయే మనవలకి తను అమ్మగా చెప్పే ఊసులదీ కావచ్చు) ఈ తరతరాల తరగని రక్తబంధాల భావోద్వేగాలు నన్ను సంద్రాన పడవలా ఊపుతున్నాయి, ఇక నాకు కట్టబడిన తెరపైన బొమ్మల తెరచాపలు ఎన్నైనా సరే, సంతోషం గా స్వీకరిస్తాను- మీరు మరువలేని మరువపు గుభాళింపునై మిగిలిఉంటాను...!

6 comments:

  1. మీచే ముచ్చటగా పేర్చబడిన మీ పేర్ల-పేరు ముచ్చట నాకూ మరువలేని హాయినే ఇచ్చింది :)

    ReplyDelete
    Replies
    1. అవునా లల్లీ- బాగుంది కదా, తప్పక మీ మనసున ఉన్న సమీప ఊసుని కదిపి ఉంటానుగా?

      Delete
  2. "నిన్ను చూస్తే అచ్చం మీ నాన్న గారు చుట్టూ ఉన్నట్లే ఉంది, నీ స్వభావం అంతా మావయ్యగారిదే, ఆలోచనలు, ప్లానింగ్ భలే భరోసాగా ఉంది,"
    ఇటువంటి మాటలు ఆనందాలని అద్భుతాలని ఆవిష్కరిస్తాయనడం అతిశయోక్తి కాదు.

    ReplyDelete
    Replies
    1. పరంపరలోని ఆదీనతని ఆపాదించుకోవడంలో మహత్యం అదేనేమో కదండీ!?

      Delete


  3. అమ్మాయి నాన్న పోలికైతే లక్కే లక్కటండీ !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. లక్కు కన్నా లక్క లా మనసుని-మనిషిని కలిపి అతికించే ఆ భావన బాగుందండి. నెనర్లు!

      Delete