వడియపు తెప్పలో గోంగూర ముద్ద!

ఆంధ్రమాత గోంగూర వరకు మరి నేను భోజనం పెట్టే మాతనే!

అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః |
నమస్కార ప్రియో సూర్యః బ్రాహ్మణో భోజనప్రియః ||

హరిహరులు, సూర్యచంద్రులు అలరారిన లోగిలి మాది! నిత్యం లక్ష్మీ కళ ఉట్టిపడే పెరటి తోట, వాకిలి తట్టున వనం మా ఇంటికి చిరునామా... నువ్వుల నూనె/కాచిన ఆవనూనె నలుగుతో అభ్యంగన స్నానం అదీ కుంకుళ్ళు/శీకాయ పులుసుతో తలారా స్నానం కర్చూరాలు, బావంచాలు, వట్టివేర్లు పొడి చేసి ఇంట్లో తిరగలి లో విసిరి వస్త్రకాయం పట్టిన పెసరసున్నితో పూర్తికావాలి, ఇంటి పాడి గేదెకి వెన్న పూసి, వేడినీటి స్నానం కూడా పరిపాటి, అదన్నమాట మొదటిపంక్తి వైనం నా లోగిలిలో... అనునిత్యం యే పొద్దూ బ్రహ్మఘడియల్లో లేచి "కరాగ్రే.." శ్లోకం తో పాటుగా మరెన్నో వల్లె వేస్తూ/వేయిస్తూ ప్రతి శక్తికి, విద్వత్తుకీ నమస్కారం ప్రియం గా సమర్పిస్తూ, గాయత్రి మంత్రం జపిస్తూ మా నాన్నగారు తన శాయశక్తులా అవిద్య మా ఇంట చోటుచేసుకోకుండా బ్రహ్మజ్ఞానం తెలిసినవారు బ్రాహ్మలు అన్న వివేచనతో మమ్మల్ని పెంచారు.. అటువంటి మా నాన్నగారు మంచి భోజన ప్రియులు. భోజనం ఆస్వాదిస్తూ తినటం, రుచిని స్వఛ్ఛంగా ఆహ్వానిస్తూ వీలైనంత అమ్మకి చేరువగా ఉంటూ ఆహారం వండించటం, పక్కనుండి వడ్డించి రవ్వంత నిర్దయగానే ఎలా యేవి తినాలో నేర్పినందున, అనుభూతిస్తూ కుటుంబం అంతా చేరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్వాగతిస్తూ తినేవారం...ఆయన గరిటె తిప్పి వండినవి ఇంతా అంతా వంటలు కాదు- బూందీ దూయటం తీయటం, కోడి కూర, చేపల పులుసు, బిరియానీ, కాజాలు... పదును మీద కూరగాయలు కోయటం, నౌజుల్లాంటి వాటి రుచికి లౌజు తిన్నంత రుచి రప్పించటం, మిరపకాయ బజ్జీ లో కూరిన వాము చింతపండు గుజ్జు కారం మా బొజ్జల్లోకి కూరిన వైనం అన్నీ ఇంకెన్నో ఆయన నాకు నేర్పినవే. నిజానికి 70వ దశకం లోనే కొత్తిమీర సలాడ్స్, బూడిదగుమ్మడి సూప్స్ మాతో తినిపించిన ఆధునిక ఆరోగ్య ప్రదాత తను. అలా ఆ రుచులు తెలిసిన జిహ్వ మూలానే అభిరుచులూ బాగుండేవి... పద్యాలు, పాటలు, భజనలు, గద్యాలు, నాటకాలు ఇల్లంతా భలే ఉండేది. పెళ్ళికాని బ్రహ్మచారులు, పెళ్ళైనా నోరూరి ఆగి వెళ్ళేవారు, స్వాములు, భోక్తలు, భక్తులు, అతిధులు, అభ్యాగతులు మా అమ్మ వంట నాన్నగారి వడ్డన మా విసుగుదలలు చవిచూసినవారే !!! ఒక్క విస్తరితో తినకూడదు, ఒక విస్తరైనా దానం ఇవ్వనిదే ధర్మం పూర్తికాదు అన్న నియమం, సహ పంక్తి ఉండాలి అన్నదీ అన్నిటికీను- నిజానికి నాన్నగారి తరం లో ఎందఱో ఎరుగని కొన్ని విషయాలు నా బిడ్డలకీ తెలుసునంటే అది ఆయన చలువే.


అటువంటి నాన్న గారు చెప్పినవన్నీ పచ్చబొట్టల్లే మెదడుని పరుచుకుని... వెంకటేశ్వరస్వామికి గోంగూర ముద్దపప్పు ఇష్టమట...శుక్రవారం అమ్మవారికి నేతి పాయసం, శనివారం గోంగూర పప్పు, పరవాన్నం వాడకం అలవాటు. 22 సం క్రితం దేశం వదిలినప్పుడు తెలిసింది శనివారం తాజా గోంగూర దొరకని ఇబ్బంది అంటే ఏమిటో...ప్రతి వారం వెలితి గా ఉండేది, ఉపవాసం ఉన్నట్లు తోచేది. క్రమేణా ఇల్లు ఏర్పరుచుకుని పెంచటం వచ్చే వరకు ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి వాడకం ఉండేది. అలా అలా పిల్లలకీ మప్పేసాను. పెద్దమ్మ/యువ కి అల్లం, గోంగూర పచ్చళ్ళు ముద్ద పప్పు నప్పితే, చిన్నోడు/స్నేహ కి మాగాయ, కొత్తిమీర పచ్చళ్ళు, మరుగు చారు ఇష్టం - వడియాలు తప్పవు, కాచిన నెయ్యి సరేసరి... 

ఇలా సాగుతున్న నా జీవితంలో ఇపుడు శనివారం నియమం లేదు; నాన్న తలపు తినేస్తే ఆయన అమర్చిపెట్టిన జీవనశైలి ని చుట్టూరా సృజించుకుని గడపటం తప్పా! అటువంటి ఈ రోజు నాన్న గారు తిన్నట్లే వెల్లుల్లి పోపు వేసిన గోంగూర పచ్చడిలో తెల్ల ఉల్లిపాయ ముక్కలు, మెంతులు వేసి కాచిన నెయ్యి, పొత్తల్లే వండిన అన్నం, వడియాలు, గడ్డ పెరుగు (ఆయన చూస్తుంటారు ఎందుకంటే చిన్నప్పుడు ఆయనే తినిపించారు, ఇప్పుడూ ఆయన జ్ఞాపకాలతో తింటున్నాను కనుక సంబరపడతారు, నేను అర్థాకలితో ఉంటే విలవిలలాడింది ఆయనే కనుక...)  వడియపు తెప్పలోకి కూరిన ముద్దతో జీవుడు భవసాగరపు తీరాలు దాటి స్వర్గవాస కొలనుల్లో తేలిరావాలి. నలుగురికీ పెట్టిన మనిషి మిగిల్చి వెళ్ళిన వారసత్వం సాక్షిగా, అచ్చం తాతని పోలిన మనస్తత్వం తో యువ మీదుగా మరొక తరం వరకు మా ఇంటి కొంగుబంగారం పదిలం !!!6 comments:

 1. అద్భుతం ! మీ ఈ పోస్టు గురించి ఇంకోమాట - ఆ గోంగూర ముద్ద అందుకోటానికా అన్నట్టు తెరిచిన నా నోట - లేదు - ఇంక రాదు !!

  ReplyDelete
  Replies
  1. చాలా సంతోషం, అభినందనకి ఆ భావనలోకి ఒదిగినందుకు...!

   Delete
 2. తల్లితండ్రులు ఏమి ఆస్తి ఇవ్వగలరో ఎంతో స్పష్టంగా చెప్పారు. మీ పిల్లలకి అదే సంస్కారం అందిస్తున్నారు. ఇంకేమి కావాలీజీవితానికి?

  ReplyDelete
  Replies
  1. కృతజ్ఞతలు..పెద్దలకి ఇవ్వగల నివాళి, గౌరవం ఇదొక్కటే కదండీ.

   Delete
 3. అమెరికాలో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నయి కానీ గడ్డ పెరుగే కొద్దిగా కష్టం. ఆ కాస్ట్కో లో దొరికే పాలతో పెరుగు తోడుకుంటేనే ఎక్కువ అన్నట్టుంది. అమెరికాలో కూడా గడ్డ పెరుగు కావాలంటే ఈ లంకె చూడండి

  https://www.realmilk.com/

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి! ఆ ఒక్క ఇబ్బందీ ఎదురవలేదు, పెరుగు కమ్మగా చేసుకుని తినగలుగుతున్నాము. మీరిచ్చిన పాల సమాచారం మునుపు తెలుసు. అవసరం పడితే ప్రయత్నిస్తాను.

   Delete