నలుసంత నమ్మకం

ఇసుమంత వేసవికి ఎంతలేసి చూపులో
పుట్టల్లో చీమల మాదిరి ఇళ్ళల్లో జీవులకి
ఆరేడు నెలలు ముడుచుకుని, మడతలు ముడుకులు కాచుకుంటూ.


గోరువెచ్చని పొద్దు పొడవగానే
విత్తులు, నార్లు, మళ్ళు, నీళ్ళు, గొప్పులు, శాఖపాకాలు- భూభాషలు
మిడ్ వెస్ట్ నేలలో పచ్చదనపు పరవళ్ళన్న మాటే!


జూలై మాసపు ఆరంభం అంటే వెయ్యిన్నొక్క రైతుల కూటమి రాక
ఊరంతా శనివారపు సంత వేడుక
ముక్కోటి తిరనాళ్లు, మొజాంజాహీ మార్కెట్, సైదాబాద్ మండీ, సముద్రతీర బేరాలు...
ఎన్నుకోటానికి ఎన్నని వెనకటి ఊసుల ఉట్టెలో కుండలు!?


వెదురుబుట్టలో ఇన్ని, వీపున సంచీలో మరిన్ని
తాజా కూరలు, ఊరగాయ జాడీలు, పట్టుతెనెసీసాలు, ఊలు దుస్తులు, పూసల పేరులు
వెనకా ముందు జనాలు, బారులు తీరిన వాహనాలు
ఊదరగొడుతూ వాయిద్యాల హోరు, ఊపందుకున్న క్రయవిక్రయాలు


అదిగో ఆ మనిషి- మడతకుర్చీలో- అప్పటికి కొనుగోలుదారు నెరుగని విక్రేత
గుడారపు గోడంతా చిత్రపటాలు, మోమంతా చిరునవ్వులు
మార్పు ఒకటి; మూయని పుస్తకం రంగు రంగుల పతాకలా
చిత్రాలు ఎక్కని చూపుకి కాగితాల బొత్తి కొక్కెమై...
ఒకరిద్దరు తచ్చిట్లాడుతూ, మరి కొందరు మూగుతూ
ఆమె దిద్దిన పుస్తక ముఖపత్రం, ఆ హస్తకళ కి తలమానికం


ఇకిప్పుడు, నాలుగైదు పటాల బరువు దింపుకుని-
ఒకట్రెండు ముఖపత్రాల వివరాలు దొరకపుచ్చుకుని
మరుసటి వారానికి మరింత ఓపిక తెచ్చుకుని
ఆ మనిషి- కళాభిమానుల కొరతలేని- విజేత


ఆ చూపులో నలుసంత నమ్మకం
శిశిరం తాకినా వసంతపు చివుర్లతో పచ్చగా మెరిసే వనం

(నేపథ్యం: అమెరికా మిడ్వెస్ట్ లో దాదాపుగా 7 నెలలు ఇంటినే ఆశ్రయించుకుని ఉండే జీవనం మా చలిప్రాంతం లో, ఒకింత వ్యవసాయ క్షేత్రంలో...మిగిలిన ఆ 5 నెలల్లో 'సాగు'తో కొందరు, సాగుతూ కొందరు, 'కళా సాగు' చేసుకుంటూ మరి కొందరు...అంతా కలిపి సాగించే జీవిత చిత్రం)

1 comment: