ఈ కావ్యం, ప్రేమికులకే అంకితం!

ఈ పయనం నీ వైపే నా గమ్యం నీవే. నేనే నువ్వు .. కన్నా మనమిరువురం కలిసి నిర్మించే ఈ నవలోకాన ప్రేమికులకే ప్రవేశం...

ప్రేమని శ్వాసించి అనుభూతిలొ జీవించే జీవులం. వలపులు, వగపులు, రాలు పూల ఎడబాట్లో, రగులు సెగల ప్రణయాల్లో, రాగాలకందని అనురాగంలో, కలయికలో, ప్రతి కదలికలో, కలిసున్నా లేకున్నా మనది ఒకటే తన్మయత్వం. నా తలపుల విహారాన, వాస్తవ విలాసాన జనించిన ఈ వచనమే నా నిత్య రచన. విరించిని నేనే, విపంచినీ నేనే, నా విశ్వం మాత్రం నీవే.

ఉపమానాలు, ఉత్కర్షలు, తలంపులు లేని లోకం వెదుక్కుందామా?
నన్ను నీకు, నిన్ను నాకు పెనవేసి వుంచే బంధం వేసుకుందామా?
మనకు, మనలోకానికి, ఆ బంధానికీ ఒకటే పేరు పెడదామా "ప్రేమ" అని?

ఆకాశ వీధులనుండి వెన్నెల మేనా ఎక్కి నా వీధి వాకిట వయారంగా దిగి వచ్చింది నా నెచ్చెలి విరహ కన్నియ. నా చెంత నున్న ఏకాంతాన్ని ఉరిమి చూసింది. ఆ చూపుతో బెదిరి తను నన్ను వీడిన నా తనువులోని అణువణువు నీ కొరకు తపన పడుతోంది. నా చేతిలో తన చేయుంచి నా సఖి నీ కొరకు మునిమాపు వేళల విడలేని మోహపు సంకెల వేసి నీ ప్రేమామృత దాహంలో పడత్రోసింది.

ఎంత చిత్రం ఎటు చూసినా నాకు నేనే కనిపిస్తున్నాను, ఆ పలు రూపాల్లోని నా కళ్ళన్నిటా నీకై ఎదురు చూపో, నీ పై అలకో కనిపిస్తుంది. అందులోనే ఆర్తి వుంది. సాగరునివలె నీవూ రావు కదా, అందుకే నా మనసుకి నేనే సర్ది చెప్పుకున్నాను.

సొమ్మసిల్లిపోకే చివురుకొమ్మలా, ఎండమావి తీర్చునా నీ దాహార్తి?
కడలి కదులునా తన దరికి రాని నది కొరకు?
సాగి సాగి అలసి సొలసి ఆగి సాగి తానె చేరాలి కాని...

అంతలోనే బింకం గుర్తుకొచ్చింది.

మరి నాకెందుకు వగపు, వారీ, వీరి తలపు
ఎకసెక్కమాడేటి కాలం ఇక జారుకోదా ఈ క్షణం
సరి ఎవరు నాకు ఎండమావిలో కూడా దప్తి తీర్చుకోను

అని నీ మీద పంతమాడుకున్నాను.

నవ్వేసుకునే వుంటావు, నా మొహం చాటు చేసుకుని నా ముంగురుల్లో చేరే గాలి వలెనే...

గాలి! వెచ్చని నిను ఒకమారు తాకాలి.
సుడిగాలినై చుట్టేస్తాను, గింగరాలు తిప్పేస్తానంటావా?
అలాగే కానీ, అచ్చెరువున మునిగిపోతా.

గాలి! వేణువూది నిను రాగాల అలంకరించాలి.
పాటవై, ప్రకృతి అందెల రవళైపోతానంటావా?
అలాగే కానీ, పరవశించిపోతా, ప్రాణ వాయువుగ పాటనే నింపేస్తా.


కన్నా, ఒక్కసారి ఆ గుట్టు విప్పేయనీ నువ్వూ నిజంగా నల్లనయ్యవేనని, అందులోనే నీ అందం దాగుందని. వురుముకి బెదిరే నన్ను చుట్టూ చేయి వేసి పొదివిపట్టే వేళ సిరిగంధపు చెట్టుని చుట్టిన నల్ల త్రాచు కాదా ఆ కరం. అది అందిన నాది కాదా వరం.

గోరువెచ్చని పొద్దులో వున్న వెచ్చదనం నను హత్తుకున్న నీ మేనిదా క్షణం.
ఆ అభయంలో ఎంత భరోసా, జగద్విజేతకైనా సాధ్యమా నా ధీమా?

నిదుర రాని నిశీధుల్లో, నిట్టూర్పు వేకువల్లో, నిలదీసే ఏకాంతాల్లో, నిలవరించలేని వేదనలో నీకై లేఖలు పంపగా పదాలు ఇమ్మని ప్రతి సడిని వేడాను. ప్రేమికనై యాగాలు చేసాను. దక్కిన నిన్నే తిరిగి తిరిగి వరంగా కోరుకున్నాను. నీ ఒక్కడి కోసం నేను కోటి హృదయ గీతాలు వ్రాసాను. నన్నే శ్రోతని చేసుకుని నీకై గానం చేసాను, సాధన వలని ప్రేమ ఆలాపన ఇది.

కాలం నిన్నటి గతంలో నిన్ను చూపి ఎదురుచూపులకి నాలో సహనం నింపుతోంది. ఎంతకీ కరగని ఈ కాలం నీ కౌగిట కరిగే తరుణాన ఇంకాస్త ఘనీభవిస్తే బాగుండు.

మెల్లగా సాగుతున్న నా నిరీక్షణం,
చల్లగా వస్తున్న మన సంగమతరుణం,
నీకై నాకై నేల్కాంత వేసిన పూపొదరిళ్ళు,
తరువులు పరిచిన చివురు పరుపులు,
నీ ఒడిలో నిదురించే నా కళ్ళు,
అవిగో అక్కడే నా వూహల వేణువులు,
నాలోని మౌనం తటాలున పరుగిడే నీ దర్శనం!


నీకు ఇష్టమని ఎంకికిమల్లే వూసులు చెప్పాను గుర్తుందా మావా?

సిగలోకి ఓ చిన్ని పూవిమ్మంటే ముల్లుతో గుచ్చి
ముద్దుగా ఓ మొగ్గకొమ్మ నామీదకు వాల్చే ఆ గులాబీ కొమ్మకు చెప్తా
మావా ఇంతే అలక చూపాక నా వొళ్ళోనే తలవాల్చి సిగ్గుపడతాడని.

మొగ్గనీ వదలక మధువుగ్రోలేటి తుంటరి తుమ్మెదకి
కాసింత తటపటాయించి వూసు విప్పేస్తా
మావోడు నీకేం తక్కువ కాదు, మొగ్గలు త్రుంచేటి మొండాడేనని.


మనియాద పెడతావే మనసిచ్చిపుచ్చుకున్న మొనగాడివి నీవె కాదా?
తియ్యంగ కలలుగంట తొంగున్నా అయినా సెయ్యేయనంటవే దొరా?

అందుకు కాదా ఖండితనయింది.

నీతో కలిసి విహరించిన వూహల పూతోటలు,
శిశిరపు శిధిలకళతో కొనవూపిరులు వదులుతున్నాయని,
నీ ఒడిలో నిదురించిన నా కనులు,
నిప్పు కణికలై నన్నే కాల్చేస్తున్నాయనీ వివరించాలనివుంది.
నీ చేతల పులకించిన నా తనువిక,
తానర్పితం కాబోనని "ఖండితంగా" శాసనమేస్తుంది.
చెప్పినవిక చాలని వెళ్ళిరావా మరి?


అయ్యో నా మదికింత వగపేలా నా సామి రాకకై నేను అష్టనాయికనై ఎదురుచూసిన రాతిరి ఈ పిచ్చి మనసు ఎలా మరిచిందో, ఏమో..

మన్నించు కన్నా...

నిత్యం నీ తడిపొడి తలపులతో తనువునలంకరించుకొని,
రహస్యం దాచలేని గుండె చేసే గడబిడనే గంధంగా రాసుకుని,
కార్యం నెరవేర్చుకుని కన్నుగీటిన నిన్నే కాటుకగా అద్దుకుని,
ఆలస్యం చేయక రారమ్మని వేడుతూ నీ "వాసవసజ్జిక"నైతి.


గుండె కతలన్నీ గుట్టుగా, గుసగుసగా చెప్పలేనని,
కలంనడిగి నీలి అక్షరాలు తెచ్చా.
చిర్నవ్వు రేకులన్నీ నీపై చల్లలేనని, చిరుగాలి తెరలుతెచ్చా.
నిన్ను హాయిగా మురిపించి, అదిలించి, నెమ్మదించలేనని,
చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
ఉసిరి కొమ్మ వెనుకనుండి, కొబ్బరాకు పైకెక్కి,
నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి,
నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?


నను ఇక పరీక్షించకు వేగిరమే నీ వూపిరి నా అరచేతి చిరు చెమటగా మార్చగా నా చెంతకి రారా కన్నా... ప్రియా ఈ వేదన భరియింపను నా తరం కాదిక

కాలానికి ఎదురీదుకుంటూ గతం వెదుకుతూ,
స్మృతుల తిన్నెలపై, నీ జాడనన్వేషిస్తూ,
అలసితి, సొలసితి,
నేస్తం, ఒక్కసారి తిరిగిరావూ?

వసంతాన కోకిలగానం మనం నేర్పినదే, తరంగిణి వేగం మనం చూపినదే ఒకటి మన హృదయ గీతం మరొకటి మన వలపు సంబరం. ఇలలో మనం, కలలోనూ మనమే. మనకి మనమే తోడు.

అందుకే

మారాకు వేయనని మల్లెకొమ్మ మారాం చేసినట్లు
నువు లేక మనసు మాట వినను అన్నది.
పరాకు మంత్రం జపిస్తూ కోయిలమ్మ మూగపోయినట్లు
నువు లేని నా వనమంతా నిదుర పోయింది.

లోలోని ఆత్రం కాలాతీతమౌతుందని నను తొందరిస్తే.
ఏదేదో నెపం సమయాభావాన్ని నీకు తెచ్చిపెడుతుంది.
నీకు నాకు నడుమ ఇలా నేలపై సరిహద్దుగీసావంటే,
నిక్కచ్చిగ ఆచొటే నేను నింగివరకు వీడ్కోలు గోడకట్టేస్తా.

మదనుని చేత చిక్కి విరహపు సెగల వేగే నీ మగువకి అతి చేరువగా నడయాడుతు ఆమె నిత్యం అతి ప్రియంగా తాకాలనుకునే ఆ వక్షస్థలం అలా కనీ కనిపించక దాచుకోవటం నీకు తగునా నా ప్రాణ బంధమా? నీ మెడవంపులో తలదాచుకుని, నా మెడవంపులో నీ పెదవి చేసే సంతకం లిఖించుకోవాలనుంది. ఎంత తీయని అనుభూతో.

కొనగోర్లు నీ మునిపంటి పదునుకని పదిలపరిచాను
ఇంకేమిచెప్పాలన్నా నునుసిగ్గు కమ్మేస్తుంది
పులకింతల పారిజాతాలు పక్కగా పరిచాను
మధురిమల మరువాలు జతగా కలిపాను


నా మనసు వూసు ఇది …

తావెళ్ళాడని అనిపించిన దారుల గాలే పీల్చుతూ,
తన అడుగులుసోకాయన్న నేల తిరిగి తిరిగి తాకుతూ,తన వూసే వూరూ వాడా చెప్తూ,
తను మెసిలిన లోగిలి వాకిటనే నిలుచుని,
తనొస్తే ఏంచెప్పాలో మళ్ళీ మళ్ళీ అద్దంకి అప్పచెపుతూ,ఎన్నాళ్ళూ గడిపానిలా?
ఏమో తాను తప్ప ఇంకేమీ జ్ఞప్తికే రావట్లేదు!


మనసు, మస్తిష్కం అనుకున్నదొకటి, మూగగానో, మౌనంగానో తనని సాధించాలనుకున్నాయవి. కానీ అపుడపుడూ మాత్రమే తనది, ప్రధమస్థానం నాదనే హృదయానికి దాసోహమంటున్నాయి. అతని కొరకు ఆ గుండె చేసే నాదంలో అవి మూగపోతూనే మౌన రాగాలు ఆలపిస్తున్నాయి. అనుకున్న మౌనమే కానీ అది తన కొరకు మనసా వాఛా మది, హృది కలిసి సాగిస్తున్న మధురమైన పయనం. నీవు పంచిన స్మృతులు మల్లెల మాలలా అల్లి నిన్ను వరించే వరమాల చేసుకుని నిలిచున్నానిచట!

అస్తమానూ వూహల్లోనేనా నిను ఉడికించేదనుకుంటాడేమో?

అమాంతం వెలికివచ్చి వురికే వాగల్లే వూసుల్లో ముంచేస్తాడు.
చిలిపి కళ్ళ వలపు కురిపిస్తాడు, వగలు నాలో వుందోలేదో తడిమిచూస్తాడు.
వదనమేదీ అనో వంపులేవి అనో అంటాడు, నన్ను వంకలేవీ పెట్టొదంటాడు,
ఏదో ఒక వంకతో నాపై వాలతాడు. వంగిన నా వంటిపై స్వారీ చేస్తాడు.
పెదవికి మరో పని చెప్తాడు నాకిక సెలవు దొరకదంటాడు, మాటలిక మనకొద్దంటాడు.
ఇవన్నీ తానొకడే నిర్ణయిస్తాడు, మరలాకాక మరేంవుంటది నేనే తనలో కలిసిపోయాక?
ఇంతకీ వాడెవరన్న నా శోధనకి నాకింకా సమయమే దొరకలేదు. ఇకది ముగిసిన సంగతే!
మనసు నికిచ్చేసి నీ వినా మనలేనన్న నా దేహం,మనసా వాఛా ఎన్నడో అయింది నీలో మమేకం.ఆ సంభవానికి గుర్తు మన సాంగత్యమో, సంగమమో కాదు,కలలో మెలకువలో తన ఉలికిపాటుకు మూలమైన నీ తలపే. ఇదంతా అనురాగం, అనుబంధం కప్పుకున్న హృదయం చేసే మాయా?పదిలంగా నన్ను నిన్ను ఒకటిచేసిన విధాత ఆడుతున్న విలాసమా?

నిన్నటి కలవంటి నిజాన్ని మనసు వూటబావిలా అనుభూతి వెనుక మరొక మధుర భావననగా తోడిపోస్తుంది.

ఈనాడు నా ఉల్లం ఝల్లుమంది, ఒడలు వొణికింది, తనువు తీపిఘాట్లతో తెల్లారేవరకు తబ్బిబ్బైంది. చెమరింపుల్లో తృళ్ళిపడింది, అలవోక నవ్వుల్లో మునకలేసింది. నునుసిగ్గు వరదలో మునిగిపోయింది. విల్లో, వీణో ఆ రెండూ కాని మరేదో నా వంటి రూపిపుడు. గుండె జారిపోయింది, కాని తన సడి దుంధుబి వలే, డమరుకం వలే ఇంకా వినిపిస్తూనేవుంది. వలువలు వంటిపై వుండమంటున్నాయి, వడుపుగా పక్కకి తొలుగుతున్నాయి. ఎంత చిక్కబట్టుకున్నా ప్రాణం నీ దరికే పరుగులు తీస్తోంది. ఏదారిన వెళ్ళను? నా వాటిని తిరిగి పోగేసుకోను? ప్రకృతంతా ఈ నీ స్త్రీలోనే ఆవిష్కరించినట్లుంది. మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాను, ఎవరు నీవు? నిన్నేమని పిలిచేది?

నా కోసం కవితలల్లి, నా కన్నీట నీవూ కరిగి,నీ బాణిలో కథలల్లి,
నా నవ్వులో నీవూ కలిసి,నా కవితకి స్ఫూర్తివై,
నా అనుభూతిలో నీవూ తడిసి,నీ వాణిలో తేనెలునింపి,
నా బాధలో నీవూ గడిపి,నా తోడువై మెసిలి,
నా నిట్టూర్పులో నీవూ ఎగిసి,నీ కౌగిలితో కమ్మేసి,
నా వొడి నీవూ దోచేసి,నా ఉనికి నాకిక వద్దని,
నీ వినా నే మనలేననిపించిన నా ఆత్మబంధువా,
నీ నా బేధమిక లేనేలేదని మనవైక్యమైన ఆత్మలని నేడు చూపవా?
ఆత్మసంగమం అయిన అస్థిత్వంలో తనువు కలయిక అనివార్యమని, ప్రియా,
ఆ పడుగుపేకల మధురిమల మేళవింపే నాకు నీవిచ్చే కానుకని నిరూపించవా?



నీ చెంత నేను కలువల నవ్వుని నా సరసన నీవు నెలరాజువి. మన సావాసం రాగ భరితం మన కలయిక భువికి దివికీ నిత్య వాసంతశోభ.


ఏటి ఒడ్డున ఏదమ్మ నా ఆలిచిప్ప?
తోట మలుపున కానరాదే నా రామచిలుక?
గూటిలోపల తొంగోదే నా గోరువంక?
అమ్మో నా మనసు చింతకి వైద్యమేదీ?


మొన్న నీ కళ్ళతో కలిపిన నా కళ్ళునిను చూడక నేనుండలేనని చెప్పలేదా?
నిన్న నీ అడుగుల్లో అడుగేసిన నా కాళ్ళునిను చేరక ఆగలేనని తెలుపలేదా?

ఏ కలల్లోనూ నీకై వెదకబోను,
వూహల్లోనూ నీకై నిరీక్షణ మాత్రం ఆపను
ఈ ప్ర్రాయమాని నను ప్రశ్నించుకోను,
నీ రాకకై అనునిత్యం వేచివుంటా.ఇది తరుణమాని నిను నిలదీయను,
కల,ఇల,వూహ అన్నిటా స్వాగతిస్తా.నా మానసమే నీకు కోవెల చేస్తా,
ఈ సమర్పణమే నా కానుకగా ఇస్తా!


గోరు వెచ్చని సూరీడ్ని చూసినా, గోముగా చూసే గోరువంకని చూసినా, గొల్లుమని నవ్వే గొబ్బి పూవు చూసినా, అసలు కదలిక అన్నది ఎక్కడ చూసిన చివ్వున మెదిలే ఉహా అందులో నీ సందేశం ఏదో వుందనే. కలిసున్నా అంబరమే, కలిసే ఘడియల్లో, కలిసి విడిన కాలానా అంబోధే నా తలపుల కొలత. నీ నెలత మది నీవెరుగవా సఖుడా? త్రికాలాల్లోనూ నా హృదయనాధుడివి నీవే కాదా కన్నా. దేవేరిగా నిన్నేలినా దీనురాలనై నిను వేడినా అది ప్రేమ కోసమే...


ఇన్ని పదాలు ఏరికూర్చి నీ ఎదపై తలవాల్చి నా మదిలో మళ్ళీ నీతోనే వూసులాడితే ఎప్పటి మాదిరే ఒక్కమాట అంటావు "నా లేత బంగారు, నువ్వే నా లోకం, నేను నీకు అంకితం" అని. నీ నయనం సమ్మోహనం, నీ అధరామృతం మధురం, నీ ఆలింగనం మనోన్మత్తం, నీ గమనం కమనీయం" అని చేతలతో చెప్పకనే చెప్తావు. నేనింక కోరేది ఏది ప్రియుడా?

నిన్నటి గూట్లో పదిలంగా దాగిన గువ్వ నా మది.
రేపటి వలలోకి కలల కడలిలోకి లాగినవాడివి నీవె కదా!
మన వేదం మన సాంగత్యం, మన పయనం మరో ప్రేమ ప్రస్థానం.
మనమిరువురం బహుదూరపు బాటసారులం, సవాళ్ళకొగ్గని సహవాసులం.

26 comments:

  1. ఎన్నాళ్ళో వేచిన ఉదయం
    భలే గా వుంది
    ధన్యవాదాలు :)

    ReplyDelete
  2. ఉష, వర్షాకాలమై మబ్బులు క్రమ్మేశాయా అందుకే మరువపు కవితా ఉషోదయం లేదోమోనని ...ఈరోజు,ఈరోజు అని ఎదురుచూస్తున్నా ప్చ్.. చాలా రోజులయింది.గ్రహణం విడిచిందేమో ఈరోజు ప్రత్యక్షమయ్యారు. :)

    ప్రేమికులకే అంకితమిచ్చిన మీ కవిత చినుకే లేదనుకుంటున్న మాలాంటివారిపై కుండపోత కురిపించినట్లయింది.:)

    ఈ వ్యాఖ్యలో ముందుభాగం నా మోహనరూప టపాకు మీవ్యాఖ్యకు స్పందనగా నా మాట. మళ్ళీ ఇక్కడ copy & paste

    ReplyDelete
  3. "సిరిగంధపు చెట్టుని చుట్టిన నల్ల త్రాచు కాదా ఆ కరం" ...very nice..

    ReplyDelete
  4. "మన వేదం మన సాంగత్యం, మన పయనం మరో ప్రేమ ప్రస్థానం."
    కొనసాగాలి నిరంతరం మీ సాహితీ ప్రస్థానం......

    ReplyDelete
  5. అబ్బో చాలా పొడవుందే...తీరిగ్గావచ్చి చదువుతాను.

    ReplyDelete
  6. "చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
    ఉసిరి కొమ్మ వెనుకనుండి, కొబ్బరాకు పైకెక్కి,
    నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి,
    నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?" wow!!!!!!!!!!!!!!!!!!

    ReplyDelete
  7. 'నిత్యం నీ తడిపొడి తలపులతో తనువునలంకరించుకొని,
    రహస్యం దాచలేని గుండె చేసే గడబిడనే గంధంగా రాసుకుని,'......బాగా రాసారండీ .

    ReplyDelete
  8. హరే కృష్ణ, ముందుగా వచ్చి మనసుకి నచ్చిన మాట చెప్పినందుకు నెనర్లు. ఇదే ప్రేమలోని మహిమ. అందరినీ ఆకట్టుకుంటుంది.

    విజయమోహన్ గారు, ఇక్కడ ప్రేమ అన్నది విశ్వవ్యాప్తం. అది ఇద్దరి వ్యక్తుల మధ్య భావనే కాదు. ప్రేమని స్పర్శించే ప్రతి స్పందనదీను. ప్రేమ అనతవాహిని కదండి, అందుకే అలా ఉన్మత్త తరంగిణై వెల్లువగా వురికింది.

    ReplyDelete
  9. మురళి, చిన్ని, మీ ఇద్దరికీ నచ్చిన ఆ రెండు భావనలు నేను స్వానుభవంలో అనుభూతిగా మిగుల్చుకున్న ఆస్వాదనలు. తలపుకి వచ్చిన ప్రతిసారీ అదే గాఢత మనసుకి తోస్తుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  10. పరిమళం, అశ్వినిశ్రీ, కొంచం వూహని జోడించినా మీ మనసుని అలరించిన ఆ రెండు భావనలూ వాస్తవ జనితమే. నెనర్లు. మీ అభిలాషకి కృతజ్ఞతలు.

    ReplyDelete
  11. మహేష్, మాట తప్పరు కదా? అయినా ఇది ప్రేమకి సంబంధించినది, జీవిత కాలం నడిచే సజీవ కావ్యం ఇది. మీ తీరికలో నావి ఓ నాల్గు పదాలు చూసి మీవి ఓ రెండు కలపటం మరవకండేం?

    ReplyDelete
  12. నిన్నటినుంచి వ్యాఖ్య వ్రాయకుండా చేతులు గట్టిగా కట్టేసుకున్నా... మళ్ళీ ఈరోజు చదివితే ... మీ శృంగార నాయికా నాయకుల వలపు గిలగింతలు మనసును ఎక్కడెక్కడికొ విసిరివేసారు.

    అల్లన జాబిలి - వల్లని చూపుల
    ఉల్లము ఝల్లన - మెల్లగ ముసిరి
    చిత్తుగ మదిని - మత్తుగ జేసి

    ముద్దుగ ముద్దుల మాటల
    హృదిలో ప్రేమను నాటి

    తీయని వలపుల తన్మయ తనువున
    నెచ్చలి మాటలే వెచ్చని కౌగిలిలై
    అలసిన తనువున తుషార బిందువె
    నుదుట వెలసిన కుంకుమ బొట్టుగ
    జగతిన వెలసెను నూతన జన్మగ.

    ReplyDelete
  13. నిన్నటి సంపూర్ణ సూర్య గ్రహణం డైమండ్ రింగ్ మబ్బుల మాటున దాగిపోవడంతో చూడలేక పోయిన నిరుత్సాహం, దాంతొ కమ్ముకున్న నిస్సత్తువ (ఈ జన్మలో మరి రాదు కదా?), ఈ ప్రేమ ప్రస్థానంతో పటపంచలయ్యాయి. మరలా విరిసిన మరువపు విపంచికి హృదయపూర్వక స్వాగతం.

    ReplyDelete
  14. భా.రా.రె. గారు, జిలిబిలి పలుకులతో భలే చెప్పేసారు నా కావ్యంలోని సారాంశం. నా నాయిక మాటకారి. మనసుదాచుకోలేని మనిషి. ఆ మగడు మౌనమూర్తి. ఒకింత జడపధార్థం అందుకే అంతగా ప్రేమ వేడుకోలు సాగింది. అది మీ మనసున రస రమ్య స్పందనల మల్లెలు కురిపించటం, ఈ కవితగా వెలికి రావటం ముదావహం. ప్రేమ మిళిత శృంగారభావనలు, ఆ స్పందన జనిత కవితా వచనాలు కత్తి మీద సాము అయినా ఈ యాంత్రిక జీవనానికి ఉత్ప్రేరకాలు కదండి. మీ స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  15. వర్మ గారు, నా అల్లిబిల్లి పదాలకి ఎంత హోదా కల్పించారు! సంతోషం. నాయికలోనూ, నాయకునిలోనూ నేనే పరకాయప్రవేశం చేసి వ్రాసాను. ఇద్దరి ఉదాత్తత ఒక్కరి మాటల్లో వ్యక్తంచేయటం కాస్త కసరత్తు చేసాను. నా మనసుకి తెలిసిన భాష ఈ కావ్యం. ప్రేమాభిమానాలు ఆపేక్షపూరిత ఆర్తి ఇవే నా బలిమి బలహీనత. ఈ పయనంలోనే నా జీవిత ప్రస్థానం ముగుస్తుంది. నెనర్లు.

    ReplyDelete
  16. ఏమని చెప్పను, అప్పుడెప్పుడో చదివిన "ఏనుగు-నలుగురు గుడ్డివాళ్ళు" కధ గుర్తుకొచ్చింది...
    ఆ కధలో నేనొక గుడ్డివాడినేమో, ఏనుగు మీ కవిత ఏమో... (సంగతేమంటే, అలసటతో ఉన్న ఈ సమయంలో నా మది ఇంతకన్నా బాగా ఆలోచించలేక హాజరు పలకాలని ఆత్రుత పడుతోంది.)
    పాత కవితలు జాగ్రత్తగా కలిపారు, నా ఫిర్యాదు గుర్తుందన్నమాట. అవి పాతవైనా వాటి పరిమళం కొంగ్రొత్తగా నను తాకింది.
    ఇక, ఇది కవిత అనే సాహసం ఎవరూ చెయ్యరు, కావ్యం కదా.. కవితా సాగరం కదా.. అయితే
    "కడలి కదులునా తన దరికి రాని నది కొరకు?" చదువుతుంటే "కదలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం" అన్న పాట అప్రయత్నంగా గుర్తొకొచ్చినా... "కడలి కదిలితే అది సునామీగా మారి వినాశనం చేస్తుంది" అన్న నిజం గుర్తుకొచ్చి ప్రియుడు గంభీరుడు అని చెప్పారని అనుకుని ముందుకు కదిలా.....
    ===
    మళ్ళీ ఖాళీ దొరకగానే వస్తా... వచ్చి నా ఫిర్యాదులో పొగడ్తల అత్తరో జల్లిపోతా... ప్రస్తుతానికి పదహారవ వాడిగా ఉండనీయండి

    ReplyDelete
  17. ఎంత పెద్ద కవితా. ? హెవిటో మీ ఓపిక!ముందు దానికో జోహారు!!

    ReplyDelete
  18. అమ్మాయీ, మరదే తొందరపాటు అంటే ;) ముందస్తుగానే హెచ్చరించి నా నూటొక్క టపాగా వెలువడిన స్వీయానుభవం నుండి జనించిన అనుభూతి కావ్యమిది. సాగరమంత స్పందన జోడించి వ్రాసాను. ఓపిక కాదు ఇక్కడ విషయం, నా హృదయ సడి ఇది. చదువరులున్నారు నన్ను సాధిస్తారు కనుక మరింత సంతృప్తి వస్తుంది. పాత టపాల్లో చిట్టి కవితలు వెదుక్కోండి. లేదా వేచిచూడండి రానున్న టపాల కోసం. కావాలంటే ఓ బుల్లి కవిత వ్రాస్తాను మీకోసం.

    ReplyDelete
  19. ప్రదీప్, మునుపొకసారి చెప్పాను, నేను తెలుగులో చదివింది చాలా తక్కువ అని కనుక "ఏనుగు-నలుగురు గుడ్డివాళ్ళు" కధ నాకు చెప్పితీరాల్సిందే. ఇకపోతే పిర్యాదు డబ్బా వనం మొగల్లోనే వుంచాను, ద్వారం నుండే మీ జాబితా జారవిడిచిపోవచ్చును. అత్తర్లు వద్దు నా సహజ పరిమళం చాలు నాకు/మరువానికి. ప్రియుడు/నా నాయకుడు గంభీరుడు నిజం, ఆపై మద్ర స్వరానా గండుకోయిల వంటి వాడూనూ ;) సశేషాన్ని పూరిస్తారని ప్రతీక్షిస్తూ..

    ReplyDelete
  20. "మనమిరువురం బహుదూరపు బాటసారులం, సవాళ్ళకొగ్గని సహవాసులం."
    ee vaakyam mari mari nachchimdanDi.samayaabhaavam valla mi blog Alasyamgaa chustunnanninnALLaku.
    anta pedda kavita raayataaniki enta samayam vechchimchi umtaarO ..ani abburapaddaanamdi.johaarlu!!

    ReplyDelete
  21. తృష్ణ, ఇది ప్రేమకావ్యం అని ముందే నిబ్బరంగా చెప్పాను కనుక అలాగే వుంది. సమయాభావం గురించి నాకు బాగా అనుభవమేనండి. అది నన్ను నేను దాన్ని అధిగమించటమే నా క్రీడ. ;) ఇకపోతే ఇది నా జీవన కావ్యం కొంత వాస్తవం కొంత వూహ, కనుక తనని అలా తరిచి అడగటం అలవాటే కనుక పదాలు అలవోకగానే దొర్లాయి. ఇంత అనుభూతి కలిసిన అనుభవాన్ని మిగులుస్తున్న జీవితానికి జోహార్లు. అది నన్ను పలుమార్లు పరీక్షించటం వేరే సంగతి. మీకు నా నెనర్లు. we are in deed మనమిరువురం బహుదూరపు బాటసారులం, సవాళ్ళకొగ్గని సహవాసులం. ;)

    ReplyDelete
  22. మొత్తం నల్లనయ్యపైని మధురభక్తి అన్నమాట. భలే.

    ౧ "నేనే నువ్వు"... "ఎటు చూసినా నాకు నేనే కనిపిస్తున్నాను"... "కోటి హృదయ గీతాలు వ్రాసాను, నేనే శ్రోతనై నీకై గానం చేసాను" ఇత్యాది -- బావుందండీ ఈ ఆత్మకేశవాద్వైతస్థితి
    ౨ "సిరిగంధపు చెట్టుని చుట్టిన నల్లత్రాచు కాదా ఆ కరం' -- కన్నయ్యని మళ్లీ మళ్లీ మీ దగ్గరికే రప్పించేసుకుందామనాండీ ఈ ఉపమానం!

    మొత్తం చదివాక నాకు అనిపించిన మరో రెండు విషయాలు (సలహాలు మాత్రమే. ఉచితాలో అనుచితాలో మీరే నిర్ణయించాలి):
    ౧ మధ్యలో పూర్తిగా ఎంకి భాషలోకి మారిపోయేటపుడు అది వేరే భాగంగా వ్రాస్తే బాగుండేదేమోనండీ.
    ౨ పూర్తిగా కృష్ణుణ్ణి నాయకుణ్ణి చేసేసి, అమ్మో ఎంత పేద్ధగా వ్రాసేసారూ! ఏదో పాపం కన్నయ్యని కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టే... ఐనా సరే, కొంచెం క్లుప్తంగా వ్రాసి ఉండవలసినదండీ. :)

    ReplyDelete
  23. రాఘవ, కలా నిజమా మిత్రమా, సుచిర కాల దర్శనం. సుదూరాన్నుండి సుమధుర సందేశం అందిన ఆనందం.
    నల్లనయ్యపైని మధురభక్తి తో మీరాని మించిన తన్మయాన్ని పొందిన దాన్ని. ;) ఇది నా తాదాత్మ్యం. వ్యక్తమైనది వాంఛాపూరితమా దైహికమా లౌకికమా ప్రక్కన పెడితే ఇది ప్రేమైక జీవనం, ప్రేమ తత్వం. అది గమనించినందుకు ధన్యవాదాలు.
    ఎంకి భాష - మీరన్నది నిజమే సరైన న్యాయం చేయలేకపోయాను. సంశయంగానే వుంచాను.
    క్లుప్తత - సమస్యే లేదు. ఇకపై వ్రాయబోనని ముందే అనుకుని ఇది కావ్యమని ఆపై హెచ్చరించి మరీ కుదించగా ఇంత చిరుకావ్యం అయింది. నిజ రచన దీనికి ఇంతకింత వుంది. ;)
    నెనర్లు.

    ReplyDelete
  24. కవితకి కవితే సమాధానం. ఇదీ ఒక ప్రేమ కావ్యానికి నేను వ్రాసుకున్న పీఠిక. But an ameteurish work.

    http://thinkquisistor.blogspot.com/2008/11/blog-post_26.html

    I'l be back again with more elaborate comment. It deserves some seriousness.

    పైగా ఈ కావ్యం ప్రేమికులకే అంకితం అని ముందరి కాళ్ళకి బంధం వేశారాయే. నాకసలా ప్రేమనే పదార్థం తెలుసాయని ప్రశ్న వేసుకుంటే నాకీ కవిత చదివే అర్హత ఉందానిపించింది.

    మీ కామెంట్ బాక్స్ నేనే నింఫేశాను. మన్నించగలరు.

    ReplyDelete
  25. పెద్దదైనా పెన్నిధిలా ఉంది.

    " నీ నయనం సమ్మోహనం, నీ అధరామృతం మధురం, నీ ఆలింగనం మనోన్మత్తం, నీ గమనం కమనీయం"

    So nice. I too felt the same. అనుభవించాలే కానీ చెప్పనలవి కాను భావ పరంపర.

    ReplyDelete
  26. గీతాచార్య, మీరా ఆ మాట అనేది? ;) తిరగతోడి చదువుతున్నాను ప్రేమని మీ మాటల్లో. ఈ రోజు ఎంతో సుదినం. వ్యాఖల వానలో తడిసిముద్దయాను. వానలో కరిగిన నా బొట్టుకి ఈ జల్లుల్లో కరిగిన నా వేదన కలిపి నా ఆనందానికి నేనే దిష్టి తీసుకున్నాను.
    సృజన, నిజమే ఇవి అనుభూతి పంచిచ్చే జ్ఞప్తులు. పదిలంగా ఎదనంటుకుపోయుండే వెల్లలు. ప్రేమైక జీవనం గడిపే ప్రతి ప్రేమికులు ధన్యులు.

    ఇరువురికీ నా నెనర్లు.

    ReplyDelete