ఓ పయనం లో ఆ నాలుగు, ఈ నలుగురు


“It is my right to be uncommon ...”  - Dean Alfrange ఆ మాటలు ఆయన అన్నది ఒక ఉద్దేశపూర్వకంగానే అయినా ఒక కార్యాన్ని, లక్ష్యాన్ని ఎంచుకునే ప్రతివారికీ వర్తిస్తుంది.  తెలుగు బడి పర్వం నా జీవితం లో మొదలు కావటానికి పూర్వాపరాలివి.  నాతో ఉండి నన్ను నడిపేది నా స్వంతమైన స్ఫూర్తి మాత్రమే.  ఇక్కడ చెప్పే నాలుగు విషయాలు,  నలుగురు వ్యక్తులు -  ఎంతో కృషి, కుతూహలం, శ్రద్ద,  పట్టుదల పెంచిన అంశాలు.  మరి కొంత మార్గదర్శకాలు.

20సం. క్రితం ప్రవాస జీవితంలోకి రానున్నానని తెలిసినపుడు ముందుగా వచ్చిన బెంగ – తెలుగు వారుంటారా? అంటే ఆంధ్రా నుంచి వెళ్ళినవారు అని కాదు.   తెలుగుదనం తెలిసిన తెలుగువారు.  తెలుగుదనాన్ని ప్రేమిస్తూ, గౌరవించేవారు.  ఉంటారా?  ఉండరా?  ఉంటే నాకు తెలుస్తారా?  నేను ఇలాగే ఉంటానా?  తెలుగుదనాన్ని నిలబెట్టుకుంటానా? ఈ భయం లోలోపల  పెరిగిపోతూ ఉండగానే సిడ్నీ వెళ్ళి పడ్డాను.   వెళ్ళిన వారం తెలిసిన ఒకరి ద్వారాగా ఈ ప్రైవేట్ చానల్స్ రాకమునుపు మనకి దూరదర్శన్ లో  వారానికొకమారు వచ్చే “చిత్రమాల” వంటిదే అక్కడ ఫీజీ ఇండియన్ కమ్యూనిటీ చొరవతో వచ్చే సినీగీతాల ప్రోగ్రామ్ ఉందని తెలిసి కాస్త ఊరట.   అలా ఒక నెల కి తెలుగు రేడియో కార్యక్రమం “తెలుగువాణి” ప్రతి శనివారం ఉదయం 2 గంటల పాటు ప్రసారమౌతుందని తెలిసింది.  అది లగాయతు పని ఉన్నా పక్కన పడేసో, లేదా ఉదయపు పని పూర్తి చేసుకుని బాసింపట్టు వేసుక్కూర్చుని రేడియోలోకి చెవి నొక్కి మరీ వినేదాన్ని.  పొత్తిళ్ళలో బిడ్డనుంచుకునీ కూడా వదిలేదాన్ని కాదు.  “ఈ వారం ప్రశ్న  అని అడిగేవారు, సరైన సమాధానమిచ్చినవారిలో ఒకరికి బహుమతి ఉండేది.  దానికి సమాధానం చెప్పేవరకు ఊపిరి బిగపట్టుకుని,  చెప్పాక బహుమతి  ఎవరికోనని మరింత బిగుసుకుని గడిపేదాన్ని.  ఆ ప్రశ్నలు-సమాధానాలు వలన ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలిసాయి.  అలా గడుస్తున్న వారాంతాల్లో ఒక ఆదివారం ఒకరి ఇంట్లో నేను మాట్లాడే తెలుగు విని “పై వారం రేడియోలో వార్తలు చదువుతారా?” అని అడిగారు ఆ రోజే పరిచయమైన ఒక వ్యక్తి.  కాస్త మొహమాటంగానే ఒప్పుకున్నాను.  వివరాలు తర్వాత ఇస్తామన్నారు.  చదవటమేగా ననుకున్నాను నిజానికి.   గురువారం నాడు సాయంత్రం ఫోను,  ఫలానా వారిని అడిగి వార్తలు తెచ్చుకుని తెలుగులోకి అనువదించి శనివారం ఉదయం  7 గంటలకి రేడియో స్టేషన్ కు వచ్చేయండి అని.  గుండెల్లో రాయి పడిపోయింది.  సరే తప్పుతుందా మరి! ఆ ఫలానా వారు దిగుమతి చేసిన గత వారం రోజుల ఈనాడు తరహా ఆంగ్ల పత్రిక లోని వార్తలు ముందేసుకుని,  బేరీజులు వేసి,  తెలుగులోకి రాసి, కొన్ని తీసి,  కొన్ని మార్చి, దిద్ది,  మొత్తానికి శనివారం వార్తలు చదివేసాను.  నాకు అలా రేడియో స్టేషన్ లో చదవటం కొత్త.  ఆ అనుభవం నెమరువేసుకుంటుండగానే ఒక ముగ్గురు ఫోన్లు – 1) బాగా చదివారండి; తెలుగు బాగా వచ్చినట్టుందే!  2) ఏమ్మా క్రొత్తవారా?  ఇంతకు మునుపు వార్తలు చదివావా?  3) మానకండి, అపుడపుడూ చదవండి. – సారాంశాలతో.   ఆనాటితో మొదలైన ఉత్సాహమే రేడియో తో పాటుగా, అక్కడి పత్రిక తెలుగు వాహినికి కథలు, కవితలు పంపటం వంటి సరదాలకి,  సభల్లో మాట్లాడటానికి ముఖ్యంగా స్వర్గీయ రామారావు గారికి ఘననివాళి అర్పించటం వంటి కృతజ్ఞతాపూర్వక చర్యలకి,  వేడుకల్లో వ్యాఖ్యత గా వ్యవహరించటానికి మూలమైంది.  7సం.  గడిచిపోయాయలా.  ఈ ఏడేళ్లలో నాకు చాలా కాలం పాటు ఇంట్లో ఇంటర్నెట్ లేదుకనుక ఆన్‌లైన్‌లో మసలుకోవటం అనేది తక్కువ.  ఈవారం” అని వచ్చే ఒక ఆన్లైన్ పత్రిక మాత్రం తరుచూ చదివేదాన్ని.  

సరే, మళ్ళీ పాదాల్లో చక్రాలు తిరిగాయి.  తూర్పు దిక్కు దేశాన్నుంచి పడమటి తీరానికి తోయబడ్డాను.  మళ్ళీ కొత్త సీసాలో పాత సారాలా జీవితం దిద్దుకుంటుండగా 2005 ప్రాంతాల్లో  సంభవించిన ఒక వ్యక్తిగత విఘాతాన్ని తోసుకుని సాగటానికి ఎంచుకున్న మార్గం – సాహిత్యం.  2005-2008 నాటికి స్క్రీన్ మీద ఎక్కువసేపు చదవటం అలవాటు పడ్డా అవన్నీతెలుగేతర రచనలు, లేదా ఈనాడు,  ఆంధ్రభూమి,  వార్తా పత్రికల రచనలు .  ఆ క్రమంలో నా కంట పడింది  మాలతి గారి తూలిక – తెలుగు కథలకి ఆంగ్లానువాదాలు.  అభిమాని లేఖ గా మొదలైన ఆ అనుబంధం మరొక మలుపు కి కారణమైంది.   వదిలేసిన కొన్ని సాహితీ వ్యాపకాలు తలకెత్తుకునే మార్పు సంభవించింది.  ఆ ఆనందపు నావ లో సాగుతున్న నా దృష్టికి తేబడింది వీవెన్ గారి లేఖిని.  వీవెన్ గారికి ఎందరో ఋణపడి ఉన్నారు,  నేనూ ఒకరిని.  ఆ తెలుగులో రాయటం సాధ్యం అన్న హర్షాతిరేక గళం నిదానంగా నా కలం లోకి అక్షరాలుగా చొచ్చుకుని నిద్రాణా నుభూతులను,  నిజ జీవితా నుభవాలను “మరువం  తోటగా వెలికి తెచ్చాయి.   అలా 4సం. క్రితం బ్లాగులోక వాసినయ్యాను.   అప్పుడు తారసపడ్డ అద్భుతమైన బృహత్తర కార్యక్రమం “ఆంధ్రభారతి”.   తెలుగు చదువరులు అంతా చేతులెత్తి మొక్కి,  చేతులు కలిపి నడపాల్సిన యజ్ఞమది.  అక్కడి నిక్షిప్త నిధులను తొణకని ఆసక్తి తో  నిండుగా అనుభవిస్తుండగా,  నా మూషిక వాహన సంచారం (మౌస్ క్లిక్స్)  లో ప్రత్యక్షమైంది  కంటబడింది ఇదిగో  తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం - మీ కోసంఅంటూ మాగంటి వంశీ గారి వెబ్.   వత్తుగా పేర్చిన అల్మారాలో వెదుక్కునే వస్తువు అక్కడి ఏదో ఒక అరలో దొరుకుతుంది.  అప్పుడు మొదలైన అక్కడి సమాచార సందర్శనం ఈవేళ్టిదాకా బెణకలేదు.   నా తెలుగు తృష్ణ కి మూలమని చెప్పుకునే నాలుగూ ఇవి -  తూలిక,  లేఖిని,  ఆంధ్రభారతి,  మాగంటి వెబ్.   ఆ నాలుగు దిక్కుల నిలిచిన నడుమ అభ్యాసానికి కలిసిన వెబ్ పత్రికలు, ఇతరత్రా వనరులు మరి కొన్ని ఉదహరించితీరాలి -  సుజనరంజని,  పొద్దు,ఈమాట, కౌముది, పుస్తకం... "అక్షరచిత్రం, పదనృత్యం, అంతశ్చైతన్యం"  అంటూ సాగిన నా "మరువం"  బ్లాగు అనుభవాలు,  నాలోని కవికి తోడ్పడ్డ పరిచయాలు ఎంతో విలువైనవి,  కానీ, అవి ఈ పోస్ట్ పరిధికి రానివి.  అభిప్రాయాలూ, విమర్శలు పడుగుపేకల్లా నడిచేవి.  అయినా అవన్నీ మునుపట్లో సవివరంగా, సవినయంగా చెప్పేసినవే.  అంచేత ఎక్కువ వివరాలు ఇవ్వను.  అప్పుడు అందిన ఒక ఆశ్చర్యానందపు క్షణం -   ఇది.
  
ఇక ఆ నలుగురు వ్యక్తులెవరననేనా మీరడిగేది.  తొలుత మా హిందీ టీచర్ – సీతారత్నం గారు.  మాలోని అనాసక్తిని పారద్రోలి,ఆటపాటల్లా అధ్యయనం చేయించి, అలవోకగా భాష మీద పట్టు వచ్చేలా కృషి చేసిన గురువు.  సహనం,  శాంతం కలిపి అల్లిన వస్త్రం ఆవిడ మానసం.  

విద్యార్థి గా నా తర్వాతి దశలో “న గురో రధికం” అన్న భయ,భక్తి భావాన్ని,  ఒక విధమైన ఆరాధనతో కూడిన అభిమానాన్ని నాలో కలిగించివారు మా లలిత మేడం గారు.  అందరికీ హడలుపుట్టించే ఆవిడకి కళాశాలలో చేరిన మొదటి రోజు నుండి చేరువ కాగలిగాను.  ఆ చనువు ఇక్కడ మాటల్లో చెప్పలేనిది. ఒక విధమైన ఆకర్షణీయమైన నవ్వుతో, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే మాటతో ఆవిడ నేర్పిన విద్య, తీరు నేను మరువలేను.  ఈ ఇద్దరూ నన్ను చాలా ప్రభావితం చేసారు.   ఆధ్యాపక వృత్తిలోకే వెళ్ళాలన్న నా నిర్ణయాన్ని విధి బలీయత ఐటీ వైపుగా మళ్ళించి ఉండకపోతే ఎలాగ ఉండేదో? 

మూడవ వ్యక్తికి, నాకు  వారధి మా అత్తయ్య.  అత్తయ్య స్నేహితురాలైన ఖజానా గారు తన పిల్లల్ని పెంచుతూ,  మిగిలిన పిల్లల్ని ప్రోత్సాహిస్తూ, ఆర్థిక సహకారం అందిస్తూ, విద్యా బుద్దులనే గాక, సంస్కారయుతమైన నడవడిక, సభ్యత తో కూడిన జీవిక అలవరచటంలో,  స్నేహహస్తాన్ని అందించటంలో ఎలా ముందుంటారు, చురుగ్గా పలు కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు... ఇత్యాది విషయాలు తెలిసాక,  ఆమె ఆ ఎదిగే పిల్లల పట్ల ఎంత కీలకమైన పాత్ర  వహిస్తున్నారో అవగాహన కి వచ్చాక నాలోనూ ఆసక్తి రగిలింది.   

3సం. క్రితం తెలుగు బడి మొదలుపెట్టాను.   ఒక ఏడాది పాటు అన్నీ బడి బ్లాగులో లాగ్ చేశాను కానీ ఆ అవసరం కనపడక ఆపాను.  ముచ్చటగా మూడో ప్రయత్నమైన ఈ బ్లాగు - ఇతరత్రా బడులు, సంబంధిత  విషయాలు అవీ కూడబెట్టాలని ఆలోచనతో - బాలానందం మాదిరిగా మొదలుపెట్టాను. 

చివరిగా తారసపడ్డ నాలుగవ వ్యక్తిని గూర్చి నాలుగు మాటలిక్కడ.  పైన ముగ్గుర్నీ వ్యక్తిగతం, ముఖతహాః ఎరుగున్నాను.  ఈ వ్యక్తిని నేను కలవనేలేదింకా.  కలవగలననీ అనుకోవట్లేదు.  చాలా చిత్రంగా నీకు తెలిసినది ఎంత/ఏమిటి?అని ప్రశ్నిస్తున్నట్టు వచ్చిన వారు శ్రీ జలసూత్రం విక్రమార్క (జవిక్) శాస్త్రి గారు; జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారికి బంధువులు.  వాదిస్తూనే ఆయన లోని భాషాపటిమకి అచ్చెరువు పడేదాన్ని.  తెలుగు మళ్ళీ 'ఓనమాలు' మొదలుకుని చదివి రావాలి అన్నంతగా నాలో పట్టుదల పెంచినవారు.  “గురువు గారు, మీరు ఎవరోగానీ నాకు మంచి స్ఫూర్తినిచ్చారు. చండామార్కుల వారి వలెనో, సాందీపుని మాదిరో కాస్త నాకు మీవద్ద శిష్యరికం చేసే అవకాశం ఇస్తారా? నిజానికి మీ ప్రశ్నల్లనిటికీ ఒకటే జవాబు. నాలో మీరు చూసిన లోపాలు నాకు అర్థమయ్యే రీతిలో చెప్పండి, మీ నిర్వచనానికి తగిన శైలి, భావం, భాష, స్థాయి నేర్పండి. ఈ వంతు మీరు తీసుకుంటానంటే అపుడు చెప్పండి. మీ సవాళ్ళు స్వీకరించి నేను సాధన చేస్తాను. మీకివన్నీ అనవసరం అనుకుంటే ముమ్మారు నాకు సమాధానం ఇచ్చివుండేవారు కాదని నాకనిపిస్తోంది. దక్షిణగా మా తాత ముత్తాతల మాదిరి కావిళ్ళలో నూకల్లో కలిపి కాసులీయను, రూకల బస్తాలు పంపను. నా తర్వాతి తరానికి భాష, శైలి నేర్పుతాను.  అని మనస్ఫూర్తిగా వేడుకున్నాను.

మీరు అడిగిన వంతు నేను తప్పక తీసుకుంటాను. కాపోతే చండామార్కుల వంతూ కాదూ, సాందీపుని వంతూ కాదు, "కవిగండరగండ దుష్కవి కాలభైరవుండ" వంతు మాత్రమే. అమ్మాయిగారండీ - నేను వ్రాసింది అర్థం చేసుకుంటారు అన్న నమ్మకం నిరూపించారు కాబట్టి, అత్తెసరులోని గంజి లోపలికి ఇంకింది కాబట్టీ ఎప్పటిలానే దయ్యపు వ్రాతలే వ్రాస్తాను. విధి విధానాలు మార్చుకోను. మార్చుకోలేను. సరళంగా చెపితే చివరికి పరుషంగా తేలుతుంది. అందుకు! మీ నోట్లో నుంచి ఊడిపడ్డ దక్షిణ మాత్రం అడిగి మరీ తీసుకుంటాను. గుర్తు చేస్తాను. మాట తప్పితే ఎన్నటికీ మర్చిపోను. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మాట ఎలా తప్పారన్న విషయం ఈ గండభేరుండ దయ్యానికి తెలుస్తూనే వుంటుంది. కాబట్టి పారాహుషార్!

ఇప్పుడు చివరిగా మీకో ప్రశ్న - పుటకి ముప్ఫైయ్యారు పంక్తులు, పంక్తికి 45 అక్షరాల చొప్పున రాస్తూ ఉంటే 100 పేజీల పుస్తకం వ్రాయటానికి ఎన్ని గంటలు పడుతుంది ? మీ చుట్టాల్లో (బ్లాగ్ చుట్టాల్లో - ప్రత్యేకించి ఈ చుట్టరికం టపా చుట్టాల్లో) వినేవారి చెవులు ఊర్లో చెరువులో పౌర్ణానికి దీపాల్తో వదిలే దొప్పలు అవటం మూలాన్నూ, చూసే కళ్ళు కత్తిపీట కత్తికి చివర వుండే వంకీలుగా కనపడుతుండటం మూలాన్నూ కొద్దిగా కష్టమే అయినా కావిడిబద్ద తిరగేసి వెన్నుపూస విరక్కొట్టేట్టుగా ఆలోచించి చెప్పండి. “  అని సవాల్ విసిరారు. 
   
ఆ పరిచయం ఉత్తర ప్రత్యుత్తరాలుగా పరిణమించాక వారు ఇచ్చిన అభిప్రాయాలూ,వివరణలూ నాకు చాలానే దోహదం చేసాయి.  అపుడపుడే ఇంకా సాహిత్యపరంగా,  భాషాపరంగా ఏదో చెయ్యాలి అని కలుగుతున్న ఉత్తేజం వారి అభిమాన పూరిత వాక్కులతో మరింత ఉద్దీపితం అయ్యేది.   అయినా ఆ సవాల్ నాకు జవాబు దొరకని ప్రశ్న గానే మిగిలిందిప్పటికీను.  మీలో ఎవరికైనా తెలిస్తే నలుగురికీ పంచండి.

అదండి నా “ఆ నలుగురు”  కథ.

ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహిస్తూ, మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని ఉద్దీపితం చేసే సర్వేశ్వరుని కరుణతో తెలుగుబడి మొదలు పెట్టాను.  విద్యాకైరవానికి కౌముదైన త్రిలోకజనని సరస్వతి కటాక్షం మీపై ఎప్పుడూ ఉంటుంది అన్నారు స్నేహితులు.  సొంత అనుభవాలు, సొంత  అనుభూతులు, సొంత కష్టాలు/సుఖాలు, సొంత ఆత్మకథలు స్థాయి దాటి, పోనీ, వాటితో పాటుగా సార్వజనీనమైన సారస్వతం వైపు దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని మనసుకి తోచిన అనుభవాలు ఇప్పటి కార్యక్రమాలకి పురిగొల్పాయి. రేపు మరి కొన్ని... అంచేతను ఇది సశేషం.

10 comments:

 1. బాగుంది మీ ప్రస్థానం

  ReplyDelete
 2. ధన్యవాదాలు కొత్తపాళీ గారు. నిజమే, ప్రస్థానమే సరైన పదమేమో... ప్రవాసాన తెలుగుదనం అన్నదాని వల్లనే కలిగినా 'బడి' పరిధి కావని వదిలేసిన అనుభవాలు/జ్ఞాపకాలు చాలానే మిగిలాయి.

  ReplyDelete
 3. Uncommon! - How true, how true....Beaten path leads you to the same destination every single time. Step off and you have a new destination. And you are one of that few. Wish many more join your quest. BTW - I did not know that I, rather my website played a part in shaping it. The other 3 are rare gems, very rare. They happen once in a life time. I am happy that my website made it to your list... :) Keep focused and that's all matters. Listen to few, pick two, get to work on the one you like most. That's all I can say. Do what you can, with what you have...Congratulations on your "telugu baDi" work again!

  ReplyDelete
 4. Thank you, Vamsi gaaru. Just to add on, As I am getting more and more involved in this direction I (perhaps anyone on a new path) could experience what Sage Patanjali said of ‘inspiration’ – “When you are inspired by some great purpose, some extraordinary project, all your thoughts break their bonds; your mind transcends limitations, your consciousness expands in every direction, and you and yourself in a new, great and wonderful world. Dormant forces, faculties and talents become alive, and you discover yourself to be a greater person by far than you ever dreamed yourself to be.”

  ReplyDelete
  Replies
  1. ఏమండే మరువం ఉష గారు,


   ఆ పతంజలి వాక్యాన్ని (సంస్కృతం లో నే నా ? ) చెప్ప గలరా ? Curious to see what what the original.


   చీర్స్
   జిలేబి.

   Delete
  2. జిలేబి గారూ, నాకు సంస్కృతం లో ప్రవేశం లేదు. నాకు పతంజలి యోగి పరిచయం సహజ్మార్గ్ ధ్యాన మార్గం వలన; నేను చదివినవన్నీ మా గురువుల హిందీ రచనలకి ఆంగ్లానువాదాలు లేదూ వెళ్ళిన వర్క్ షాపుల్లోని మటీరియల్స్, ఆన్లైన్ స్టఫ్. మీరు ఎరుగుంటే తెలుపండి.

   Delete
 5. ఉష గారూ...స్ఫూర్తి నిచ్చిన జ్ఞాపకాలని మాతో పంచుకున్నారు. చాలా బావుందండీ...

  ReplyDelete
 6. జ్యోతిర్మయి గారూ, ధన్యవాదాలు. "ఉపాధ్యాయుడు తరగతి గదిలో అధ్యయనానికి ఉపయోగపడే తరగని గని." అన్నది నా నమ్మిక. అటువంటి గురువులు, గురుభావనకి అర్హులైనవారు తారసపడటం నా అదృష్టం. నా స్ఫూర్తికి హేతువులు ఇక్కడ రాసినవి.

  ReplyDelete
 7. శుభాభినందనలు, ఘనాభివందనములు.

  ReplyDelete
  Replies
  1. ఊకదంపుడు గారూ, ధన్యవాదాలు.

   Delete