అక్షరమా నీకు వందనం!

“మీరు తమిళులుగా పుట్టినా తెలుగు భాష అంటే ఇంత అభిమానం ఉండేదా?” అని స్నేహితులొకరు నన్ను ప్రశ్నించారు. నా సమాధానం లేదు, ఇది నా మాతృ భాష. తెలుగుని గౌరవిస్తూ, తెలుగు మాటని తృప్తిగా వాడటం నా వరకు మా అమ్మ పెట్టిన పెరుగన్నం తిన్నంత కమ్మన.” కనుక నేను తెలుగమ్మాయిని, తెలుగమ్మని ఇప్పటికి, తెలుగవ్వనీ అవుతాను ఒకప్పటికి.
తెలుగు భాష – అమ్మ భాష అంటూ మాధవరావు గారు రాసిన పాట (బాణీ కట్టి పిల్లలకి నేర్పాలని అనుమతీ తీసుకున్నాను), దీనికి ముందు రాసిన నా పోస్ట్లో రసజ్ఞ గారన్న “అదేదో పరాయి దేశం వాడు మెచ్చుకుంటే తప్ప మన మాతృ భాషకున్న విలువ తెలుసుకోలేని స్థితిలో ఉన్న వారున్న ఈ రోజుల్లో…” అన్న మాటల వెంబడి, అలా అలా తలపోతల్లో 02/11/2010 నాడు రాసిన కవిత స్ఫురణ కి వస్తే అది నా పాత బ్లాగు నుంచి ఈ బ్లాగుకి తెచ్చాను. యధాతధంగా పెట్టేసాను. తెలిసిన భాషని పదుగురుకీ పనికి వచ్చేలా తీర్చి దిద్దాలని, పంచాలన్నదే నా ఆకాంక్ష. పరభాషలకు వ్యతిరేకిని కాను, మాతృ భాషాభిమానిని.
మీ ఉష.
02/11/2010: 08:25:00 PM
అనుచితపోకడల్లో చిక్కిన అక్షరానికి నా వంతు వందనం సమర్పిస్తూ...
సరస్వతీదేవిని ఒక్కసారి ఇలా అభిషేకించాలని..
మరి నలుగురు పఠిస్తే ఆ తల్లికి సేవ.
*************************
అమృతం సేవించకనే చిరాయువువి
ఆదిపరాశక్తిని నుతించగ కనకధారవి

ఇహము పరము ఎరుక పరచగ పదసోపానివి
ఈశ్వరుని కనులెదుట నిలిపేటి జ్యోతివి

ఉత్తుంగ తరంగమైనా, ఉప్పెనవైనా నీకే చెల్లు
ఊహాతీతలోకాన కదనాశ్వానివి నీవు

ఋషీశ్వరుల తూనిక జార్చిన స్వర్ణాభరణం నీవు

ఎన్నో చరితలు చెప్పినదానవు
ఏ యుగానైనా జాతి మనుగడ నీవు కూర్చేడి భాషే
ఐహిక జీవిత పరమార్థ బోధనకీ నీవె మూలాధారం

ఒద్దిగ్గా నీవమరిన వాక్యం అపురూపం
ఓంకారాన ఒదిగింది, ఓరిమి బోధించినది నీ అల్లికలే
ఔన్నత్యం పదంలోనేనని చూపిందీ నీవే

అందమైన మనసుని పరచగ ఆలంబన నీవే
అచ్చుల్లో, హల్లుల్లో భావావేశాలు పొదగనీ
నీ అమర చిత్రం నను మరోమారు దర్శించనీ

సరిగమల అలరింపుల్లో నర్తించావు
తకధిమితోం పాద కైతల్లో నడయాడావు
సెలయేటి పాటల్లో ఈదులాడావు
సంద్రపు అలలంటి కావ్యాల్లో కదలాడావు

నీ దివ్య తేజసుని మాకు అనునిత్యం ప్రసాదించు
క్షమనొసంగి మనిషి అల్పగుణాన్ని అంతమొందించు
పలుకున, పదమున నిను ధ్యానించు ఇంగితమివ్వు
నాగరికత కి ఆలంబన అక్షరం అని నినదించనీ

విచ్చుకత్తులు రువ్వేటి వికృతభావనల్లో అలిసావా
మనసుని పొడిచేటి శూలమయ్యానని వగచావా
అమానుష కలానికి చిక్కానని వణికావా
నీ స్వేచ్ఛనదిమేటి కుయుక్తి నిలబడునా కలకాలం

కవాటాలకి కళ్ళెం వేయగవారెవరు
గవాక్షాలు మూయగల శక్తులేవి
అక్షరజ్యోతికి చమురులేనిదెక్కడ
కవితామతల్లికి పూజలందనిదెన్నడు

**********************

బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్
కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్
హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజ దార సుతోదర పోషణార్థమై !!
కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భరతీ !!
పదం పర గతమై రాజుల చేతిలో ఇచ్చి తన కూతురు వంటి కావ్య కన్య ను రాజుల చేతిలో పెట్టి డబ్బు తీస్కోవటం ఆ పడుపు కూడు కంటే వ్యవసాయం చేసుకుంటూ వుండటం మేలని పోతన గారి పద్యం.

ఆయనకు ఒక రాత్రి సరస్వతి కనపడి ఏడ్చిందట ఇలా నన్ను ఎందుకు ఇలా అమ్ముకుంటున్నావు అని.

ఎందుకో మనసులో అది తోచింది.

13 comments:

  1. ఉష గారూ , మీ "మాతృ భాషాభిమానానికి" మనసు పులకించింది .


    తెలుగు నాట బలుకు తియ్యని మాటతో
    తెలుగు బ్లాగులు కొల్వు దీర వలయు !
    తెలుగు జాతీయాల తియ్యం దనాలతో
    తెలుగు బ్లాగులు కొల్వు దీర వలయు !
    తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ
    తెలుగు బ్లాగులు కొల్వు దీర వలయు !
    తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ
    తెల్గు బ్లాగులు కొల్వు దీర వలయు !

    కూడి పండితుల్ దలలూచు కొరకె గాక
    తెల్గు లందరి కందంగ దివురు నటుల
    తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ
    తెలుగు బ్లాగులు కడు కొల్వు దీర వలయు !

    ReplyDelete
    Replies
    1. లక్కాకుల వెంకట రాజారావు గారూ, అశువుగా పద్యాలు రాసేస్తున్నారు. అసలీ మధ్యన పద్య సంబంధిత బ్లాగుల కళకళలు బాగున్నాయి. వందనాలు. మీరన్న తెలుగుదనమే నాకూ ఇష్టం, కేవలం భాష కాదండి. అన్నిటా ఇది మన(దైన) పద్దతి అన్నది నాకు ప్రీతికరం, మూఢాభిమానిని మాత్రం కాదు సుమా!

      Delete
  2. ఉష గారూ, "అక్షర వందనం" బాగుంది. తెలుగు వారే తెలుగు మాట్లాడటం అవమానంగా భావించే ఈ రోజుల్లో తెలుగు పట్ల మీకున్న మక్కువ, తెలిసిన భాషని పదుగురికీ పంచాలనే మీ తాపత్రయం అభినందనీయం. "పడుపు కూడు భుజించుతకంటే సత్కవుల్ హాలికులైననేమి?" అద్భుత వ్యక్తితం పోతన గారిది. ఆ మహానుభావుణ్ణి గుర్తు చేసినందుకు కృతఙ్ఞతలు.
    నాకూ తెలుగు భాష పట్ల మక్కువ, తెలుగును అభిమానించే వారి పట్ల అభిమానం. తీరిక సమయంలో రాస్తుంటాను. మీకు సమయం దొరికితే నా బ్లాగ్ చూడండి.

    ReplyDelete
    Replies
    1. మిరజ్ ఫాతిమా, మీ అభిమానానికి చాలా సంతోషం. మీ బ్లాగు చూసానండి, కానీ మళ్ళీ తీరిగ్గా చూడాలోమారు.
      పద్మార్పితా, ఎంత శ్రద్దగా అందరినీ ప్రోత్సాహిస్తూ ఉంటారు మీరు అనుకుంటుంటాను. థాంక్స్!

      Delete
  3. మీ అక్షర వందనం....
    మీ అభిమానానికి పరాకాష్ట!

    ReplyDelete
  4. పని సమయం కదా. మీ కవిత మొత్తం చదవటానికి వీలు చిక్కదు. వీలు వెంబడి చదువుతానండి.
    తెలుగు అన్నమాట వినబడగానే నా ఒళ్ళు రోమాంచితమౌతుంది. తెలుగును మీరు అభిమానిస్తున్నారు. అది చాలు నాకు.
    మాతృ భాషకాకపోయినా తెలుగును అభిమానించే వారికీ కొదవలేదు. బ్రౌన్ గురించి విన్నారు కదా? అలగే అప్పయ దీక్షితులు (తమిళుడు) అన్నమాట చిత్తగించండీ "ఆంధ్రత్వ మాంధ్ర భాషా చ నాల్పస్య తపసః ఫలమ్" అంటే "ఆంధ్రుడుగా పుట్టటం, ఆంధ్రభాష అబ్బటం అనేవి సామాన్యమైన తపస్సుకే దక్కే వరాలు కావు" అని అర్థం అండి.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ, ఇప్పటి స్థితి గతులననుసరించి “మాతృభాషనైనా గౌరవించండి, పరభాషా వ్యామోహం తగదు.” అన్నది నా అభిప్రాయం. ఇతర భాషాభిమానానికి నేనూ సిద్దమే, నేర్వాల్సి రావటమూ అనివార్యమే కదా? తెలుగేతరుల అభిమానం హర్షనీయం. అప్పయ దీక్షితులు గారి మాట పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇదివరలో వారిని గూర్చి కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతుల చెప్పిన తెలుగు భాష విశిష్టత అన్న టపాలో (http://sureshkadiri.wordpress.com/2010/05/17/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A4-%E0%B0%95%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF/) చదివి పదిలపరుచుకున్నాను వివరం. ఇవాళ మీ ప్రస్తావనతో మళ్ళీ వెదికి ఆంధ్రుల ప్రశంస - http://languageengineering.blogspot.com/2005/07/blog-post_112020679477686901.html - లోనూ అప్పాయ దీక్షితుల గారితో పాటుగా ఇతరుల అభిప్రాయాలూ చదివాను, అదీ బాగుంది.

      Delete
    2. ఉషగారూ,
      మీరిచ్చిన మెదటి లింక్ సరిగా వ్రాస్తే http://sureshkadiri.wordpress.com/2010/05/17/తెలుగు-భాష-విశిష్టత-కంచి
      Tip: యధాతథంగా Browser నుండి cut & paste చెస్తే చదువ శక్యం గాకుండానే వస్తుంది. అలాంటప్పుడు notepad లో తిరిగి సరిగా type చేస్తే సరిపోతుంది. దానిని ఒకసారి browser లో check చేసుకుంటే చాలు. ఇక్కడ ఇచ్చిన పూర్తి శ్లోకం సంతోషం కలిగించింది. ధన్యవాదాలు. రెండవ link content చాలా బాగుంది - యెన్నో విశేషాలతో.

      Delete
    3. Thanks for your tip, శ్యామలీయం గారు.

      Delete
  5. అద్భుతం...మీ అక్షరాలు.
    ఇంపు కల్గించాయి.
    అభినందనలు.....

    ReplyDelete
  6. మీ అక్షరహారతి భాషాభిమానులను పులకరింపచేస్తుంది. మీ పదవిన్యాసమాల చదువులతల్లి గళాన అక్షర కదంబమాల.

    ReplyDelete
  7. అక్షరమక్షరం నిత్య సత్యం .చాలాబాగా వ్రాసారు కవిత

    ReplyDelete
  8. Dr PULIPATI GURUSWAMY గారు, C.ఉమాదేవి గారు, రవిశేఖర్ గారు, మీ భాషాభిమానపూర్వక వాక్కులకి నమస్సులు. ఆ భారతి కరుణా కృప కటాక్షాల్లో అందరం తరించాలిలా ఎప్పటికీను. ఎపుడో విన్న (యుగళ గీతమే అయినా) ఒక పాట లో ఈ ఒక్క పదాలల్లిక నాకు చాలా ఇష్టం 'భారత భారతి పద సన్నిధిలో, కులమత సాగర సంగమ శ్రుతిలో...'

    ఇక ఇవాళ పొద్దు పొద్దున్నే పాటలపల్లకి ఎక్కిన నా మనసు - పాడుకుంటున్న సినారె గారి పాట - కొందరికి గుర్తుచేస్తూ...

    http://geetalu.blogspot.com/2011/05/blog-post_23.html

    లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
    లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
    మధుర భారతి పద సన్నిధిలోమధుర భారతి పద సన్నిధిలో
    ఒదిగే తొలి పువ్వును నేను ఒదిగే తొలి పువ్వును నేను

    ఏ ఫలమాశి౦చి మత్తకోకిల ఎలుగెత్తి పాడునూ
    ఏ ఫలమాశి౦చి మత్తకోకిల ఎలుగెత్తి పాడునూ
    ఏ వెల ఆశి౦చి పూచే పువ్వు తావి ని విరజిమ్మును
    ఏ వెల ఆశి౦చి పూచే పువ్వు తావి ని విరజిమ్మును
    అవధిలేని ప్రతి అనుభూతికి అవధిలేని ప్రతి అనుభూతికి
    అత్మాన౦దమే పరమార్ధ౦

    ఏ సిరి కోరి పోతన్న భాగవత సుధలు చిలికి౦చెనూ
    ఏ సిరి కోరి పోతన్న భాగవత సుధలు చిలికి౦చెనూ
    ఏ నిధి కోరి త్యాగయ్య రాగజలనిధులు పొ౦గి౦చెనూ
    ఏ నిధి కోరి త్యాగయ్య రాగజలనిధులు పొ౦గి౦చెనూ
    కమనీయ కళావిష్కృతికి కమనీయ కళావిష్కృతికి
    రసాన౦దమే పరమార్ధ౦

    లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
    మధుర భారతి పద సన్నిధిలోమధుర భారతి పద సన్నిధిలో
    ఒదిగే తొలి పువ్వును నేను ఒదిగే తొలి పువ్వును నేను

    ReplyDelete