తెలుగుతల్లికి మల్లెపూదండ, పంతులమ్మకి పటికబెల్లం“భారతావని జన్మమందిన భవ్య భారత బాలలం...” వింటూంటే మనలో కొందరికైనా చిన్ననాటి దేశభక్తి గీతాలాపనల జ్ఞాపకాలు, వాటి తాలూకు తన్మయత్వం కలుగదూ? ఇంచుమించు అదే స్థితికి తీసుకువెళ్లారు నా బడి పిల్లలు, “తెలుగక్షరాలు కలకూజితాలు వాగ్దేవి వీణాస్వరములు” అని పాడుతూ నర్తిస్తూ. అసలు వాళ్ళనేకన్నా నేనే వెళ్ళాను అనవచ్చును. మూడేళ్ళ నాడు నా తెలుగు బడి మొదలుపెట్టినపుడు అనుకున్నట్లుగానే ఇంతదాకా నడపగలిగాను. ఏమి నేర్పాలి, ఎలా నేర్పాలి అన్నవి పూర్తిగా నా ఆలోచనలోనే రూపు దాల్చాయి.

తొలినాళ్ళలో - అప్పట్లో నా కవిత నొకదాన్ని ఘాటుగా విమర్శిస్తూ వచ్చినా తదుపరి కాలం లో - నా బడి విషయకంగా జలసూత్రం విక్రమార్క శాస్త్రి - జవిక్ శాస్త్రి మాస్టారు (పూర్తి వివరాలు తర్వాతి టపాల్లో) కనబరిచిన శ్రద్ద, అలాగే అవటానికి ఐటీ రంగాన స్థిరపడినా విశ్వవిద్యాలయాల్లో బోధన చేస్తూ, తెలుగు సాహిత్య రచనలు, సమీక్షలు, పరిశోధనలు, వ్యాసాలు గరిపే స్నేహితులొకరు నా బడి తొలి బ్లాగులో ఇచ్చిన వివరాలు, పద్దతులు అవీ చదివి
"some of your teaching techniques are very innovative and interesting."
అంటూ ఇచ్చిన అభిప్రాయం తగు ప్రోత్సాహాన్నిచ్చిన విషయాల్లో కొన్ని. పోయిన ఆదివారం మా తొలి సాంస్కృతిక ప్రదర్శన ముగిసింది. మచ్చుక్కి కొన్ని చిత్రాలు ఇస్తున్నాను. ఇవి మా సంబరాల చిహ్నాలు.
గురుస్తోత్రం పఠించటానికి సిద్దపడుతూ...
ప్రదర్శన ముగిసాక ధన్యవాదాలు సమర్పిస్తూ...

తీపి గురుతుల పటికబెల్లం పలుకులు పంచుకుంటూ...
ఇన్నాళ్ళ స్మృతులు రాసుకోవాలి. అవి నా పిల్లల భావి దశలో నెమరువేతకీ ఉపయోగపడాలి. అపుడు మీకూ చెప్పకనే చెప్పేస్తానుగా. అందాకా ఆగండి మరి!

13 comments:

 1. శుభం.ఇంతింతై వటుడింతై,అంతంతై,ఇంకెంతో అయేలా వృద్ధిచెందాలని ఆశిస్తూ అభినందనలు.

  ReplyDelete
 2. ఉషాగారూ మీ ప్రయత్నానికి జోహార్లు. భాషాభివృద్దికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీ పిల్లల కార్యక్రమాలు చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. మీకు కుదిరితే వీడియోలు పెట్టగలరు. తెలుగు బడి ముచ్చటగా మూడేళ్ళు పూర్తుచేసుకున్నందుకు గట్టిగా చప్పట్లు.

  ReplyDelete
 3. పంతులమ్మ గార్కి పటిక బెల్లము లేమి ?
  పసిహృదయపు సిరుల భాగ్యములకు ,
  ముద్దు ముద్దు పలుకు ముత్యాల దండల
  కన్నిటి కధికారి యామె కాద ?

  ReplyDelete
 4. అక్కడి పిల్లల్లో మాతృ బాషను అద్భుతం గా ప్రోత్సాహిస్తున్నారు.మీ కృషి అభినందనీయం.

  ReplyDelete
 5. శ్రీనివాస్ పప్పు గారు - ధన్యవాదాలు. పుట్టింటి పట్టుచీర లా మా గోదారోళ్ళ అభినందనలు హాయినిచ్చాయి. :)

  జ్యోతిర్మయి గారు - తప్పక అన్నీ వివరాలు వీలే వెంబడి ఇస్తానండి. మీరు తెలుగుబడి నడుపుతున్నారనుకున్నాను. నిజానికి ఆ సమాచారం కూడా పోగేస్తున్నాను. ఏమో, ఒకానొక రోజు మన అందరి ప్రయత్నాలు వెరసి పెద్ద ప్రణాళికగా రూపుదాల్చవచ్చు.

  ReplyDelete
 6. లక్కాకుల వెంకట రాజారావు గారు, నిజమేనండి. ఆ పసి మనసుల ముద్దు పలుకుల ఎనలేని కానుకలే నాకు వెలకట్టలేని కానుకలు. మీ పద్యరచనా పటిమకు వందనాలు.

  ఒద్దుల రవిశేఖర్ గారు, నిజమేనండి, మా అమ్మానాన్నలు, గురువులు మా చిన్నతనాన తెలుగుతో పాటుగా ఆంగ్లం, హిందీ నేర్పటానికి పడ్డట్టే ఇపుడు వీళ్ళకి తెలుగు నేర్పాలని ఈ పాట్లు/కృషి. ధన్యవాదాలు.

  ReplyDelete
 7. అభినందనలు.....పిల్లలకు - మీకు.....

  పఠించిన గురుస్తోత్రం ఓ సారి వినిపించండి...లేదా పాఠం ఇక్కడెయ్యండి.....అవునూ మిక్కీ మౌస్ టొపీ పెట్టుకున్న అబ్బాయెవరు? తెలుగు పిల్లలంటే మిక్కీ మౌసుకు కూడా ఇష్టంలా ఉన్నట్టుంది....

  ReplyDelete
 8. అదేదో పరాయి దేశం వాడు మెచ్చుకుంటే తప్ప మన మాతృ భాషకున్న విలువ తెలుసుకోలేని స్థితిలో ఉన్న వారున్న ఈ రోజుల్లో మీ కృషికి జోహార్లు. తెలుగు బడి నిర్విరామంగా, దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....

  ReplyDelete
 9. మేము స్వయం గా చూసి చాలా సంతోషించాము. చిన్నప్పటి స్మృతులతో ఆనందం చెందాము. ఉషా గారికి కృతఙ్ఞతలు!
  ఉమేష్, వసంత

  ReplyDelete
 10. వంశీ గారూ,

  ఆ వివరాలు తప్పక ఇస్తాను త్వరలో. ఈ పిల్లకాయల పాత్రలు, తగు వస్త్రాలంకరణ నాకొక పెద్ద సమస్య అయింది నిజానికి, ముందుగా అనుకోలేదు కనుకా, చిన్న ఊరు కనుకా ఉన్నంతలో దగ్గరగా ఉండేలా చూసుకున్నాను. వాడు పిట్టలదొర పగటివేషగాడు. :) వేటకి వచ్చాడు.

  ReplyDelete
 11. రసజ్ఞ, రాయబోయే బడి ఊసుల్లో ఒకటి మీరన్న అంశం. మీరిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

  ఉమేష్ గారూ, వసంతా - ఇది మాత్రం అచ్చంగా నాకు ఆశ్చర్యానుభూతిని ఇచ్చిన వ్యాఖ్య.

  ReplyDelete
 12. ఉష గారు,
  తెలుగు పట్ల మా అభిమానం ప్రశంసనీయం...మీ తెలుగు బడి దిన దిన ప్రవర్ధమానమై వెలగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ..నాగిని.

  ReplyDelete
 13. You are a gift to the Telugu and please do continue and spread the good.

  ReplyDelete