వాస్తవానికి తన పేరే వాస్తవం, తన తీరేమో అమరం!

వాస్తవానికి నిజంగా తన పేరే అది,
అయినా ఇంకొన్ని మాటలు చెప్పాక కానీ మీరొల్లనంటారని,
మాటవరసకి కాక మనసు పెట్టి కాసినన్ని
అనుభవమైన వైనాలు కలిపి మీతో నిజమేననిపిద్దామని ఇలా...

పంచభూతాలతో మరంత సన్నిహితముందేమో!
భూమంత ఓర్పు కావాలి నీకు,
ఆకాశమంత శోధన చేయాలి నీవు,
నీరు కారిపోని జవసత్వం వుండాలి నీకు,
అగ్ని సామ్యమైన వేదన పడాలి నీవు,
గాలి దుమారమంత వేగం నీజీవనపయనమంటూ పోలికలుతెస్తది.

ఋతువులూ తన నేస్తాలేమో!
తను చెప్పిన రీతిలోనే వచ్చిపోతుంటాయి.
సంతసం వసంతంలా ఇట్టేవచ్చి అట్టే జారుకుంటది.
మనస్తాపం గ్రీష్మంలా కాల్చేస్తది.
దుఃఖం వర్ష ఋతువులా గుండె లోగిల్ని వరద పాల్చేస్తది
శరత్, హేమంత శిశిరాలు మిగిలన్నిటా తామున్నాయంటవి.

ఇంద్రచాపం వోలె ఎపుడూ జీవితాన్ని దిద్దమని రంగవల్లిగా,
కాలచక్రం మాదిరి జీవనాన్ని పోల్చమని రంగులరాట్నంగా,
ఆరోప్ర్రాణం తీరున ఆశయాలు, ఆశల్ని అద్దమని తళుకులుగా,
తెలియచెప్పే, మరణం తప్పని నా జన్మలో అనుక్షణం అరుదెంచే అమరం, ఈ "వాస్తవం"

11 comments:

  1. ఋతువుల గురించి బాగా రాసారు. కానీ శరత్ , హేమంత, శిశిరాల గురించి ఏమీ రాయలేదెందుకు.
    నా ఊహ,
    ఆత్మ సాక్షాత్కారం శిశిరంలా మనసులోపలి తప్పుడు భావనలు రాల్చేస్తుంది
    ఇక మిగిలిన వాటినేమనాలి????
    ఇక మరణం గురించి నేను "ఎవరామె" అని ఒక కవిత రాసాను, చదివి మీ అభిప్రాయం తెలుపగలరు (http://pradeepblog.miriyala.in/2009/01/blog-post.html)

    ReplyDelete
  2. ప్రదీప్,

    మీ కవిత చదివాను, ఒక్కసారిగా మదిలో చిత్రంగీసేసి నాతో మరో నాలుగు పంక్తులు వ్రాయించిన నిండు ఉత్ప్రేరణుందందులో. స్పందన తీవ్రమైనప్పుడు అలా కవితగా వెల్లువౌతుంది, మీ భావనని అది పలుచన చేయదనే నమ్మకం. అలాగే ఆ వ్యాఖ్యని తొలగించే సర్వ హక్కులూ మీవే!"

    ఇకపోతే, ఆ మిగిలిన మూడు ఋతువుల్లో ఆత్మవిమర్శ, ఆత్మనింద, ఆకు రాలినట్లు గోచరించే ఆరంభశూరత్వం, అవి రాలినట్లే సర్వం ధారబోయగల దాత్రృత్వం, మోడువోలె నిలచి తిరిగి ఆశటూపిరుల చివురువేసే శిశిరలోని వృక్షాలు, స్నేహితం, లక్ష్యం, గమ్యం.. ఇలా ఎన్నో వేల భావనలు ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిబిక్కిరిచేస్తే ఆ క్షణం అనిపించింది - చదువరుల మనసు గారడికి ఈ వైనం ఎందుకు వదిలేయ్ కూడదూ, చూద్దాం ఎవరి పలుకు ఏమని గుట్టు విప్పుతుందోనని. అలాగే మీ వూహ వాకిలి దాటి ఇదిగో ఇలా కూడలికొచ్చి నిలబడింది. చాలా చక్కగానూ వున్నది. తొలి వ్యాఖ్యతో ఇంత చక్కని అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. చాలా చక్కని కవిత్వం.

    ReplyDelete
  4. చాలా బాగుంది ఉష గారు, ప్రదీప్ గారి కవిత కూదా చాలా బాగుంది ఒక సారి చదవండి ..నే చదివాను అది :)

    ReplyDelete
  5. దుర్గేశ్వర గారు, మీ వ్యాఖ్యవంటి ప్రశంసకు మీకు నా ధన్యవాదాలు


    నేస్తం, ఇటువైపు రావటం మానారంటే మరువం బెంగపడతదని గుర్తున్నందుకు + వ్యాఖ్యకు మీకు ధన్యవాదాలు. ప్రదీప్ గారి కవిత చదవటం, స్పందనగా నేనో నాలుగు పంక్తులు వ్రాయటం, తన ఆమోదం పొందటం ఇవన్నీ నిన్నే జరిగిపోయాయి, ఈపైన రెండో వ్యాఖ్యలో ఋజువు కూడా వుంది. టీచరు గారు, ఇక pending homework లేదు. ఇంకేమైనా ఇస్తారా మరి? ;)

    ReplyDelete
  6. ఇంత తక్కువ సమయంలో.. చక చకా.. ఇన్నిన్ని భావాలని మీ మరువపు తోటలో ఎలా గుమ్మరించేస్తారండీ బాబూ..!
    నాకైతే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది తలచుకుంటే :)

    ReplyDelete
  7. మరువాన్ని మరువడమా ఒకసారి ఈ రోజు రాసిన టపా చదవండి :)

    ReplyDelete
  8. మధురా, మీరు మరీను, మీ మబ్బుల్లో విహరించాక ఇటువంటి వాస్తవాన్ని జీర్ణీంచుకోవటం కష్టం. అందుకే మనం సమవుజ్జీలం. ఇకపై అలా సాగిపోదాం ;)

    నేస్తం, ఆవకాయ పెట్టక మునుపు, ఇంకా టెంక పట్టని కాయలతో జీడావకాయ అని చేస్తారు. అది చాలా రుచిగా వుంటుంది, మీ ఈ టపా దాన్ని జ్ఞప్తికితెచ్చింది. ఈ ఒక్కమాట నా భావాన్ని మీకు తెలిపిందనుకుంటా. మన తెలుగు నాట అందునా గోదావరి జిల్లాల్లో ఆవకాయ ఎంత ప్రీతిపాత్రమైనదో మీకు తెలుసు కదా!

    మా నాన్న గారు అలాగే కబుర్లు చెప్పేవారు, ఇప్పటికీ సగం ఫోనులో సంభాషణ అదే ధోరణిలో సాగుంతుంది. పైగా ఎన్నెన్నో క్రొత్త పద్ధతలు ఆరోగ్యానికి మంచివి, సంస్కృతికి సంబంధించినవి, పద్యాలు వల్లెవేయించటం, భజనలు చేయించటం, పాటలు పాడించటం, తనువేసిన నాటకాలు అభినయించిచూపటం, హిట్లరంత నిరంకుశత్వం (ప్రేమ చూపటంలోనే సుమీ!)..చెప్పాలంటే ఈ టపాకన్నా ఎక్కువౌతది - ఆయన పాత్ర నిడివి చాలా ఎక్కువ. అమ్మది మౌనం, వంట, వినటం వంటి పాత్ర. ఆ రెండిటి మధ్యనా నాన్నగారి ఏకైక చెడు లక్షణం కోపాన్ని నేనూ సగం పుణికిపుచ్చుకుని అచ్చంగా ఇపుడు నా పిల్లల్ని ఆయన్ని అనుసరిస్తూ పెంచేస్తూ, అమ్మ నాకు friend అనిపించుకుంటాను అస్తమాను.

    ఇకపోతే మన్మధుడు సినిమాలో ఒక సన్నివేశం వుంది - కోటా శ్రీనివాస రావు, బ్రహ్మానందం చేత పదే పదే ఒక dialogue "ఈ వయసులోనే ఇలా వుంటే.." అన్నది తన స్టాఫుకి చెప్పిస్తాడు. అలా మీరు నా పట్ల వ్రాసిన ఆ భావాన్ని నాకతి సన్నిహితమైన అందరకూ చూపి ఆ రెండు పాత్రల్నీ నేనే అభినయించేసుకున్నాను. కొన్ని భావనలు పూర్తిగా మాటల్లో వ్యక్తపరచలేము. ప్రయత్నించినా కొంతే పొందుపరచగలం. ఇదీ అంతే, అందుకే ఆ చిక్కని సంతసాన్ని, ఆకసమంత సంతృప్తినీ, మీవంటి నేస్తాన్ని అన్నిటిని నా గుండెలోనే పదిలపరుచుకుంటున్నాను. మీకు పలు మార్లు చెపాను, మీ వ్యాఖ్యలేని నా టపాలు తక్కువ, అవి చాలా బేలగా కనిపిస్తాయి నాకు, మీ మాటల భరోసా లేకనేమో.

    మరోమారు హృదయపూర్వక దన్యవాదాలు.

    ReplyDelete
  9. ఉష మీ కవిత అర్ధం చేసుకోటానికి సమయం పడుతుంది కాని, చాలా బాగుంది. సరేగాని, మన్మధుడు లో కోట బ్రహ్మానందం సీను ఎక్కడండి బాబు.

    ReplyDelete
  10. జన్య, మీ వ్యాఖ్యవంటి ప్రశంసకు మీకు నా ధన్యవాదాలు.

    అయ్యో రామా, అది "సంతోషం" లోనండి. బుర్ర, బుద్ధి బాగా మందగించిపోయాయి :( సరైన సమయానికి గుర్తు చేసారు

    ReplyDelete
  11. కవితా జ్ఞానం అంత లేదు గాని, కొద్దో గొప్పో సినిమా జ్ఞానం ఉంది లెండి :)

    ReplyDelete