దయార్ద్ర దృక్కు

అంతదాకా జరిగిన ఘటనలు మర్చిపోయాను
నిజానికి గుర్తుండేవేవీ జరగనూ లేదీ రోజు.

ఆ చిన్ని కళ్ళ కాంతికి-
మా నడుమ దూరమే
నీడగా నా మీద వాలినట్టుగా ఉంది
అలవాటైన అలవోకడతో అమ్మ భుజమెక్కి
నాకోసమో ఆత్మీయ కరచాలనం అందిస్తూ...

'బుజ్జితల్లి' అవును అచ్చంగా అదొక 'బుజ్జితల్లి'
బారలు జాపిన నా చేతుల్లో ఆ బుజ్జాయి
అనుకోకుండా ఆకాశం లోకి చూసాను
ఏ దేవతా పుష్పం రాలిపడిందోనని అబ్బరంగా

బుల్లి పాదాల కేళికి పరవశించి
ఉయ్యాల పరుపుగా మారిపోవాలని ఊహ కలిగింది
గుప్పిళ్ళు కూరిన నోట సొంగ, చొల్లుమాటలు
ఒకదాని వెంట ఒకటి, చెప్పలేని హాయి
అందినంతవరకు అద్దుకున్నాను అత్తరులా
పాపాయ్ బట్టలు పదే పదే తడుముకున్నాను
ఎందుకో తెలియదు, అమ్మ స్పర్శలానే ఉందనిపించింది

"బుజ్జితల్లి" నా పిలుపు నీకు నచ్చినట్లేనా,
నా మాటలన్నీ అర్థమైనట్లు నిక్కి చూస్తున్నావు?
రవ్వంత కాలం నా బతుకున మెసిలిన ఆత్మబంధువా
నీ నవ్వుల లోకాన నన్ను నిలిపిన బుజ్జితల్లీ
ఆపుడపుడూ ఇలా పలకరించిపోవే
ఈ రూపున కాకపోయినా, ఇంకొక చిన్నారిగా...

నిజానికి నీ కళ్ళు నాకు పరిచయమే
ఆ కళ్ల లోని దయ కొరకే అన్వేషిస్తాను
నిరంతరం తపిస్తాను
ఇంతకు మించి ఒకరికొకరం ఏమీ చెప్పుకోవద్దు
ఈ రేయికి తలుచుకోను ఇపుడు నీ జ్ఞాపకం ఉంది నాకు.

(మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు, కానీ ఆదరం గా ఆదమరిపించిన ఆ చంటిపాప మిగిల్చిన అనుభూతికి కృతజ్ఞతగా.)

వింటున్నావా?

పున్నాగ బూరలు ఊదుతూ,
పారిజాతం రాలిపడుతూ
పరిమళం పంచిపెడుతున్నాయి-
ఆవరణ అంతా మేని పులకింతలే.

చిటారు కొమ్మన సీమచింత,
కావేసిన మావిడి పంట
నోరూరిస్తున్నాయి-
చావిడి నిండా చాపిన చేతులే.

గోడ మీదుగా లావాదేవీలు
ఇటు ముంజెలు అటుగా,
అటు మొగ్గలు ఇటుగా మారకం.

ఒప్పులకుప్ప, తొక్కుడుబిళ్ళ
ఆడనంటే చెల్లదక్కడ,
పూలజడ చెదిరితే ఒప్పుకోరిక్కడ
తేలని లెక్కల్లో తెగని ఆరాటం.

మొన్నటి ఊసులు
నిన్నటి ఆశలు
నేటి కలలు
ఏదైతేనేమి
మనుగడకి ఊపిరులు కాదా!?

కంటి కాంతులకి కొదవ లేదు:
మెరుపులు మసకేస్తే
మెరుగులు పెట్టటమే
మాగన్ను కునుకులో జోగటమే, బతుకంతా ఇకపై...

మరలు తిప్పుకుంటూ మళ్ళి పోను,
మమతలెరుగని యాంత్రికత లోకి.
ఎదురీత బారల్లో ఎద నిండా తృష్ణ పీల్చుకుంటా-
వస్తావా మరి నాతో చెయ్యీ చెయ్యీ కలిపి?

వికిరణం

"నాకేమీ ఆకారాలు కనిపించలే"దన్న స్వరం లో వారింపు
"ఇప్పుడూ సవ్వళ్ళు వినిపించలేదు" ఖండింపుకి చూపు జోడి
చివరి ప్రయత్నం "అలానూ అనిపించలేదు మరి" గా మిగిలిపోయాక
ఇక గుప్పిళ్ళు విప్పాలనిపించ లేదు, 
గుండె చప్పుడు కూడా...
అక్షరాలని విభజించి 
అణుశక్తి వెలికి తీయాలంటే 
మరో ఇంద్రియం అవసరం
ఈ అసంఖ్యాక మెదళ్ళు 
ఎప్పటికీ అపరిచితమే, 
నేనొక మబ్బుకమ్మిన ఆకాశం కావచ్చు
ఆ వాస్తవ చిత్రం లో 

బావిలో కడలి హోరు, 
దేహం లో పాకే అలజడి.
గోడలకి తలబాదుకునే యోచనల అలికిడి లో-
కెరటాల మీద నీడలు తేలుతూ, 
నన్నో నిన్నో ఆకృతిగా మలుస్తుంటే
నిశ్శబ్దం రాకున్నా బాగుంది, 
ఏదో అనిపిస్తే ఇంకాస్త బాగుంది
ఆగని ఆరాటాలకి భాష్యం చెప్పాలని 
నియమం లేదు - మన నడుమ...
ఈ అసంకల్పిత ఆనందానికి ఎప్పటికీ వాహికనే, 
నీవొక చల్లని కిరణసమూహం అవుతుంటావు 
ఆశలు పొడచూపితే.