"ఏవండీ కాసేపు మొహం అరువీయరా?" అంటే వీపు చీరేయరూ

ఈ శీర్షిక కథాకమామీషు తెలియాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే.  ఈ చిన్నారి ఎవరన్నది తెలియాలన్నా నా మాట పూర్తి కావాల్సిందే. ఎందుకంటే, మా ఉగాది సంబరాలు/బడి ఊసుల కొనసాగింపు ఇది.

                                                  


సరే, బడి పెట్టేసాము.   అ, ఆ అని కాక సరాసరి మాటల్లోకి లాగి పాఠాలు మొదలెట్టేసాము.  బడి కొంత సేపు గదిలో,  కాసేపు పెరట్లో, చెరువు దరినా సాగిస్తున్నాము.  2009 లో పండుగలు ఒక్కొక్కటి వస్తుంటే ఎందుకు చేస్తాము?  అన్న విషయం మాత్రం నేర్చుకున్నాము.క్రిస్మస్ పండుగ మాత్రమే చేసాను.  పదేళ్ళలోపే అయినా కొందరు ఆరిందాలు ఇదిగో ఈ స్లైడ్స్ చేసి అబ్బురపరచారు. నాకు నచ్చే పూల బొమ్మలు ఉండేలా చూడటం తో పిల్లలూ, నేనూ ఒకరినొకరు తెలుసుకోగలుగుతున్నామన్న ఆనందం వేసింది.

నెమ్మదిగా పండుగలు జరపటం లోకి జరిగాము.  వినాయక చవితికి మేమే మా చెరువు మన్నుతో స్వామి ప్రతిమ చేసి, పత్రి పోగేసి,  పాలవెల్లి, ప్రసాదాలు చేసుకుని చక్కగా పూజ చేసుకున్నాము.  ఇదిగో చిన్నారుల చేత ముదమారా మురిపాలుగొన్న బొజ్జ గణపయ్య. 


ఇంతలో దుర్గాష్టమి వచ్చింది.  బొమ్మల కొలువు చాలా శ్రద్దగా పెట్టాము.  మూడు అంచలుగా సర్ది అందరికీ ఆకళింపు వచ్చేలా పదే పదే చెప్పుకున్నాము.  అమ్మవారి బొమ్మ, పండుగ విషయాలు పిల్లలతో చార్ట్స్ చేయించాను. 

దీపావళి కి పప్పు ధాన్యాల ముగ్గు వేసి దీపాలంకరణ చేసుకున్నాము.  నరకుణ్ణి కథల్లో చెండాడి,  చీకట్ని చిన్నారుల కంటి కాంతులతో పారదోలేసాముసంక్రాంతి యధావిధిగా చేసుకున్నాము.  ప్రసాదాలు, ఫలహారాలు దక్కుతాయన్న కారణమో,  పంతులమ్మ వదలదని మాత్రమో కాదు,  పిల్లల్లో ఆసక్తి పెరిగింది.  చక్కగా పట్టులంగాల్లో ముద్దు ముద్దుగా వస్తుంటారు ఆ రోజుల్లో. 

అలాగ 3 ఏళ్ళు గడిచి,  ఉగాది వస్తుందనగా పిల్లలతో నృత్య నాటిక ఒకటి వేయించాలి, అదీ సాంప్రదాయబద్దంగా,  నేను కూర్చినదవ్వాలని సంకల్పించాను.  ముందు నా రచన కి స్వర కల్పన అనుకున్నా గానీ వృత్తిపర వత్తిడితో మరీ "ఆకలి ఆకాశమంత నోరు సూది బెజ్జమంత" మాదిరిగా అవుతుందనిపించి,  పాటల వెదుకులాట మొదలెట్టాను.  ఆపని ఒక కొలిక్కి వస్తుందనగా,  పిల్లకాయలతో వేయిద్దామనుకున్న పాత్రల వేష/వస్త్రధారణ గూర్చిన సందేహాలు.  మా పిల్లల తల్లితండ్రులు బంగారాలు, కావాల్సిన సాయానికి సిద్దమేనన్నారు.  అయినా ఈ కార్యక్రమానికి చెందిన గురుతర బాధ్యత నాదేనని నాకు తెలుసు.  రాయలు వారు, గిరీశం ఇలా కొన్ని ముఖాలు నాపైననే ప్రయోగాలు చేసుకున్నాను.  :)  పిల్లది ఎపుడు తొంగి చూసినా నేనేదో ఒక పాత్రని ఆవహింపజేసుకుని ఉండేదాన్ని.  జంధ్యాల సినిమాల్లో మనిషి గా మారాననొచ్చు.  లేకపోతే,  ఎంత మంచివారు గానీ "ఏవండీ నా ప్రయోగాలకి కాసేపు మొహం అరువిమ్మంటే"  వీపు చీరేయరూ? ;)

మా చిన్నప్పటి డాన్స్ మాస్టర్స్ జయసూర్యం,  శేషుబాబు గార్లే కాక, ప్రధాన నిర్వాహకులు, సహాయకులు అంతా తలపుల్లోకి వచ్చేవారు.  సులువుగా కానిచ్చినట్లుండే మా నృత్య ప్రదర్శనల అసలు కష్టాలు అనుభవంలోకి వచ్చాయి. 

అప్పటి నా ఆహార్యాల్లో కించిత్ కష్టాల్లో కొన్ని:
మొత్తానికి పాటల ఎంపిక పూర్తయింది.  మాగంటి గారి వెబ్ లో నృత్య నాటిక ఒకటి,  బ్లాగర్ మెహెర్ గారు తన తమ్ముడితో పాడించిన గీతం,  గురు స్తోత్రం,  నా కవితలో పదం తో కలిపి మొత్తంగా 4 అంశాలు కూరాయి.

ఆ వివరాలు, అసలు ఉగాదినాటి కబుర్లు, ఫోటోల తో చివరి భాగం వీలైనంత త్వరలో తర్వాతి టపాలో.  అన్నట్లు ఇక్కడి ఫొటోల్లో నేను గాక మరొకరు ఉన్నారు.  ఎవరో చెప్పుకోండి చూద్దాం?

No comments:

Post a Comment