రసాల కిసలయం: అనగనగా మా నాన్న కథ

"...భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయటకు పెట్టి మొదట వచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది కృతజ్ఞతతో" - గుంటూరు శేషేంద్ర శర్మ

నాన్న గారి పట్ల ఇష్టాన్ని, ప్రేమని అంతా నవ్వేంతగా చూపగలుగుతాను కానీ కృతజ్ఞత ఇంకా పూర్తిగా చూపలేకపోయానే అనుకుంటాను.

శివరాత్రి అంటే నా వరకు ఎక్కువ గుర్తులు నాన్న గారి పుట్టినరోజు. వేగు చుక్క ని వెదుకుతూ, నది స్నానం - కళ్ళు మూస్తూ/తెరుస్తూ, జోగుతూ జాగారం. ఎప్పుడూ ఉపవాసం. అపుడపుడూ ఏకాహం. తెలియని వాళ్ళకి (కనీసం వతను తప్పకుండా చెల్లి కైనా) ఆరిందాలా తెలిసినవి చెప్పటం. తెలిసిన వారు (అంటే నాన్న గారు, మామ్మ) చెప్పినవే చెప్తుంటే వింటూనే మళ్ళీ వాళ్ళవి వాళ్ళకి అప్పజెప్పటం. మరీ ముఖ్యంగా లింగోద్బవ సమయానికి నాన్న పుట్టగానే "కేశవ" అంటూ నామకరణం చేసేసుకోవటం, తులసమ్మ కోటలో పచ్చగా విచ్చుకోవటం వంటివి. నాన్న గారి తరం లో అలా వాళ్ళ అమ్మలు పూజలు, నోములు, వ్రతాలు చేసి సంతానాన్ని కన్నాము అని చెప్పటం చాలా సహజం కానీ ఎన్నిసార్లు చెప్తున్నా అందులో వెల్లివిరిసే సంతృప్తి ఎంత చిక్కనో! మొన్న ఓసారి చెప్పినట్లే ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఆ ఒక్క రోజే తెలతెల వారకనే క్రిష్ణ లో నదీ స్నానం, ఈత కొట్టటం చేసేవాళ్లం. చలికి వణుకుతూ నాన్న గారికి జుట్టుతుడిచే పని అప్పజెప్పి గుప్పిళ్ళలోకి ఊపిరూదుకుంటూ ఎన్ని పసితనపు జ్ఞాపకాలో గుండెలో పట్టుకున్నాను. నేను హాస్టల్ లో ఉన్నపుడూ జాగారం చేసుకుంటూ, వార్డన్ సిస్టర్ కి తెలియకుండా జపమో, మంత్రమో పఠిస్తూ గడిపేదాన్ని. ఇంకొకటి ఏమిటంటే నా పుట్టిన రోజు ఆంగ్ల కాలెండర్ లెక్కల్లో తేదీ కనుక కొన్నిసార్లు శివరాత్రి లో పడుతుంది. అపుడు మరింత సంబరం. నాన్న పుట్టిననాడే నేను పుట్టాను అన్న ఊహ భలే వింత నా చిన్నతనం లో.

నాన్న గారిని గూర్చి మునుపే చెప్పేశాను ఆ నాన్న కూతురుని అన్చెప్పి. ఇది పునశ్చరణ మాత్రమే.

నాన్న చెప్పిన పాఠం నిత్య పారాయణం,
తిథి వారాలు ఎంచని ప్రతి పనిలో అదే కొలువు.
పాఠం స్వయంకృషి.

నాన్న నేర్పిన పాట నా నోట పలికింది,
కోటి గళాలై శతకోటి స్వరాలై.
భావం ఆశయసాధన.

నాన్న వేసిన బాట నాకు చెప్పింది,
పోటి పడినా వోటమి ఎదురైనా ఆగకని.
మార్గం స్థిరసంకల్పం.

నాన్న అనుభవం ఆస్తిలో నా వాటా,
ఆటుపోటు తప్పని బ్రతుకున అదే ఆలంబన.
ధనం స్వాభిమానం.

నాన్న చెప్పిన మాట జేగంట,
గుడి కాని గుడి నా గుండెలో గణగణ.
రాగం అనురాగం.

నాన్న చూపనిదేదీ నాకు అపరిచితం.
అస్థిత్వం విసిరిన సవాలుకి నా జవాబు,
నాన్న కూతురు నేనంటేనే నాకు ఇష్టం.

అలా ఎక్కువగా నాన్న గారి చేతిలో దిద్దబడిన నాకు, ఆయన నుంచి సంక్రమించిన అలవాట్ల/అభిరుచుల్లో ఒకటి తోటపని. మొక్కలు/వృక్షాల పట్ల అతి ప్రేమ. ఇప్పటికీ ఇంకా తెలియాల్సిన వృక్షజాతులు, పూలు మిగిలున్నా తెలిసినవి ఎక్కువే - తెలుసుకుంటూనే ఉన్నాను కూడా.

అందునా పిల్లలకి తెలుగునేర్పటానికి ఎంచుకున్న ఒక అంశం ఇదే కనుక ఇంకాస్త సేకరణ చేస్తున్నాను. కానీ వాళ్ళకన్నా నాకే ఎక్కువగా విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ అధ్యయనం. ప్రకృతి ప్రేమికులకి “వృక్షో రక్షతి రక్షితః” మాత్రమే కాదు వనం అన్నది మనం (మనసు) కి జీవధార.

అలా తారసపడిన ఒక పుస్తకం - మేనకా గాంధీ, యాస్మిన్ సింగ్ రచించిన 'బ్రహ్మాస్ హెయిర్' . ఇందులో మైథాలజీలో సాంప్రదాయ వృక్ష విశేషాలు, వాటి నావరించి వున్న పురాణ విశిష్టతల కథలున్నాయి. ఇదే పుస్తకం తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారు అనువాదం చేయగా సుమారు 4 సం. క్రితం విపుల లో "బ్రహ్మకేశాలు" అన్న శీర్షికన వెలువడింది. తెలిసినవారి ద్వారా వాటి ప్రతులకు ప్రయత్నించాను కానీ వారు త్వరలో పుస్తకం గా ప్రచురణలోకి తెస్తున్నారని తెలిసింది కనుక నా ప్రయత్నం విరమించాను. ఇప్పటికి ఆసక్తి ఉన్నవారు ఇక్కడ ఇంగ్లీషులో చదువుకోవచ్చు. చాలా బావుంది.

నాన్న గారికి ఈ మొక్కలు కథలవీ కొన్ని చెప్పాను, కొత్తగా చూసిన పూల వివరాలు తెలిపాను. శ్రద్దగా విన్నారు. ఆయన మరి కొన్ని చెప్పారు.

ఇపుడే శివాలయం లో అభిషేకం చేసుకుని పూజాదికార్య క్రమాలు ముగించుకుని వచ్చి, నేను వెళ్లలేకపోయినా నా తరఫున ఒక ఆత్మీయ హస్తం ఇచ్చిన సర్ప్రైజ్ కానుకని స్వీకరించి ఆనందంగా ఉన్న మా నాన్న గారు మరింత ఆయురారోగ్యాలతో శత వసంతాలు చేసుకోవాలని మనసారా ప్రార్థిస్తూ, జీవని చిన్నారులకి ఒక చిరు కానుక పంపాను . ఇది ఒక మైలురాయి జన్మ దినం కనుక ఇంతగా గుర్తు పెట్టుకుంటున్నాను.

ఈ మధ్యన వచ్చిన దూకుడు పాటలో ఒక వాక్యం నెమరేసుకుంటూ - "అన్నీ తానై ఉన్నాడు దేవుళ్ళాంటి నాన్న...కోరే వరమే లేదంటా తన సంతోషం కన్నా." అవును 'నేను - మా నాన్న' కథ నాకెప్పుడూ అనగనగా అనుకునే "రసాల కిసలయం"

కవితాప్రపంచంలోకి వచ్చిన కొత్తల్లో మనసుకి హత్తుకున్న కవితలోని పంక్తులివి.

"జీవితం రసాల కిసలయం కాదు జిల్లేడు కొమ్మ
వేధించినా క్షీర భాష్పాలిచ్చే వెర్రిబాగులమ్మ" - సి.నా.రె. (అని గుర్తు)

కిసలయం అనే వికృతి స్వరూపం కి ప్రకృతి పదం - "కిసలయించు" అంటే "చిగుర్చు"... అని అర్థం. కనుక ఆ పదప్రయోగాన్నే ఈ శీర్షికలో పెట్టాను.

14 comments:

  1. మీ నాన్న గారికి మా తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ..

    ReplyDelete
    Replies
    1. మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు .

      మీకు కూడా జన్మదిన శుభాకాంక్షలు .

      Delete
  2. బావున్నాయండీ మీ జ్ఞాపకాలు. మీ నాన్నగారికి మా తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయండి.

    ReplyDelete
  3. ఉషారాణిగారూ,
    మీ మరువం మంచి వాసన వేస్తోంది... తియ్యని జ్ఞాపకాలు... మనసుపొరల్లో ఏకాంతం లో నెమరువేసుకునేవి... బయటకు తీస్తోంది.
    మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యంతో పూర్ణాయుష్కులై మీకు స్ఫూర్తిదాతగాకొనసాగాలని కోరుకుంటున్నాను.
    అభివాదములతో

    ReplyDelete
  4. గుండె లోతుల్లోని ఙ్ఞాపకాలు
    మదిలోని చిరుతడి తగిలి
    మొలకెత్తి చేయెత్తి జైకొట్టు
    ఈ "రసాల కిసలయం"
    అద్భుతం.. ఆనందనందనం.

    ReplyDelete
  5. మీ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉషగారు... వారు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  6. సిరిసిరిమువ్వ, మాలాకుమార్, మధురవాణి, nsmurty, శ్రీలలిత, వేణూ శ్రీకాంత్ - మీ అందరికీ పేరు పేరునా థాంక్స్. మీ శుభాకాంక్షలు నాన్న గారికి చేర్చాను. నాకు తెలిసినంతలో మాలా గారికి, మధురకి "బ్రహ్మకేశాలు" నచ్చవచ్చు- పూలజాతరలు గారుపుతారు కనుక.

    ReplyDelete
  7. ఉషగారూ, కొద్దిగా ఆలస్యంగా.. మీ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. ఉష నాన్న గారికి జన్మ దిన శుభాకాంక్షలు. నాన్న కూతురు గా నీకెప్పుడు ఆయన గుండేలోని చోటు పదిలమే.. ఆ గుండెలో గువ్వలా ప్రేమ ధారల తడిచిన నీకు కూడా జన్మ దిన శుభాకాంక్షలు. కాసేపు అనుకో ఈ సవత్సరం శివరాత్రే నీ పుట్టిన రోజు కూడా వచ్చిందని.

    ReplyDelete
  9. నాన్నగారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు,ఆలస్యంగా తెలిసింది అందుకే అలస్యమయింది.నాన్నగారు మా అనంతపురంలో అదీగాక మా వ్యవసాయ నీటిపారుదల శాఖలో పనిచేసారని తెలిసి చాలా ఆనందమయింది.

    ReplyDelete
  10. తృష్ణ, థాంక్స్. భావన, కాలంతో ఈదుతూ నా తోట ఒడ్డునే తేలుతున్నావు. థాంక్స్. ఎంత గుర్తుంటాయో గానీ నాన్న గారికి జోరీగలా అన్నీ చెప్తూనే ఉన్నానెప్పటిలా :)

    ReplyDelete
  11. విజయమోహన్ గారు, అవునండి అనంతపూరులో ఉన్నరోజుల్లోనే (నాన్న గారికి పనిచేసిన ప్రతి ఊరు చుట్టుపక్కల ధార్మిక ప్రదేశాలు, స్థల పురాణాల పట్ల ఉన్న ఆసక్తి ననుసరించి) తాడిపత్రి, కదిరి, మంత్రాలయం, ధర్మస్థలి, వేమన సమాధి, లేపాక్షి ఇలా చాలానే తీరిగ్గా తిరిగి చూసాము. మీరు పెట్టిన తాడిపత్రి దీపోత్సవ ఫిక్స్ అందుకే చాలా సంబరంగా కొందరు స్నేహితులకీ పంపాను. మీ ఆకాంక్షకి నెనర్లు.

    ReplyDelete
  12. ఉష గారు,
    మరి కొద్ది ఆలస్యంగా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

    "అన్నీ తానై ఉన్నాడు దేవుళ్ళాంటి నాన్న...కోరే వరమే లేదంటా తన సంతోషం కన్నా."
    well said

    ReplyDelete
  13. నాన్న గురించి మీ అభిప్రాయం అద్బుతం.మీ మొక్కల అభిరుచి చాలా విశిష్టమైనది.చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete