ఎంతెంత దూరం


ఏటి గట్టున పచ్చిక చివురికీ,
గూడు కట్టనున్న గువ్వకీ
ఏ మాత్రమేం ఆ దూరం?
ఎడదలో తడారనంతవరకు
ఆశల పందిరులు వేవేలు.
గిజిగాడి గూటి నేత ఆపతరమా?

ఇంద్ర ధనుస్సుల సమూహానికీ,
నడుమ దారి తప్పిన క్షణానికీ,
ఎంతేమిటి ఎడబాటు?
మనసులో మనిషున్నంతవరకు
కలల రంగవల్లులు కోటానుకోట్లు.
జవరాలి గాజుల సవ్వడి మోహనరాగమే!

* * * * * * * * * * * * * * * * *

గిజిగాడు ఇదిగో ఇక్కడ, మా బాబాయ్ [వంటి] నూతక్కివారు పట్టేసారుగా..

ఈమాట వారికి కృతజ్ఞతలతో, అనేక రకాల అనుభూతులను వినిపించగల
మోహనరాగం గూర్చి ఇక్కడ.

కలలుకనే కళ్ళెవరవని అడిగితే మీకు నాగురించి ఏమీ తెలియనట్లే..

చిన్నప్పటి ఆటలలో ఓ చిన్ని ఆట - ఇద్దరు ఆడతారు. ముందువాళ్ళు ఇసుక నింపి, పుల్ల గుచ్చి, వెనకనున్న వాళ్ళు కళ్ళుమూసి నడిపిస్తూ సాగేది. "ఎంతెంత దూరం?" అంటూ ముందు వెళ్తున్న చిన్నారి అంటుంటే వెనుక వస్తున్న గడసరి "చాలా చాలా దూరం" అని అలా ఇలా తికమకగా తిప్పి ఓ చోట ఆ ఇసుక పారబోయించి రావటం..ఈసారి కళ్ళు విప్పుకున్న ఆ చిన్నారి, ఆ స్థలం వెదికి పట్టుకోవటం..

ఒక అనుబంధాన చిక్కిన మనసులు ఆశలతో ఎన్ని దూరాలు వెళ్ళివస్తాయో, ఎన్ని తావులు వెదికి దాచిన కలలు పట్టుకుంటాయో అని - ఈ చిన్ని కైత

10 comments:

  1. బావుంది.
    గిజిగాడు అంటే నూతక్కి వారి లింక్ కూడా పెడితే బావుండేది
    ఈ పోస్ట్ లో మొదటి కామెంట్ రాసే భాగ్యం ఎవరికో :)

    ReplyDelete
  2. ఏటి గట్టున పచ్చిక చివురికీ,
    గూడు కట్టనున్న గువ్వకీ
    ఏ మాత్రమేం ఆ దూరం?బాగుంది ఉషగారు. ఆ ఆట నాకు ఇష్టం.మా పిల్లలతో ఆడిస్తుంటాము.

    ReplyDelete
  3. నిజమే చాల చాల దూరం :-)
    నేను ఆడేదాన్ని ఈ ఆట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో .నేను ఇసుక పారేసి వచ్చేప్పుడు కాలి తో గీతాలు గీస్తూ వచ్చి కళ్ళగంతలు తీసాక ఎంచక్కా నా అడుగుల గీతాల వెంట వెళ్లి యిట్టె కనుక్కునే దాన్ని ,ఎవ్వరికీ అర్ధం అయ్యేదికాదు :-)

    ReplyDelete
  4. కలల రంగవల్లులు కోటానుకోట్లు.. ఇంతవరకు చాలా బాగుంది. ఆఖరి పదమెందుకో అతికినట్లు లేదురా ఉష.

    ReplyDelete
  5. ఎడదలో తడారనంతవరకు
    ఆశలపందిళ్ళు వేవేలున్నా ప్రేమ చిరుజల్లల్లే వచ్చి తాకి పోతునే వుంటుంది
    కళ్ళలోని ప్రేమ
    చెమ్మ ఆరని ఎడద
    తడిచిపోయే గూడూ
    ప్రేమ పాట్లని చెప్ప వో కూనలమ్మ.. :-)

    ReplyDelete
  6. హరే కృష్ణ, ఏవిటండీ ఇంకా "జామినామినా జాంగలేవా ఆనావా ఆ ఆ ..This time for Africa" హవా మీదున్నారా, మొదటివారు లెక్కలేస్తున్నారు? థాంక్స్ గిజిగాడి లింక్ కలిపేసా. :)

    ReplyDelete
  7. రాధిక[నానీ], పిల్లల సంగతి తర్వాత, మనసు మనసు ఆటలో ఎవరు వెనక ఎవరు ముందు? :)

    చిన్నీ, అంత పిన్న వయసులో అన్ని కళలున్నవారు, ఇప్పుడు ఆ జంట మనసుని జతులాడేస్తున్నారన్నమాటేగా? ;) శభాష్..కొనసాగించండి.

    ReplyDelete
  8. భావన, తప్పదా బయటపడక? రంగవల్లులు తీర్చిదిద్దేది చెయ్యేగా, అప్పుడు గలగలలు ఆ ముంజేతి గాజులవేగా మరి! కాస్త నిగూడార్థం... ;) అర్థం చేసుకో.. గాజుల గలగల చెలికాని హృదయ సవ్వడికి జతగా.
    >> ప్రేమ చిరుజల్లల్లే వచ్చి తాకి పోతునే వుంటుంది
    ఊ వాటి కొరకేగా ఇలా ఆలాపనల సందేశాలు. థాంక్స్.

    ReplyDelete
  9. ఇంతకీ ఆకలలు కనే కళ్ళెవరివి? కళ్ళచాటున దాగిన స్వప్నమేమిటి?

    ReplyDelete
  10. భాస్కర రామి రెడ్డి గారు, కలలకి అలిసిన ఆ కనులు ఓ కవివి. ఆ కవి కన్న కోటానుకోట్ల కలల్లో ఓ మచ్చుక ఇదిగో ఇక్కడ http://maruvam.blogspot.com/2010/05/blog-post_04.html

    నెనర్లు.

    ReplyDelete