అనగా అనగా "చెయ్యి" అనే ఆమెకు ఐదుగురు కొడుకులు - అయితే?

అయితే - వాళ్ళే ఐదు వేళ్ళూను - అనేస్తే చాలదు. వేళ్ళ పాటలు (వేళ్ళ లెక్కలు కాదు, వేలం పాటలూ కాదు) పాడిస్తూ, అయిదువేళ్ళు ఐకమత్యానికి చిహ్నంగానో, లేదూ ఐదు వేళ్ళూ ఒక్కలా ఉండవనో, పంచ పాండువులనో ఇలా అమ్మమ్మ, తాతయ్యలు, మామ్మలు, నాన్నమ్మలు చెప్తుంటే పెరిగినవారం చాలామందిమే ఉన్నామని నా అంచనా. ;) ఆ పంధా లోనే, నిజానికి, ఎక్కువ ప్రాచుర్యం లో ఉన్న పాటల సేకరణ చేస్తూ ఇంకాసిని ఎవరైనా ఇవ్వకపోతారాని ఈ పోస్ట్. ఆపై మా బడి పిల్లల కేరింతలు మీకు చక్కలిగింతలు పెడతాయని హామీ!


1. మా మామ్మ నాకు పాడి ఆడించిన/నేర్పిన కిత కితల పాట ఇది.

ఆకేసి (నా అరచేయి చాపించి తన వేళ్ళతో పాముతూ)
అన్నం పెట్టి (నా బొటనవేలు మడుస్తూ)
పప్పేసి (చూపుడు వేలు మడుస్తూ)
చారేసి (మధ్య వేలు మడుస్తూ)
నెయ్యేసి (ఉంగరం వేలు మడుస్తూ)
బెబ్బేసి (చిటికెన వేలు మడుస్తూ) * బెబ్బిఅంటే పెరుగు :)
ఆం ఆం అంటూ తినేసి (మూసిన ఆ గుప్పిటని మూతి వరకు తీసుకెళ్ళి)
సంతకు పోయే దారేది? (తిరిగి నా అరచేయి తెరిచి, తన వేళ్ళు భుజం వరకు పాకిస్తూ, చక్కిలి గింతలు పెడుతూ, నా కిల కిలలతో మురుస్తూ తానూ నవ్వేసేది)


2. మా మరొక మామ్మ గారి ఆ/పాట. పంక్తికొక వేలు ముడుస్తూ పాడేవారు.

తిందాం తిందాం అందంట (బొ.వే)
ఎట్లా తిందాం అందంట (చూ.వే)
అప్పుతెచ్చి తిందాం అందంట (మ.వే)
అప్పెలా తీరుద్దాం అందంట (ఉం.వే)
ఎగ్గొట్టిపారిపోదాం అందంట (చి.వే)
ఎలా పారిపోయారంటే ఇలా (కిత కితలు)

వెరసి కిలా కిలా నవ్వులు.


3. బాల పిల్లల బొమ్మల పత్రిక (1947 నవంబర్) సంచిక నుంచి సంగ్రహించినది. ఇందులో అనగా అనగా చెయ్యి అనే ఆమెకు ఐదుగురు కొడుకులు. వాళ్ళే ఐదు వేళ్ళు. బొటనవేలు పెద్దన్నయ్య అన్నమాట, చిటికెన వేలు బుల్లి తమ్ముడూను. వాళ్ళ పాట ఇది

తిందాం, తిందాం, తిందాం (చి.వే)
ఏమిటి తిందాం? ఏమిటి తిందాం? ఏమిటి తిందాం? (ఉం.వే)
అప్పచ్చులు తిందాం? అప్పచ్చులు తిందాం? అప్పచ్చులు తిందాం? (మా.వే)
అప్పచ్చు లెలావొస్తాయి? ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? (చూ.వే)
నేనే తెస్తాను! నేనే తెస్తాను! నేనే తెస్తాను! (బొ.వే)


4. అమృతవీణ బ్లాగు లో దొరికినది

ఇల్లలికి ముగ్గేసి
ఆకేసి పీటేసి
పప్పెట్టి బువ్వెట్టి
పాలోసి పెరుగోసి
అత్తారింటికి తోవేదంటే
కిత కిత కిత కిత కిల కిల కిల కిల


5. తెలుగుదనం.కో.ఇన్. వారి సైట్ లోనిదిది.

ఆకేసి ఉప్పేసి
పప్పేసి అన్నం పెట్టి
చారేసి నెయ్యివోసి

అమ్మకొక ముద్ద
చెల్లికొక ముద్ద
అక్కకొక ముద్ద
అవ్వకొక ముద్ద
తాతకొక ముద్ద

అందరికి పెట్టి
నువ్వు తిని
నేనూ తిని

ఆకెత్తేసి ఆకేసి వక్కేసి
సంతకు పోయే దారేది
అత్తారింటికి దారేది??


ఇక, మీ మీ పాటలు రచించో, రాగాలు కట్టో పెట్టేయండిక.

6. రసజ్ఞ గారు ఇచ్చినది:
ఇల్లలికి ముగ్గేసి
ఆకేసి పీటేసి
పప్పేసి కూరేసి
ఆమేసి (ఆం అంటే అన్నం) నెయ్యేసి
ముద్ద చేసి తినిపించి
తినిపించి మూతి తుడిచి
అత్తారింటికి దారేదంటే....
గోళ్ళపాలెం నుంచి వేళ్ళపాలెం
వేళ్ళపాలెం నుంచి అరచేతి పాలెం
అరచేతి పాలెం నుంచి ముంజేతి పాలెం
ముంజేతిపాలెం నుంచి మోచేతి పాలెం
మోచేతి పాలెం నుంచి చంకల పాలెం

7. జయ గారు ఇచ్చినది:

ఇల్లు అలికి-ముగ్గువేసి
పీటా వేసి - ఆకు వేసి
పప్పు వేసి - పాయసం వేసి
అన్నం పెట్టి - అప్పచ్చీ పెట్టి
పాలు వేసి - పెరుగు వేసి
కూరా వేసి - చారు పోసి
నెయ్యి వేసి - ముద్దా చేసి
నోట్లో పెట్టి - తినిపించి
చేయి కడిగి - మూతి తుడచి
తాత గారింటికి - దారేదండి?
ఇట్లా పోయి - అట్లా పోయి
మోచేతి పాలెం - ముందుకు పోయి
ఇదుగో వచ్చాం - అదుగో వచ్చాం
చెయ్యి ఎత్తి - చంకలో పెట్టి
వేలు పెట్టి - చక్కిలి గిలిగిలి
చక్కిలి గిలిగిలి - చక్కిలి గిలిగిలి....

అని పాట ఒక్కొక్క లైనుకి ఒక్కో వేలు మూసి తీస్తూ, అరచేయినుంచి మోచేతిమీదుగా చంకలో దాకా వెళ్ళి చేతి వేళ్ళతో చక్కిలిగిలి పెట్టాలి. పిల్లలు విషయం తెలుసుకోటమే గాక అనుభవిస్తారు కూడాను :)

18 comments:

  1. 'మరువం' ఉష గారు,

    బహు కాల 'దర్శనం'

    వెల్కం బెక బేక !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. మీ ఈ పాటలన్ని మా అనుభూతులను గుర్తుతెచ్చాయండి :)తిందాం తిందాం మా అత్తగారి ఫేవరేట్ :)

      Delete
  2. ఇకమీదట మరువం సువాసనలు మళ్ళీ గుబాళిస్తాయా ?

    ReplyDelete
  3. ఉషగారు....చాలారోజులకి వచ్చి ఆకేసి బువ్వెట్టి నెయ్యివేస్తే ఎంతో కమ్మగా ఉందండి!

    ReplyDelete
  4. హాయ్ Zilebi, మాలా కుమార్, చిలమకూరు విజయమోహన్, Padmarpita గార్లు, మీ స్నేహ సౌహార్ధ్ర పలకరింపులకు సంతోషం. ఈ పిల్లల పాటలకు మీకు తెలిసిన ఇతర వర్షన్స్ ఇవ్వటం మాత్రం మరవకండి. ఇదొక చిన్న ప్రయత్నం కానీ మనమంతా పరస్పర సహాయ సహకారాలతో ప్రోది/గు చేనే బాల సాహిత్యం ముందు తరాల భాషా సమృద్దికి వినియోగపడుతుందని నా ఆశ.

    ReplyDelete
  5. 1. ఏనుగొచ్చిందేనుగు-ఏవూరొచ్చిందేనుగు

    2. మంచిగంధం మాచికాయ-ఊదొత్తి ఉమ్మకాయ

    3. చిలుకలు చిలుకలు అందురే గాని

    4. కుదురుగా పాపడు గుమ్మడి కాయ

    5. తారంగం తారంగం-తాండవకృష్ణా తారంగం

    6. బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది

    7. బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెల్తివి?

    8. గోరంత దీపము కొండంత వెలుగు, మా యింటి పాపాయి మా కంటి వెలుగు

    9. ఎండలు కాసేదెందుకురా? మబ్బులు పట్టేటందుకురా...

    10. వానా వానా వల్లప్పా

    11. కొండాపల్లి కొయ్యాబొమ్మా...నీకో బొమ్మా నాకో బొమ్మా.

    12. కుదురుగ పాపడు గుమ్మడి కాయ...విరిసిన పాపడు విఘ్నేశాయ...

    13. చిన్ని మా అమ్మాయి శ్రీముఖము చూడు...

    ఇవి అన్నీ మీ దగ్గిర ఉండే ఉంటాయిగా ఉషా గారు. ఇవి నేర్పిస్తే చాలా బాగుంటుంది.

    ReplyDelete
  6. ౧.చిట్టి చిలకమ్మా, అమ్మకొట్టిందా
    ౨.చుక్ చుక్ రైలు వచ్చింది
    ౩.చిట్టి చిట్టి మిరియాలు
    ౪.చెమ్మ చెక్క చేరడేసి మొగ్గ
    ఇవి ఉన్నాయాండీ మీ దగ్గర?

    ReplyDelete
  7. బాగున్నాయండీ నేను నేర్చుకున్నది కొంచెం వేరేలా ఉంది!
    ఇల్లలికి ముగ్గేసి
    ఆకేసి పీటేసి
    పప్పేసి కూరేసి
    ఆమేసి (ఆం అంటే అన్నం) నెయ్యేసి
    ముద్ద చేసి తినిపించి
    తినిపించి మూతి తుడిచి
    అత్తారింటికి దారేదంటే....
    గోళ్ళపాలెం నుంచి వేళ్ళపాలెం
    వేళ్ళపాలెం నుంచి అరచేతి పాలెం
    అరచేతి పాలెం నుంచి ముంజేతి పాలెం
    ముంజేతిపాలెం నుంచి మోచేతి పాలెం
    మోచేతి పాలెం నుంచి చంకల పాలెం

    ReplyDelete
  8. ఇప్పటి అమ్మలికి ఇన్ని పాటలు పాడి చెప్పేసమయం ఉందా? good

    ReplyDelete
  9. 1.చింత పిక్క చిక్కింది చిన్నమ్మికి

    2. దానిమ్మకాయ నిను చూడగానే నోరూరుచుడు

    3 . ఆయమ్మ ఆయి ఆపదలు కాయి ,

    చిన్న తల్లిని కాయి శ్రీరంగసాయి

    4. అణాకు రెండూ ద్రాక్షాపళ్ళు

    ReplyDelete
  10. ఉష గారూ ఇంకో పాటండీ..

    ఏనుగు ఏనుగు నల్లన
    ఏనుగు కొమ్ములు తెల్లన
    ఏనుగు మీద రాముడు
    ఎంతో చక్కని దేముడు!

    ReplyDelete
  11. అమ్మోయ్ - పిందెల కోసమెళితే, కొత్తావకాయ ముద్ద/ రాలుగాయలకి వెదికితే రసాల మామిడి దొరినట్టుందోచ్. :)
    జయా, మాల గార్లు, మీ లిస్ట్ లోవీ కొన్ని నేనే నేర్చుకోలేదు - కానీ నా సేకరణల్లో వెదికి మళ్ళీ మీ మీదనే పడతాను సాయానికి. You name it you get it - a workplace rule I learned ;)

    మందాకిని, జ్యోతీర్మయి గార్లు, మీరిచ్చిన లిస్ట్ వచ్చండి. పిల్లలకి నేర్పాను. ప్రత్యేకించి మా బుల్లి విద్యార్థి తేజస్ "ఏనుగు ఏనుగు నల్లానా' చాలా ముద్దుగా పాడతాడు.

    థాంక్స్ అన్నది తప్పనిసరిగా వాడాలి కానీ నా సంతోషం, కృతజ్ఞత ఆ అక్షరాల్లో ఇమడదే అకటా...చాలా థాంక్స్.

    ReplyDelete
  12. రసజ్ఞ గారు, మీకు నిజ్జంగా మూటల కొద్దీ థాంక్స్. ఎందుకంటే ఈ పోస్ట్ అసలు ఉద్దేశం ఈ ఒక్కపాట - 5 వేళ్ళ అంశం - మీద వేరియేషన్స్, వర్షన్స్ పోగేయటం. అనుకోకుండా నాకు ఆపై రాబడీ దక్కింది.

    మీ అందరికీ నచ్చేలా మరొక పోస్ట్ రాస్తున్నాను. తప్పక అప్పుడూ ఇలాగే "పాట"సాయం రావాలి సుమా!

    ReplyDelete
  13. sarma గారు, ఒక తరాన్ని తరిచి చూసినట్టుగా అన్నట్టుంది మీ మాట. నా వరకు ప్రతి తరంలో తీరికున్న అమ్మలు - వాళ్ళలో నేర్పే తెగ, అనాసక్తి మంద; తీరికలేని అమ్మలు - అయినా కూడా అగచాట్లు పడైనా నేర్పేవారు, తగ్గిందల్లా మంచిదే అనేసుకుని వదిలేసేవాళ్ళు ఉన్నారు. ఈ నలుగురి కలగలుపు ఈ సంఘం. పోతే ఇది నాన్నలకీ వర్తిస్తుంది. దేవులపల్లి వారన్నట్లుగా పిల్లలు కొండవాగులు "కొండ తల్లో తండ్రో! వాగులు బిడ్డలు." నా తర్వాతి పోస్ట్ లో కాస్త వివరాలు రాస్తాను. మీరు మళ్ళీ అభిప్రాయం ఇవ్వాలండి.

    ReplyDelete
  14. అలా అయితే ఈ వెర్షన్ కూడా చూడండి మరి.

    ఇల్లు అలికి-ముగ్గువేసి
    పీటా వేసి - ఆకు వేసి
    పప్పు వేసి - పాయసం వేసి
    అన్నం పెట్టి - అప్పచ్చీ పెట్టి
    పాలు వేసి - పెరుగు వేసి
    కూరా వేసి - చారు పోసి
    నెయ్యి వేసి - ముద్దా చేసి
    నోట్లో పెట్టి - తినిపించి
    చేయి కడిగి - మూతి తుడచి
    తాత గారింటికి - దారేదండి?
    ఇట్లా పోయి - అట్లా పోయి
    మోచేతి పాలెం - ముందుకు పోయి
    ఇదుగో వచ్చాం - అదుగో వచ్చాం
    చెయ్యి ఎత్తి - చంకలో పెట్టి
    వేలు పెట్టి - చక్కిలి గిలిగిలి
    చక్కిలి గిలిగిలి - చక్కిలి గిలిగిలి....

    అని పాట ఒక్కొక్క లైనుకి ఒక్కో వేలు మూసి తీస్తూ, అరచేయినుంచి మోచేతిమీదుగా చంకలో దాకా వెళ్ళి చేతి వేళ్ళతో చక్కిలిగిలి పెట్టాలి.
    పిల్లలు విషయం తెలుసుకోటమే గాక అనుభవిస్తారు కూడాను:)

    ReplyDelete
  15. థాంక్స్ జయ. మీది, రసజ్ఞ గారు ఇచ్చిన వెర్షను పైన పోస్ట్ లో కలిపాను. కొత్తగా చదివే వారికి ఇపుడు 7 రకాల వేళ్ళా(ఫా)టలు :) నా పిల్లల వేళ్ల పని పడతానిక.

    ReplyDelete
  16. ఉష గారు
    బావున్నాయి ..అన్నీ ఒకే సారి గుర్తుకు తెచ్చారు ....నాకు కూడా ఒకటి గుర్తుకొచ్చింది ఇది ఈ కోవ లోకి రాదనుకోండి ..కొంచెం ఏడిపించడానికి

    నాన్నొచ్చారు
    ఏం తెచ్చారు
    రేడియో తెచ్చారు
    ఎలా తిప్పాలి
    ఇలా తిప్పాలి............ అంటూ చెయ్యి వెళ్లి చెవి ని మెలి తిప్పుతుంది :)

    ReplyDelete
  17. ఇదీ నాకు తెలియని పాటే వంశీ. థాంక్స్. మా అక్క బుల్లి మనుషులు నిచ్చెనలు వేసుకుని మా పేద్ద రేడియో లోకి వెళ్ళి పాటలవీ పాడతారని చెప్పేది. ఎప్పుడూ ఓ కన్నేసి ఆ రేడియోని శల్యపరీక్షలు చేసేవాళ్ళము - ఆ ఊసు గుర్తుకొచ్చింది. ఈ పాటల్లోని అమాయకత్వం, స్వచ్ఛత ఎంత బావుంటాయో.

    ReplyDelete