నా బ్లాగుని చదివే అందరికీ - వీడ్కోలిక

కారణాలు ఏవైనా ఇక నేను రాయలేను అన్న ఆశక్తత నన్ను కమ్మేసింది. ఈ వనాన ఋతువులో, కాలాలో గడిచిపోయాయి. శీతవేళ వచ్చేసిందిక. శిశిరమెంత కాలం కొలువౌతుందో తెలియదు. "రాయగలను" అని మభ్యపెట్టుకోలేను. "రాయను" అని ఆన పెట్టుకోలేను. మరి మిగిలింది ఏమిటన్నది కాలానికి వదిలేస్తున్నాను.

నా రాతలకి చదువరుల స్పందనలు, ప్రతిస్పందనలు, ఇతర బ్లాగులు అన్నీ నా ఎదుగుదలకి దోహదం చేసాయి. సాహిత్యం పట్ల దాహాన్ని పెంచాయి. రచనా/పఠనా వ్యాసాంగాల విలువని విశ్వసనీయంగా తెలిపాయి. సాధన వీడను. అది మాత్రం నిస్సందేహం.

విషయకంగా నేను బ్లాగ్ప్రపంచానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమార్పణలు కూడా! ఆత్మీయులందరినీ కోల్పోతున్నాను. ప్రియాతిప్రియమైన నా మరువాన్నీ విడనాడుతున్నాను. ముందే తెలుస్తున్న వేదన. అయినా వెళ్లాలి.

ప్రకృతి - సమస్త చైతన్యానికి మూలం. చలం 'పురూరవ' లో అన్నట్లు “అద్భుతమూ, అతీతమూ అయిన విషయాలను చూస్తూ కూడా సాధారణత్వం కింద సమర్థించుకునే అల్పస్థితి ఈ లోక దురదృష్టం. అట్లానే కాకపోతే సూర్యోదయమనే పరమద్భుతాన్ని ప్రతినిత్యమూ చూస్తూ నిర్జీవంగా బ్రతుకుతూ ఉండగలరా?” - నేను ఉండలేను.
అలాగే నిట్టనిలువునా నరికేసినా, చివురేసి పూవు పూచి పలుకరించే ఈ చెట్టు ఎంతో స్ఫూర్తినిస్తున్నట్లుగా, ఓదార్పునిస్తున్నట్లుగా తోస్తుంది.
జీవంలేని జీవితమక్కర్లేని నిర్జీవమైన ఒంటరిగా ముగిసిపోవాలని మాత్రం లేదు నాకు. నిజానికి ప్రకృతిని గమనిస్తూ జీవమున్న జీవితాన్ని గడపటమే మునుపటి నా ప్రపంచం. తిరిగి అటుగానే ఈ పయనం.


సెలవిక మిత్రుల్లారా.
* పై చిత్రం ఏమిటీ ఎందుకు కలిపాను అన్నది క్రిందన వ్యాఖ్యలో వ్రాసాను.


మీ "మరువం" ఉష.

52 comments:

  1. మీరు వ్రాస్తూ ఉండాలి, బ్లాగు మూసేయద్దు అని చెప్పలేను కానీ, మరీ పూర్తిగా మానేయడం.. హ్మ్.. మీ వ్యాపకాలతో తీరిక లేకపోయినా, ఏదో ఓ నిమిషంలో వ్రాయాలి అనిపించచ్చు.. అప్పుడు మాత్రం తప్పకుండా వ్రాయండి..
    Have a nice time..

    ReplyDelete
  2. ఏంటండీ! ప్రొద్దునప్రొద్దున్నే ఇంత షాక్ ఇచ్చారు. ఇలా బ్లాగులోకానికి దూరం ఐతే కుటుంబంలోని ఒక సభ్యుడు ఇల్లు వదిలివేసివెళ్ళినట్లు అనిపిస్తోంది. మీ నిర్ణయాన్ని మార్చుకొంటారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  3. ప్రకృతి నైజాన్ని అనుసరిస్తూ మీరు మళ్ళీ తిరిగి రావాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  4. ఇదేమిటి హఠాత్తుగా ఇలా షాక్ ..

    ReplyDelete
  5. అయ్యో అదేమిటండీ, సరే అలా మీ మునుపటి ప్రకృతి ఆరాధ్య ప్రపంచానికే వెళ్ళిపోండి, కానీ అలా ఆరాధిస్తున్నప్పుడు కలిగే మీ భావనలను మాతో పంచుకోవచ్చు కదండీ. ఖచ్చితంగ అరోజుకో, వారానికో ఓ టపా వెయ్యాలి అని కాకుండా మీకు నచ్చినప్పుడల్లా రాస్తూ ఉండొచ్చు కదా. బ్లాగులో మరి లోతైన కవితలు విపించవా మాకు?

    ReplyDelete
  6. అంత దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు... ఇప్పుడు మీకు ఏం కష్టమొచ్చిందని ?, మీకు ఇంతమందిమి లేమూ? ఇంతమందిని విడిచి ఉండడానికి మీకు మనసెలా ఒప్పిందండీ? ఋతువులలో మార్పులా మీలో కూడా ఏదో రోజు మార్పు వచ్చి మళ్ళీ వస్తారని ఆశిస్తూ ...

    ReplyDelete
  7. మంచి నిర్ణయం.కారణాలేవైనా కానివ్వండి, ఇక పై చేరాలనుకున్న గమ్యం త్వరగా చేరుకుంటారని ఆశిస్తూ.. As Master Oogway says - There are NO accidents :)

    ReplyDelete
  8. ఉషా,మీకున్న భావసంపద,దాన్ని పదాల్లో పొదగ గల్గే నైపుణ్యం అందరికీ ఉండదు. రెండు మాటలు ప్రాసలో రాసి దానికి కవిత అని పేరు పెట్టేసుకుంటున్న రోజుల్లో మీ కవితలు నిగూఢంగా ఎంతో చెప్తాయి.ఎన్నో ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి.

    అలాంటి మీరు..ఉహూ..ఏం బాలేదు.

    ReplyDelete
  9. హ్మ్.. ఎందుకలా?

    ReplyDelete
  10. అయ్యో ఇదేమిటి హఠాత్తుగా :((

    ReplyDelete
  11. హ్మ్---సరే! బ్రేక్ తీసుకుని కొత్త ఎనర్జీతో రండి. ఈసారి మాత్రం వచనమే రాయాలి సుమా!

    ReplyDelete
  12. అయ్యో రామా !! ఇందులోకూడా బోల్డు జీవం ఉంది కదండీ......

    ఇలా ప్రకృతితో గడిపేస్తున్నాను అని చెప్పేస్తే సరిపోదు మరి. మీ ఇంట్లో పువ్వులన్నా కాయలన్నా ఆకులన్నా నాకు చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు మీ picasa update చేస్తారు కదూ..... ఏదీ ప్రామిస్ :)

    ReplyDelete
  13. మార్పు సహజమండి మనిషిజీవితమున
    మంచి వేచియుండు మలుపులందు
    మరువరండి ప్రజలు మరువంపు గంధాలు
    మరల కలుతుమండి మరువకండి

    ReplyDelete
  14. i hope it is not an etopian thought .

    ReplyDelete
  15. నిజమే. విశ్రాంతి తీసుకోండి. అయితె సాధారణ విషయాలు రాయొచ్చు కదా? అలాగే సునీత గారు చెప్పినట్టు వచనం రాయండి.

    ReplyDelete
  16. ఆల్ ది బెస్ట్....మళ్ళీ కొన్నాళ్ళ తరువాత మీ కవితలు చూస్తామనే ఆశిస్తున్నాం

    ReplyDelete
  17. మరువం మిమ్మల్ని "మరువం"---జయదేవ్,చెన్నై-

    ReplyDelete
  18. ఉష గారూ,మీ బ్లాగ్ వలన నాకు కవితల పట్ల ఆసక్తి కలిగింది.మీరు రాసేవిదానం నాకు చాలా నచ్చుతుంది .మీరు ఇక రాను అంటుంటే నాకు చాలా భాద గా ఉంది.తొందరలోనే మళ్లి వస్తారని ఆసిస్తూ , ఆశగా ఎదురు చూస్తుంటాను.:(:(

    ReplyDelete
  19. తోచింది రాసి పారెయ్యక, ఏమిటండీ....వీడ్కోలు మాటలు?
    మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే...చెప్పండి. దంచుదాం.
    పైగా మంచి సెంటిమెంట్ ఉట్టిపడేలా రాసారు. ఇది చదివిన వారెవరైనా...'సరే నమ్మా...అలాగే కానీ. సంతోషం...' అనేట్టు లేదు.
    ఒక వారం రెస్టు తీసుకుని, 'ది కరాటే కిడ్' సినిమా చూసి మళ్ళీ ఆరంభించండి.
    రాము
    apmediakaburlu.blogspot.com

    ReplyDelete
  20. ఏవిటీ మరువానికి ఒక చిన్న విరామం ఇస్తున్నారా? అలా అయితే సరే.. మరిన్ని మధురానుభూతులు కూడగట్టుకుని త్వరలోనే మళ్ళీ మమ్మల్ని అలరించాలని ఆశిస్తూ :)

    ReplyDelete
  21. ప్రకృతిని గమనిస్తూ జీవమున్న జీవితాన్ని గడపటమే మునుపటి నా ప్రపంచం.సాగిపోండి. ఉషోదయపు కవితా కిరణాలు మాపై ఇక ప్రసరించవనే బాధ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది.

    ReplyDelete
  22. ఇది అస్సలు బాలేదండి!!!

    ReplyDelete
  23. సరే. వెళ్ళి - రండి.

    ReplyDelete
  24. ఉషగారు,

    ప్రొద్దున్నే మీ ప్రకటన చూసి ఆశ్చర్యం వేసింది.ఈ విరామం తాత్కాలికమే కావాలని,మీరు మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని మంచి టపాలు వ్రాయాలని ఆశిస్తూ..

    ReplyDelete
  25. ఇప్పుడే చూస్తున్నా మేడం ఈ పిడుగులాంటి వార్త. నిన్నటి సోంపేట కాల్పులతో మనసంతా వికలమయి భారంగా వుండి మరువం వైపొస్తే ఈ విషయం మరింత కుంగదీసింది. ఈ మద్య కామెంటు రాయకపోయినా చదువుతూనే వున్నా. మీరిలాంటి హాఠాత్ నిర్ణయాన్ని తీసుకుంటారనుకోలేదు. ఆ మద్య కొద్ది దినాలు దూరమయి మరల రాస్తునారని సంతోషించా. చిక్కనైన విషయాలని ఆలవోకగా చెప్పే మీలాంటి వారు దూరమవ్వడం బ్లాగ్ లోకానికి దురదృష్టంగానే భావిస్తున్నా. మరల రాస్తారని ఆశిస్తూ...

    ReplyDelete
  26. మనసనేది ఎన్ని రకాలుగా మారుతుందో మనకు తెలియనిదా.. దానికి జీవం లాంటి అమృతాన్ని పోస్తూ నడపడమే మన కర్తవ్యం కదా మరి.
    మానేస్తే ఎలా....?

    ReplyDelete
  27. ఎంత ప్రకృతి ని ఆస్వాదిస్తున్న ,ఏదో చెప్పాలనిపిస్తుంది ,అప్పుడు మళ్ళీ ఇక్కడే చెప్పాల్సి వస్తుందేమో !ఆలోచించండి ఏది మంచో ఎది చెడో?మీకు తేలేదని కాదు , నచ్చినట్టు చేయండి.

    ReplyDelete
  28. త్వరలో వచ్చేస్తారని ఆశిస్తూ...

    ReplyDelete
  29. బ్లాగు కుటుంబమున్ వదలి, బంగరు చెల్లెలు మెట్టినింటికిన్
    సాగుచు వీడుకోలనగ, జారదె మాకిక నీరు కన్నులన్?
    ఏగిన మీద, నీ వెపుడు నెచ్చటయున్నను సంతసంబునం
    దూగుము! మోదమందునపు డొక్కపరిన్ తలపోయుమా మమున్!

    ReplyDelete
  30. ఇంత వెల్లువై అంత విలువైన అభిమానాన్ని నా కొంగుబంగారంగా కట్టి పంపుతున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. రాత్రి ఈ టపా రాసినపుడు మొదలైన కంటితడి ఒక్కక్కొరి వ్యాఖ్యతో వెల్లువలా ఎగిసిపడే కెరటమౌతూంది. అందుకే ఇలా ఓ కంఫ్యూటర్ వెనక కూర్చుని అక్షరాల్లో జొనిపి భావోద్వేగాలు బయటపెట్టెస్తే ఆ నేపధ్యం తెలియనివారు ఏమనుకుంటారు అన్న ఇంగితాన్ని పక్కన పెట్టి ఇలా బయటపడిపోతూ స్టుప్పిడ్ని అవుతున్నందుకు కూడా బాధ లేదు. ఈ సందర్భంగా ఇదే విధమైన స్థితికి లోనైన నన్ను ఓ అభిమానపూరిత చేష్టతో సేదదీర్చిన సంగతి చెప్పాలని ఉంది.

    ఈ ఏడాది జనవరి ఒకటిన పెట్టిన నా టపా, వరవడికి వేయక తప్పని అడ్డుకట్ట కి స్పందనగా కళాస్ఫూర్తి పృథ్వీ గారు గీసిన చిత్రాన్ని పైన కలిపాను. అప్పుడు ఆయన పంపిన మాటలివి "ఉష గారు మీరు ఎవరో ఎలావుంటారో, ఏం చేస్తుంటారో జస్ట్ రచనల అక్షరాల ద్వారా నాతో సంభాషించిన లేదా నేను సంభాషించుకున్న రెండక్షరాల ’ఉష’ నామదేయం తో రూపానిస్తూ ఎన్నోసార్లు చూసుకున్నాను. మీ ఆంతర్యం చెప్పే సౌందర్యానికి, ఆనందానికి, ప్రశ్నలకి, జవాబులకి వ్యగ్రత చెంది మౌనం తో సమాధాన పర్చుకున్నాను. మీ చివరి టప ఎందుకో పలకరించింది., ఏమీ లేని దాని కంటే అనిపించిన కొంత భావాన్నయినా చెప్పేస్తే మనసుకు ఒక విధంగా విముక్తి కలిగించుకోవచ్చనిపించింది." ఇది ప్రదర్శనాభిలాషగా తోచినా మనకి పూర్తి అపరిచితులు అన్నవారు కూడా స్థలకాల పరిధులకతీతంగా ఎంత ఆత్మీయమైన స్పర్శని మనసుకి పరిచయం చేయగలరు అని చూపటానికి పెట్టాను.

    మళ్ళీ అదే తృప్తి పునరావృతం అయిందీ రోజు. కారణాలివి అని చెప్పలేను. నాతో నాకే విబేధం కలిగిస్తున్న నా భావోద్వేగం నా పురోగతిపాటుగా, నాకు సార్వజనీనమైన సారస్వతం పట్ల సృహ కలిగిస్తున్నవారి పయనానికి ప్రతిబంధకం కాకూడదనే, నేనూ ఆ దిశగా కలిసో/సమాంతరంగా సాగాలనోనే ఇక్కడ ముగిసిపోత. నా తత్వం ఆత్మవిమర్శ స్థాయిదాటి ఆత్మనిందలా పరిణమించకుండా ఈ నివారణ. త్రిలోకజనని సరస్వతి కటాక్షం ఏదో ఒక రూపాన వరంగా అంది, ఆ అండదండల వలన సాహిత్యపరంగా అనుకున్నది చేయాలనే ఈ నిర్ణయం.

    "మరువం" నా మానసపుత్రిక. నా ఒక్కదానికి మిగిలే సమయాల్లో అదే నా లోకం. దాన్ని విడిచి వెళ్ళటానికి ఎంతో ఆత్మస్థైర్యం కావాల్సివచ్చింది. మా అమ్మగారి మాట "ఆడపిల్ల పుట్టింటికి వచ్చి వెళ్ళేప్పుడు కంటనీరు పెట్టకూడదు" అన్నది నేనెప్పుడూ వినలేదు. అలాంటి నేను విడిచిపోతుంటే నా వనం మౌనంగా వీడ్కోలు ఇచ్చింది, నేనే పొగిలి పొగిలి ఏడ్చాను. ఏముంది ఇందులో వెనక్కి వచ్చి రాసేయొచ్చు అనుకోవచ్చు. ఇక స్థిరసంకల్పానికి అర్థం ఏముంటుందప్పుడు? అయిందేదో అయింది, దానివల్ల మనం ఎదుగుతామా లేదా అనేది మన చేతుల్లో ఉంది. ఇదీ నేను నాకు నేను సర్దిచెప్పుకుంటున్నమాట. ఏదో ఒకనాడు "ఈ పిల్ల శోకం ఊటబావి" అని తల్లడిల్లే నా నానమ్మకి ఇచ్చిన మాట "ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను" [సాధ్యమా?] నిజం చేయలేకపోయినా ఇదిగో నేను సాధించినా సాహిత్య మూలధనమని మాత్రం అలా నవ్వుతూ మీ ఎదరకి వస్తాను. నా వ్రాతల్లో నాకొక వ్యక్తిత్వాన్ని ఆపాదించి, బాహ్యాంతర బేధాల్లేని ఆత్మని చూసారన్న తలంపుతోనే, అందువలననే అంత అభిమానంగా తలావొక మాట చెప్పారనే నా మొఖం ఇక్కడ పడేస్తున్నాను.

    అసలు టపాని మించిన ఈ సమాధానమే ఇకపై వ్యాఖ్యలకీ జవాబుగా మన్నించగలరు. ఇక ఇక్కడ ఎక్కువగా సంచరించి నిబ్బరం కొల్పోలేను. మరొక్కసారి పెద్దలకి పాదాభివందనం. మిగిలిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఈ వనాన ఇక నా తుదిపలుకు. శాశ్వత సెలవు.

    ReplyDelete
  31. Usha, All the best in what ever you planning to do on literary front. The talent you have will reach the audience in different forms. Blog is only one medium. Try for greatness. Whether you want it or not, one day your writing along with lot of bloggers work will be accorded the recognition it deserves in due course of time. So dont stop writing. Keep writing in different genres and compile them for posterity.

    Forgive me for commenting in English, did it due to time constraints

    ReplyDelete
  32. స్నేహితురాలా...ఆమెన్!!!

    ReplyDelete
  33. ఉష గారు ,క్రమం తప్పక చదివే మీ అభిమానుల్లో నేను ఒకదానిని అండీ ,ఒక్కసారే మీ ప్రకటన చుస్తే దిగులేసింది ,శాశ్వత సెలవు అని మాత్రం అనకండీ . నేను ఊహించినట్లే వున్నారు .:-)

    ReplyDelete
  34. ఆగిన పయనమిక్కడ రెట్టించిన వుత్సాహం తో ఇంకో సాహిత్య వనం లో పడుతుందని ఆశిస్తూ.... వెళ్ళి రా మిత్రమా....

    ReplyDelete
  35. ఎక్కడున్నా నమ్మండి: దిగ్విజయం మీ మార్గం,
    ఈ శీతవేళ రావడాలూ, నిలువునా నరకబడ్డాలూ ఉత్త సోది!
    ఎప్పుడూ మర్చిపోకండి: దరహాసం మీ కందం,
    ఈ ఊటబావి శోకాలూ, పొగిలి పొగిలి ఏడ్వడాలూ బొత్తిగా నప్పవు!
    ఇక్కడకాపోతే ఇంకోచోట,
    ఉష వెలుగివ్వాల్సిన తావులు ఎక్కడో ఎదురుచూస్తూనే వుంటూనే వుంటాయి.
    అక్కడ తెల్లగా, చీకటి మరిగిన కళ్ళకు మిరుమిట్లు గొలిపేలా ప్రభవిస్తూనే వుండాలి.
    మళ్ళీ వచ్చేస్తారని రహస్యంగా ఆశిస్తూ, మనసారా శుభాకాంక్షలు! :)

    ఫణి

    ReplyDelete
  36. "హమ్మయ్యో..ఉషగారూ..ఏంటండీ ఇది?" అని మీరు టపా పెట్టిన వెంటనే అడిగేద్దామనుకున్నా!కానీ మీరు ఇలా చేస్తున్నారంటే ఏదో బలమైన కారణం ఉంటుందనే ఆగిపోయా!మీరు మళ్ళా రాసిన వ్యాఖ్య చదివాక కూడా అదేంటో నా మట్టిబుర్ఱకి అర్థమైచావలా.ఏదైతేనేం, నాకిప్పుడిప్పుడే రుచి తెలుస్తున్న మీ మాగాయ పెరుగన్నం కబుర్లు,మంచి భాషాసుగంధం నిండిన మీ కవితలు ఇక వి(క)నపడవంటే అదేదో, ఏదోలా ఉంది..ః-(..... కాని,మీరెందుకు,ఏ కారణంతో వెళ్ళిపోతున్నా, మీరు సాగాలనుకున్నే మార్గం నల్లేరుమీద నడకలా సాగాలని కోరుకుంటున్నా...ఇంకో చిన్న విన్నపం..మీ మరువాన్ని వదిలెళ్ళినా, అప్పుడప్పుడు మా బ్లాగు వంక కన్నేస్తూ, మీ సలహాలు అందిస్తారని ఆశిస్తున్నాను...నా భాగవతగమనానికి మీలాటి పెద్దల ఆశీస్సులు కావాలి..తప్పకుండా నా విన్నపం మన్నిస్తారని ఆశిస్తాను..

    ReplyDelete
  37. బ్లాగ్ విరమణల కాలం నిశ్సబ్దంగా సాగుతోంది....మొన్న నేను ,నిన్న మరొకరు ,నేడు ...ఈ నీ నిర్ణయం ...యింకా ఈ దిశగా ...?

    ఆకస్మికమైనదే అయినా ... మంచిదా కాదా అన్నదానికన్నా... అవసరమా కాదా అన్నదానికే ప్రాధాన్యం. సమస్య ల్లా . ... సమస్యలతో ముడివడిన అవసరం ...ఆధిపత్యాన్ని నెరపుతున్నప్పుడు . తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమేనని భావిస్తూ . ఆత్మీయతతో.అభినందిస్తున్నా

    కావలిసినంత సమయం దొరుకుతుంది.మనసు పై శరీరం పై వత్తిడి తగ్గుతుంది.కుటుంబ సభ్యులకు ఎక్కువ అందుబాటులో వుండటం వల్ల కుటుంబంలో ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. సృజనకు అవకాసమేర్పడుతుంది. ఎత్తునుండి నేలపై బడిన బంతిలా దిగ్విణీ కృత సాహితీ ఆవేశంతో తిరిగి మా ముందుకు రావచ్చు.మునుముందు మహత్తర కృత్యాలు సాధించవచ్చు.

    నాకు తెలుసు... కుటుంబం, వుద్యోగం .భాద్యతలు, బరువులు.. .......ఆకాంక్షలకు, సృజనకు తాత్కాలిక అడ్డంకులేమో కాని అడ్డుగోడలు కాలేవని....,

    మనంతటికి మనం ఓ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి, దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలనే నిశ్చయానికి రావలసిన అవసరం ఏమాత్రం లేదమ్మాయ్.. నీ వెసులుబాటు ననుసరించి అప్పుడప్పుడైనా.మమ్ములను ఆలరించ వచ్చు అలాగని నిన్ను యిబ్బంది పెట్టం.

    అ చిరకాలాన
    తెలుగు సాహితీ బ్లాగ్లోకాన
    ప్రపంచ వ్యాప్తంగా
    సాహితీ అబిమానుల
    అభిమానాన్ని చూరగొని
    శోధనతో సాధన,
    సంపూర్ణసాధనకు
    నిరంతర సంవేదన జోడించి
    నిర్విఘ్నంగా కొనసాగే ఉషస్సు.....
    తాత్కాలికమైనా
    బ్లాగ్వీక్షకుల చెంత చేరదని ....
    భావన బాదాకరమైనా
    నిజ జీవితసాగరాన పయనంలో
    పలు నావలపై పాదాలుంచడం
    కష్టతర విన్యాసం అన్న విషయం
    .నా బోంట్లకు నిత్యానుభవసారం.
    అందుకే
    నీ ఈ నిత్యజీవన విన్యాసాలవీక్షించి
    నేను లోగడ విస్మయాన్ని తెలిపిన మాట
    నీకు గుర్తుండే వుంటుంది.

    సాహిత్య వాహినికి అడ్డు కట్ట
    వేయబోవటం లేదన్న మాట
    ఒకింత ఊరటనిస్తోంది.......
    ఆచార్య ఫణీంద్ర కవీంద్రుడు
    తన పద్య పాదాన నుడివినటుల
    బ్లాగ్మిత్రులు ఆకాంక్షను వేలిబుచ్చినటుల
    నీ వెక్కడున్నా ఎల్లవేళలా
    ఆనందంగా ఆహ్లాదంగా వుండాలని,
    ఈ బాబాయిని అప్పుడప్పుడూ
    పరామర్శిస్తూ వుండాలని ...
    ఆశిస్తూ నీకూ ,నీ కుటుంబ సభ్యులందరికీ
    శుభాసీస్సులందిస్తూ, ..
    అంతా క్షేమమేనని భావిస్తూ.......నీతో
    ఓ బాబాయి లా
    ఆత్మీయతను పెనవేసుకున్న
    శ్రేయోభిలాషి ....రాఘవేంద్ర .
    (ఆత్మీయతానుబందాలతో హృదయాలను చెమర్చుకుంటున్న స్పందిత బ్లాగ్ కుటుంబీకు లందరికీ శత సహస్ర వందనాలు ...నూతక్కి ).

    ReplyDelete
  38. Good luck with everything Usha. Hope you continue your passion.

    ReplyDelete
  39. change is a good thing. it will always bring you to your like with more love and passion for it. We all know you like writing.. and will wait to welcome you back. best of luck usha gaaru.

    ReplyDelete
  40. usha gaariki

    i have been away from net quite a longtime.

    so i could not respond early

    your decision may be right from your point of view. may be unexpected from ours.

    take a break as kottapali sir said, come back renewed.

    i quote here a poem of akella ravi prakash.

    అక్షరం
    ఇక నే కవిత్వం రాయలేనని తీర్మానించుకొన్నాను
    వెలవెలపోతున్న నా కవిత్వపాదాలు
    తెల్లటి ఖాళీతనం లోకి
    శూన్యంలోకి
    శిధిలమవుతున్న ఆలోచనలు
    నా బాల్యపు
    చెరుకు పొలాల్లోనూ
    యవ్వనపు
    నదీప్రవాహాల్లోనూ
    నగ్న వరిగింజల
    చంద్రవంకల్లోనూ
    అతి విస్తారంగా కాచిన
    కవిత్వ వెన్నెల
    చెప్పా పెట్టకుండా
    నన్ను బహిష్కరిస్తుంది
    రాయలేనితనం
    అన్ని బాధలకన్నా
    వ్యధల కన్నా ఎక్కువగా బాధిస్తుంది
    రాయలేనితనం
    నా ఆత్మ మూలాల్లోకి
    చొరబడి నన్ను జ్వలిస్తుంది
    ఇక నాలోని కవి మరణాన్ని
    ప్రకటించుకొని
    లోతట్టు జీవితపునీళ్ళలో
    చిక్కడిన కలల నావని
    సముదాయించుకున్న ప్రతీసారి
    అసంఖ్యాక కవితా రహదారులూ
    వింత కాంతి ముఖ ద్వారాలూ
    మళ్ళీ మళ్ళీ మహోదృతంగా
    నాలోకి సుడులు తిరుగుతూ.

    ---- ఆకెళ్ళ రవిప్రకాష్ ( 'ప్రేమ ప్రతిపాదన" సంకలనం నుండి)

    bhavadeeyudu
    bollojubaba

    ReplyDelete
  41. మీ సాహిత్యవ్యవసాయం అప్రతిహతంగా కొనసాగుతుందని ఆశిస్తూ మీ శ్రేయో೭భిలాషి.

    ReplyDelete
  42. ఉష గారు,
    ఎన్నో రోజుల తర్వాత బ్లాగులకు వచ్చిన నాకు మీ ఈ టపా చూసి చాలా బాధ కలిగింది. తగినంత విశ్రాంతి దొరికి మళ్లీ వస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  43. నేను ఈ మధ్య బ్లాగులు రెగ్యులర్గా చూడటం లేదు. బ్లాగు వ్రాయటమా మానటమా అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం అని నేను నమ్ముతాను. మీరు చేరుకోవాలనుకుంటున్న గమ్యానికి ఈ బ్లాగు ఒక అడ్డంకిగా నిలబడకూడదు! మీ మరువపు సుగంధాలు మా మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నా ఏం చేసినా మీ ప్రతి అడుగులో మీకు విజయం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎప్పటికో ఒకప్పటికి మరలా మా ముందుకు ద్విగ్విజయంగా తిరిగి వస్తారని రావాలని కోరుకుంటున్నాను!

    ReplyDelete
  44. ఈ బ్లాగ్విరామానికి మీ వివరణ కూడా అర్ధం కాలేదండి...ఒకోసారి అర్ధం కాని మీ కవితల్లాగ...!! సామాన్యులం కదా మరి..:)

    కారణాలు ఏవైనా, మీరు నిర్ణయించుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటాను.
    మిమ్మల్ని తప్పక మిస్సవుతాము...

    కొన్నాళ్ళ తరువాతైనా మీరు మళ్ళీ మీ మరువపు సువాసనలు వెదజల్లాలని కోరుకుంటూ...
    -మిత్రురాలు.

    ReplyDelete
  45. నీ కవనం-అమరం-మరువం


    తూరుపు నగరంలో మరువమనే ఓ ఉషాకిరణం
    గణగణమను తలపుల గంటలతో ఒకేఒక్క ద్వారం
    ప్రతి మదికీ వేకువయై పలకరించు ఈ ఉషాకిరణం
    ఒకపరి తిలకించిన ఇక మరువం, ఇదేమి మోక్షలోకం


    అల్లుకున్న ప్రతి పదమూ అవధిలేని దారంగా
    వికశించిన ప్రతి కవితా అమృతపు తేనెల మల్లియగా
    అనుదినమూ ఓ సుధాకవిత మా తెలుగుతల్లికీ మల్లెపూదండగా
    అవిశ్రాంత కవితాంజలి షోడశోపచార నిత్యపూజగా
    ప్రతి మదికీ ప్రార్ధనయై వినిపించు ఈ ఉషాకిరణం
    ఒకపరి వినిపించిన ఇక వదలం, ఇదేమి మోక్షలోకం


    మధురసాల మదిపలుకులె అఖండమనిపించే దీపంగా
    నవరసాల అభినయాలె పదాల పరిమళాల ధూపంగా
    విరసం ఎరుగని సరసుల మనసుల ఆకలికి నైవేద్యంగా
    అక్షరమను సురదేవికి కవిత్వమే సర్వాంగపూజగా
    ప్రతి మదికీ సామవేద సారమై అగుపించు ఈ ఉషాకిరణం
    ఒకపరి చదివిన ఇక మరువం, ఇదేమి మోక్షలోకం


    మరణం లేనిది అక్షరం
    అంతం కానిది నీ కవిత్వం
    మరువకు నేస్తం మూతపడకూడని తోట నీ మరువం

    - Anand B. Surampudi

    ReplyDelete
  46. నూతన సంవత్సరంలో మరల మరువపు గుభాళింపు మొదలవుతుందేమోనన్న చిరు ఆశతో..

    ReplyDelete
  47. "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది..." - శేషేంద్ర శర్మ
    నిద్రాణమైన ఈ నా వనాన అపుడపుడు తొంగి చూసి ఆయా పోస్టుల్లో తమ తమ మనోభావాల్ని, అభిప్రాయాల్నీ పంచుకున్న మెహెర్, ఆనంద్, నూతక్కి వారు, వర్మ గారు, మౌన విహారులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

    ReplyDelete