మొరాయించే పాదాల్ని ఈడ్చుకుంటూ
ఊరడించే ఊహల్ని మోసుకుంటూ
ఉదయమో, ఏదీకాని వేళలోనో
వేస్తుంటాను కొన్ని అడుగులు-తరుచుగానే-
రహదారుల దాపున కాలువల వెంటా,
కాలిబాటలు పడని పచ్చిక బయళ్ళ లోనూ.
మనసున బరువు, కనపడని కావిడి మోస్తున్నట్లు
నడిచిపోతున్న కాలం ఎదురౌతుంది
కాదేమో? కాలం చేసే గారడీలు కనపడతాయి
అన్నీ అశాశ్వతమన్న సత్యం
ఎదని అదిమిపెట్టే- నాకై నేను ఎత్తి విసరలేని- పాషాణంగా తోస్తున్నా,
అరుదుగా ఆ ఎరుకని మరిపించే చిరుజల్లులు తాకిపోతాయి,
అనుభవాల్లో అనుభూతుల ధ్వని వేరేమో!?
అప్పుడిక ఆ తడి మట్టి లోకి
కదిలి దిగబడే బండరాళ్ల వంటి సత్యాలు కనుమరుగై
పచ్చని మొలకల వనమైన హృదయం
రంగు రంగుల కలలకి, పూలకి సన్నాహాలు చేస్తుంటుంది.
ఎందుకనో లెక్కలేనన్ని మోసుకెళ్ళినా బరువనిపించవవి!
No comments:
Post a Comment