పయనాలు

ఆ ఊరు పేరు అందరిదీ..
ఏళ్ళ తరబడి
తరతరాల నోట వినపడుతూ వచ్చేది

వీలునామాలు, సొంతదారులు మారుతూ
వీధి పేర్లు, కొత్త వలసలు కలుస్తూ
ఊరు పేరు ఎందరికో పరిచయం అయేది

గోడలు కూలిన మేడల్లో
వేళ్ళూనిన రావి కొమ్మల్లో
అపుడపుడు ఎవరెవరో-

జ్ఞాపకాల తడుములాట, వెదుకులాటలో
నేలంతా అడుగుల సంతకాలు చేస్తుంటారు

మరెవరెవరో
పునాదులు, గదులు పేర్చుతున్న రోజుల్లో 
కలలు నాటుతూ రేపటి లోకపు ఉనికికి
రూపు దిద్దుతారు..

పేరు మారని ఊరు
కొత్త చిరునామాలు మోస్తూ
జనంతో కిక్కిరిసి
జీవితాల చిత్రాలతో, సాంద్రతతో
తీరు తెన్నులు మార్చుకుంటుంది

ఊరులు తిరుగుతూ 
ఊసులు వింటూ
నేను

పేరుకొక పాట వ్రాసుకుని
స్వరకల్పన చేస్తున్నాను
ఊరికొక ఉనికి తెలుసుకుని
మారుతున్నాను

నా పేరు మారింది
సంచారిగా మారింది
నాదీ ఆ అందరి పేరయింది

వసంతానికోసారి

చీకటి మబ్బులు చిట్టి కాంతులు రాల్చేవేళ
మినుకుమినుకుమనే చంద్రుని చూద్దామంటూ
మేఘాల మునకలేసే సూర్యుని వెదకాలంటూ

వేకువజాము కి మునుపే మనసు లేచింది
చుట్టూ లోకాన్ని తడిమి చూసింది

పరుగు తీయలేని గాలులు కొమ్మల్ని కుదుపుతూ
తెరలలో నిలవలేని మంచు ఇల కి జాలువారుతూ
ఉదయ గాన కచేరికి శ్రుతి సవరించే వేళ

కొమ్మల నీడల్లో కదలాడుతూ,
మంచు పొదల్లో మెదలాడుతూ

నిలిచీ నిలవని పిట్టలు కొన్ని
మరిచిన నెలవుల తిరుగాడుతున్నాయి
పాత గూళ్ళు వెలతెల పోతున్నాయి

పరుగులు నేర్చిన కూనలేవో
గరిక పరుపుల మీద దొర్లాడుతున్నాయి
సయ్యాటలో మునిగి తేలుతున్నాయి 

వసంతం వచ్చిందా రానుందా ఎరగనట్లు

మొగ్గలు తొడిగిన మొక్కలు
చివురుల మునిగిన రెమ్మలు
చిత్రమేదో చేస్తున్నాయి

ఏడాదికోమారు 
ఇదే పదాలు పాడుతున్నాను 
పూర్తి చేయలేనని పదిలపరుస్తున్నాను

నిరుడు ముగిసిన పద్యం
తిరిగి పురుడు పోసుకున్నట్లు 
కొత్త పాదం తారాడుతూ ఉంది

యాత్ర దేముంది - తూర్పు పడమర నడుమ ఏదో ఉంది

ఆ క్షణం   
రేగి పళ్ళు మాగిన వేళలో 
నేరేడు కొమ్మలు బరువుగా వాలిన వుదయాలలో 
నిమ్మ పూల మీదుగా కదిలిన గాలిలో
నేను నిన్ను పునర్దర్శనం చేసుకున్నాను

చేమంతి మందారాల రంగుల జుగల్బందీ ముగిసాక
జాజులు మల్లెల పోరు మొదలయాక 
మామిడి పూత దాచిన భరిణె మూత బిగించాక 
రసాల కాయల హోరు వాడలకి వచ్చాక
నన్ను సాగనంపే సమయంలో 
ఆకాశం వర్షించింది

నిన్ను హత్తుకుని ఒదిగిన చెమ్మ 
నన్ను చుట్టుకుని వున్న ఆత్మీయత 
ఉమ్మడి బంధం నా కొంగు బంగారం

నేల తల్లీ, 
నీ స్పర్శ కోసం తిరిగి వస్తాను..
సశేషమైన చరితలు రాసుకుని మోసుకొస్తాను 
పాటల పోత పోసిన పిట్టనై నర్తిస్తూ 
మళ్లీ కొత్త రాగం తో పాదం కదుపుతాను

-----

ఈ క్షణం
కోయిల పాట కార్డినల్ గొంతులో ధ్వనించింది
చేమంతి వన్నె తిరిగి చేరుకుంది
ఆ సీమలో వేడికి జడిసిన శీతల పవనాల జాడ 
ఈ నేల మీద తెలిసింది
నేస్తాలు నిండు గా ఆహ్వానం పలికాయి..

తూగుడుబల్ల మీద మనసు మాత్రం 
తూరుపు పడమరల నడుమ ఒరుగుతూ వుంది

సీమాంతర యానాలు అంత సులువుగా వెనకపడవు-
వెంటవెంట వస్తుంటాయి.
అడుగులతో సాగే ఒంటె మెడలో గంటల సడి
ఎడారి దిక్కుల్లో ఆగి ఆగి తరలినట్లుగా, 
నిమిషాలు నడిచి వెళ్లి పోతున్నా 
జ్ఞాపకాలు ప్రతిధ్వనిస్తూ 
మరి కాసేపు ఆగుతున్నాయి…

Lovers of Trees


ఒకానొక సాయంవేళ
శరదృతువు ఛాయలు మోస్తూ
ఆకులన్నీ అనేకానేక వన్నెల్లో
పదును లేని కాంతులేవో చెదురు మదురుగా 
చిక్కబడుతున్న రవళులు- కొన్ని పిట్టలవి, కొన్ని గాలులవీ
అరుదుగా రాలుతున్న ఆకులు 
నేలకి  చేరక ఊగిసలాడుతూన్న 
తరుణం.. 
నేనూ నిలిచివున్న సమయాన
"isn't it beautiful" చిరు స్వనం
రవ్వంత చిరు దరహాసం మిళితమైనట్లు
చెట్టుని పోలిన మనిషి
కళ్ళలో రెండు పున్నముల కాంతి
ఆమె ఒకరా, ప్రకృతి ఆవహించిన ఇరువురో?
మా మాటలన్నీ మరో లోకపు పరవశం
అపుడు మరిన్ని ఆకులు రాలాయి
ఇటువైపుగా కదిలాయి
'కవితలన్నీ తారాడినట్లుంది,' అంటున్నాను
 "do you know the trees poem"
కొత్త గానం, కోయిల స్వరం ఊహించని గళం తో 
ఆమె ఆ రేయి చంద్ర కాంతి గా కమ్ముకున్నది
ఆ పాట కలకి అందని సీమకి
నన్ను తరలించింది 
కలవరించని, కలని వరించని 
కొంగొత్త నేను
ఇక మరి, కదిలి కదిలి తెల్లవార్లూ చెట్టునై 
పదాలు రాల్చుకున్నాను

A Spectator

I marvel at ‘em
Zinnia or hummingbird
Can’t tell yet- petals and wings perhaps
By the window I await
Winds stop dancing as
Whispering sounds spread around
A hummingbird tells stories of nature to each petal
And, I delightfully await every day
Wondering if they watch me as well! 



పునః పరిచయం

 చెరువు గట్టు చీల్చుకుని ఈ చెట్టు వేర్లు

నీళ్ళలో 

నీడకూ అందక దాగినట్లున్నాయి

చెరువేమో

అలల వేళ్ళ కొసలు జొనిపి

గట్టు తెంచుకుని చేరుకునేందుకే

ఎగిసి ఎగిసి ఎగిరెగి రెగిరి ఎగిరి

చేరువగా వచ్చినట్లుంది


కొమ్మలు, చివురులు

పసిరి వాసనలతో, పచ్చని మెరుపులతో

ఎండ కొనలతో కరచాలనం చేస్తున్నాయి

మరి,

మంకెన పూల బొత్తి లా

ఓ ఎర్రని పిట్ట

ఎగిరి, తిరిగి వాలి

కదిలి కలదిరిగి

పాడి, అలిసి

కూలబడింది


వాడంతా వీచే గాలులు 

వాన మబ్బుల గోలలూ.. 

పిల్లకాయల కేరింతలు

గూళ్ళలో కువకువల అలికిడి

పొదల మీద రెక్కలపురుగుల పొర్లిగింతలు 

వసంత కాలాల

వైనాలు ఎప్పటివే

ఎప్పటికీ మాసిపోనివే!


మంచు మీద రవ్వల పొడితో ముగ్గులు వేసినట్లుగా ఉంది.
నక్కి కుట్లు వేసిన నేలకి జరీపోగులా ఆ వెన్నెల ..



 

snowతనం నూతనమా?


బుట్ట గౌను కొసలు మెలితిప్పే చిన్ని వేలు
చేతిలోకి తీసుకుని
అమ్మ అద్దిన తెల్లని స్నో ముద్ద
మెత్తగా నలిగేది
ఇపుడు చేత పట్టిన మంచు ఉండలా
కవ్వపు కొసలకి అంటిన వెన్నలు
చాపిన అరచేత ముద్ద చేసి
అద్దిన మామ్మ కనులలో
గుట్ట పడినదేదో
మనసుకి తిరిగి చూపుతున్న ఈ ధారలు
ఆగక కురిసి, కురిసిన చోటే కూలబడి
కొమ్మకి అలుముకుని
కొసలలో గట్టిపడి
చెట్టులన్నీ బుట్ట గౌనులు తొడిగిన పాపాయిల వలె
తెలవారి వెలుగులో తేలిన
చిట్టి పాదాల గురుతుల్లో, మెరుపుల్లో
నావేలే ఆ చిన్నతనపు ఆనవాలు
and, it muffles the sounds
redesigns the disrobed branches
the drab surroundings vanish
a wish for more snow mornings
never goes unfulfilled,
coz' it's winter!!!



 

ఒకానొక తేనెపిట్ట రాకతో

మధ్యాహ్నపు గాలి పూలలో జోగుతూన్న వేళ
చప్పుడు చేయక తుంటరి తేనెపిట్ట తుర్రు తుర్రుమని
తిరుగాడుతూ ఉంటుంది తరుచుగా
దయగా దమయంతి ఏనాడో చుట్టిన పచ్చకోక
మెరుస్తూ ఉంటుంది
కిటికీ రెక్క చాటున మాటేసిన నేనేమో
చీకటి మోమున నా చుక్కల కనులు
అరమోడ్చి సేదతీరుతూ ఉంటానిక...


 

ముసాబు ఉదయాల మునకల్లో

-1-

వానచినుకులు

పిల్లకాలువలు కట్టుకుని

ఇనకనని మొరాయిస్తున్నాయి


వలస పక్షులు

నిన్న లేనివేవో చూస్తూ

వింతపడుతూన్నట్లు

నిమ్మళంగా ఒళ్ళు కడుక్కుంటున్నాయి


ఎప్పుడూ ఉన్న చెట్లు, 

ఇప్పుడిప్పుడే విచ్చుకున్న పూలు

ఆరాటం గా దిగుతున్న నీటి మబ్బులకి

వసతి ఏర్పాట్లలో 

హడావుడిగా మాట్లాడేస్తున్నట్లుగా ఉంది

చిరుగాలుల సవ్వడిలో కొత్త తీరు వింటుంటే


కిటికీచట్రాలు అడ్డం పడి ఆగిన 

ఇంకాసిని నీటిబొట్లు

ఆగి ఆగి దూకుతున్నాయి  


వానంటేనే ఆహ్లాదం, 

వానొస్తే చెప్పలేనంతదేదో ఉంటుంది

ఎప్పటికీను...


-2-

పక్కకి వచ్చి వాలి, 

కువకువల కేరింతల మినహా 

పలుకరించని పిట్టలన్నా,

"గుర్తుకొస్తున్నావ" ని చెబ్దామంటే

 నీడకీ ఆచూకీ తెలుపని నువ్వన్నా,

పట్టరాని కోపంగా ఉంది, 

పంతం పట్టాలని పౌరుషంగా ఉంది...

నువ్వు పిలవగానే టక్కున పారిపోయే 

నా బెట్టుసరితనాల మీదొట్టు.

-3-

వానలోనూ, 

ఆనందాల వానలలో

తడిసి ఒళ్ళు  ఆరబెట్టుకున్న

అక్షరాలలోనూ 

నానిపోతున్న హాయి!

360°

 కాసేపు నీతో

ఆ రవ్వంత తడవే
మరి-
కనులకి దారి ఇస్తూ నీ కాంతులు
ఇక, రోజూ ఉదయమో, అస్తమయమో చివరికి నిశి వేళల లోనో
లోనుంచి నమ్మిక ఒకటి
త్రోవ వెంట నీవు చిమ్మిన
గురుతుల కొరకు
గమ్యం ఎరుగని యాత్ర కొరకు
నిరంతరం కదులుతూ ఉంటుంది.
ఇదేనంటావా జీవితానికి తుది నిర్వచనం..
అసలుకి అదేమీ లేదు, ఉండదూ అనా !?


ఋతురీతి

 2023 అక్టోబర్ నెలాఖరు, పోస్టాఫీస్ వద్ద పార్క్ చేసిన ప్రదేశం మొత్తం ఎర్రగా మారిన ఆకుల గలగలల చిరుగాలి. మోపుగా ఆ చెట్లన్నీ ఎర్రని ఆకాశం దిక్కు గా నిటారున నిలుచుని ఉన్నాయి. మనస్సు కదలనని మొరాయింపు, వెనుకగా నవ్వు, తిరిగి చూసాను ఒక - embodiment of bliss ని - "అవన్నీ హృద్యంగా లేవూ!" నవ్వు కలగలిసిన పలుకరింపుతో ఆ స్త్రీ. ప్రతి శరదారంభ సమయం కుప్పించే మైమరుపులో నా సంభాషణ తదుపరి, Trees poem చదివావా అని అడుగుతూనే పూర్తిగా చెప్తుంటే వింటూ వింటూ, తాదాత్మ్య స్థితిలో నెట్టబడిపోయాను. మనిషిలో ఋతువుని దర్శించడం, ఆమె

"Poems are made by fools like me,

But only God can make a tree."

అని పూర్తి చేసిన క్షణాన అనుభవమైంది.

నేనూ ఆ ఉదయం చదివి, అనువదిస్తున్న కవితని చూపాను. ఆ సంగతి తరువాయి.

2024 మార్చ్ నెలాఖరు. అక్కడక్కడా కొన్ని పూలు, అరుదైన రంగులూనూ. రెస్టారెంట్ కోలాహలం గా ఉంది. మేమూ వేడుక జరుపుకుంటున్నాము. పక్క టేబుల్ నుంచి "many blessings" అంటూ చిరునవ్వుల పన్నీటి చిలుకరింపు. మెత్తని స్వరం తో ఆ యువకుడు వసంత వేళలకి ప్రతీకలా .. ఆర్నెల్ల నాటి వీడ్కోలు, ఆ క్షణపు స్వాగతింపు నడుమ మనిషి మూలాల ఉనికి.
ఇపుడు నా చుట్టూరా రకరకాల పూలతో చెట్లు, నేల నుంచి విడివడుతూ మొలకలు. మనిషి కూడా ప్రకృతిలో భాగమైన నేలలపై చాలా తరుచుగా నడుస్తుంటాను మరి!

Trees
I think that I shall never see
A poem lovely as a tree.
A tree whose hungry mouth is prest
Against the earth’s sweet flowing breast;
A tree that looks at God all day,
And lifts her leafy arms to pray;
A tree that may in Summer wear
A nest of robins in her hair;
Upon whose bosom snow has lain;
Who intimately lives with rain.
Poems are made by fools like me,
But only God can make a tree. - Joyce Kilmer

స్వంతదారులు

వాడినవో, వడిలి రాలి పడినవో

జీవితం మీద పరుచుకుని
కొన్ని చివికినవి
మరిన్ని పరిమళం మాయనివీను..
అనుభవాల మొగ్గ తొడుగుతూనే,
జ్ఞాపకాల వునికితో బరువుగా
యీ తరువు,
తన తనువు వున్నంత వరకూ మాత్రమే
నిరంతరం.

తన అనంతరం…
తదనంతరం

యెవరికీ చెందని బాటల్లో
రాలి, వాలి వుంటాయి.
జీవన సాగుకై వేరెవరో
స్వంతం చేసుకునే వరకూను.
మరి,
ఆపై తన వారెందుకు?
స్మృతులకి వీలునామాలెందుకిక?

చేరవస్తూన్న క్షణాలెన్నో

మునిమాపు, రేయి నడుమ-

ఆకాశపు అద్దం చేత బుచ్చుకుని
శ్యామ మేఘాలు దులుపుతూ,
చీకటి అంటిన చేతులతోనే
కన్నీటివో, కలలవో
కరిగిన కాలపు కాటుక మరకలు
తుడుపుతూ
మేలుకునే ఉంటాను,
వేసట తో వేచి ఉండటంలో
ఓపలేని ఆత్రం ఉప్పెన వంటిది..
తెలవారు ఝాముకి
ఏవో రంగుల తెరలు కప్పుకుని
తిరిగి అదే ఆకాశం.
అవే చేతులతో రూపాలు
దిద్దుతూ,
నా కనుల లోను, ఊహల లోను
వెలుగు జాడలు.
వెతలు కానరాని
మైమరుపు సునామీ వంటిది.
పోతే,
రేయిపవళ్ళను తారుమారు చేసే
తరుణాలు, గ్రహణాలు వస్తాయి
గతాన్ని అదుముకుని
మేఘాలు కురవాలని
గగనమంత కనులతో
ప్రళయవేళ కొరకు ప్రతీక్షిస్తూ
తెలియని రేపు లోకి
నిదుర వూతతో
చేరుకుంటాను…

వాన పదం

 దారి తప్పి వచ్చిన మబ్బులు
మూడ్రోజులుగా మకాం వేసాయి
లేగదూడలల్లే నింగి బారునా అవే..
తెరలు తీస్తూ మూస్తూ దాగుడుమూతలు
పూలమళ్ళు మడుగులైనాయి,
నిండా మబ్బు పింజెలు
ఉండబట్టలేక ముంచిన చేతులనిండా
తడిమట్టి చిత్రాలు, తళుకులు
త్రోవ పొడుగునా పూల పడవలు
గాలులకి ఆకులే అందియలు
అటుయిటూ హడావుడిగా కుందేళ్లు
ఎగురలేక రెక్క ముడిచిన తూనీగలు
ఆగలేని పాదాలకి అదుపులేదు
మనసూ వర్షిస్తూ వుందిక,
లోలోపలి వానకీ లయ లేదు
కురిసే పదాల మెరుపులే-
పగటి మిణుగురులు.

Modern MILs n' Darling DILs global geet

(అత్త లేని కోడలుత్తమురాలు రోజులు మారాయి)

పల్లవి: మిల్లెట్స్ తినే మిల్ కి కీన్వా క్వీన్ కోడలొచ్చెనే
వావ్ వావ్ వావావ్వా
కట్లెట్స్ చేసే కోడలకి కట్ షార్ట్ వంటలత్త తోడటనే
ఆహ హహ్హ ఆహహ్హా
చరణం 1: అత్తమ్మ అత్తమ్మ ఆకులతో ఆమ్లెట్ వేసేదా..చెప్పమ్మా
కాపచినో మీద క్రీం వేయించనా కూనమ్మా..
కీపిట్ సింపుల్ లేరామ్మా
(రీ మిక్స్ అబ్బాయ్ కి)
ఆవిడే మా మామీ
ఈవిడే నా బార్బీ
మస్తు జబర్దస్త్ జోడీలే
రాములో రాములా
॥ మిల్లెట్స్॥
చరణం 2: దిల్ ఓ మెరే దిల్
దానిమ్మ దాల్చిన చెక్కా చాయ్ లాటే
యిదిగో స్వీటమ్మా
ఆంటీ మై స్వీట్ డార్లింగ్
వాటే వండర్ ఇన్ హోల్ వర్ల్డ్
యు ఆర్ నీ..జంగా
(రీ మిక్స్ మావగారి కి)
బూల్ గయా సబ్ కుచ్
మై సారే లోగోంసే గావూంగా
సిర్ఫ్ ఏక్ లైన్
జాంగ్ చకా చకక్ చక్కా
॥ మిల్లెట్స్ ॥
* MIL=mother in law, DIL=daughter in law
బియ్యం దొరకకపోతేనో అనే ఊహ, ఒక అత్త కోడళ్ళ జీవిత పరిణామాలు గత 33 సం. గా చూసి సరదా గా రీమిక్స్ పేరడీ. నాతో పాడేవారెవరు? అడుగు కలిపి ఆడేవారెవరు? నవ్వు కి జడిసేవారెవరు? నిన్నని విడవని వారెవరు? రండి రేపులోకి నవ్వుల నావలో నడిచేద్దాం.

దంతసిరి

1.
ఇంటి వంట ఒంటబట్టగ
పంటి పదునుకి సొంటి ఘాటులు।
పట్టి దినుసుల గట్టి  రుచులను
పట్టు పట్టగ పెట్టి పుట్టవలె।।

సురేష్ కొలిచాల గారు సూచించిన మార్పు తో
2.
ఇంటి వంటలు ఒంట బట్టగ
పంటి పదునుకి సొంటి ఘాటులు ।
పట్టి దినుసుల గట్టి రుచులను
పట్టు పట్టగ పెట్టి పుట్టెను ।।

అభిముఖము


 తానెవరో నేనెవరో ఎరిగినంత కరుణతో
కన్నార్పనీయక కట్టిపడేసే ఆ నగవుతో
ఇటుగానో  అటెటో మరి చూపుల గాలాలు విసురుతూ
మురిపాలలో సగపాలు నాకూ పంచుతూ...!

చిగురులు

అమ్మ చేతిని విదుల్చుకుని చిందులేసే పిల్లలు 
కొమ్మ నుంచి జారిపడుతున్న యీ  చినుకులు
కేరింతల సడి కి మురిసే తల్లి 
పిట్ట పాటల పరవశించే జగతి 

గాలి కడలి లో నిశ్శబ్దపు నౌక,
వెంటాడే వెలుతురు లో చీకటి జాడ
కనుమరుగౌతున్న తరుణం

నిదురలో ముగియని కలని
పగటి యవనిక పై తీర్చిదిద్దుతూ కాలం

3/17/21

అమ్మ ఒడిలోని బిడ్డని లేవనెత్తి నిలబెట్టే తండ్రి చేతులు 
అంకురం మొదలుకుని ఆకాశాన్ని తాకే తరువుల చుట్టూ
ఈ సహస్రకోటి కిరణాలు ... 
రాకపోకల, కలివిడితనాల మేనమావలు ఆ గాలివానలు

4/4/21

పిట్టపాటల  తియ్యందనాలకై
వానలుగా వచ్చి చేరాయి మబ్బులు
తడిరెక్కల తిమ్మిరి విదుల్చుకుంటూ
ఎండపొడలోకి  ఎగిరిపోయాయా తుంటరులు 

4/7/21

Memories are arbitrary

లోక సంచారి ఒకరు
పరిమళరూపాన పూటకొక పూసత్రం లో
విడిది చేసి
వేకువఝాముకి పుప్పొడి కంబళి విసిరి కొట్టి
పయనమైనట్లుగా ఉంటుంది...
తాను తిరిగిన దారులన్నీ నాకెరుకనే!
గూడు కట్టని ఒక్కొక్క జాతి పిట్ట
కొమ్మ అంచునో, గుమ్మం మూలనో

నిదుర చేసి
పొద్దు పొడుపు వేళకి పాటతో చుట్టుముట్టి
బందీని చేస్తూంటాయి!
అంత్యాక్షరి ప్రాసలు కలుపుతూ నేనూ జతపడతా...
తలవాకిట నిలిచిపోతాను,
చుక్కలు పొదిగిన దుప్పటి కప్పుకుని
నేలని అదుముకుని
జీవన పరిమళమై తిరుగాడుతాను
కలల సానువుపై రాగమై ధ్వనిస్తాను.