వసంతానికోసారి

చీకటి మబ్బులు చిట్టి కాంతులు రాల్చేవేళ
మినుకుమినుకుమనే చంద్రుని చూద్దామంటూ
మేఘాల మునకలేసే సూర్యుని వెదకాలంటూ

వేకువజాము కి మునుపే మనసు లేచింది
చుట్టూ లోకాన్ని తడిమి చూసింది

పరుగు తీయలేని గాలులు కొమ్మల్ని కుదుపుతూ
తెరలలో నిలవలేని మంచు ఇల కి జాలువారుతూ
ఉదయ గాన కచేరికి శ్రుతి సవరించే వేళ

కొమ్మల నీడల్లో కదలాడుతూ,
మంచు పొదల్లో మెదలాడుతూ

నిలిచీ నిలవని పిట్టలు కొన్ని
మరిచిన నెలవుల తిరుగాడుతున్నాయి
పాత గూళ్ళు వెలతెల పోతున్నాయి

పరుగులు నేర్చిన కూనలేవో
గరిక పరుపుల మీద దొర్లాడుతున్నాయి
సయ్యాటలో మునిగి తేలుతున్నాయి 

వసంతం వచ్చిందా రానుందా ఎరగనట్లు

మొగ్గలు తొడిగిన మొక్కలు
చివురుల మునిగిన రెమ్మలు
చిత్రమేదో చేస్తున్నాయి

ఏడాదికోమారు 
ఇదే పదాలు పాడుతున్నాను 
పూర్తి చేయలేనని పదిలపరుస్తున్నాను

నిరుడు ముగిసిన పద్యం
తిరిగి పురుడు పోసుకున్నట్లు 
కొత్త పాదం తారాడుతూ ఉంది

యాత్ర దేముంది - తూర్పు పడమర నడుమ ఏదో ఉంది

ఆ క్షణం   
రేగి పళ్ళు మాగిన వేళలో 
నేరేడు కొమ్మలు బరువుగా వాలిన వుదయాలలో 
నిమ్మ పూల మీదుగా కదిలిన గాలిలో
నేను నిన్ను పునర్దర్శనం చేసుకున్నాను

చేమంతి మందారాల రంగుల జుగల్బందీ ముగిసాక
జాజులు మల్లెల పోరు మొదలయాక 
మామిడి పూత దాచిన భరిణె మూత బిగించాక 
రసాల కాయల హోరు వాడలకి వచ్చాక
నన్ను సాగనంపే సమయంలో 
ఆకాశం వర్షించింది

నిన్ను హత్తుకుని ఒదిగిన చెమ్మ 
నన్ను చుట్టుకుని వున్న ఆత్మీయత 
ఉమ్మడి బంధం నా కొంగు బంగారం

నేల తల్లీ, 
నీ స్పర్శ కోసం తిరిగి వస్తాను..
సశేషమైన చరితలు రాసుకుని మోసుకొస్తాను 
పాటల పోత పోసిన పిట్టనై నర్తిస్తూ 
మళ్లీ కొత్త రాగం తో పాదం కదుపుతాను

-----

ఈ క్షణం
కోయిల పాట కార్డినల్ గొంతులో ధ్వనించింది
చేమంతి వన్నె తిరిగి చేరుకుంది
ఆ సీమలో వేడికి జడిసిన శీతల పవనాల జాడ 
ఈ నేల మీద తెలిసింది
నేస్తాలు నిండు గా ఆహ్వానం పలికాయి..

తూగుడుబల్ల మీద మనసు మాత్రం 
తూరుపు పడమరల నడుమ ఒరుగుతూ వుంది

సీమాంతర యానాలు అంత సులువుగా వెనకపడవు-
వెంటవెంట వస్తుంటాయి.
అడుగులతో సాగే ఒంటె మెడలో గంటల సడి
ఎడారి దిక్కుల్లో ఆగి ఆగి తరలినట్లుగా
నిమిషాలు నడిచి వెళ్లి పోతున్నా 
జ్ఞాపకాలు ప్రతిధ్వనిస్తూ 
మరి కాసేపు ఆగుతున్నాయి…

Lovers of Trees


ఒకానొక సాయంవేళ
శరదృతువు ఛాయలు మోస్తూ
ఆకులన్నీ అనేకానేక వన్నెల్లో
పదును లేని కాంతులేవో చెదురు మదురుగా 
చిక్కబడుతున్న రవళులు- కొన్ని పిట్టలవి, కొన్ని గాలులవీ
అరుదుగా రాలుతున్న ఆకులు 
నేలకి  చేరక ఊగిసలాడుతూన్న 
తరుణం.. 
నేనూ నిలిచివున్న సమయాన
"isn't it beautiful" చిరు స్వనం
రవ్వంత చిరు దరహాసం మిళితమైనట్లు
చెట్టుని పోలిన మనిషి
కళ్ళలో రెండు పున్నముల కాంతి
ఆమె ఒకరా, ప్రకృతి ఆవహించిన ఇరువురో?
మా మాటలన్నీ మరో లోకపు పరవశం
అపుడు మరిన్ని ఆకులు రాలాయి
ఇటువైపుగా కదిలాయి
'కవితలన్నీ తారాడినట్లుంది,' అంటున్నాను
 "do you know the trees poem"
కొత్త గానం, కోయిల స్వరం ఊహించని గళం తో 
ఆమె ఆ రేయి చంద్ర కాంతి గా కమ్ముకున్నది
ఆ పాట కలకి అందని సీమకి
నన్ను తరలించింది 
కలవరించని, కలని వరించని 
కొంగొత్త నేను
ఇక మరి, కదిలి కదిలి తెల్లవార్లూ చెట్టునై 
పదాలు రాల్చుకున్నాను