కొమ్మ...!!!

వెన్నెల దయగా వర్షిస్తూ
దారి వదిలినట్లే ఉన్నా
బెదురుపోని చీకటి

గదిలోకి చొరబడి
వెలుగు చేరని దరికి

దాగిపోతూ ఉంది.
పూలమొముతో 
నిటారుగా నిలిచిన కొమ్మ
కిటికీ నీడ కట్టిన ఫలకంలో చేరి
తలవాల్చి నిలుచున్న కొమ్మలా 

కనపడుతోంది, 
ఏమీ పాలుపోని స్త్రీ ఊహలోకి వచ్చింది.
'బహుశా నా ప్రతిబింబమేన'ని భ్రమింపచేస్తుంది...

ఎదలో దీపపు వత్తి సర్ది, 
నూనె తిరిగి నింపుకుని
వదలిపోని దిగులు చీకట్లని

పట్టించుకోక
కళ్ళలో ఆశలు వెలిగించుకుని,
నీ ఊహల కొమ్మకి నా ఊసుల పూలు అతికిస్తూ-

కాలం దయతో దారిచూపితే
నీవిటుగా వస్తావని, 

నా ఆచూకీ తెలపాలని
పుప్పొడి రాగమొకటి

ఈ చుట్టుపక్కల చల్లుతున్నాను
(కొమ్మ అంటే స్త్రీ అని కూడా అర్థముంది)

శేష గీతి

'కిటీకీ నుంచి ప్రపంచాన్ని చూడాలి, ద్వారాలు తెరుచుకు వీధుల్లోకి నడవాలి,'
అని అనిపించనప్పుడు-
నీడల గుర్రాల వెలుగు జీను

గోడల మీద పరుచుకుంటుంది
      చీకటిని చిధ్రం చేసి

కంటి తెరలు తెరుస్తుంది.
ఆత్మ పథానికి సోపానాలు,
పెదవులు విచ్చుకు ఉబికే పాదాలకి

      పదములు తానైన
           కాంతి ఒకటి

నిన్ను వెంటే అంటిపెట్టుకుని ఉండి
 అనంత విశ్వంలోకి నడిపిస్తుంది...

విడివడిపోవటం!?

I dread the day I will no longer hear from someone I am morally and emotionally attached.. నేను దగ్గర ఉండగా కోల్పోయిన నా కుటుంబంలోని ఐదుగురి మరణాల వెంబడి నా జీవిత గమనం నుంచి... ఎవరైనా మనని విడిచిపోతే 'వారితో సంతోషంగా గడిపిన సంఘటనలు గుర్తుచేసుకుని నిలవాలి,' అంటారు; కానీ, చిత్రంగా అలా ప్రయత్నిస్తే మనం వారికి ఎన్నటికీ తీర్చలేని కొన్ని కోరికలు లేదా మనం నొప్పించిన సంఘటనలు తలపుకి వచ్చి "జీవితం ఇంకొక అవకాశమిస్తే మరొకలా జరిగేది, సరిదిద్దుకునేవారం," అనుకుంటాము. ఎన్ని వీలునామాలు రాసుకున్నా విడమరచలేని కొన్ని మానసికమైన లెక్కలు మిగిలే ఉన్నాయి అని తేల్చుకోవాలో, తెలుసుకోవాలో తెలియని వ్యధలో కొట్టుమిట్టాడుతాము...
కానీ, ఆ మనస్థితి రావటానికి ఆ బాధ, ఆ విడివడిపోవటం ముందుగా సంభవించాల్సిన షరతులు. అందుకే ఎవరినైనా ఏదైనా అనే ముందు లేదా ఒక చర్య జరిపే ముందు ఈ సత్యం అంతః చేతన లో ఉంచుకొనే సాధన చేయాలి అని మాత్రం అవగతమౌతుంది.

పూలు గుసగుసలాడేనని ~




అనగనగా డైనోసార్స్, ఏప్స్ కి పూర్వం, మనుషులు పుట్టక మునుపు రెండు కుసుమాలు, అక్కాచెల్లెళ్ళు వాహ్యాళికి వెళ్తారు. ఆలా చాలా దూరం నడిచాక వాళ్ళొక అందమైన లోయ ని చేరతారు. అప్పుడు చెల్లి సుమం అక్కని "మనమింకా నడవాలి కదా? ఈ లోయకి అవతల యేముందో చూడాలిగా," అని అడుగుతుంది . "నేను ఇక్కడే వేచి ఉంటాను. నువ్వు వెళ్ళి తిరిగిరా," అంటుంది అక్క. చెల్లి ప్రయాణమై బయల్దేరుతున్నపుడు పెద్ద విరి చెల్లి పూవుతో "నువ్వు తిరిగి వచ్చేప్పటికి నన్ను మర్చిపోతావా?" అని అడుగుతుంది. పయనమై వెళ్ళిపోతూ చిన్ని పువ్వు లేదంటూ సమాధానమిస్తుంది.
చాలా కాలం గడిచాక ఆ చిన్న పువ్వు ఎదిగి ఒక అందమైన అమ్మాయి గా మారుతుంది. ఆ అమ్మాయి ఒకరోజు ఆ పాతలోయకి పూలు కోయటానికి వస్తుంది. ఆమె ఒక దేవగన్నేరు కొమ్మ విరిచి ఆ కుసుమాన్ని తీసుకున్నప్పుడు ఆ పూలమొక్క గుసగుసగా "నన్ను మర్చిపోయావు ప్రియతమా?" అని అడుగుతుంది.
( I translated this story from Veettilekkulla Vazhi (The way to home) Malayalam movie I recently watched. This story is told to a 5yr old boy. The clip is from 1:10:25-1:11:45 I like to extend my thanks to Ken&Thuong that provided the subtitles.)

ఏకాంతధార!

కాలం కొమ్మన విరబూస్తున్న క్షణాలు..
రిక్త హృదయంలోకి యే ఒక్కటీ జారిపడటం లేదు.
లిప్త పాటైనా ఆ ఆచూకీ వెదకాలన్న కాంక్ష-
ఇంకా కాంక్ష పండి, కోరికలా రాలిపోయి-
అనుభూతికి జ్ఞాపకాల అస్తిత్వమిచ్చేటంత ఆర్తి మిగిలే ఉంది!