ప్రతీక్ష

పుష్పించినదేదో ఫలించటానికి ఒదిగిన క్షణమా, ఒరిగిన తరుణమా అని అచ్చెరువున మునిగే మది ఆలోచన కి ప్రతీక! జీవితం సమస్తం ఈ స్థితి...


ఆత్మోల్లాసం!

అంటే..అంత ఆనందంగా ఉంది అని అన్నమాట!  ఆత్మ బంధువు,  ఆత్మీయ స్థానం అనిగాక మా మనిషి, మనవాడు అని చెప్పాలని లేదు. 


ఉత్సాహో వ్యవసాయ ప్రతీక వంటి ఒకరిని పదిలపరుచుకునే ఓ ఊసు. ప్రకాశం బారేజ్, నాగార్జున సాగర్ డాం, ధవళేశ్వరం అంటే నాన్నగారి ఉద్యోగానుభవాల విజయపరంపర మనోయవనిక మీద నాట్యమాడుతుంది.  ఇప్పుడు విజయవాడ, గన్నవరం అనుకోగానే హర్షాతిశయం మిన్నంటుతుంది నీ వల్లే నీ వల్లే...!



జీవితం లోకి అడుగులు పడే తరుణంలో ఎవరేమి సాదిస్తామో, ఎవరెంత సవిస్తారంగా తమ తమ అనుభవం తో నలుగురికీ తోడ్పడుతామో తెలియని అమాయకత్వపు నాటి రోజుల్లో 'పలుకే బంగారం' అన్నట్లు ఉండే తను.. ఇలా తన వృత్తి రీత్యా ఎన్నెన్నో పరిధిలోనివి, ఇంకాస్త కార్యసాధన అవసరపడేవీ అధ్యయనం చేసుకుని, పూర్తి అవగాహనతో అత్యంత శ్రద్ధ వహించి సామర్థ్యం సమకూర్చుకుని, నిపుణతతో విధులు నిర్వహిస్తూ నలుగురి నోట మంచిమాట అందుకుని, పదుగురికీ సహాయకారిగా నిలవటం  నాకు ఎంతెంతో ఆనందం. 

ఎందరమో దేశం విడిచాము, తనవంటి కొందరు అక్కడే స్థిరపడి, ఇంకాస్త అభ్యుదయం సాధించటానికి పాటుపడి,  జనానికి జన్మభూమికి అందించే సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం.  ప్రభుత్వ అధికారులలో ఇటువంటివారి శాతం పెరిగే కొద్దీ జన వికాసం, జాతి విజయం తప్పక సాధిస్తాము!

నాని! సదా నీ శ్రేయస్సు, యశస్సు మనసారా కోరుకుంటూ, నీ ఆయురారోగ్యాలు మరింతగా నాకూ ప్రేరణ కావాలని మురుసుకుంటూ, నీ జీవిత ధ్యేయాలన్నీ సిద్ధించాలని నీవారమైన 'మేమంతా' అభిలషిస్తున్నాము.  మనసైన మాట మహా బరువు సుమా, అందుకే నిన్ను ఇక్కడ నాకు తెలిసిన నలుగురిలో కూడా పడేస్తున్నాను..అలవి కానివి కొన్ని బయటకి చెప్పేయాలి కదు!?

*-----*-----*-----*
ఉత్సాహః = ప్రయాసమును ఓర్చుట
వ్యవసాయః = విశేషముగా నిశ్చయించుట

మొయిలు బొత్తి

నిర్నిమేఘ ఆకాశం అమాంతంగా అల్లికల పోగుల్లా గుట్టలు పోసింది
కొలను దాచుకున్నవన్నీ బింబాలై తేలియాడాయి 
మబ్బులు పుటలుగా కవిత రాసుకుంటూ ఉన్నానా..అంతలోనే
ఆకుల్లా పరిచి ఎవరో మరి చిత్ర రచనలు చేస్తూ పోయారు...
విస్తుపోతూ నేనూ కనుల యానం చేస్తూ గడిపాను,
గుమ్మాన ఆగిన నీలి మబ్బు కన్ను గీటి కదిలిపోయేవరకు!








పొడిగింత

పంతంగా నీడల్ని పరిగెత్తిస్తూ
మొండి దేహంతో ఎండ
రూపం, రంగు లేని నీటిలోకి జారిపడింది
భళ్ళుమని నిశ్శబ్దశ్రుతితో తెల్లారింది

వంతుగా ఆకుల్నీ, కొమ్మల్నీ ఊపుతూ
మొగ్గ దేహంలోకి గాలి
రూపం, రంగు అద్దుకుంటూ ఒదిగిపోయింది
రివ్వుమని రెక్కలతో పిట్టపాట హోరెత్తింది

నీళ్ళు, పూలు నవ్వుతున్నాయి
ముళ్ళు, రాళ్ళు నీడల్ని మోస్తున్నాయి
నిండుగా ఉనికి సంతరించుకుని జాగృతి
రెండుగా చూస్తున్న అద్వైతమే స్థిరమని ఖాయం చేసింది...!