Showing posts with label బడి. Show all posts
Showing posts with label బడి. Show all posts

చతుష్షష్ఠి కళలు? తప్పదు, మరి విభిన్న వర్గీకరణలు!

"అయితే ఏమిటి? తెలుసుకుని ఏమి చేస్తావు?" అనే లోకం ఒకటుంది ఎప్పుడూ, "అయినా తెలుసుకోవాలి, తరిచి చూడాలి," అనే జిజ్ఞాసువుల సమూహం ఉంటూనే ఉంది సమాంతరంగా!

పిల్లలకి నేర్పే అవకాశం నిజానికి నాకే ఎక్కువగా లబ్ది ని చేకూరుస్తున్నట్లుంది! ఇకపోతే, తెలిసినవారికి ఒక నెమరువేత, తెలుసుకోగోరేవారికి మరొక వనరుగా...

చతుష్షష్ఠి కళలు

(1) విద్యలను 64 గా భారతీయులు గణించారు. వీటిని చతుష్షష్టి కళలంటారు.

అవి వరుసగా:

వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.

అర్థము:

1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)
2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు (1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)
3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు
4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.
5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు
6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము
7. నాటకములు
8. గానము (సంగీతం)
9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము
10. కామశాస్త్రము
11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,
12. దేశభాషాజ్ఞానం
13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.
14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు
15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము
16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,
17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము
18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము
19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం
20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము
21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము
22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము
23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము
24. పాకకర్మ= వంటలు
25. దోహళము=వృక్షశాస్త్రము
26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు
27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య
28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .
29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.
30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.
31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.
32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య
33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య
34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య
35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,
36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు. వాడుకరి:ఆనిష్.భరథ/ంఅయ ఆంగెలౌ ‎
37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,
38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,
39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.
40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.
41. వాణిజ్యము - వ్యాపారాదులు.
42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.
43. కృషి - వ్యవసాయ నేర్పు.
44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి
45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.వాడుకరి:ఆనిష్.భరథ/ంఅయ ఆంగెలౌ ‎
46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.
47. మృగయా - వేటాడు నేర్పు
48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.
49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము.
50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.
51. చిత్ర - చిత్రకళ
52. లోహా - పాత్రలు చేయి నేర్పు
53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.
54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు
55. దారు - చెక్కపని
56. వేళు - వెదరుతో చేయు పనులు
57. చర్మ - తోళ్ళపరిశ్రమ.
58. అంబర - వస్త్ర పరిశ్రమ
59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు
60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము
61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము
62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము
63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము
64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య

*-*-*-*-*

(2) మరొక వివరాల ప్రకారం...

  1. గీతం
  2. వాద్యం
  3. నృత్యం
  4. అలేఖ్యం
  5. విశేష కచ్ఛేద్యం
  6. పుష్పాస్తరణం
  7. తండుల కుసుమబలి వికారం
  8. దశనవ సనాంగరాగం
  9. మణి భూమికా కర్మ
  10. శయన రచనం
  11. ఉదక వాద్యం
  12. ఉదకాఘాతం
  13. చిత్రయోగాలు
  14. మాల్య గ్రథన వికల్పాలు
  15. శేఖర కాపీడయోజనం
  16. నేపధ్య ప్రయోగాలు
  17. కర్ణపత్ర భంగాలు
  18. గంధయుక్తి
  19. భూషణ యోజనం
  20. ఇంద్రజాలం
  21. కౌచుమారం
  22. హస్తలాఘవం
  23. వంటకాలు
  24. సూచీవాన కర్మ
  25. సూత్ర క్రీడ
  26. వీణా డమరుక వాద్యాలు
  27. ప్రహేళికలు
  28. ప్రతిమాల
  29. దుర్వాచక యోగాలు
  30. పుస్తక వాచనం
  31. నాటకాఖ్యాయికా దర్శనం
  32. కావ్య సమస్యా పూరణం
  33. పట్టికా వేత్ర వాసవికల్పాలు
  34. తర్కు కర్మలు
  35. తక్షణం
  36. వాస్తువిద్య
  37. రూప్యరత్న పరీక్ష
  38. ధాతువాదం
  39. మణిరాగాకర జ్ఞానం
  40. వృక్షాయుర్వేద యోగాలు
  41. మేష కుక్కుట లావట యుద్ధ విధులు
  42. శుకశారికా ప్రలాపాలు
  43. ఉత్సాదనే, సంవాహనే, కేశమర్దనేచ కౌశలం,
  44. అక్షర ముష్టికా కథనం
  45. మ్లేచ్చిక వికల్పాలు
  46. దేశభాషా విజ్ఞానం
  47. పుష్పశకటిక
  48. నిమిత్త జ్ఞానం
  49. యంత్రమాతృక
  50. ధారణ మాతృక
  51. మానసీక్రియ
  52. సంపాఠ్యం
  53. కావ్యక్రియ
  54. అభిధానకోశం
  55. ఛందోజ్ఞానం
  56. క్రియాకల్పం
  57. చలితక యోగం
  58. వస్త్రగోపనం
  59. ద్యూతవిశేషాలు
  60. ఆకర్షక్రీడం
  61. బాల క్రీడనకాలు
  62. వైనయికే జ్ఞానం
  63. వైజయికీ విద్యలు
  64. వ్యాయామికీజ్ఞానం

*-*-*-*-*

(3) ముచ్చటగా మూడవ విభజన పట్టిక:

బలాలు!?

నేను పిల్లలకి కొత్త విషయాలు చెప్పే ముందు ఒక పాటగా లేదా జింగిల్స్ లా నేర్పి నిదానం గా పాఠం లోకి ఈడ్చుకుని వెళ్తా: ఒక పూర్వ ఉదా: పెళ్ళి కిళ్ళీ కొడిగినహళ్ళి బిసిభెళెబాత్ (వివాహాలు, అందులో విందు ప్రత్యేకతలు, వివాహ వేడుకల్లో ప్రాంతీయ బేధాలు..గట్రా చెప్పటానికి) అలాగ ఈ బలాలకి క్రిందన 3 లైన్స్ కూర్చాను. 

అంగబలం అర్థబలం కండబలం గుండెబలమ్మ్మ్మ్
బుద్దిబలం ఆత్మబలం ముహూర్తబలం మంత్రబలమ్మ్మ్
స్థానబలం సైనిక బలమ్మ్మ్మ్

ఇక అనువాదాల్లోకి వస్తే:

1) అంగబలం- power of support ('amga' = physical support rendered by followers')

2) అర్థబలం – power of money, power of economy

3) ఆత్మబలం - self-confidence

4) ముహూర్తబలం – power of the moment

5) మంత్రబలం – power of manthra (ఈ పదం ఇప్పుడు అమెరికాలో బాగానే ప్రాచుర్యం పొందింది కనక.) 

6) కండబలం - muscle 

7) గుండెబలం - ఇది రైమింగా వుంచాను కానీ - self-confidence నే కావచ్చు 

8) బుద్దిబలం - power of intelligence

9) స్థానబలం - local support

10) సైనిక బలం - army

ఇపుడు ఈ పదింటికీ మీరంతా అక్షింతలో/దీవెనలో వేస్తే నా పనిలో పడతా!

[11) గ్రహబలం – power of stars

12) దైవబలం – By god’s will; or power of prayers. 

ఇవి కూడా కలపనా వద్దా అని ఆలోచనలో పడ్డాను.]

పాటలు, పాఠాలు, పద్యాలు, పుస్తకాలు గూర్చి ఓ టపా!

మరువం అంటారని ఒక ప్రశ్న, గుర్తుకొచ్చామా నేను నా శిష్యగణం మరి? ;) 

ఏడాదికి పైగానే అయింది మా బడి కబుర్లు చెప్పుకుని, ఈ బ్లాగులో ఏమైనా రాసుకుని. అంచేత చిన్న పలుకరింపు, నా చిన్నారుల ఊసులు చెప్పుకుందామని,  సమీప భావిలోనో, ఆ తదుపరి కాలంలోనో నా పిల్లకాయలే చదువుకుని సంబరపడతారనీను కూడా-

ప్రస్తుతం వేరే ఊరికి నా నివాసం మార్చినా, పిల్లలు దూరశ్రవణం ద్వారాగానూ పాఠాలు నేర్చుకొనటానికి, చదువుకొనటానికి సంసిద్దత వ్యక్తం చేయడంతో స్కైప్ ద్వారా బడి నడుపుతున్నాను. అదే అనుకోని మార్పు నా బడి నిర్వహణలో. పిల్లలంతా ఒక్క వారం లోపే వినటం, ప్రశ్నలు వెయ్యటం, సందేహ నివృత్తి వంటివి ఒక క్రమంలో చెయ్యటమూ అనూహ్యమైన తృప్తి.  ఒక పంతులమ్మకి ఇంతకన్నా విలువైన గురుదక్షిణ ఉండదనే చెప్తాను.

పాఠ్యాంశాలు ఎప్పటిలా నేనే కూర్చుకుంటున్నాను.  ఆ పరంగా వెదుక్కుని కొన్న కొత్త పుస్తకాలు ఇక్కడ ఉంచుతున్నాను. 

1) నా సహోద్యోగి రేమాండ్ కి ఈ భాష పట్ల నాకున్న అభిమానం వలనే నేనంటే అభిమానమని నా గట్టి నమ్మకం వమ్ముకాలేదు. అతనికి పాత పుస్తకాల విక్రయశాలలకి వెళ్ళి ఎప్పుడూ ఏవో కొనటం అలవాటు(ట). ఒకానొక అటువంటి చోటులో ఈ పుస్తకం అతని కళ్ళబడటం, పదిలం గా కొని, రెండు చాక్లెట్స్ తో కలిపి నాకు కానుక గా ఓనాటి ఉదయాన్నే నా డెస్క్ మీద పెట్టి వెళ్ళటం నన్ను ఆశ్చర్యానందభరితురాలిని చేసింది.  పోతే ఇవి పంచతంత్ర కథలన్నమాట!


పుస్తకం లోని బొమ్మలు చాలా బావున్నాయి, మచ్చుక్కి ఒకటి:
ఈ పుస్తకం గూర్చిన వివరం:





2) ఈ రెండు పుస్తకాలూ నేను Best Book Centre,Hyderabad, AP వారి వద్ద కొన్నాను





ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి ఇలా చెప్పుకుపోతే. కొన్ని:-


పోయినేడాది,

1. పాలగుమ్మి వారు స్వరపరిచిన 'సీతమ్మ వాకిట చిరుమల్లె చెట్టు చిరుమల్లె చెట్టేమొ చితుక పూసింది' పాటని వింటూ నేర్చుకుని పిల్లలు ఆ సాహిత్యాన్ని అచ్చుతప్పులు లేకుండా రాసారు.


2. జతపరిచిన పరీక్షాపత్రం తో వారి స్థాయి చూసుకుని కొత్త అంశాలు ఎంచుకున్నాను.



ఈ ఏడాది,

1. పెద్ద పిల్లలు పద్యరచన అంశాలు, లక్షణాలు,  అలంకారాలు, ఛందస్సు నేర్చుకుంటున్నారు. సామాన్య, సాంఘిక శాస్త్రాలు వాడుక భాషతో అభ్యసిస్తున్నారు, ఆంగ్లం నుంచి తెలుగు కి, తెలుగు నుంచి ఆంగ్లానికి వాటిని అనువాదాలు చెస్తున్నారు (అమెరికా అధ్యక్షుని ఎన్నిక, స్ట్రాటస్ మేఘాలు...)

2. చిన్న పిల్లలు ఆ అక్కలు, అన్నల బాటలో నడుస్తున్నారు. వాక్య నిర్మాణం, కథలు చదవటం, సంభాషణలు నేర్చుకుంటున్నారు

ఇవండి ఇప్పటికి మా బళ్ళో పిల్లలకి నేను నేర్పుతున్నవి, పిల్లల వలన నేను నేర్చుకుంటున్నవి. పనిలో పనిగా సంస్కృతం సాధన మొదలుపెట్టాను. నేను గురువులుగా ఎంచుకున్న వారి తలతింటున్నాను నా పుష్టికి

అన్నట్లు నా బడి ఐదవ సంవత్సరంలోకి అడుగిడింది, అంతలోనేనా అనిపిస్తున్నా గానీ... 

తెలుగుతల్లికి మల్లెపూదండ, పంతులమ్మకి పటికబెల్లం



“భారతావని జన్మమందిన భవ్య భారత బాలలం...” వింటూంటే మనలో కొందరికైనా చిన్ననాటి దేశభక్తి గీతాలాపనల జ్ఞాపకాలు, వాటి తాలూకు తన్మయత్వం కలుగదూ? ఇంచుమించు అదే స్థితికి తీసుకువెళ్లారు నా బడి పిల్లలు, “తెలుగక్షరాలు కలకూజితాలు వాగ్దేవి వీణాస్వరములు” అని పాడుతూ నర్తిస్తూ. అసలు వాళ్ళనేకన్నా నేనే వెళ్ళాను అనవచ్చును. మూడేళ్ళ నాడు నా తెలుగు బడి మొదలుపెట్టినపుడు అనుకున్నట్లుగానే ఇంతదాకా నడపగలిగాను. ఏమి నేర్పాలి, ఎలా నేర్పాలి అన్నవి పూర్తిగా నా ఆలోచనలోనే రూపు దాల్చాయి.

తొలినాళ్ళలో - అప్పట్లో నా కవిత నొకదాన్ని ఘాటుగా విమర్శిస్తూ వచ్చినా తదుపరి కాలం లో - నా బడి విషయకంగా జలసూత్రం విక్రమార్క శాస్త్రి - జవిక్ శాస్త్రి మాస్టారు (పూర్తి వివరాలు తర్వాతి టపాల్లో) కనబరిచిన శ్రద్ద, అలాగే అవటానికి ఐటీ రంగాన స్థిరపడినా విశ్వవిద్యాలయాల్లో బోధన చేస్తూ, తెలుగు సాహిత్య రచనలు, సమీక్షలు, పరిశోధనలు, వ్యాసాలు గరిపే స్నేహితులొకరు నా బడి తొలి బ్లాగులో ఇచ్చిన వివరాలు, పద్దతులు అవీ చదివి
"some of your teaching techniques are very innovative and interesting."
అంటూ ఇచ్చిన అభిప్రాయం తగు ప్రోత్సాహాన్నిచ్చిన విషయాల్లో కొన్ని. పోయిన ఆదివారం మా తొలి సాంస్కృతిక ప్రదర్శన ముగిసింది. మచ్చుక్కి కొన్ని చిత్రాలు ఇస్తున్నాను. ఇవి మా సంబరాల చిహ్నాలు.
గురుస్తోత్రం పఠించటానికి సిద్దపడుతూ...
ప్రదర్శన ముగిసాక ధన్యవాదాలు సమర్పిస్తూ...

తీపి గురుతుల పటికబెల్లం పలుకులు పంచుకుంటూ...
ఇన్నాళ్ళ స్మృతులు రాసుకోవాలి. అవి నా పిల్లల భావి దశలో నెమరువేతకీ ఉపయోగపడాలి. అపుడు మీకూ చెప్పకనే చెప్పేస్తానుగా. అందాకా ఆగండి మరి!

బాలానందం - బ్రహ్మానందం

మరువం - ఎవరం మరవగలం? ఆ చిన్నప్పటి ఆటపాటలు. పాలబువ్వ కూరేస్తూ అమ్మ పాడిన పాటలు. చిన్న మావయ్యో, పెద్దత్తో ఆడించిన ఆటలు. ఆటల తగవులు. తప్పుకొక మొట్టికాయ తో తాతయ్యో/నాన్నారో అలవాటు చేసిన దినపత్రికల పఠనం, పద్యాల వల్లింపు. పాఠశాల ఊసులు. గోడకుర్చీ వేసిన బిక్కమొహాలు. అమ్మమ్మ చేతి వంటలు. పండుగ వేడుకలు. కొత్త బట్టల మురిపాలు. ఆకతాయి అల్లరులు. వచ్చీ రాని ఎక్కాలు. వెక్కిళ్ళతో ఎకసెక్కాలు.

అసలు తెలుగు నేర్చుకున్నదలాగే కాదూ? ఆ తర్వాతేగా అయ్యోర్లు, పంతుళ్ళు...పుస్తకాలు...అవధానాలు, అష్టపదులు. ;)

సరే ఇంత ఉపోద్ఘాతం ఎందుకూ అంటే మరందుకే - తెలుగు నేర్పేందుకు. సాంప్రదాయం, సంస్కృతి గూర్చి నేర్చినవీ, నేర్పాల్సినవీ తిరగదోడుకుని, మీచేత అక్షంతలు వగైరాలతో పాటుగా మరిన్ని పాఠాలు రాబట్టుకునేందుకు.

మా మరో బాలానందానికి స్వాగతం.

మా తెలుగుబడి మొదలై రెండేళ్ళు కావస్తుంది. నా తెలుగుబడి పిల్లలకి ప్రోత్సాహంగాను, విషయ సమాచారాలు ప్రోగు చేయటానికిను, మా జన్యా విద్యా సేవా సంస్థ విశేషాలు - ఇలా కలగూరగంప కబుర్లకి ఒక వేదిక అవసరపడింది. అందుమూలాన ఈ బ్లాగు మొదలుపెట్టాను.

నా బుడతలిరిగో...అమ్మో, అల్లరి పిడుగులు సుమా!





పాఠాలతో పాటుగా ఆటలు యమజోరుగా ఆడేస్తూ...





మాతో పాటుగా మా ఆటపాటలు, పాఠశాల కళలు మీవీ అనుకుని వస్తూ ఉండండి. కబుర్లు విన్నా, చెప్పినా మీ ఇష్టం.

బాలానందం బ్రహ్మానందం
భాషాభిమానం గడ్డపెరుగన్నం
బ్లాగరుచందం పూసమిఠాయిపొట్లం
ఆడేవారూ రారండోయ్
చూసేవారూ రారండోయ్
రాసేవారూ రారండోయ్

ఏడాది గడిచిపోయాక, ఎదుగుదల కనపడుతున్నాక..

మరిక ఈ బ్లాగులో ఇది చివరి టపా. ఇక్కడ వ్యాఖ్యలతో, వ్యక్తిగత ఈ-మెయిల్స్ ద్వారాగా ప్రోత్సాహించిన అందరికీ ధన్యవాదాలు - ఉషారాణి.

ఉగాది తో నా తెలుగు బడి మొదటి ఏడాది పూర్తి చేసుకుంది. నిజానికి ఈ బ్లాగు ఒక ఏడాది పాటు మా బడి ఎదుగుదల తెలిపే పట్టిక గా రాసినది. దీన్నుంచి useful and compelling content అన్న ప్రాతిపదిక ఆధారంగా చెప్పింది ఏమీ లేదు. కాకపోతే, తగు సలహాలు, సూచనలు అందటానికి నాకు ఉపయోగపడింది. పిల్లలలో క్రమేణా శ్రద్ద, ఆసక్తి పెరిగాయి. క్రొత్తవారు చేరారు. "నేను బీహార్ లో పెరిగాను, నాకు సరీగ్గా తెలుగు రాదు, కానీ మా పాపకి నేర్పించాలని ఉంది, పంపనా?" అని ఒక తల్లి, భారతదేశానికి తిరిగి వెళ్ళిపోతున్న ఇద్దరు పిల్లలూ "నాకు ఇంకా ఈ బడికి రావాలనుంది" అనటమే నాకు గురుదక్షిణ. అలాగే పాతికేళ్ల యువకుడొకరు ఈ చిన్నారులతో పాటుగా కూర్చుని పాఠాలు నేర్వటం ఒక సరదా. నేను కూడా మరింత ఇష్టంగా వాళ్ళు నేర్చుకునే పద్దతులు అన్వేషిస్తూ, నాకూ ఇదొక అధ్యయనంగా ఉపయోగించుకున్నాను. జాలంలోని ఎన్నో విషయాలు నేను చదివి, వారికి విశదీకరిస్తున్నాను.

ప్రస్తుతం:
- వేమన, సుమతీ శతకాలు వల్లె వేయటం మొదలు పెట్టాము.
- గుణింతాలు, సంయుక్త అక్షరాలు గుర్తుగా/అచ్చుతప్పులు లేకుండా వ్రాస్తున్నారు.
- పుస్తకాలు చదవగలుగుతున్నారు. పండుగలు, వేడుకలు - ఎందుకు చేస్తాము? ఎలా జరుపుతాము? వంటి వివరాలు, మన సంస్కృతి, కట్టుబొట్టు, భాష, ఆహారం, సాంప్రదాయాలు
- కుటుంబ వాతావరణంలోని విషయాలు, చుట్టరికాలు - ఇలా వారికి తెలియాల్సినవి అని నేను నమ్మినవి నేర్చుకుంటున్నారు/తెలుసుకుంటున్నారు.

ప్రతి వారం ఒక ఇంటరాక్టివ్ సామూహిక సాధన - చిట్టిపొట్టి కథలు (మన సామెతలు, పంచతంత్ర, కొంగ-నక్క, కాకి-పిచ్చుక వగైరా); పాటలు (లెక్కలేనన్ని, వీలైనంత అభినయం/నృత్యం కలిపి); నాటకాలు (ఇవి అప్పటికప్పుడు అంశం తీసుకుని వారితోనే సంభాషణలు రాబట్టటం);ఆటలు (వైకుంఠపాళీ/అష్టాచెమ్మా/వామనగుంటలు/..)

నాకు తోచిన మార్పులు, చేర్పుల వలన వారిలో బిడియం తగ్గి, నేనంటే నేనని ఉత్సాహంగా పాల్గొనగలుగుతున్నారు. ఈ ఏడాది మొదట్నుండీ "Student Of The Month" బహుమతులు ఐదారు ఏళ్ళలోపు చిన్నారులే గెలుచుకున్నారు.

ఉదాహరణలు:

పిల్లలకి కూరగాయల పేర్లు పెట్టి, వాళ్ళకి నచ్చే కూర పేరు చెప్పించటం [బెండకాయ - నాకు బెండకాయ వేపుడు ఇష్టం/ వంకాయ - వంకాయ మసాల మా అక్కకి ఇష్టం/ కాకర - మేము తినము], లేదా మేము చెప్పిన రెండు కూరగాయలు చేతులు కలపటం [పాలకూర, టొమాటో; సొరకాయ,ములక్కాయ]. ఇదే ఆట దినుసులు/పప్పుధాన్యాలు తో పొడిగింపు.

అంకెలు ఇచ్చి ఒక్కొక్క అంకెకి వాళ్ళ అవగాహనకి తగిన విశేషణం, వివరాలిస్తూ చర్చలు - రెండు/జత (పౌర్ణమి-అమావాశ్య; రాత్రి-పగలు), మూడు (త్రిమూర్తులు), నాలుగు దిక్కులు, ఐదు (పంచేంద్రియాలు, పంచపాండవులు),..... తొమ్మిది (నవ గ్రహాలు)

రూపు ఇచ్చి వస్తువులు కనుక్కోవటం, బొమ్మలు గీయటం, రంగులు అద్దటం - గుండ్రం - బఠాణి, బంతి, గోళీ...

ఒక పాట వినిపించి/సన్నివేశం చూపించి - అవి పలకల మీద వ్రాయటం/అందులోని వ్యక్తుల సంబంధాలు, సంబాషణలు దేని గురించి అన్న ప్రశ్నోత్తరాలు.

ఈ ఏడాదికి సరిపడా నాకు అంశాలు సిద్దంగా ఉన్నాయి. వాళ్ళతో పాటుగా నేనూ ఇంకా నేర్చుకోగలవి చాలా ఉన్నాయి. ఇలా ఆ బడిని నిరాటంకంగా కొనసాగించగలననే నమ్మకం.


నాకు ఈ సంకల్పం కలగటానికి ఆధ్యాపకవృత్తి పట్ల గల గౌరవం, ఇష్టం కారణమైతే, మీ పిల్లలతో పాటుగా మా వాళ్ళకీ చెప్పండి అన్న తల్లిదండ్రుల అభిమానం మరో కారణం. ఈ ద్వారాగా వస్తున్న ఆదాయం విద్యార్థులకీ, ఆధ్యాపకులకి శిక్షణ ఇప్పించటానికి http://janyaa.org/projects.php వినియోగపడటం అందరికీ ముదావహం.

సెలవిక.

ఇక పంతులమ్మకి పాఠాలు!

నవ్వులు పంచే పాఠాలు నేర్చుకోవాలనుందా? కాస్త ఇది చదవండి మరి.

జనవరి నెల కాస్త చలికి వణుకుతూ, బుల్లి బుల్లి బన్నీల్లా, టెడ్డీ బేర్ బొమ్మల్లా, పాపం, మానకుండా వచ్చారు అన్ని క్లాసులకీ దాదాపుగా. మానినవాళ్ళ మాటలివి.

"ఏమ్మా ఎందుకు రాలేదురా?"

.. నేను "అదుర్స్" సినిమాకి వెళ్ళాను. [నేను అదిరిపడ్డానని చెప్పాలా?] :)
.. అమ్మ షాపింగ్ లో లేట్ చేసి నా క్లాస్ మిస్ చేసింది
.. నాకు నిద్ర వచ్చింది
.. మా డాడీకి టాటా చెప్పటానికి ఏర్పోర్ట్ కి వెళ్ళాను

మంచి పంతులమ్మని కనుక "దొంగ జ్వరాలు" రావు వీళ్ళకి. :) రావాలనే పరుగులు తీసి వస్తారు. పదిమంది పిల్లకాయలు, ఒక గురువాంటి అని లెక్కలూ వేస్తారు. ;)

ఈ నెల అంతా పదాలు వల్లె వేయటం, వ్రాయటం మీదనే సాధన జరిపాము.

నేను పదాలు ఇలా విడగొట్టి వ్రాయటం నేర్పాను.

౧. ముందుగా రోమనైజ్డ్ పదంగా వ్రాసి విడగొట్టటం.

iTuka -> i|Tu|ka

౨. తర్వాత ఒక్కో అక్షరం కూర్చటం
i = ఇ
Tu = ట + ఉ = టు
ka = క

iTuka = ఇటుక

ఆ పై విధంగా ప్రతి గుణింతానికీ పదాలు, దాదాపుగా అన్ని హల్లులు వాడి నేర్చాము.

మరి రెండు ఉదాహరణలివి.

bhaarya -> bhaa|rya

bhaa = భ + అ = భా

r!ya = ర ++ య = ర్య [వాళ్ళకి గుణింతం కి వత్తుకి తేడా ఇలా నేర్పాను]

bhaarya = భార్య

attammaa -> a|tta|mmaa

a = అ

t!ta = త + త = త్త

m!maa = మ + అ ++ మ = మా ++ మ = మ్మా

attammaa = అత్తమ్మా

నెలాఖరుకి పిల్లల స్థాయి ఇది.

వైష్ణవి, సాహితి, స్నేహ,నేహ, మేఘన, స్ఫూర్తి, అనీష(సంతు): ఈ ఏడుగురు పిల్లలు "అమ్మ మాట చల్లన, ఆవు పాలు తెల్లన..." పాట మొత్తం తెలుగులో వ్రాయగలిగారు.

శ్రీవల్లి, అలేఖ్య, అనూష, అనీష: నలుగురు తేలిక పదాలు వ్రాయగలుగుతున్నారు.

లలిత్, తేజస్, సంహిత్ :
ఈ ముగ్గురు అక్షరాలు వ్రాస్తున్నారు. వీళ్ళు మరీ బుజ్జాయిలు కనుక ఇదే పెద్ద జంప్. మరదే కదా మగపిల్లలు వెనకపడిపోయారు, వెనగ్గా పుట్టారు కాదా మరి. ;)

***************************************
వ్యతిరేక పదాలు : నేను నేర్చిన పాఠాలు

పాత-కొత్త, పెద్ద-చిన్న, పొడుగు-పొట్టి, ఉంది-లేదు, పైన-క్రింద, లోపల-బయట

ఈ వరకు నేను చెప్పి ఇక వాళ్ళని చెప్పమంటే ఇదిగో ;)

పుట్టింది - చచ్చింది [ ఈ మాట కి అంతా నవ్వే సరికి, ఇది ఇదేదో గొప్ప ప్రయోగమనుకుని..]
వచ్చాడు - చచ్చాడు [నేను నవ్వి నవ్వి చచ్చిపోయాను నిజ్జంగా.. ఇది సినిమా పరిజ్ఞామని వేరే చెప్పాలా?]
బతికింది - చచ్చింది [ఆరేళ్ళ సంహిత్ ఈ మాట చెప్పటం వింతే సుమీ!]
అమ్మాయి- అబ్బాయి [ఇదెక్కడి లెక్కబ్బా! ;)]

***************************************

నెమరువేత: పది పదాలు వల్లె వేయించి, తిరిగి చెప్పమన్నాను.

దాదాపుగా అందరికీ ఐదారు పదాల వరకు గుర్తున్నాయి. ఇద్దరు మూడు, మరిద్దరు ఎనిమిది చెప్పారు. ఇది వాళ్ళలో జ్ఞాపకశక్తికి కసరత్తు.

***************************************
జోడు పదాలు : ఇవి వాళ్ళకి తమ చుట్టూ పరిసరాల్లో చూసేవి గొలుసుకట్టుగా రావాలని నేర్పాను.

పిల్లి-ఎలుక; పాలు-పెరుగు; మొక్క-పువ్వు; కాయ-పండు; ఉప్పు-కారం

***************************************

లెక్కలు పెద్దగా చేయలేదు. నూట పదహార్లు, వెయ్యినూట పదహార్లు వంటివి చెప్పుకుని, వందల్లో అంకెల్ని తెలుగులో చెప్పటం ఎలాగో సాధన చేసాం. కొద్దిపాటి కూడికలు కూడా.

***************************************

పాటలు: ఒకటీ అరా పాడినా పైన సాధనకే పెద్దపీఠ ఈ నెల.

త్వరలో ...

ఫిబ్రవరి నెల నుండి అంతా రైటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. దాదాపుగా అన్నీ మన రాష్ట్రానికి చెందిన అంశాలే. ప్రదేశాలు, నదులు, వృక్షాలు. వివరాలు వచ్చే నెలాఖరుకు...

క్రిస్మస్ సెలవలకి వెళ్ళేముందు నా తెలుగుబడి కబుర్లు!


క్రిస్మస్ సెలవలు రానున్న కారణంగా ఈ నెల కేవలం రెండు వారాలు మాత్రం క్లాసు ఇచ్చాను. మిగిలిన మూడు వారాలు పంతులమ్మ డుమ్మా కనుక నా బుడుగులూ గప్ చుప్ ;) వివిధ కారణాలతో ముగ్గురు, నలుగురైనా రాలేకపోతున్నారు. కానుకలు మాత్రం అందరికీ పదిలం. మారి నాకో? :(
వీళ్ళ కోసం అలా షాపింగ్ చేసి, గిఫ్ట్ రాప్ వేయటం నాకు అదో సంతోషం. లోపల 2010 కాలెండర్, కాండీస్, కీచెయిన్ + పెన్, పెన్సిల్, మార్కర్ వుంచాను. అన్నీ వాళ్ళకి ఉపయోగపడే వస్తువులే.

ముందుగా దశరా, దీపావళి సమయంలో నేర్పిన పండుగ, వేడుక, సంబరాలు, ఉత్సవాలు గురించి మాట్లాడాక క్రిస్మస్ ప్రస్తావన తెచ్చి, అందరినీ ఆ చర్చలో పాల్గొనేలా చేసాను. కనీసం సగం మందికి చాలా విషయాలు గుర్తున్నాయి. పైగా కళ్యాణం, అభిషేకం వంటి క్రొత్త పదాలు కూడా [మరలా కాస్త నటీంచపోతే నాకు నేర్పరు వాళ్ళు :)] చెప్పారు. ఇదొక కిటుకు, వాళ్ళకి తెలిసినవి చెప్పించటానికి కొన్నిసార్లు తప్పదు.

పదకుండు మంది నవ్వుల కాంతులే సిరి దీపాలు

Align Center ఇది నా పుత్రికా రత్నం అలంకరించిన క్రిస్మస్ ట్రీ
అల్లరికి మాత్రం అందరూ సై సై - ఒకరిని మించి ఒకరు


పగలు కూడా శోభామయమే మా ట్రీ

ఇక పాఠాల్లోకి వెళ్తే, థాంక్స్ గివింగ్ సెలవల గురించి కానీ, వాళ్లకి నచ్చిన ఏదైనా అంశం గురించి ఒక్కొక్కరితో రెండు నిమిషాలు మాట్లాడమన్నాను. భలే చెప్పారు, కొందరు భవిష్యత్ లో యూనివర్సిటీ లో పెద్ద ప్రొఫెసర్ అవుతామని, మరొకరు పేద్ద ఉద్యోగం చేస్తామని ఇలా ;)

.. గుణింతాలు వల్లె వేయించకుండా పదాలతో ఒకేసారి నేర్పాను. దాదాపుగా అన్ని శబ్దాలకీ ఏదో ఒక పదం పట్టగలుగుతున్నారిప్పుడు.

ఉదా: "క" గుణింతం:

కల, కాకి, కిస్, కీస్, కుక్క, కూర, కృష్ణ, క్రూరమృగం, కెటిల్, కేక్, కొన్ని, కోతి, కైట్, కంచం

ఇప్పుడు గుణింతాలు, వత్తులు, సంయుక్త అక్షరాలు [ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు] కూడా దాదాపుగా చెప్తున్నారు.

.. మరికొన్ని పదాలు చాలా కూలంకషగా తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మారుస్తూ, వ్యాక్యాల్లో కూడా ప్రయోగించి నేర్చుకున్నాము. ఇవి మాత్రం ఉద్దండపండితులైపోయారు.

ఎవరు, ఎలా, ఎట్లా, ఏమిటి, ఏంటీ, ఏమని, ఎంత, ఎన్ని, ఎక్కడ, ఎందుకు, ఎందరు, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎందుకైనా, ఎన్నడూ, ... ఇలా చాలా సందర్భాన్ని బట్టి వాడే పదాలు.

.. లెక్కల్లో - ఒకరు, ఇద్దరు... ఏడుగురు ఇలా మొదలైన లెక్క ఎనిమిది సుమారుల్లో "ఎనిమిది మంది" కి మారటం. వంద తర్వాత నూటఒకటి కి మారటం వగైరా నేర్చాము.

ఇవి కాక ఒక మాటకో, పాటకో అభినయించటం కూడా చేసాము. అన్నీ వ్రాయను అంత ముఖ్యంగా అనిపించటం లేదు. కానీ అంతా నాకు హగ్స్ ఇచ్చి వచ్చే యేడు కలుస్తామని వెళ్ళారు.

నవంబర్ నెలలో నేర్చిన పాఠాలు

*** వచ్చే వారం "థాంక్స్ గివింగ్ సెలవుల" వలన క్లాస్ లేదు. ఇవి నవంబర్ నెల పాఠాల వివరాలు.

తెలుగు పాఠాలు విదేశంలో పెరుగుతున్న పిల్లలకి చెప్తున్నవి కనుక దాదాపుగా వాళ్ళంతా అతి తక్కువగా తెలుగు మాట్లాడివుంటారు కనుక, పిన్న వయస్కులు కనుక పాఠాలు కాస్త క్రొత్తగా ఆట, పాటలు కలిపి చెప్తాను. ఈ విధంగా వాళ్ళలో క్లాసుకి రావాలన్న ఉత్సాహం కనపడుతుంది.

.. అక్షరమాల లోని అచ్చులు, హల్లులు అన్నీ పెద్ద పిల్లలు గుర్తించ గలిగి, పలికి, సరళమైన పదాలు, వాక్యాలు వ్రాయగలుగుతున్నారు.
ఉదా: గారెలు, నాకు పాలు కావాలి

.. మనం నేర్చుకున్నట్లుగా కాక కాస్త మార్పుతో నేర్పుతున్నాను.
ఉదా:
** సున్న వ్రాసి, దాన్నుంచి వచ్చే అక్షరాలు ఒక సమూహం లో - మ,య, ప, వ, అ, ఆ, ర ....
** డబ్ల్యు వ్రాసి దాన్నించి వచ్చే అక్షరాలు - చ, ఐ, ఉ, జ ...
** యెస్ వ్రాసి - క, క్ష

.. అక్షరాల తేడాలు తెలుసుకున్నారు. ఒకటి చెప్తే దానికి క్లోజ్ కజిన్ గురించి చెప్తున్నారు.
ఉదా: స, న; ప, వ; మ య

.. వత్తులు తెలుసుకున్నారు.

.. గుణింతాలలోని ఎక్సెప్షన్స్ దాదాపుగా గుర్తుపడుతున్నారు.
ఉదా: క -కు; ర - రు; వ -వు [మ అని ఎందుకు వ్రాయరు?]

.. వత్తులు, గుణింతాలు కలిపిన అక్షరాలు పలకటం, అవి వున్న పదాలు గుర్తించటం
ఉదా: స్నేహ, స్ఫూర్తి, జన్యా, అమ్మమ్మ, అన్నయ్య, నేర్పే...

.. చిన్నారులు [ఐదారేళ్ళ వయసు వారు] కూడా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.

.. ఇప్పుడు ఇద్దరిద్దరిని కలిపి టీం వర్క్ చేయిస్తున్నాను.

.. పాట:

- అమ్మ కు జై జై

.. కథ:
- చాలా చెప్పుకున్నాం. మీకు అవన్ని చెప్పం. ;)



అక్టోబర్ పాఠాలు

ఈ నెల పిల్లలంతా తిరిగివచ్చారు. ఇప్పుడు మా బళ్ళో పిల్లలు, పంతులమ్మల పేర్లివి. ;)

పంతుళ్ళు-పంతులమ్మలు:

అలేఖ్య
అనీష
అనీష [సంతు]
అనూష
మేఘన
నేహ
వైష్ణవి
స్నేహ
సాహితి
సంహిత్
స్ఫూర్తి
శ్రీవల్లి
లలిత్
తేజస్

పిల్ల:


నేనే ;) - వాళ్ళంతా ఇప్పుడు నాకు పాఠాలు నేర్పేవారే ...

********************************************

ఈ నెల ఎన్నో చేసాం. అన్నీ తెలుపలేనేమో. అయినా చిన్న ప్రయత్నం.

.. మా లేక్ లోని చేపలకి బ్రెడ్ వేయిస్తూ వాళ్ళతో ఆ చుట్టూ పరిసరాల మీద వ్యాఖ్యానం చేయించాను.
ఉదా: చేపకి రొట్టె పెడుతున్నాను; ఇక్కడ పక్షులు వున్నాయి.

.. జంతువులు, పక్షులు పేర్లు నేర్చుకున్నాము

.. ఒక్కొక్కరికి ఒక అంశం ఇచ్చి రెండు నిమిషాల చొప్పున మాట్లాడించటం

.. దసరా పండుగ ఎందుకు చేసుకుంటాం?

.. ఒకరు చేసే మూగ సైగని మరొకరు చూసి అర్థం చెప్పటం.

.. కూరగాయల పేర్లు - వాటితో ఒక కథ - దోసకాయంత దొంగోడు

.. అక్షరాలు వ్రాయటం లోని తేడాలు వివరించాను
ఉదా: ల [ఒకటే గీత], స [రెండు కానీ కలవవు], క [రెండు గీతలు కలిపి వ్రాయటం]

.. పదాలు వాడి నేను చెప్తే వాళ్ళూ కొన్ని గొలుసుకట్టు పదాలు కూర్చటం
ఉదా: చెరువులో చేపలు, మొక్కమీద పువ్వులు

.. ఉచ్చారణ దోషాలు పోవటానికి కష్టమైన పదాల సాధన
ఉదా: [పెళ్ళి, కిళ్ళీ, కొడిగినహళ్ళీ, బిసిభళేబాత్]; [కాకర, కీకర, కీసర, బాసర] ... ఇలా గుక్కతిప్పుకోకుండా వల్లెవేయటం :)

*********************************************
పాట:
.. చిట్టి పొట్టీ మిరియాలు
.. దేవీ స్తోత్రం
.. పిల్లల చేత సినిమా పాటల్లోని పదాలు గుర్తింపచేయటం


సెప్టెంబర్ పాఠాలు

ఈ నెల విశేషం: స్కూల్లో వారికి క్రొత్త తరగతి మొదలుపెట్టినట్లే నేను వారి చేత వ్రాయించటం మొదలు పెట్టాను. :)

అందరికీ చిన్న వైట్ బోర్డ్, ఇరేశబుల్ డ్రై మార్కర్ కానుకగా ఇచ్చాను. అదీకాక వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ చూసి అందరికీ మార్కర్స్ సెట్ ప్రెసెంట్ చేసాను. ఈ చిన్ని చిన్ని సరదాలు వాళ్ళలో నేర్చుకోవాలన్న ఉత్సాహాన్ని పెంచుతాయని నా ఆలోచన.

.. మొదట వాళ్ళతో అచ్చులు వ్రాయించి, ఆ తర్వాత వ్రాయించిన రెండక్షరాల పదాలు మచ్చుక్కి కొన్ని:

అల, తల, వల, కల, జడ, ఆట, పాట, పాలు

.. వత్తులు కలిపి, రెండు అక్షరాల శబ్దాలు కలిపి పదాలు

అక్క, అత్త, అట్ట, నవ్వు, పువ్వు, చిక్కని, నీళ్ళు

****************************************

పాటలు:

.. బుర్రు పిట్ట బుర్రు పిట్ట
.. చిట్టి పొట్టి మిరియాలు
.. ఒప్పులకుప్ప వయ్యారిభామ

వేసవి నెలల పాఠాలు

ఈ వేసవి లో క్లాసులు చాలా ఇర్రెగ్యులర్ గా జరగటం తో వచ్చే యేడు వేసవికి తెలుగు స్కూల్ కి కూడా సెలవలు ప్రకటించాలని నిర్ణయించుకున్నాను.

ఇక్కడ మేము విలైనంతలో నేర్చుకున్న పాఠాలు జతపరుస్తున్నాను. మీ పిల్లల పుస్తకంలో పూర్తి వివరాలు వున్నాయి.


.. అచ్చులు ఉచ్చారణ వచ్చాక హల్లులతో కలిపి గుణింతాలుగా పలకటం.

ఉదాహరణకి అ - క; ఆ - గా; ఇ - సి; ఈ - టీ ఇలాగన్నమాట.
.. పైన శబ్దాలు వాడిన పదాలు

ఉదా: నాకు, నీకు, మేము, మనము, మీరు, వారు, వీరు

.. పదాల్లో వివిధ అర్థాలు

ఉదా: ఇక్కడ - అక్కడ - ఎక్కడ; ఎందుకు - అందుకు; ఇది-అది-ఏది

.. పదాలు వాడకం

ఉదా: నీతో, నాకు, మీ కోసం

.. వాళ్ళు రోజూ గమనించేవి

ఉదా: చంద్రుడు, అమావాస్య, పౌర్ణమి, నెలవంక.

ఇవి నేను బొమ్మలుగా గీసి, వాళ్లతో రంగులు దిద్దించి, పలికించటంతో గుర్తు పెట్టుకునే అవకాశం ఎక్కువ.

.. ప్రకృతి/నేచర్ లో వారు గమనించేవి

ఉదా: భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, మేఘాలు, మట్టి, వాతావరణం.

******************************************************

పాటలు:

.. చుక్ చుక్ రైలు
.. కాకి కాకి
.. అమ్మ మాట చల్లన

05/02/09: క్లాసు వివరాలు

చాలావరకు పిల్లలు వేర్వేరు కారణాల వలన రాలేకపోయినా, ముదుగా అనుకున్నట్లు పరీక్ష, సమీక్ష చేసాను.

మూడు సంవత్సరాల ఈల, సంహిత్ చెల్లి, అన్ని పాఠాలు వాళ్ళ అన్నతో సమంగా వల్లెవేసి తిరిగి మాకు వినిపించటం నాకు అత్యంత ఆశ్చర్యానందాల్నిచ్చింది.

అలాగే తేజస్ మొదటిసారిగా నేను పాడతాను అని "ఏనుగు ఏనుగు నల్లానా.." అని చక్కగా చెప్పటం కూడా నాకు పిల్లలకి నచ్చే తీరుగా పాఠాలు చెప్తున్నానన్న సంతృప్తినిచ్చింది.

తాబేలు-కుందేలు కథ మళ్ళీ చెప్పుకుని, కాకమ్మ-పిచ్చుకమ్మ కథ చెప్పుకుని, ఆ రెండిటిలోని నీతి సారాంశం తెలుసుకున్నాము.

కాసేపు మా పెరట్లోని చెరువు వొడ్డున గడిపి, చేపలు, కప్ప పిల్లల్ని చూసాము. పక్షులని గుర్తు పట్టాము. ఇంకాసేపు బంతాట ఆడాము. పిల్లలకి ప్రకృతి పట్ల ఆసక్తి, గమనించటం నేర్పే ప్రయత్నమిది. వాళ్ళంతా చిన్ని కళ్ళనిండా సంబరం నింపుకుని, గల గల కాబుర్లు చెప్పటం ఇంకాస్త ఆనందం.

మొత్తంగా తెలుగువెలుగు తన కిరణాలు ప్రసురింపచేస్తుంది. దేశభాషలందు తెలుగు లెస్స.

04/25/09: క్లాసు వివరాలు

హాజరు attaendance తో పాటు మొదలైన చిలిపి అల్లరితో మొదలుపెట్టామీరోజు. లలిత్ ఎంతో ముద్దుగా lolly pop అంటూ తన హాజరు పలకటం బావుంది.

ముందు క్లాసులో ఇచ్చిన హోంవర్క్ అందరివి కనుక్కున్నాను. సాహితి వారాల గురించి చాలా బాగా వ్రాసింది. నేహ చాలా చక్కని చిత్రం తెచ్చింది. అలాగే అందరు పిల్లలు ఆసక్తిగా తమ తమ వర్క్ గురించి చెప్పారు.

నేర్చుకున్న పాఠం: హల్లులు Consonants. ముందుగా పరుషమైనవి harsh sounding క, చ, ట, త, ప లు చెప్పటమైంది. అలాగే అచ్చులు Vowels దిద్దటం నేర్పాను.

నేర్చుకున్న పాట: చుక్ చుక్ రైలు వస్తుంది ..

పైవారం సమీక్ష review మరియు కొద్దిపాటి పరీక్షించటం వుంటుంది.

04/18/09: క్లాసు వివరాలు

ఈ రోజు మా బడిలో చేరిన మరో చిరంజీవి - తేజ.

ముందుగా పాత పాఠాలు ఒకసారి మనం చేసుకుని క్రొత్త వాటిలోకి వెళ్ళాము. తెలుగు అచ్చులకి ఏ ఆంగ్ల అక్షరం వాడాలి అన్నదాంట్లో చిన్న పరీక్ష పెట్టాను. అంతా బాగా చేసారు.

ఈ వారం నేర్చుకున్న విషయాలు: రంగులు, వారములు.

రంగుల వివరాలు ఇంద్రదనుస్సు/రెయినుబో ను ఉదాహరణగా ఉపయోగించి తెలుసుకున్నాము.

వారాలు కూడా ప్లానెట్స్, వీక్ డేస్ ఆపై తెలుగువి ఎలా రిలేటె చేసుకోవచ్చో చదువుకున్నాము.

రెండు మూడు అక్షరాల తెలుదు పదాలు మననం చేసాము. అంకెల గురించి చిన్న ఆట ఆడాము.

ఈ వారం అలేఖ్య పంచుకున్న ఈ ఆదివారం తన దినచర్య ఇది. కొద్దిపాటి ఇంగ్లీష్ తప్పించి చాలావరకు తెలుగులోనే చెప్పగలిగింది.

"నేను దిండు మీద బజ్జుంటాను. నేను పాలు తాగుతాను. నాకు బొట్టుబిళ్ళ ఇష్టం.నేను purple పట్టు లంగా వేసుకున్నాను"

పిల్లలు ఇంట్లో చేయాల్సిన హోంవర్క్ గురించి నోట్ పుస్తకాల్లో వ్రాసుకున్నారు. పెద్దపిల్లలు చిన్న పిల్లలకి సహాయపడుతూ ముచ్చటగా ఈ పని పూర్తిచేసారు :) అందరికి రోజులో కనీసం 5-10 నిమిషాలు తెలుగులో ఇంట్లో వారితో మాట్లాడమని చెప్పాను. తల్లితండ్రులూ! మీరు కూడా వార్ని ప్రోత్సాహించమని కోరుతున్నాను.

04/11/09: క్లాసు వివరాలు

ఈ రోజు మా బడిలో చేరిన మరో చిరంజీవి - లలిత్.

ముందుగా పాత పాఠాలు ఒకసారి మనం చేసుకుని క్రొత్త వాటిలోకి వెళ్ళాము.

క్లాసుకి వచ్చిన 12 మంది పిల్లల్ని, ఇద్దరిద్దరుగా ఆరు బ్యాచులుగా విడదీసాను. ఆరు అంశాలు ఇచ్చి 5 నిమిషాల్లో ఆ విషయంపై క్లాసుకి చెప్పటం అన్నది వారికీయబడిన పని, ప్రతివారి అంశం గురించి చెప్పాక ప్రశ్నోత్తరాలు జరిగాయి.

స్నేహ, అనీష [ఇష్టమైన క్రీడ/ఆట]
సాహితి, తేజస్ [ఇష్టమైన వ్యక్తి]
నేహ, అలేఖ్య [ఇష్టమైన కళ/ఆర్ట్]
వైష్ణవి, లలిత్ [ఇష్టమైన సినిమా]
స్ఫూర్తి, సంతు [ఇష్టమైన సంఘటన]
సంహిత్, శ్రీవల్లి [ఇష్టమైన సబ్జెక్ట్]

ఈ వారం నేర్చుకున్న పాట: చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ"

ఈ వారం నుండి ప్రతి వారం ఒక చిన్నారి మాటలు వ్రాస్తాను. ఇది వారిలో తెలుగులో మాట్లాడటం అన్న అంశాన్ని పెంపొందించే ప్రయత్నం. ముందుగా నేహ పంచుకున్న ఈ ఆదివారం తన దినచర్య ఇది. కొద్దిపాటి ఇంగ్లీష్ తప్పించి చాలావరకు తెలుగులోనే చెప్పగలిగింది.

"అమ్మ, నేను ఒకసారే లేచాము. కొంచంసేపు టివి చూసాను. బ్రష్ చేసుకుని, సిరియల్ తిన్నాను. మళ్ళీ కాసేపు అయ్యాక అమ్మ స్నానం చేయమంటే వెళ్ళాను. నాన్న అప్పుడు లేచారు. ... తెలుగు క్లాసుకి వచ్చాను"

పిల్లలు ఇంట్లో మనం చేయాల్సిన అక్షరమాల/అచ్చులు, పాటలు నోట్ పుస్తకాల్లో జతపరిచాను. క్లాస్ వర్క్ బాగా చేసినందుకు అందరికీ ఒక్కొక్క క్రెడిట్ పాయింట్ ఇవ్వబడింది.

04/04/09: మా మొదటి క్లాసు వివరాలు వినాలని వుందా!

ఇంకాస్త ఉత్కంఠ కలిగించాలనివున్నా, అసలు విషయం చెప్పేస్తున్నాను.

ఈసారి క్రొత్తగా చిన్నారులు
  1. అనీష,
  2. అనూష,
  3. మేఘన,
  4. తేజస్
మా బడిలో చేరారు.

పిల్లలకి క్లాసులో పెట్టే చిన్న చిన్న పరీక్షల్లో క్రెడిట్ పాయింట్లు ఇవ్వబడతాయి. నెల చివర్లో ఎక్కువ పాయింట్లు వచ్చిన చిన్నారికి బహుమతి వుంటుంది. తరగతిలో బాల బాలికలు చురుకుగా పాలు పంచుకోవాలనే ఈ పద్దతి. ఆందరికి సమానంగా అవకాశం ఇస్తాను.

ముందుగా అందరు పిల్లలు తమ పేరు చెప్పి, తమకు తెలిసిన తెలుగు పదాలు మూడన్నా చెప్పమని కోరాను. చిత్రంగా అంతా చెప్పేసారు. మంచి ఆరంభం.

ఆ తర్వాత అక్షరమాల, అచ్చులు గురించి క్లుప్తంగా నేర్చుకున్నాము. పదప్రయోగం మీద కాసేపు గడిపాము. రామాయణంలోని ముఖ్య పాత్రలు గురించి అడిగినపుడు కూడా అంతా రామ, సీత, లక్ష్మణ, హనుమంతుడి గురించే కాక ఒకరిద్దరు సుగ్రీవుని గురించి ప్రస్తావించటం కూడా ముదావహం. అలాగే కుటుంబ సభ్యుల వరసలు తెలుసుకున్నాము.

"ఏనుగు ఏనుగు నల్లానా" అని మీరంతా పాడుకునే వింటారు కదా? మా పిల్లలు కూడా అదే పాట ఆనందంగా కలిసి పాడారు.

అందరిలో రెండో క్లాసుకు రావాలన్న ఆసక్తి వున్నట్లుగా అనిపించింది. అది ప్రతి గురువుకీ ఆనందం కలిగించే విషయం. అలాగే మమ్మల్ని గమనిస్తూ కూర్చున్న మరో చిన్నారి అభిప్రాయం కూడా నాతో ఏకీభవిస్తున్నట్లుగానే వుంది. మరి మీ మీ అభిప్రాయం తెలిపితే మరింత సంతోషిస్తాను.

మొదటి సమావేశం, గురుపూజ

03/27/09, శుక్రవారం, ఉగాది పర్వదినాన సాయంత్రం 5 గంటలకు జరిగిన మొదటి సమావేశం, గురుపూజ కార్యక్రమం ముందుగా దీపారాధనతో మొదలిడాము. ఈ కార్యక్రమానికి హాజరైనవారు.

చిరంజీవులుః
అనిరుధ్
అనీష
అలేఖ్య
నేహ
వైష్ణవి
స్నేహ
సాహితి
ప్రఙ
సంహిత్
స్ఫూర్తి
శ్రీకర్
శ్రీవల్లి
అంతా కలిసి ముక్తకంఠంతో వల్లించిన ప్రార్ధనా శ్లోకాలుః
"శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే"
"సరస్వతి నమస్తుభ్యం - వరదే కామ రూపిణి విధ్యారంభం కరిష్యామి - సిద్ధిర్భవతు మే సదా."
"గురుబ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
తరువాత పుస్తకాలలో "ఓం" అన్న శుభప్రదమైన అక్షరం వ్రాయటంతో పిల్లలు తెలుగు బడిని లాంఛనంగా మొదలుపెట్టారు. తల్లితండ్రులకు తరగతి జరుపబడు విధి విధానాలను గురించి పూర్తి వివరాలు అందించబడ్డాయి. ప్రసాదాలు స్వీకరించి అంతా ఇళ్ళకు మళ్ళారు.

చిరు ఙాపకాలుః