సాగరసౌధం

ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ చింతా సీతారామాంజనేయులు గారు మలిచిన నృత్య రూపకం "సాగరసౌధం" గూర్చిన అన్వేషణ తో పాటుగా నా చిరు అనుభవం కలగలిసిన అనుభూతి.  ఎవరికైనా ఈ నృత్య నాటిక పరిచయం ఉంటే పూర్తి పాటల సాహిత్యం సంపాదించటానికి సహాయపడండి.

అలుపన్నది యెరుగక పరవళ్ళతో, ఉరవళ్ళతో ఉరికే నదిని చూస్తే- ఉప్పొంగే ఆనందం,  అలాగే- అంతులేని అనురాగం, ఆవేశం, అదుపులేని ఆరాటం కూడ కనిపించేది.  అలా కొండల్లో, కోనల్లో పరుగులు పెట్టి సాగరసంగమం అయ్యే నది ఈ ప్రకృతిలోని స్వేఛ్ఛకి ప్రతీక అనిపించేది.  ఎప్పుడోనే ఓ కవి మనసు నది గమనాన మరో కోణాన్ని చూసింది. నాగార్జుగసాగర్ ఆనకట్ట నిర్మాణానికి కొత్త భాష్యం వెదికింది.  ఈ నాట్యకారుని చేత "సాగరసౌధం" అనే రసవత్తరమైన సంగీతభరిత నృత్యనాటికగా రూపొందించబడ్డాక, కృష్ణానదిని ఒక స్త్రీగా అన్వయించి ఆమె కన్న కల తాలూకు వేదనని అలాపిస్తూ మొదలై,  ఆనకట్ట నిర్మాణ మానవ మేధా విజయకేతనం తో ముగిసే ఈ నృత్యనాటిక మేము చేసేవారం.  నాటి ప్రదర్శన నాకు కళ్ళకు కట్టినట్లు గుర్తు.  నేను నాగార్జునాచార్యుడిగానో, నదిగానో అభినయంచేదాన్ని.  పిన్న వయసులో పలుమార్లు ఈ ప్రదర్శనకై చేసిన నిరంతర సాధన వలన నాకు బాగా గుర్తుండిపోయింది. "సాగరసౌధం" నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణం లో భాగస్తులైన ప్రతి ఒక్కరు ఒడలంతా పులకించిన అనుభూతితో వీక్షించిన నృత్య నాటిక. 1975 నుంచి అభ్యసించి, పూర్వాభినయం తో ఆరితేరి ప్రదర్శించి, ఎందరినో అలరించిన అనుభవం గత స్మృతుల్లో ఎప్పుడూ గేట్స్ తెరవగానే దూకే కృష్ణమ్మలా ఉంది.  కానీ, 1980 తర్వాత చూడలేదు, వినలేదు. కనీసం వ్రాతప్రతి తెచ్చుకుని ఉంచుకోవాలి, ఒక పూర్తి నాటిక రికార్డ్ పదిలపరచాలి అని తెలీని ప్రాయం. ఇప్పుడు మనసు పొరలు తొలగించి ఆలాపనలు ఇలా పట్టుకునే ప్రయత్నం! తప్పక ఏదో ఒక మార్గంలో అందిపుచ్చుకోగలనని భావిస్తున్నాను.. సంగీత రూపకం గా చాలా బావుండేది ఈ ప్రదర్శన.

"నిజమేనా, నిజమేనా నేను కన్న కల నిజమేనా.... కష్టాలను నష్టాలను కవితలల్లుకున్నాను.. ఎటు తోచక పోయితినే సాగరమునకు" అని తన అపార జలశక్తి వృధాగా రాళ్ళలో, ముళ్ళలో ప్రవహించి, అడవుల్లో సాగి, సముద్రపు పాలవుతుందని విలపించే నదీమతల్లిని ఓదారుస్తూ ఆధునిక మానవుడు వస్తాడు. "రండి రారండి వెలుగు జెండా ఎగరేయండి, కృష్ణమ్మ ఎద నిండే ఖిల్లా నిర్మించండి..సుత్తులు మ్రోగించండి సుర దుందుబులెందుకండి" అని నినాదాలిస్తూ ఆనకట్ట నిర్మాణం తలపెట్టి పూర్తిచేసి "నీ ఆశలు, ఆశయములు నిండిన సాగరమిదే, సాగర సుధా సౌదామిని సాగరసౌధమ్మిదే.." అని ఆమెను సంతృప్తి పరచటం, ఆ సమయాన రిజర్వాయరు తవ్వకంలో నీట మునిగిన బౌద్ధారామాన్ని నాగార్జునకొండ పైకి మార్చటం జరుగుతుంది.  అపుడు నాగార్జునాచార్యుని పాత్ర వస్తుంది. "ఎవరో నను పిలిచినారు, విధియే పడత్రోసి చనిన శిధిలాలను కదలించి.. " అని సమాధి/తపో ముద్ర విడిచి లేచి జరుగుతున్న ఆధునికదేవాలయ నిర్మాణానికి సంతుష్టుడై నిష్క్రమిస్తాడు.  తన జలాల సద్వినియోగం కాంచిన ఆనంద నాట్యం చేసే కృష్ణమ్మ "ఆహా ఆహా ఎంతటి అమర పురాంగణమిది, విద్యా విజ్ఞాన శక్తి విజయ ప్రాంగణమిది.." అని సంతృపిగా రాగాలాపన చేయటం తో ఆ నృత్యనాటిక ముగుస్తుంది.

ఇలా నేను వినతి పంచుకుని, వెదికి సాహిత్యం అందబుచ్చుకుని యేమి సాధిస్తాను!? యేమీ లేదు- మా నాన్న గారి జీవితకాలంలో కృష్ణానది, నాగార్జునసాగర్ ప్రస్తావనలతో ఆయనలో జలపాత హోరు ఎగిసిపడేది అనుభవాల వరవడితో. నేను పుట్టిందీ, తొలిదశల నా జీవితకాలంగడిచిందీ అక్కడే.  మాకూ ఎక్కువ మూలాలు, బీజాలు నాగార్జునసాగర్ లోనే.  ఆయన అధ్వర్యం లో ఒకసారి పుష్కరాల పనులు కొనసాగాయి, 2016 లో మా కజిన్ ఒకరి పర్యవేక్షణ లో కీలకమైన పనులు జరిగాయి. నాన్నగారిని తలుచుకుంటూ,  తనని అభినందిస్తూ, నన్ను నేను గర్వంగా చూసుకుంటూ- ఆ ఘనమైన బాల్యపు కీర్తిశిఖరాలపై మేము ఎగురవేసిన బావుటా వంటి- ఈ నాటిక ని గుర్తున్నంత వరకు రాసుకోడమే ఆ యిద్దరికీ నా మనః పూర్వకం గా వేయగల పతకం.  నేను అమితంగా ఇష్టపడే నాన్నగారికి, అపరిమితంగా అభిమానించే తనకి ఎప్పటికీ అపారమైన అనురాగంతో ఇలా కృతజ్ఞత తెలుపగల అవకాశం జీవితం తిరిగి తిరిగి ఇవ్వాలని అభిలషిస్తూ...
*****

పాత్రధారులు: కృష్ణా నదీమతల్లి,  నాగార్జునాచార్యుడు, జనశక్తి

1) తన జలాలు ఊరకనే వ్యర్థంగా సాగరపాలు కావటం కలగాంచిన నదీమతల్లి శోకంంతో విచారాన మునిగి పాడే ఈ పాటతో మొదలౌతుంది
"నిజమేనా నిజమేనా నేను కన్న కలనిజమేనా"
2) సామాన్య ప్రజానీకం ఆమెని చూసి తల్లడిల్లుతూ పాడేపాట
"తల్లీ కృష్ణా నదీమ తల్లి
కష్టాలను నష్టాలను కవితలల్లుకున్నావు
ఎటుతోచక నీవే పోయితివె సాగరమునకు"
3) యువ రక్తం ఉరకలెత్తే నేతల గీతం ఆ తదుపరి ఇలా సాగుతుంది
"స్వంతంత్ర భారత ప్రభాత కాంతి
శాంతి దూతలం"
4) ప్రభుత్వ పర్యవేక్షణలో కార్మిక శక్తి నిర్మాణ సమయాన శ్రామిక గానం:
"రండి రారండి వెలుగుజెండా ఎగరేయండి
కృష్ణమ్మా ఎద నిండే ఖిల్లా నిర్మించండి
బండలెత్తుకుని రండి
బంగారమదేనండి
సుత్తులు మ్రోగించండి
సురదుందుభులెందుకండి"
5) ఈ సమూహ సందడి కాంచి తపస్సు నుంచి మేల్కొన్న నాగార్జునుని స్వగతం:
"ఎవరో నను పిలచినారు
విధియే పడద్రోసి చనిన శిధిలాలను కదలించి"
6) నిర్మాణం పూర్తి అయ్యక ఆనకట్ట మీద పరుగులిడుతూ కృష్ణమ్మ ఆనందహేల:
"ఆహా! ఆహా! ఎంతటి అమర ప్రాంగణమిది!
విద్యా విజ్ఞాన శక్తి విజయ ప్రాభవమిదె
ఆ కొండ పైనేమి వైకుంఠమా ఈ లోయ దరినిది కైలాసమా
ఏది నాగార్జున కొండ? ఏడి నాగార్జునుడు
ఓహో ఆ కొండ పైన ఉన్నారా, కొండ మీద నేమిటి నా గుండెలోనే ఉన్నారు..."
7) ప్రజానీకం అంతా ఏకమై హర్షధ్వనులతో పాడే పాట తో ముగుస్తుంది
"నీ ఆశలు ఆశయములు నిండిన సాగరమిదె
సాగరసుధా సౌదామిని సాగరసౌధమ్మిదే"

పూచేటి వేళాయే

మిసమిసల రేకుల పొది
వసంత వేడుకకి బాకా ఊదుతుంటే..

 
పుడమి లో పుష్పకాలం
పరవశాల పల్లకీలో ఊరేగుతుంటుంది...!