Showing posts with label సమీక్ష. Show all posts
Showing posts with label సమీక్ష. Show all posts

ఎం.నారాయణ శర్మ గారి 'ఈనాటి కవిత' వ్యాఖ్యానం: శీతగానం

కవిత్వం కావాలి కవిత్వం అనుకుంటుంటాం..కాని కవిత్వమంటే..అనే ప్రశ్న చాలా సార్లు..వస్తుంది..ఒక్కో మార్గంలో ఒక్కో రకంగా నిర్వచించు కుంటారు.ఇవన్నీ సరైనవని ఎలా చెప్పలేమో సరికాదనివాదించడానికీ అంతే అవకాశంలేదు.

కవిత్వం కళాతాత్వికభావనలు కనిపించి ఒకసాధారణ దృశ్యాన్ని ప్రతిమగా మహొన్నతంగా అందించాలని కళాతాత్వికులభిప్రాయపడతారు.దృశ్యాన్ని ఆమూర్తంగా కళావ్యాఖ్యానాలు నిలబెడతాయి.ఇందుకు ప్రతీకలు,భావచిత్రాలు ఎక్కువ ఉపయోగపడతాయి.

భావచిత్రం అంటే కనిపించే దృశ్యాన్ని అంతే కళాత్మకంగా వర్ణించడం.దీనికి కవి అందులోని సౌందర్యమూలాలని విడదీసుకుని అనుభవించగలగాలి.మొత్తం వాతావరణంలోని ప్రధాన క్షేత్రాలని తీసుకుని వర్ణించాలి.అలా ఎన్నుకునే అంశాలు కవిచూసిన వాతావరణాన్ని ,దాని సౌందర్యాన్ని ప్రదర్శించగలగాలి.తాననుభవించినదాన్ని అంతే సౌందర్యంగా పాఠకులకు చేర్చాలి.

మరువం ఉష శీతాకాలంలోని ఉదయంలో కనిపించే వాతవరణమ్నించి రెండుదృశ్యాలను,రెండు శబ్దాలను చేదుకుని కళాత్మకంగా ఆదృశ్యాలను వ్యాఖ్యానించి కవిత్వం చేసారు,ఉదయంలోని రాలుతున్న మంచు,కొద్దిగా రంగు రంగుల్లో విస్తరిస్తున్న వెలుగురేఖలు...ఆసమయంలో ఎగురుతున్న పక్షుల రెక్కలచప్పుడు,కదులుతున్న కొమ్మలచప్పుడు ఈవాతవరణాన్ని చిత్రించిన కవిత ఇది.

"మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు...
కంటి ముందు కదలాడే దృశ్య కావ్య పఠనం సాగుతుంటే"

"లాకు తీయగానే పరిగెట్టే కాలువల సవ్వడిలా రెక్కలహోరు,
ప్రకృతి నాట్యానికి నట్టువాంగం లా కొమ్మలచిటికెలు...
శ్రవణ నిఘంటువు లో శృతులు, స్మృతుల పుటలు చేర్చుతూ"

"ఉదయం పాటగా మారింది, పదచిత్రాలు పాడమని ఊరిస్తుంది
పాదమై పల్లవిస్తూ, పదపదానికి నర్తిస్తూ...
పరవశాన మెరిసాను, ప్రకృతిగానమై నిలిచాను. "

మంచుని మడతవిప్పిన చీర-గా .తొలి కిరణాలని ఇంద్రధనుస్సులో ముంచితీసిన కుంచెగీతలు-గా చెప్పారు..అట్లే శబ్దాలని రెక్కల హోరులా ,ప్రకృతి నట్టువాంగంలా ఉందని అన్నారు.

ఇందులో మంచినిర్మాణంకూడా ఉంది.మొదటివి రెండు దృశ్యాన్ని ప్రకటిస్తే మూడవవాక్యం తన అనుభవాన్ని చెప్పింది.ఇందులోని రెండవభాగంలో లోనూ ఈనిర్మాణం ఉంది కాని ఇందులో శ్రవణానుభవాన్ని ప్రకటించారు.
కాళిదాసు-"ఉద్గాస్యతామిచ్చతి కిన్నెరాణాం తానప్రదాయిత్వమివోపగంతుం"అన్నాడు.-హిమాలయాలలో వీచేపిల్లగాలుల సవ్వడి కిన్నెరలగానానికి కోరస్ లా ఉందని భావం..ప్రకృతితో స్నేహం చేస్తేనే ఇలాంటి అల్లికలు సాధ్యమేమో.-స్నేహమంటే 
చూడటం,వినటం,స్పర్శించటం,దాని గురించి మాట్లాడటమని దానికోసం మనసు ఆరాటపడటమని నీతిశాస్త్రం చెప్పింది.

"దర్శనే స్పర్శనేవాపి శ్రవణేభాషనేపివా
యత్రద్రవత్యంతరంగః సస్నేహ ఇతి కథ్యతే"

ఆస్నేహంలోంచి మంచి భావచిత్రాన్ని కవితగా అందించినందుకు ఉష గారికి అభినందనలు

*****
-శీతగానం-

మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు... 
కంటి ముందు కదలాడే దృశ్య కావ్య పఠనం సాగుతుంటే

లాకు తీయగానే పరిగెట్టే కాలువల సవ్వడిలా రెక్కలహోరు,
ప్రకృతి నాట్యానికి నట్టువాంగం లా కొమ్మలచిటికెలు...
శ్రవణ నిఘంటువు లో శృతులు, స్మృతుల పుటలు చేర్చుతూ 

ఉదయం పాటగా మారింది, పదచిత్రాలు పాడమని ఊరిస్తుంది
పాదమై పల్లవిస్తూ, పదపదానికి నర్తిస్తూ...
పరవశాన మెరిసాను, ప్రకృతిగానమై నిలిచాను.  
(28/12/2013)

కాసుల ప్రతాప రెడ్డి గారి 'కవిస్వరం' లో : "లోపలి చూపు"

ఆత్మను పిడికిట పట్టుకుని లోలోతుల్లోకి పయనిస్తూ అనుభవాలను, అనుభూతులను నెమరేసుకుంటూ సాగిన కవిత ఉష రాసిన లోపలి చూపు. ఆత్మానుభూతిని అల్పక్షరాల్లో వ్యక్తీకరించి పాఠకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుందీ కవిత. ఇల్లు కేవలం ఓ భౌతిక రూపం కాదనే ఎరుకను కలగజేస్తుంది. ఇంటి చుట్టూ, ఇంట్లోనూ మన జీవితం పరుచుకుని ఉంటుంది. జీవన యానంలో ముందుకు నడిచిన తర్వాత గతంలోని పలు విషయాలు, సంఘటనలు గుర్తుకు వచ్చినప్పుడు పొందే అనుభూతిని కేవలం భౌతిక విషయంగా కాకుండా లోలోతుల్లోని ఆత్మ తండ్లాటగా ఆమె ఈ కవితను తీర్చిదిద్దారు. ఇల్లును దర్శించడానికి ఆమె ఆత్మ కిటికీ తెరిచి లోలోనికి ప్రయాణించారు. మెదడు తోట అయినప్పుడు ఆలోచనలు విత్తనాలవుతాయి. ఆ విత్తనాలు మళ్లీ తోటలో కొత్త మొక్కలై వ్యాపిస్తాయి. ఇలా జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. భౌతిక ప్రపంచంలోంచి ఆత్మలోకంలోకి ప్రయాణం చేసిన ఈ కవిత పాఠకుడికి జీవితం పట్ల నిర్మమకార స్థితిని కలగజేస్తుంది. ఈ నిర్మమకారం మనిషిని ఈర్ష్యాద్వేషాలకు, రాగానురాగాలకు దూరం చేసి లోకాన్ని ఉన్నదున్నట్లుగా చూసే తత్వాన్ని మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని వస్తుగతంగా దర్శించే చూపును ఇస్తుంది. కవిత మొత్తంగా మానవ జీవితంలోని సారాన్ని అందిస్తుంది. - కాసుల ప్రతాప రెడ్డి

అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-
చావిట్లో ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు

పెరట్లో చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు

వసాట్లో వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు

"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ
అలవోకగా మనసు తలుపు తెరిచి గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ
మరిన్ని గోచరమౌతూ
కలగా ముగిసినవో కథలై మిగిలినవో కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!

"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds" కావచ్చు...
అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...

*****

-లోపలి చూపు-

అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-

చావిట్లో 
ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు

పెరట్లో 
చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు

వసాట్లో
వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు

"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు
వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ 

అలవోకగా మనసు తలుపు తెరిచి
గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ మరిన్ని గోచరమౌతూ

కలగా ముగిసినవో
కథలై మిగిలినవో
కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!

"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds"

కావచ్చు...

అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...
(09/05/2014)

"మరువం" కవితాసంకలనం పై కవిసంగమం లో వచ్చిన సమీక్ష!

సంపుటి పేరు:- "మరువం" రాసిన కవయిత్రి:-" మరువం ఉష'   
పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి

"ఆమె కవిత్వ పరిమళం నిజంగా మరువమే !"

"నిన్న వాన వెలిసి పోయిందనే బెంగ,నేడు వాన కురుస్తుందని కలత,మదికి ఇదో సరదా-ఎండ బాధ వద్దనో,చలి బారిన పడననో ఒక దాని వెంట ఒకటి యోచనా సుడులు వృథా అలజడులు"-అని ఒక జీవన శకలాన్ని చిత్రిక పట్టిన కవయిత్రి ఉష."పగలు రేయి పునరావృతాలు,ఋతువుల రాకపోకలుమారే వర్ణాలు,నడుమ చీకు చింతల నిత్య జీవిత పారాయణాలు"-కాల స్వభావంతో జీవితాన్ని ముడివెట్టిన కవయిత్రి ఉష గారు.'నీవు కేంద్ర బిందువు నన్నావు,నీ చుట్టూ ఓ అనంత వృత్తం నను గీసుక రమ్మన్నావు,ఇక్కడే నేను కొత్త పాఠం నీకు చెబుతున్నాను,వింటావా?"-అని విధాతకే పాఠం చెప్ప ప్రయత్నిస్తున్న కవయిత్రి ఉష గారు.

తనలో తానొక ప్రకృతి పరవశత్వపు పరిధి గీసుకొని,తాను పొందిఉందిన ఆ వివశత్వపు అనుభూతిని పాఠకుల హౄదిలోకి వొంపగల అభివ్యక్తి ఈ కవయిత్రిలో అగుపిస్తుంది.అపార భావుకత,అందుకు తగ్గ పద సంపద ఈవిడలో వుంది.కాల్పనిక,భావ కవితా దోరణుల మిళితం ఈమె కవిత్వం.

ఈ కవయిత్రి తన కవితా ఖండికలకు వుంచే శీర్షికలు కొన్ని ఎంతో భావుకతను అద్దుకొని పాఠకున్ని తన వైపుకు తిప్పుకొంటాయి."వలపుల వాన చినుకు","మంచు పూల పేరంటం","ఈ సిగ లెక్కెక్కడ తప్పిండొచ్చబ్బా!",-ఇలాంటి పద్యాల శీర్షికలు ఎన్నో ఉష గారి పద్యం పదునున్కు కొలమానాలుగా నిలుస్తాయి.వర్షం అందర్ని అలరించినా కొందరే దాన్ని కవిత్వం చేయగలుగుతారు.వేరు వేరు కవులు తీసుకుండే వస్తువు ఒకటే అయినా వారి మార్గాల భేదాలను బట్టి వేరు వేరు కవితలు తయారవుతాయి.వాన చినుక్కీ,నేల మంటికీ వుండే వొక చిక్కని బంధాన్ని మరువం ఉష గారు క్లిష్టత లేని పదాల ప్రయోగంతో వొక అసాధరణ వూహను నిర్మించారు."మా వూరి మబ్బుకి మమతలెక్కువనుకుంటా"-అని మొదలయ్యే ఈ కవితలో మేఘాన్ని కరి మబ్బుగా చెప్పటం సాధరణమే అయినా వెను వెంటనే "కరి వేరు మొగ్గలా మెరిసి అని అనటంలోనే వొక వైచిత్రినీ కవయిత్రి మెరిపిస్తుంది."ఉన్నది వూరుకోకుండా మెరుపు లేఖలు రువ్వే ఆ మబ్బు ఉరిమురిమి తుళ్ళిపడేలా తుంటరి పనులు చేస్తుందని"-ఉన్న రంగులు చాలక వింత వన్నెలతో వరుసలు కడుతుందని ఈ కవయిత్రి మబ్బుకి మానుష్త్వ రూప ఆరోపణ చేస్తుంది.ఇలా కవిత్వం చేయటం కృష్ణ శాస్త్రి లాంటి పూర్వ కవుల పఠనం వల్లా లాభించే విద్య అని తెలుస్తుంది.

ఈ కవయిత్రి రాసిన వాక్యాలు సాధారణంగా సాదా సీదాగా కనిపిస్తాయి కాని లోతుగా ఆలోచిస్తే ఈన్ కవయిత్రి ఒక గాఢమైన,లోతైనా భావాన్ని నిగూఢంగా వ్యక్తం చేస్తాయి."కన్నె తూరుపు వెచ్చందనాల కావిళ్ళు గడప గడపకు పంచి, పడమర కాంత కౌగిళ్ళలోకి పరుగులు తీసి సూరీడు"- అని కవయిత్రి అనే ఈ వాక్యాల్లో సూర్యోదయాన్ని,సూర్యాస్తమయాన్ని కవయిత్రి ఆవిష్కరించినట్లు అర్థం చేసుకోవచ్చు
ఈ కవిత్వ పంక్తులు సాధారణ వాక్యాల్ల అనిపిస్తాయి ఆని తూర్పు అనే కన్య వెచ్చని కావిళ్ళని వూర్లోని ప్రతివారికి అందిచ్చి పడమటి దిక్కు అనే వనిత కవ్వింత కౌగిళ్ళలోకి పరుగులతో చేరుకున్నాడు సూర్యుడు అనే వొక అద్భుత డృశ్యాన్ని కవిత్వహృదయంతో కవిహృదయం అనే ఖండికలో దృశ్యం చేస్తుంది.రేయింబవళ్ళలో రేయి వర్ణన ఎక్కువ సందర్భాల్లో కవయిత్రి చేయడం ప్రకృతిలో రాత్రి కి గల ప్రత్యేకతమో ననిఅనిపిస్తుంది.గోగణాలు ఇళ్ళకు చేరుకొనే సమయాల్ని,ఎగిరి ఎగిరి అలసిన రెక్కలతో గూటికి చేరుకొనే సాయం వేళల్నీ కవయిత్రి పేర్కొంటూ అవి అమ్మవొడికి ఆనవాళ్ళై నిత్యజీవన రేయింబవళ్ళుగా చివరికి జంటహృదయాల తుంటరి సరాగాలై పరశింప చేస్తాయని కవయిత్రి వూహనిమరింత పరిమళభరితం చేస్తుంది.

"అసంపూర్తి కల అర్థరాత్రి గాలివానలా నిదురలేపి మరీ కలవర పెడుతుంది"-అని అంటున్న ఉష గారు నిరీక్షణల్నీ తెలవారి రాలిపడిన పారిజాతాల్లా,నిట్టూర్పుల్ని దిగుడుబావి పాకుడు మెట్లలా పోలుస్తూ అర్ధాకలితో నలుగుతున్న అనాథ శిశువుని,పాల బువ్వ తెలియని పసికందైనవాన్ని"ఇరువురూ ముక్తసరి మురిపాల ఆత్మవంచకులు"-అనుభూతికి తలవొగ్గిన కారణంగా ముగ్గులేస్తున్నప్పుడూ లెక్క తప్పిన చుక్కల్లా వొక అసంబద్ద కలయికలా రూపు దిద్దుకొన్నారని ఈవిడ ఎంతో లోతైన భావాన్ని మాములు వాక్యాల్లా చెప్పి,తన నేర్పుని ప్రదర్శించింది.ఈ ప్రపంచంలో ఏ వ్యవస్త వున్నా కవులకు వస్తువు కొఱత వుండనే వుండదు అది మనుషులతోనే వుంటుంది కాబట్టి.అనాది కాలం నుంచి కవుల అనుభూతిలో అభివ్యక్తమయ్యే వస్తువు ప్రేమే.స్త్రీ పురుష సంబంధాలు వున్నంత కాలం ప్రేమకు సంబంధించిన సాహిత్యం వుండక మానదు.అభ్యుదయ,విప్లవ కవులని అనుకున్న వాళ్ళు కూడా కొండకచో ప్రేమను అద్భుతంగా చెప్పారు.అట్లాంటి కవిత్వాలు పఠితల ఆదరణను పొందాయి. ఈ కవయిత్రి కూడా కాల్పనిక,భావ కవిత్వ ధోరణిలో కవిత్వ నిర్మాణం చేయటం మూలానేమో ప్రేమను కవిత్వం చేసింది."నీవు పరచిన అంప శయ్య మీద నేను/నీ ఙ్ఞాపకాల బాణపు గాయాలతో ఎంతకూ రాని సంక్రమణానినికై/ఇన్ని యుగాల ఎదురు చూపులో"-ఇలాంటి కవిత్వపు శకలాలు "ప్రేమ సహస్ర నామాలతో" అలరిస్తాయి ఈ సంపుటిలో.

కవయిత్రి ఉష గారు సహజ ప్రియాలైనా ప్రాకృతిక అంశాలను కవిత్వంగా మార్చటమే కాదు స్త్రీ సహజ ఇష్టాలైనా ముగ్గులు,పువ్వులు,గోరింటా మున్నగు వాటిని తన ప్రతిభా పరుసవేదితో పసిడి పాదాల పరిమళ మరువపు కవిత్వం చేయటమే కాదు వాటిలో వొకానొక కూడా దుఃఖాన్ని పోస్తుంది.ముగ్గు పిండి అమ్మే స్త్రీని వెన్నెల వేకువలు తెలియని వెఱ్ఱిదానిలా,రేయింబవళ్ళు రాజుకున్న ఆకలి మంటగా నిలబెడుతుంది."నా చేతి చిత్రాలు మా ముంగిలి వైనాలు/పూల గొబ్బిళ్ళ అలరారు రంగవల్లులు/వారందరికీ తెగ మురిపాలు/మరి నీవి కాదా సగపాలు"-అంటూ ముగ్గు పిండి అమ్మిన ఆవిడకు కూడా ఆ రంగవల్లులు తెచ్చే శోభలో,ఇచ్చే ఆనందంలో సగభాగం చెందుతుందని అనటం చిత్రంగా అనిపించినా న్యాయసమ్మతమేననే భావనని కవయిత్రి కలిగిస్తుంది. భావ చిత్రాలను రూపు కట్టించటంలో ఈమెకి మంచి నేర్పు వుంది.అతి తక్కువ పదాల పేర్పుతో చాల ఆశ్చర్యాన్ని కలిగించే నైపుణ్య నిరూపణ చేస్తుంది."చేపల చెఱువు మీద నాచు/అచ్చంగా పంట పైరు పచ్చ"ఊహించుకోవాల్సిందే.
జీవితాన్వేషణ చేయటం, ఆ అన్వేషణ నుండి ప్రకృతి శక్తుల ద్వారా పాఠాలు నేర్చుకోవటం కొందరు కవులు చేస్తుంటారు.ఈ అంశం కూడా ఉష గారిలో పుష్కలంగా వుంది.ఈ లక్షణాన్ని "బహుదూరపు బాటసారి'-అనే కవితలో పొందుపరిచింది."ఈ తరుణాన వెను తిరిగి చూస్తే వేవేల క్రోసుల నా జీవిత బాట"అని మొదలయ్యే కవితలో"అచటచట బాట ప్రక్కగా నా లక్ష్యసిద్దిని నిలిపిన గిరులు/నిరాశలో కృంగిన లోయలు,వెలికి తెచ్చిన ఆశయాల నిచ్చెనలు'ఇలా సాగిన కవితలో ప్రకృతి వొక వికాస పాఠమైన వైనాన్ని కవయిత్రి విపులీకరించటమే కాదు "నా త్రోవ తుది వరకు అలుపెరుగని"అన్వేషణ స్ఫురింపచేస్తుంది. ఈ కవయిత్రి భావన శక్తి కూడా అపారమని చెప్పకుండా వుండలేనితనం సంపుటి చదివింతరువాత ఆవరించింది."గోడ మీది నీడలు"-అనే కవితలో 'దృశ్యానికీ,అదృశ్యానికీనడుమ విన్యాసం.../సర్పంలా సాగిన నీడ/గోడ మూలలో పడగ విప్పింది/చీకటికీ దీపానికి మధ్య సమరం/ నీడ రూపు మార్చింది/నేల బారున తాబేలు ఈ మారు/మోడో అడుగుకీ కృంగి/దేహపు అరలోకీ మటు మాయం"-ఈ మాటల్లో దృశ్యానికీ,అదృశ్యానికీ మధ్య గల తేడాను నీడల్నీ సారూప్యం చేసి వొక అసాధరణ వూహను నిర్మించింది ఈవిడ.
కాలాన్ని తవ్వితే కలల ఇందనం వూరుతుందనికలలు రావటం వల్లనే రాత్రులు కరగిపోతున్నాయని కలని కొనటానికి నిద్రని ఖర్చు చేయాలనే వూహించని భావ ప్రవాహాల్నీ మన ముందు ప్రవహింప చేస్తుంది.
కలం నింపిన కల్లం-అనే ఖండికలో చెలిమిని మానవ జీవిత మాగాణిలోని పైరు పంటలతో ఉపమిస్తూ పల్లె సౌభాగ్య చిత్రాన్ని గీసి "సారం తరగని మాగాణి సంక్రాంతి మన చెలిమి"-అని అంటుంది ఈమే."దృశ్యం కరిగేలోపు ఙ్ఞాపకాల సంకెల్లతో బిగించి కట్టి పడేసేది కన్ను'.ఆ కన్ను ను కవిత్వం చేసిన ఖండిక అనుభూతి వులితో చెక్కిన నిర్మాణ శిల్పంతో మనల్ని కట్టి పడేస్తుంది."నేల చీకాకు పడేంత వాన"-అనే ఒక్క పాదమే వర్ష భీభత్స దృశ్యాన్ని చిత్రిక పడుతుంది.మనుషుల మధ్య మమతలన్ని ఇగిరిపోతున్న సందర్భాన్ని "గోడ గుండె పగిలింది "-అనే కవితలో నిరూపిస్తుంది.

ఆవిడ రాసిన"అరచేతి గీత నిలువున చీల్చితే/నుదుటి రాత మారుననే పేరాశ"-లాంటి వాక్యాలు సమాజ మూఢనమ్మకాల్ని చీలుస్తాయి.ఆకాశంలోని వాతావరణాన్ని ఎంత సౌందర్యంగా వర్ణిస్తుందో చూడండి."మంచుపూలపేరంటం"-అనే కవితలో.కిందున్న నేల రాణికేనా ఇన్ని సంబరాలు అని ఆకాశరాజు ఈర్ష్య పడ్డాడని చెబుతూ" మబ్బు ముగ్గులేసి/మంచు పూలు చల్లి/చుక్కల గొబ్బిళ్లు పెట్టి'-సంక్రాంతి పర్వ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది."గంప అక్కడుంటే గుప్పేడేనా నాకు మల్లె మొగ్గలు"-అని ఆరంభమయ్యే కవిత"ఈ సిగ లెక్కెక్కడ తప్పుతుందబ్బా"-అనే కవితలో గడిచిపోయిన పోల్చుకొంటూ తన జడ తో పెనవేసుకొన్నా ఆత్మీయబంధాన్ని నెమరు వేసుకొంటూ,"దాని జడ జానెడు/నాది బారెడు"అంటూ తన జడ నిండు గోదారేనని ఉపమించుకొంటూ,విరజాజి కుదురు కూడా తన జడ ముందు తలవంచక తప్పదని కవయిత్రి వొక పురా స్మృతి లోకి తీసికెళుతుంది.జడ స్త్రీ సహజ సౌందర్య వస్తువే అయినా ఈ కవితలో ఉషగారు అంత అందంగా చెప్పి తన ప్రత్యెకతను చాటుకొన్నారు.

పిచ్చుక పైన రాసిన కవిత వొక అద్భుత కవిత ఖండిక.అరుణగారు పిచ్చుకను :పిట్టా నువ్వు ఈ లోకంలో పట్టవు"అని అంటే మరువం ఉష 'మళ్ళి ఇంత కాలానికీ ఈచలి దేశంలో ఆకురాలు కాలంలో భలేగా కనిపించావే"-అని మురిసిపోతుంది."నువ్వొక్కతివే వచ్చావేమోనని పలకరిస్తే"అని పిచ్చుకతో చేసే సంభాషణ పఠితల హృదిలోకి గుచ్చుకొని ఙ్ఞాపకాల సలపరం రేపుతుంది.

ఈ 'మరువం'-సంపుటిలో కొన్ని కవితలు హృది తడిపేవి కాకపోయిన "తూర్పార బోసిన గింజలు" కొన్ని చదువరులకు గొప్ప అనుభూతిని మిగిలిస్తాయి. వలపు వాన చినుకును మంచు పూల పేరటం కు పిలిచి గాలి లేఖ రాసి రమ్మని,జీవితం సౌందర్య రాహిత్యం కాదని చెబుతూ ఈ జాడలు తన కవితలో వున్నాయంటున్న కవయిత్రి ఉష గారు. ఒడి ఇచ్చిన అమ్మ వెళ్ళిపోయినా,బొడ్డు కోసిన బాపనమ్మ అటే మళ్ళినా,అడుగులకు చేయూత నిచ్చినతాతయ్య,బువ్వ పెట్టిన అమ్మమ్మ..ఇలా అందరు వెళ్ళిపోయారని తన ఙ్ఞాపకాలని మన ఙ్ఞాపకాలుగా మార్చింది.అంటే తన అనుభూతుల్ని పాఠకుల అనుభూతులుగా చేయ గలిగిందంటే ఆమె మంచి కవయిత్రి అని నేను అనటం.అందుకు ఆమెను అభినంద్స్తున్నా.ఈమె కవిత్వాన్ని కపిల రామ్ కుమార్ గారు మరువం దవనం అని వ్యాఖ్యానిస్తే ఆవిడ మరువం,దవనం వాసనలు ఒకచోట పొసగవనే ఉద్దేశ్యంతోనేమో మరువం ఒక్కటే చాలు అన్నట్లు ఙ్ఞాపకం.ఈవిడను కోరుతున్నా మరువం తో పాటి దవనం కూడా కవిత్వం చేసీ కవిత్వ కాంత జడలో వొక అలంకారం చేయమని.

పుష్యమి సాగర్ గారి 'కవితా సారం': మరువం ఉష కవిత చేతి సంచి!

చిన్నతనం లో నాన్న బయిటకు వెళ్ళినప్పుడు మోసుకు వచ్చిన చేతి సంచి ఎన్ని అనుభూతులను మోసుకు వచ్చిందో లెక్కపెట్టుకోలేము. ఉష గారి ఈ కవిత లో చాల వరకు అనుభూతులను మళ్ళీ తిరిగి తోడుకుంటున్నారు. ఎంతో మంది కి తమ నాన్న గారి చేతి సంచి తో అనుబంధం ఉండొచ్చు.

ఒక సంచి చుట్టూ కథా వస్తువు ని తీసుకొని అల్లిన కవిత లో చాలా చోట్ల భావోద్వేగం అక్షరాల్లో వొదిగిపొతయి , కొన్ని చోట్ల బాల్యం తాలూకు ఆనందాలను తోడూకుంటున్నట్టు గా వుంటది.

//జిలేబి, పకోడీ గుట్టు విప్పిన ఘుమఘుమలు// అవును చిన్నప్పుడు నాన్న ఇంటికి రాగానే..ఏమి తెచ్చారు మాకు అంటూ పిల్లల హడావిడి ఇప్పటికి మననం చేసుకుంటాం.

చలనం లేని వస్తువు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది మన జన జీవితం లో, అన్ని వస్తువు లాగానే చేతి సంచి కూడా, కాని ప్రతి దినం మన తో నే వుంటూ అనుకణం కావాల్సిన అవసరాలను అది వెచ్చాలు అయిన , పండుగ లలో కావాల్సిన సరుకు అయిన ఇది వుండాల్సిందే. అంటే మానసికం గా అది ఒక స్నేహితుని లా పని చేస్తుంది ఏమో .కదా..!!

పుట్టుక నుంచి మొదలు ప్రతి దానికి సంచి లేకపోతె ఇబ్బందే, పిల్లల దగ్గరనుంచి పెద్ద వారి దాక సంచి ఎన్ని వాహకాలు మోసుకుపోతున్నదే . ఇదోక అనంతమైన సంసార కదా చరితం కదా.

//సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,//
కొత్త పద ప్రయోగాన్ని ఉపయోగించటం బాగుంది.ఉదా: "ఊసుల బోషాణం", "మోసుకొచ్చిన పరాచికాలు."

కవిత ముగింపు లో ... అక్షయ పాత్ర లా ఎంత తీసిన తరగని అనుభవాలను, అనుభూతులను గుండె కు హత్తుకోవచ్చు నిజమే కదా..ఒక నేస్తం లా మన వెంట వుండే సంచి ని వదులుకోగలమా..లేదు 

//సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,//శతకోటి గాథలు తీసినా తేలికపడని చేతిసంచీ.//

ఉష గారి కవిత ను చదివాకా.జీవితమే ఓ సంచి అనిపించింది. చిన్న కవిత అయిన ఎంతో బాగా చెప్పారు ...వారు మరిన్ని మంచి కవితలని రాయగలరని ఆశిస్తూ ...
సెలవు.
*****
- చేతి సంచి-
 
మూరెడు జాజులు, చిట్టిచేమంతి దండలు,
తామరాకు పాన్పు మీద నాగావళులు..
జిలేబి, పకోడీ గుట్టు విప్పిన ఘుమఘుమలు,
సందెగాలి మోసుకొచ్చిన పరాచికాలు..
ఊరుసద్దుమణిగాక పుట్టే ఊసుల భోషాణం,
కొత్త మురిపాల జోరుకి సాక్ష్యం చేతిసంచీ.

దినసరి వెచ్చాలు, పండుగ సరంజామాలు
ఉయ్యాల తాళ్ళు, గిలక్కాయల మోతలు
పలకా బలపాలు, పుస్తకాలు, పూస మిఠాయిలు
కాలిపట్టీలు, పరికిణీలు, పెళ్ళి శుభలేఖలు
సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,
శతకోటి గాథలు తీసినా తేలికపడని చేతిసంచీ.

***ఎప్పటికీ నాన్న చేతి సంచీ మోసిన జ్ఞాపకాలు మధురమే! అసలు జీవితమే ఓ చేతి సంచి.
(02/16/2014)