చిగురులు

అమ్మ చేతిని విదుల్చుకుని చిందులేసే పిల్లలు 
కొమ్మ నుంచి జారిపడుతున్న యీ  చినుకులు
కేరింతల సడి కి మురిసే తల్లి 
పిట్ట పాటల పరవశించే జగతి 

గాలి కడలి లో నిశ్శబ్దపు నౌక,
వెంటాడే వెలుతురు లో చీకటి జాడ
కనుమరుగౌతున్న తరుణం

నిదురలో ముగియని కలని
పగటి యవనిక పై తీర్చిదిద్దుతూ కాలం

3/17/21

అమ్మ ఒడిలోని బిడ్డని లేవనెత్తి నిలబెట్టే తండ్రి చేతులు 
అంకురం మొదలుకుని ఆకాశాన్ని తాకే తరువుల చుట్టూ
ఈ సహస్రకోటి కిరణాలు ... 
రాకపోకల, కలివిడితనాల మేనమావలు ఆ గాలివానలు

4/4/21

పిట్టపాటల  తియ్యందనాలకై
వానలుగా వచ్చి చేరాయి మబ్బులు
తడిరెక్కల తిమ్మిరి విదుల్చుకుంటూ
ఎండపొడలోకి  ఎగిరిపోయాయా తుంటరులు 

4/7/21