సఖ్యత

తన ఇంటి ముందున్న 'వీపింగ్ చెర్రీ' కొమ్మ వెనుగ్గా
'లాఫింగ్ బుద్ద' ని తలపించే మోముతో
కరచాలనం కొరకు స్నేహపూరిత పదాలతో నిలిచిన యువకుడు

అతని పక్కన నిలుచుని రవ్వంత సందిగ్ధ స్వరము,
నవ్వీనవ్వని పెదాలు, విడి విడి పొడిపదాలతో యువతి

తోచిన స్వాగత వచనాలు కలిపి
త్వరపడి ఆహ్వానాల వరకు సాగకుండా
పొరుగింటి కొత్త జంటకి 'మరి వస్తానని' చెప్పి
ఇంకా పాతబడని నా కొత్తింట్లోకి నడిచిన నేను

పరిచయాలకి తొలి క్షణాలు ఇంచుమించుగా ఇలాగేగా!?
ఈ సాధారణ సంఘటన జరిగి ఐదేళ్ళు గడిచాయి
ఇంతకీ అసలు విషయాలు మరెన్నో ఉంటాయిగా...

పట్టుమని పది నిండని వయసుకి ప్రవాసంలోకి అతడు,
రెండు పదులు నిండాక ఎల్లలు దాటుకుని నేను- గత రెండు దశాబ్దాలుగా
పరదేశీయులా, పాతుకుపోయిన వలస పిట్టలమా- రెండూ నిజమే.
సంస్కృతులు కలుపుకుంటూ వైవాహిక బంధాన అడుగిడిన స్వదేశస్థురాలు ఆమె

అనుకున్న సమయాలకి, అనువైన చోట్లలో అంచెలంచలుగా ఎదిగిన మైత్రి,
స్థానిక సాంప్రదాయాలకి, సన్నిహిత సంబంధాలకి వాకిలిగా...

ఇక్కడితో కథ కి ముగింపు అయితే సరి!
అయితే అనుకోకుండా ఒక రోజు అందరి జీవితాల్లోనూ అరుదు కాదుగా

ఇప్పటికీ వైద్య సలహాలతో, శస్త్ర చికిత్సలతో నలుగుతూ
మలగని నవ్వు కి తోడుగా కళ్ళనిండా భీతితో అతనెదురౌతాడు,
చెప్పలేని భావాలు, భాష్యాలు దోగాడే వదనంతో ఆ యువతీ తోడు రాగా.

భద్రతారాహిత్యం, అనుబంధాల పట్ల ఆత్రుత మస్తిష్కం లో మెలిపడుతుంటాయి నాలో

చీకట్లు వీడని ఓ పొద్దులో జాత్యహంకారపు నీడలో దాడి జరిగిందని
నాగరీకులు గర్హించే వార్తగా వెలుగు లోకి వచ్చిందని
చెప్దామనే అనుకుంటాను...

అంతకు పూర్వమే ఈ మాటా చెప్పాలి-
సాటి మనిషి పై అఘాయిత్యాన్ని సహించని
స్వదేశీయుడే ఎదురుదాడి చేసాడని,
మానవత్వపు పొర మీద మరక పడకుండా అడ్డుకున్నాడని.

మెదడు కొలతలతో మనిషికి మనిషికి నడుమ కక్ష, కాంక్ష, ఆకాంక్ష నడుస్తున్నాయ్, అలాగే

మనసుని మనసుని కలుపుతూ మమత, సమత, శాంతి కాముకత నిలుస్తున్నాయి, హృదయసీమల్లో.

ప్రకృతి తో

ఏముంది చెప్పేందుకు...వచనం గా ఒదగగలిగితే

గాలిలో కలిసి శబ్దాలు, పండుటాకుల వాసనలు
కిటికీ అద్దాల మీద పడుతూలేస్తూ ఏవో కీటకాలు
దిగువకి, పక్కకి పయనిస్తూ వాన తెరచాపలు
రహదారుల్లో సందోహాలు, సంఘర్షణలు
రెక్కకిరెక్క తాకిస్తూ ఆకాశంలో కలిసిపోతూ విహంగాలు
అక్షరాల్లో బంధిస్తే మనసుకి బాహ్యరూపాలు ఇవే!

కరగని మంచు పొరల్లా జ్ఞాపకాలు
వర్ణనాతీత భావాల అగ్నిపర్వతశ్రేణులు
ధీర్ఘంగా సాగేనదులుగా శ్వాసనిశ్వాసలు, 
సంద్రాలై స్రవిస్తున్న గాయాలు
ఉండుండి నిట్టూర్పు ఉప్పెనలు, అడపాదడపా అలజడుల సునామీలు
విప్పిచెప్పబోతే హృదయానికి ఇంతకన్నా రూపం లేదే?!

లోపలి చూపు

అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-

చావిట్లో 
ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు

పెరట్లో 
చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు

వసాట్లో
వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు

"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు
వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ 

అలవోకగా మనసు తలుపు తెరిచి
గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ మరిన్ని గోచరమౌతూ

కలగా ముగిసినవో
కథలై మిగిలినవో
కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!

"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds"

కావచ్చు...

అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...