రజనీముఖ వివశత



ఒక మలి సంధ్యవేళ- 
మబ్బులు తాండవిస్తూ ఉన్నాయి ఆకాశాన, 
కాంక్ష గాఢంగా తాకే సమయం ఆసన్నమైనట్లు మదిలో కలవరం 
పళ్లెరాల కొలదీ రంగులు వంపుతూ పోయిందొక కిరణం 
మిణుగురులు పోగడినట్లుగా, మంటలు చెలరేగినట్లుగా 
మబ్బులు దహించుకుపోతున్నాయి
రెక్కలు మొలిచిన ఊహల రణం 
వేటలాట మరిగిన వాంఛల కలకలం 
ఎగిసిపడుతున్న మోహజ్వాలలో 
సమిధగా దేహం 
నిశి చొరబాటుదారులా... 
చీకటి లో దాగినవి నిశ్శబ్దం వెల్లడి చేస్తుంది
ధ్వనికి ప్రతిధ్వని తోడై రూపం కళ్ళకు కడుతుంది
దృశ్యాదృశ్య మార్మికత జగతిని ముసుగులోకి లాగుతుంది
తొలిసంధ్య వరకు మబ్బులు వలువలు సెలవు పుచ్చుకుంటాయి! 




విచ్చుకునే మొగ్గలు

నిస్సహాయత
పుష్పిస్తూ ఉంటుంది, 
రాజీపడ్డం లో
నవ్వు పుట్టినప్పుడు.
వర్షిస్తూ కూడా
ఉంటుంది,
రెప్పమాటున ఓటమి ఊట
ఉప్పెన అయినప్పుడు.కాలపు హస్తాలు
రాలిన రేకుల, రాలిపడే చినుకుల
నిర్మాల్యం తుడిచి
శుభ్రపరిచిన జీవన ప్రాంగణంలో
మనసు నిర్మలంగా
కనులలో వికసించి దోగాడుతూ...

Rain Coated!

నల్లమబ్బు నిశ్శబ్దం గా ఆవరించుకున్నది కాబోలు
కాలం, నేను పోటీపడ్డట్లు సాగుతున్నప్పుడు-
ఉరిమినట్లో ఉలిక్కిపడినట్లో
ఆ మేఘం, నా దేహం
జల్లుగ జారి, ఝల్లున పొంగి పందెం వేసుకుని ...


పరుగులు పెట్టించిన పనుల లెక్క తేలిపోయింది
ఊపందుకున్న ఆనందం త్వరపెడుతుంది
తడిగారు కొమ్మల తోడుచేసుకుని
తలారా తనువారా నేను తడిచిపోతున్నాను
గొడుగుల్లో దూరినవారిని వెక్కిరిస్తూ...


వాననీటి అద్దకపు మెరుపు,
సద్దులేని వణుకున తనువూ రహస్యమేదో విప్పుతుంటే
తేమ దాగిన చిలిపి గాలి గిలిగింతలతో
వెచ్చటి ఊహ చిత్రమైన పాటగా మారుతుంటే
మరొక మబ్బు కమ్ముకోనున్న గుట్టు దాయలేకున్నాను.