వాన పదం

 దారి తప్పి వచ్చిన మబ్బులు
మూడ్రోజులుగా మకాం వేసాయి
లేగదూడలల్లే నింగి బారునా అవే..
తెరలు తీస్తూ మూస్తూ దాగుడుమూతలు
పూలమళ్ళు మడుగులైనాయి,
నిండా మబ్బు పింజెలు
ఉండబట్టలేక ముంచిన చేతులనిండా
తడిమట్టి చిత్రాలు, తళుకులు
త్రోవ పొడుగునా పూల పడవలు
గాలులకి ఆకులే అందియలు
అటుయిటూ హడావుడిగా కుందేళ్లు
ఎగురలేక రెక్క ముడిచిన తూనీగలు
ఆగలేని పాదాలకి అదుపులేదు
మనసూ వర్షిస్తూ వుందిక,
లోలోపలి వానకీ లయ లేదు
కురిసే పదాల మెరుపులే-
పగటి మిణుగురులు.

No comments:

Post a Comment