చేరవస్తూన్న క్షణాలెన్నో

మునిమాపు, రేయి నడుమ-

ఆకాశపు అద్దం చేత బుచ్చుకుని
శ్యామ మేఘాలు దులుపుతూ,
చీకటి అంటిన చేతులతోనే
కన్నీటివో, కలలవో
కరిగిన కాలపు కాటుక మరకలు
తుడుపుతూ
మేలుకునే ఉంటాను,
వేసట తో వేచి ఉండటంలో
ఓపలేని ఆత్రం ఉప్పెన వంటిది..
తెలవారు ఝాముకి
ఏవో రంగుల తెరలు కప్పుకుని
తిరిగి అదే ఆకాశం.
అవే చేతులతో రూపాలు
దిద్దుతూ,
నా కనుల లోను, ఊహల లోను
వెలుగు జాడలు.
వెతలు కానరాని
మైమరుపు సునామీ వంటిది.
పోతే,
రేయిపవళ్ళను తారుమారు చేసే
తరుణాలు, గ్రహణాలు వస్తాయి
గతాన్ని అదుముకుని
మేఘాలు కురవాలని
గగనమంత కనులతో
ప్రళయవేళ కొరకు ప్రతీక్షిస్తూ
తెలియని రేపు లోకి
నిదుర వూతతో
చేరుకుంటాను…

No comments:

Post a Comment