దాటుకుంటూ...

దారి చూసుకునో, వీలు చేసుకునో
వెళ్ళాలి, వెనక్కు మళ్ళాలి, తప్పదు-

బాటలు వేసుకుని, బాసలు దాటుకుని
మమతలకి మనసునొదిలి
మనసైనవారిని మోసుకుంటూ,

దాచిన కన్నీరు దోసిళ్ళలో
గడిపిన క్షణాలు గుప్పిళ్ళలో తప్పవిక.

దాటుకుంటూ, దాటినవి దాచుకుంటూ
వెళ్తుండాలి అటుగా, ఇటుగా, అటోఇటో తెలియని ఎటో-

అందుకే, సందోహంలో ఒక /గతి/తప్పిన మది తారసపడితే
నేస్తమా! ఆశ్రయమో, ఆసరానో అండగా ఇవ్వు

మరి నిన్నూ ఒంటరిని చేసే భావిని నీవు చేరే సరికి
గతపు జ్ఞాపకం తోడై వస్తుంది...
వేదన గిరులు దాటుకుంటూ వెళ్ళటానికి.

ఏన్నాళ్ళు ఎన్నేళ్ళు!?


ఈ గుత్తిలో పూలు నాలుగు దశల్లో ఉన్నాయి.  ప్రతి ఏడాది వసంతంలో మాత్రమే ఈ చెట్టున పూలు పూస్తాయి,  ఒక రోజు గడువుతో సెలవు పుచ్చుకుంటాయి.  తిరిగి ఏడాది వరకు ఆ చెట్టు కూడా నాలుగు దశలు మార్చి నిలుస్తుంది.  ఈ బ్లాగు కూడా అలానే ఆ చెట్టు/ పూల పోకడతో మనుగడ సాగిస్తూ...సప్త వార్షిక దినోత్సవం ఇవాళతో గడుపుకుంది.

అభిరుచులు వేరైనా, అభినివేశం అతకకపోయినా అభిమానంతో నా బ్లాగు ని ఆదరించిన/రిస్తున్న అందరికీ వందనాలు. 

కొందరున్నారు కదు ఇలా!?

నిన్నటి రాత్రే శుభ్రపరిచిన గిన్నెవైపుకి కనులుగా
అడుగులు స్థిరంగా కదులుతూ
మొన్నో మునుపో మిగిలిన కలదో కథదో
అక్షరాలు అస్థిరంగా మెదులుతూ
ఉదయాన్ని తేనీటితో తడమటానికి సిద్దపడతాను
మరిగే నీరు, పొంగే పాలు, విరిగిపడే పొడి, కరిగిపోయే చక్కెర
ఒక్కొక్క దశగా శ్రద్ధగా చూసుకుని కప్పులోకి వంచుకున్నాక-

కొనసాగింపులు వేగం పుంజుకుంటాయి,
కప్పుని కావలించుకున్నంత దగ్గరగా తీసుకున్నాక
ఊపిరిలోకి సాగే ఆవిరితో...

కప్పుని అడ్డంపెట్టుకుని కన్నీరు దాచిన ఊసు
ఇంకొకసారి పొలమారుతుంది
తదేకంగా టీ లోకి విసుగ్గా చూస్తూ
వదిలించుకున్న వ్యక్తి నీడ కప్పులో తేలుతుంది
మరొకసారి నవ్వుకి తెర తొలుగుతుంది

చురుక్కుమనే వేడితోనో, ఊదుకుంటూ తాగే రుచితోనో
ఇంకొక పది నిమిషాల సాగిపోతాయి
రోజులోకి సాగే ఊహలతో...

రోజూ ఎదురుచూపు విధిగా ఈ తంతుకి:
కొత్త ఆఘ్రాణింఫు కప్పు నుండి కావచ్చు,
ఖాళీ అవుతున్న కప్పు నింపుతున్న ఉత్సాహానిది కావచ్చు
రెండూ మారకపోవచ్చు, అయినా ఫర్వాలేదు...

తేనీటి సమయాలు, ఉదయాలు విసిగించవు
తప్పనిసరైతే తప్పా పంచుకోవాలనీ అనిపించదు