ఎగురలేని గాలిపటాలు

గాలిపటాలు
ఎగిరే మబ్బుల్లా ఉండేవవి!

చేతికి చిక్కనున్న
మబ్బుకోసమే..
పటాలు నేలకి కురవాలని
పసితనపు ఆశలూ ముసిరేవి

అప్పట్లో
ఏదో పండుగ కాలం లో,
కనీసం ఎండాకాలం సెలవుల్లో
ఎవరో ఒకరు ఎగురవేస్తారు

ఎగిరే పటం వాలితేనే కేరింత..

ఆట ముగిసే వేళకి

గాలివానకు ఒరిగిన పిట్టల్లా
చిరుగు పట్టిన చీరల్లా

అవే గాలిపటాలు..తెగిన పటాలు

బహుమతులుగా
వెదికి తేవటమే
పందెం కోళ్ళ వంటి పిల్లల కేళి

ఇప్పుడూ
ఒకప్పుడు ఎగురవేసిన
ఉల్లాసాలు
కాలపు కండె తెగిపడిన
పటాలుగా..


జ్ఞాపకాలకి చిక్కుకుని
అనుభూతులు
వెదకకుండానే ఎదురయే
మమతని
పదిలంగా తాకివస్తే
కానుక అందిన భావన..

కమ్ముకున్న ఆశలు
చిన్నప్పటి చిక్కదనంతోనే
ఇప్పటికీను
అంచేత,
మరి కొన్ని క్షణాలు
ఇప్పుడిప్పుడే
ఎగురవేస్తున్నాను
రానున్న కాలాల్లో
మనసుకి అందివస్తాయని!

పూవంత మోహమై

పున్నాగల వానలై, 
పారిజాతాల పాన్పులై
కొన్ని పూలు నేల కొరకే పూస్తాయి


మరి కొన్ని తావులీనుతూ
గాలిని వదలని మల్లెల, 

జాజుల పరిమళాల చిలుకరిస్తే
ఆగి ఆగి కదిలే వాయువులన్నీ 

వేణుగానాలై పోతాయి

నీటి ఒడిలో నిర్మలంగా పవళిస్తూ
తామర జాజరగా, 

కలువల కాంతిగా
ఆ పూలు మరి అలా విరియగానే
కొలనులన్నీ అలల నవ్వులే


పుష్పించని జాతులు ఉంటాయి తరువుల్లో
పంచవన్నెల పత్రాలు

తయారు చేసుకుంటాయి
సుమాల కాలాలు ముగిసాక
భూమిని కప్పుతూ

ఆకుల ముగ్గులు  వేస్తాయి
గాలులు అల్లరి చేతులతో
నీటిలో మునకలు వేయించటానికి
ఎడతెగక వీస్తుంటాయి
 

అప్పుడే అగ్ని పూలు
అకాశమంతా విచ్చుకుని మెరుస్తాయి,
తారలు విరిసిన నింగి
జిగిబిగి రంగులు విసురుతుంది


పంచభూతాల పూల వేడుకలో

కలదిరుగుతూ
నేనూ గమనిస్తాను
నా కనులు రెండూ

తరువులుగా మారాయని..
ఊహల పూలు రాలుతుంటే
హృదయపు గాలులు
సుమధుర భావనలు మోస్తున్నాయని...!