ముదమారా పెంచుకున్న
తోటలోకి
అనుదినం
అనురక్తితో
నడిచినప్పుడు-
నేల ఫలకం మీద
నీటిజాడ, ఎండా చిత్రిస్తున్న
నిత్యనూతన
దృశ్యాలు
జీవితానికొక
పోలికనిస్తూ...
మనసు కదంబంలో
తలపు, తపన
మెలికపడి
పూలమడిలో
స్వీయ
దర్శనమౌతూ...
ఒక్కసారిగా
తోట
పిలిచినట్లౌతుంది,
పూలు నవ్వినట్లు
తోస్తుంది.
ఊహ మాయమౌతూ
మనిషి రూపు
ఎదురౌతుంది.
చేయి, చేయీ తాకిన
క్షణాన
తనువు చేతన సంతరించుకుని
మేలువచనం
పలుకుతుంది
అంతఃకరణలో
కొత్త నారు
మొలకెత్తుతుంది
కాలం తీసుకొచ్చిన
శుభతరుణం
సారభూమిగా
మారిపోతుంది
మరో మనిషి తోటగా
తనలో ఎదగాలి
ప్రతి మనిషీ
తోటమాలిగా
అనుభవాలు,
అనుభూతుల
విత్తులు
వెదజల్లుతూ
కాలం గడపాలి, అందుకే!