తోటపనితో నాలో నేను-7



“థిమిత థిమిత..ఏమి థిమిత..పసుపు థిమిత..ఏమి పసుపు
వంట పసుపు..ఏమి వంట..పిండి వంట..ఏమి పిండి..తెలక పిండి..ఏమి తెలక..గొర్రె తెలక..ఏమి గొర్రె
పాల గొర్రె..ఏమి పాలు..జెముడు పాలు..ఏమి జెముడు..పాత జెముడు... “
ఈ పాట ఎందుకు ఎత్తుగడలోకి వచ్చిందంటే కాస్త నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళాలి..ఆహా! అంత తేలిగ్గా తీసుకెళ్ళను, ఆ ఫ్లాష్ బాక్ కి ముందు గా పదారేళ్ళ కథ ఆరంభం కావాలి..అక్కడ నుంచి ఇక్కడకి రావాలి మరి!!!


ఫ్లాష్ బాక్:1
అమెరికా నుంచి అమాంతంగా సిడ్నీ కి చేరాము.  నా ప్రవాసం లో తొలి పాతిక శాతం ఆస్ట్రేలియా గడ్డ మీద గడిచింది; అంచేత ఈ సహస్రాబ్దికి పూర్వపు ఊసన్నమాట ఇవాళ మనందరం మననం చేసుకునేదీ, ఒక విధమైన భక్తిరాహిత్యంతో నిర్లక్ష్యం గా తుంపి పసితనపు ఆటకాయ తనానికి ఆకతాయితనం జమిలి వేసి భీకరం గా పోరాటాల ఆటలకి బలి చేసిన మొక్క ని అందంగా కుదురుగా పెంచుకున్న అనుభూతి, అసలు ఉపయోగ రీత్యా ఇంకా భక్తిశ్రద్దలు పెంచుకున్న అనుభవమూను.

ఫ్లాష్ బాక్:2
మా కాన్వెంట్ క్రమశిక్షణ నాన్నగారి నియమానుసార పెంపకం నుంచి ఆటవిడుపు ముమ్మారు వచ్చేది, ఏడాదిలో దసరా సంక్రాంతి వేసవి సెలవులలో అమ్మమ్మగారి ఊరికి ‘పల్లెకు పోదాం, అల్లరి చేద్దాం ఛలో ఛలో’  లెవల్లో వెళ్ళినప్పుడు.. అన్నట్లు నిజం ఒప్పుకోండి, మీరంతా ఇంతే కదా చేసినది ఆ వయసులో!?

వేసవికాలం అమ్మమ్మగారికి మా సంగతి కన్నా కారాలు కొట్టించి, నువ్వులు గానుగాడించి, వడియాలు, పచ్చళ్ళు పెట్టించే పనుల జోరు కనుక పాలేర్లని బెదిరించో, లొంగదీసో కాదు వారంతా మా దోస్తులే కనుక వాళ్ళ భుజాల మీద స్వారీ చేస్తూ పొలానికి చెక్కేసేవాళ్ళం (దసరా సంక్రాంతి కానుకల లంచాలు కూడా బెలిపించి లే) తాటి కమ్మలు,  కిత్తనార ఆకులు,  బ్రహ్మ జెముడు, నాగ జెముడు మా భీకర గర్జనల పోరాటాలకి రాతి గదల్లా మారేవి, పొలాల గట్లు,  పల్లెపట్టు బంజరులు మా యుద్ధభూములు..పల్లేరు, బలురక్కసి పెరిగిన నేలమీదకి శత్రువుని తోసుకోడం ఒక కళ.  అలా పాపం ఆ సాత్వికమైన, సాధు మొక్కల్ని ముల్లచేట్లు, పిచ్చి పొదలు పేరిట దుమ్ము దులిపేవారం.  అంతకు మించి పెద్దగా పాత్ర లేదు వాటికి.  మరి ఆ పాటో అని స్వగతాల్లోకి జారకండి, నాతో పాటు కలిసి నడవండి.. కారాలకి నాలుగు రోకళ్ల పోటు లేదా రెండు రోకళ్ళ పోటు వేయటానికి వచ్చే బాపనమ్మ, చంద్రమ్మ వంటివారు పాడేవోరు, ఆయాసం అలసట తెలియకుండా అలా జానపదాల్లో మంచి ముత్యాలవంటి పాటల సాహిత్యం వెలిగింది ఒకప్పుడు.  పాట అంతా కాదు కానీ కొట్టుకునేప్పుడు పిల్లలం ఒక విధంగా కసిగా పిండికొట్టేసినట్లే థిమిత థిమిత అని అరిచేవారం! కనుక పాట పాత్ర ముగిసి జెముడు ప్రవేశించింది కథనంలోకి...

సరే, అక్కడితో చక చకా సిడ్నీ కి ఎగిరిపోయాము (మేము కాదు మనం) రెండేళ్ళు గడిచాక మొదటిసారి పిల్లాణ్ణి తీసుకుని అమ్మగారింటికి వచ్చాను, వచ్చేముందే ఇల్లు మారాము కనుక ఇరుగు పొరుగు ఎవరూ తెలియదు.  ఎంచక్కా ఏడూ వారాలు అడ్డు ఆపు లేకుండా హాయిగా గడిపి వెనక్కి వెళ్తూ ఓ బుల్లి సనికెల్లు పట్టుకుని వెళ్ళటం మరవలేదు. అంతకు మునుపు గడిచిన రెండేళ్ళు చాలా ఇబ్బంది పెదిపోయా అల్లం వెల్లుల్లి కొట్టుకోవాలన్నా, మిరియాలవీ దంచుకోవలన్నా..వెనక్కి వచ్చిన రెండో రోజు ఇండియాలో అల్లరి మరిగిన పిల్లాడు “Chicken Corn Cob” నవుల్తూ గంతులు వేస్తూ, సోఫాలు ఎక్కి దూకుతూ ఆడుతున్నాడు. నేను ఓ పిడికెడు మిరియాలు Omelette కోసం పొడికొడుతున్నాను; అప్పుడు ఎవరో తలుపు కొట్టారు అనేకన్నా బాదేస్తున్నారు.  కంగారుగా peephole నుంచి చూస్తే ఒక బాహుబలి ఎర్రగా మొహం వేసుకుని ఊగిపోతూ..హడలిపోతూ తలుపు తెరిచా.. 

సంభాషణ ఆంగ్లంలో జరిగింది.  “ఏమి థిమిత” (అతను) “మిరియాల థిమిత” (నేను) “మిరియాలు కాదు నా తల పగలకొడుతున్నావు. నీ సంతు గోడలు కూలుస్తున్నాడు” అతనలా అనగానే తెగ సంబరం వేసినా మర్యాదగా అడిగాను “అందుకు నేను ఏమి చెయ్యగలను. “ అని మెల్లిగా అడిగాను. కాస్త తాగిన మత్తులో ఉన్నాడు.  “నువ్వేమీ చెయ్యనక్కర్లా, మీ పనులన్నీ నేనే చేస్తా.  మీ తలలు, గోడలు పగలకొడతా” అని అరుస్తూ వెళ్ళిపోయాడు.  ఇక యువ నడవటం కూడా మానేసి పాకేవాడు భయం భయం గా.  నేను సన్నికెల్లు కడిగి ఆరబెట్టి పూజ చెయ్యటం మొదలుపెట్టా ‘మరే ఆపదా రాకుండా చూడు రాయమ్మా!’ అని.  అలా మూడేళ్ళు గడిచే క్రమంలో పరిచయాలు పలకరింపులుగా, పరామర్శలుగా మారాక చెప్పాడు “ఆ రోజు మనసు బాగోలేదు, ఏమీ అనుకోవద్దు..నువ్వు కూడా ఎగిరి దూకొచ్చు, నా గుండు కూడా పొడి చేయొచ్చు” అని నవ్వుతూ ఆ  యుగోస్లోవియన్ వ్యక్తి.   
కొన్నాళ్ళకి స్నేహ పుట్టినప్పుడు మళ్ళీ వచ్చాడు ఈసారి వలలుడు లా బూందీ దూసే అపకలా, యుద్దానికి ఊదే కొమ్ముబూరలా ఇంత బారు జెముడు ముక్క ఇచ్చి తినమన్నాడు; “నీకు మంచిది మా ప్రాంతంలో తింటాము,” అని.  అప్పుడు తెలిసింది ఆహారమని, చిన్ననాటి గద కాదని..ముందు పెద్ద “బీరకాయ” అనుకున్న నేను జడుసుకున్నాను.  ఇంకా ఏమి చెయ్యొచ్చు అంటే నీకు అలవాటు కదా కుండీలో పెట్టి పెంచుకో అన్నాడు. అలా ఒక కుండీ లో వేసిన ఆ కొమ్మ చిలవలుపలవాలు గా పెరిగి భలే పూసేది, కాసి పళ్ళు కూడా వచ్చాయి.  కానీ Stem, fruit మాత్రం నేను తినలేదు.  పిల్లలని ‘ఆ మొక్కలా ఎదగాలి,’ అనుకుని పక్కన నుంచో పెట్టి ఎత్తులు బేరీజు వేస్తుంటే వాళ్ళు కూడా కాస్త ఎడంగా ముళ్ళు గుచ్చుకోకుండా నుంచుని చూసుకునేవారు.  అలా అలా రెండేళ్ళు నన్ను భలేగా ఆకట్టుకున్న ఆ మొక్కని వదిలిరాక తప్పలేదు..పొరుగున ఉన్న కొంకిణీవారు సంతోషంగా దత్తత చేసుకున్నారు.

ఇక్కడితో  ఫ్లాష్ బాక్:2 కూడా అయిపోయి వేగంగా 2015 వచ్చిపడ్డాము (మీక్కావాల్సిన BGM కలుపుకోండి)
ఇక్కడ మెక్సికన్ గ్రోసర్స్ కి ఎక్కువగా వెళ్ళను కానీ పోయినేడాది ఒక సిరియన్ ఆవిడ హుషారుగా ఒక పాతిక ఎర్రటి పళ్ళేవో కొంటుంటే కుతూహలం గా అడిగితే అవి నాగజెముడు లేదా బ్రహ్మజెముడు పళ్ళని చెప్పి, ఎలా తినాలో ఎందుకు తినాలో కూడా చెప్తూ, నా కార్ట్లో ఉన్న “బీరకాయలు” వైపు ఆసక్తిగా చూస్తూ వాటిని గూర్చి అడిగింది (చిత్రంగా!) నేనూ యధావిధిగా వివరించి ఆవిడ ఓ రెండు బీరకాయలు కొనటానికి కారణమయ్యాను.  ఒక రెండు జెముడుపళ్ళు ఆవిడనే ఏరిపెట్టమని, ఇంటికి తెచ్చాను.  కాస్త అనుమానంగా ఎందుకైనా మంచిదని పిల్లలకి చెప్పాను ‘కొత్త ఫలం తింటున్నాను..తేడా వస్తే...” అని అర్థోక్తిలో ఆపగానే ఇద్దరూ భయంగా మాకు పెట్టకు అని అన్నారు (వారికీ రుచి చూపకుండా ఊరుకోను అని తెలుసు నేను బ్రతికి బట్టగడితే) సరే ఎంత రుచిగా ఉందొ అంతా ఆరోగ్యానికి మంచిది.  మళ్ళీ కొనటానికి వెళ్ళినపుడు ఒక దక్షిణ అమెరికా వ్యక్తిని పట్టుకుని జెముడు కొమ్మలు ఎలా తినాలి అంటే నోరూరేలా ఎలా ముళ్ళు చేక్కేసి, పైన చెక్కు తీసేసి, ముక్కలుగా కోసుకుని ఉల్లిపాయలవీ వేసి వండాలో చెప్పాడు.. అచ్చంగా బీరకాయ లా వండుకోడమే.  పెంచడం చాలా తేలిక! తినడం అరాయించుకోడం ఇంకా సులువు మరి ఆరోగ్యానికి ఎంతో మెరుగు. 

Mexican Organ Pipe Cactus, Prickly Pear or Cactus Fruit; నాగజెముడు లేదా బ్రహ్మజెముడు అనే ఈ పళ్ళ రుచి ఎర్ర జామ జీడిమామిడి నడుమ రుచి/ కొంచం ఉప్పుప్పగా లైటుపులుపుగా కొద్దితీపికలగలిపి జ్యూసీగా గింజలతో ఉంటుంది గుజ్జు.  గింజలు కాస్త ఉలవలు మాదిరి ఉన్నాయి, బచ్చలి పళ్ళలా బీట్రూట్ లా రంగు పడుతుంది చేతులకి.  ఇక్కడ మాత్రం టెక్సాస్ లో బాగా ఉంటాయి, అక్కడున్న కొద్దిసమయంలో ఎన్నో చూసాను. మా మిడ్వెస్ట్ లో కోసిన ముక్కలు, పళ్ళు ఎప్పుడూ దొరుకుతుంటాయి.  There are many benefits specifically for weight watch and cholesterol control. Not to leave out fact of the Source of Essential Micronutrients part.

నా  చిన్నప్పుడు నాగజెముడు.., బ్రహ్మజెముడు మొక్కలు/పొదలు విరివిగా ఉండేవి.  ఇప్పుడు మావైపు ఊళ్ళల్లో ఎక్కువగా కనపడటం లేదు.  కనుక నేను ఇక్కడ నుంచి కొమ్మంట్లు కట్టి తేలేను కనుక వీలువెంబడి ప్రయత్నించి ఓ పదుగురైనా పెంచినట్లయితే, అందులో నలుగురు తిన్నామని చెప్పినట్లయితే ఈ టపాకి సార్థకత! 

తోటపనితో నాలో నేను-6

వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే

 

వంకాయ ప్రశస్తిని తెలపటానికి నిజానికా చాటువు ను చాటుచేసుకుని చెప్పనక్కరలేదు కాకపొతే బసవరాజు అప్పారావు గారి పాట అడ్డం పెట్టుకుందామంటే ఆయన గుత్తొంకాయ కి మాత్రమే పట్టం గట్టారు; ఆపై ‘కూరలోపల నావలపంతా,’ అని వెర్రిపిల్లతో పాడించి నా సమగ్ర అభినవ వంకాయ వంటల కౌశలానికి పరిధి యేర్పరిచినందున..కాస్త ఈ పోలికలతో సరిపెట్టుకొమ్మని (అలా కాకపోయినా మీరు చదవటం తప్పదని నొక్కి వక్కాణిస్తూ)
వంకాయ మూడు దేశాల్లో ముప్పది రూపాల్లో నా గిన్నెల్లోకి ఎక్కినమాట మాత్రం వాస్తవం! వంకాయ, బ్రింజాల్, ఎగ్ ప్లాంట్ ల ఖండాంతర నా వంటలపెద్ద అనుభవాలు కోకొల్లలు; టపా చిట్ట చివర్న ఆ చిట్టా ఇచ్చాను; ఆగండాగండి అప్పుడే దృష్టి క్రిందకి మలపకండి..నిదానం గా చేతి వేళ్ళు గుప్పిట బిగించి చదివితే కూరలన్నీ తిన్నంత రుచిగా ఈ అక్షరం కూడా ఉండొచ్చునేమో ఓమారు ఆలోచించండి.
దంతసిరి ఉంటేనే ఈ రుచి దొరుకుతుందని నాన్నగారి సిద్దాంతం మేమంతా నమ్మి ఆచరించాము. వంకాయ లేని కూరలబండి/కొట్టు, ఆ కూర వండని చట్టి/దాక ఇలలోన కలవా!? అనర్గళంగా షోడశ వంటలు గుక్క తిప్పుకోకుండా చెప్పగల నాకు వంకాయ కొనటం అనే దుస్థితి ప్రవాసం కలిగించింది. కసరెక్కుతుందని వీలైనంత తాజాగా ఇలా కొమ్మ నుంచి గిల్లిన కాయ అలా మగ్గబెట్టి తినటం అలవాటైన సాంప్రదాయం,- నిజానికి ఈ వంకాయ హరప్పన్ల నాగరికత కాలం నాటిదని తెలుసుకోకమునుపే- ఇంటి భోజన సంస్క్రతికి ప్రధాన ప్రతినిధి అనుకునేవారి సత్సాంగత్యం తో కొని తినటానికి సిద్దమైనప్పుడు తెలియలేదు. కొనటం కాదు అసలు సంగతి, ఆ రుచీ పచీ లేని కండపుష్టి కాయలోకి ఘుమఘుమలు తేవటంలో ఉందన్నదే అసలు కిటుకు అనేసి..
ఇక మొదలైంది అమ్మ చేతి వంట, మామ్మ చేతి వంటలు కాక మనదైన బ్రాండ్స్ కలపటం.. “అమ్మా! మీకన్నా అందెవేసిన చెయ్యి అయిపొయింది వంకాయతో నా వంట,” అంటే నిండుగా నవ్వేవోరు అమ్మ. మురిపెంగా మెటికలు విరిచి ముద్దాడేది మా సుబ్బమ్మ (ఈ బంగారి ని గూర్చిన వివరం మరొకసారి). ఇన్నేసి కూరలు ఉండటంతో పిల్లకాయలు అమ్మమ్మ కూర, అత్త కూర, శైలజాంటీ వాంగీబాత్ ఇలా వర్గీకరణలు కూడా చేసారు.
అలా ఒక దశాబ్దం కొనటం లో ఆరితేరాక, ఆర్గానిక్ వంగడాలలో అదనపు రుచి మరిగాక నాకూ వచ్చింది ఒక పెరటి తోట దాదాపుగా ఐదారు బెడ్స్ వేసుకునేంత వెసులుబాటు ఇస్తూ 2003లో. ఇక మెళకువలు తెలిసాయి. బన్నీ (అనినా అర్జున్ అనుకునేరు కానేకాదు, మా డెక్ క్రిందన స్ప్రింగ్ లో పుట్టి మొగ్గలు, కొమ్మలు ఎడాపెడా కొరికి పడేసే కుందేలు పిల్ల) బారిన పడకుండా తీగలతో తడిక ఏర్పరిచి, సెప్టెంబర్లో చివరి ముదురు మొక్కలు పెరికి, అక్టోబర్ లో ఫాల్ క్లీనప్ అయాక చక్కగా సారం పెట్టిన నేల ఐదారు నెలలు మంచుకి నాని, లోలోపల సారవంతమైన భూమిగా మారాక, ఎండా తొంగిచూసే మే నెలాఖరులో నారుమొక్కలు నాటుకుని, ఆపై పెంపకం మీద అమితమైన శ్రద్దతో, చీడ పీడా రాకుండా జాగరూకతతో కాచుకుంటే “వంకాయ ఉన్ననాడు పేచీలు ఉండవమ్మా నైబరూ.. వండిన రకాము తిరిగి నెల వరకు దొరకదయ్యా కలీగూ..” అని పాడుకుంటూ వండుకుని తినొచ్చు. పిల్లలు అడిగి తింటారు. అడగనివారికి కూడా పిలిచి మరీ పెట్టినదీ వంకాయనే.. అంత కాపు, ఎంతో రుచి! కాపు బాగుంటుంది, దిగుబడి ఎక్కువ, సంరక్షణ తేలిక మనకి మిగిలే ఆరోగ్య పోషణ ఇంకెంతో ఎక్కువ.

మరెందుకిక ఆలస్యం?! మీ కాయ మీరే పండించుకుని మాక్కూడా పంచండి. నీరొంకాయ పొడుగ్గా వంకాయ రంగులోనే ఉంటుంది కదా.. ఇక బుల్లి మువ్వొంకాయలు, బండ కొండరాళ్ళంత కాలిఫోర్నియా వెరైటీ, తెలుపు కలగలిసిన ఛారలతో ఉండే జపనీస్/Asian రకం అన్నీ పండించా కానీ మనవైపు దొరికే తెల్లటి మెట్టొంకాయ అక్కడి విత్తనాలు తెచ్చిన ఒకసారి మాత్రమే సాధ్యపడింది. 

వంకాయ లో సాధారణంగా ఉల్లిపాయ వేయని వంటకం నేను చెయ్యను. ఇదిగో ఓ ముప్పై మూడు రాస్తున్నాను పేర్లు, వస్తే వండి పెడతాను ఒక షరతుతో మీ పెరటితోట కాయలు పుచ్చుకు రావాలి...
వంకాయ కూర లో రకాలు లోపల కలిపే రుచిని అనుసరించి:1) పాలు, వెల్లుల్లి, జీలకర్ర ; 2) కొత్తిమీర కారం; 3) ధనియాల కారం 4) అల్లం, పచ్చికారం 5) వెలిగారం 6) +టమాటా 7) +దోసకాయ 8) + చిలకడదుంప 9) +బంగాళా దుంప 10) +తెల్ల గోంగూర 11) + ములక్కాయ 12) + కారెట్ 13) + బఠాణీ 14) + చిక్కుడు 15) కలగూర పులుసు 16) పచ్చిపులుసు 17) మజ్జిగపులుసు 18) సాంబారు 19) దప్పళం 20) బజ్జీ 21) బెంగన్బర్తా 22) వంకాయ సెనగపప్పు 23) వాంగీ బాత్ 24) మలయాళీ కూర 25) గుత్తివంకాయ ఆంధ్రా స్టైల్ 26) గుత్తివంకాయ తెలంగాణా రకం 27) వంకాయ పకోడీ కూర 28) చైనీస్ రెసిపి 29) ఇటాలియన్ eggplant parmesan 30) పచ్చడి 31) పచ్చి దోసకాయ కలిపి 32) మిక్సేడ్ వెజ్ 33) వంకాయ ఊరగాయ


ఏమంటారు నిజమని ఒప్పుకుంటారా- ఒక్క వంకాయ అనే శాకాంబరిని రోజుకొక సారి తలిస్తే నెల తిప్పెయొచ్చునని గరిటతో పాటుగా? నేను పండించినవీ, వండినవీ ఒక శాంపిల్ ఫోటో తో ముగిస్తూ...

తోటపనితో నాలో నేను-5

"పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూచేను?
మా పెరటితోటలో చిలకడ పూచేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను" - మరువం ఉష




జాన్ నా సహోద్యోగి.. వృత్తిలో పోటీ కాకుండా సహకారంతో మెసిలినవారం. తన పూర్వీకులు చాలా తరాల క్రితం యూరోప్ దేశాల నుంచి ప్రవాసం వచ్చినవారు; కాస్త జర్మన్ కాస్త స్వీడిష్ వారసత్వం ఉంది ఇంకా చాలానే కలిసాయి క్రమేణా వారి తరతరాల పరంపర లో. అయినప్పటికీ జాన్ తాత, తండ్రి తరంలో వ్యవసాయదారులే, తనకీ చాలా శ్రద్ద. తల్లి తోటలవీ పర్యవేక్షిస్తూనే ఇలా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో సీనియర్ స్థాయి ఉద్యోగ జీవితం కూడా సాగించాడు. మా ఇద్దరికీ వెనక 3-4 తరాల వారిపట్ల గౌరవం, వారి జీవితాల పట్ల అవగాహనతో పాటుగా ఆథ్యాత్మికత, తోటపని, వంట పట్ల ఇష్టాలు కలిసేవి.

ఒక సంవత్సరం మే నెల 3వ వారంలో సంభాషణలో " ఈ ఏడాది కొత్తగా ఏ మొక్క పెంచనున్నావు?" అని అడిగాడు. ఏడాదికొక కొత్త వంగడం/రకం కూరగాయ పెంచటం నాకు అలవాటు. "ఇంకా ఏమీ అనుకోలేదు.." అంటుండగానే అటుగా వచ్చిన రాబ్ (దక్షిణ అమెరికా మూలాలు ఉన్నవాడు) "హే! ఆలీ (లెబనాన్ నుంచి వచ్చిన ప్రవాసి) చిలకడదుంపల నారు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాడు. మేము నలుగురం ఉన్నాము, మీరిద్దరూ కలిస్తే ఆరుగురం కలిపి కొంటే 25 మొక్కల కట్ట అందరం తీసుకోవచ్చు," అన్నాడు. కనీసం పాతిక కొనాలి అన్నమాట. నేను ఎప్పుడూ నర్సరీలో చూసి తెచ్చుకోవటమే కానీ అలా తీసుకోలేదు. సరదా వేసింది కాస్త సంశయం ఎలాగ వస్తాయో అన్చెప్పి... "సరే!" అంటూ నేనూ, జాన్ కలిసాము. ఒక వారానికి వచ్చింది నారు జాగ్రత్తగా నలగకుండా సర్ది పంపిన పాకేజీ. రాబ్ గబగబా వాటిని సగం వరకు నీరు పోసిన చిన్న జగ్ లో పెట్టి మా అందరికీ ఈమెయిల్ ఇచ్చాడు. మీటింగ్ కారణం గా నేను వెళ్లేసరికి ఆరోగ్యవంతమైన నారు మొక్కలు కొత్త యజమానులు చేతికి వెళ్లి కాస్త బక్కచిక్కిన ఆరేడు మాత్రం మిగిలి ఉన్నాయి. సరేలెమ్మని ఒక నాలుగు తీసుకుని, రాబ్ కి డబ్బు ఇచ్చి, ఫర్వాలేదు అన్నా తాను ఎవరినో అడిగి నాచేతిలో కచ్చితంగా పెట్టేసిన చిల్లర కూడా పుచ్చుకుని ఇంటికి రాగానే ముందుగా వెనుక ఉన్న మడిలో రెండేసి చొప్పున కలిపి పాతి, పోషణ చేసాను. జూన్ మొదటివారానికి (అంటే 15 రోజులకి) మొక్కలో కాంతి, చిగురాకు వేసే తేజస్సు కనపడ్డాయి. అసలు అంతవరకూ అవి తీగెలా పాకే వత్తైన కుదురుగా ఉంటాయని తెలియదు. ఇక ఆ పక్కన ఉన్న తోటకూర, చుక్కకూర వంటి మొక్కల మీద పాత మోజు పక్కదారి పట్టి కొత్తదారి తీసుకుంది. జాన్ తో అప్పుడప్పుడు 'నీ మొక్కలెలా ఉన్నాయి' అని అడిగి నా తీగె సంగతి చెప్పేదాన్ని. అలా నిండుగా ఉంది చాల్లే అని కూడా అనేసుకున్నాను ఇంతలోకి చిగురుల మీదుగా మొగ్గలు వచ్చి పూలు పూశాయి. తూటిపూల లా ఉన్నాయి.. తెలియకుండానే దేవులపల్లి పాట అని గుర్తు ఆ ఎత్తుగడ తో "పూచేనమ్మా పూచేనమ్మా ఏమి పూచేను? మా పెరటితోటలో చిలకడ పూచేనూ... " అని పాట అందుకుంది నా మనస్సు. అదే తర్వాత పూర్తి చేసాను. నాన్నగారికి ఫోన్లో చెప్తూ, సాయంత్రపు నడకకి వెళ్తూ నా మొక్కలు చూడ్డానికి ఆగేవారికి చూపుతూ సంబరంగా ఆ ఎదుగుదల చూస్తుండగా కాస్త ఛీడ పట్టినట్లుగా ఆకుల తీరు చూసి గ్రహించినా, క్రిమిసంహారక మందు చల్లితే పక్కనున్న అన్ని మొక్కలమీదా ఆ ప్రభావం తో దుష్ఫలితం ఉండవచ్చని, సాధారణంగా ఛీడ పీడలను తట్టుకునే వంగడాలను మాత్రమే ఆ కంపెనీ వారు పెంచుతారని విన్నాను కనుక అలా వదిలేసాను. అక్టోబర్ నెలలో మొక్కలు చలికి వడిలిపోవటం మొదలుపెట్టినా ఇంకా పూత మీద జోరుగా ఉన్న తీగెలు ఫోటో తీసి, జాన్ తో చెప్పాను. ఒక పదిరోజులకు హడావుడిగా వచ్చి "ఓయ్! ఇవాళ తీసేయ్.. అలా వదిలేస్తే నీకేమీ దుంపలు మిగలవు," అన్నాడు. ఎలా దుంప సేకరించాలి కూడా వివరించాడు. కాస్త ఆసక్తితో విన్నాను..ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఎప్పటిలానే మొక్కల్లోకి వెళ్తూ పిల్లకి చెప్పాను "ఇవాళ జాగింగ్, డాన్స్ చెయ్యను కానీ నీకొక వింత చూపిస్తా!" అని. లోలోపల అనుమానం అసలు పైన పూలు ఉన్నాయంటే లోపల దుంపలు ఉండి ఉంటాయా అనేసి...

'అయ్యో! సందెవేళ పచ్చటి మొక్కని అలా ఎలా తవ్వి తీయాలి?! నాన్నగారితో చెప్తే కోప్పడతారు..' అనుకుంటూ పైపైన తవ్వేసే ఆషామాషీ పనిలా నాలుగుసార్లు చిన్ని గునపం వంటి పరికరంతో మొదలు చుట్టూ కదిపి చూస్తే, చలికి బిగిసి ఉన్న మట్టి ఒక చిన్న పెళ్ల కూడా కదల్లేదు. అలా అలా ఒక గంట పైనే చీకటి పడిపోతున్న ఆ మునిమాపు వేళలో (సాధారణంగా వాన పడదు కానీ ఆరోజు అదీ తోడయింది) కొంకర్లు పోతున్న అంతగా బలమైన పనులకి అలవడని చేతులతో, దాదాపుగా ముద్దకట్టుకుపోతున్న స్థితిలో, "ఓ రంగయో..పూల రంగయో" వంటి పాటలు "చెల్లియో చెల్లకో.." వంటి పద్యాలు నాన్నగారిని అనుకరిస్తూ పాడుతూ మరి నా పూర్తి జాగృత, స్పృహ వదిలి మనస్సు జాయింట్స్ నెప్పి, రక్తం గడ్డ కట్టే తిమ్మిరులని దాటుకుని చేతులకి శక్తి ని పంప్ చెయ్యాలి కదా!- నా త్రవ్వకాలు కొనసాగించా. 

అదేదో లంకె బిందెలు తవ్వితే కలిగే అనుభవం లా నా టూల్ కి అడ్డమొస్తూ గట్టిగా ఏదో తగిలే సరికి బలమంతా పెట్టి మట్టి తిరగబడేలా పెళ్లగించి చూద్దును కదా! "యురేకా, బింగో, వామ్మో, హైలెస్సా" అన్ని భాషల్లో శ్రామిక ఆశ్చర్యం, కృషీవలుల విజయహాసం, పరిశోధనల ఫలితపు సమయాలు నాలో ప్రాణం పోసుకున్నాయి. స్నేహ పరిగెత్తుకుని వచ్చింది. ఆ మునిమాపు వేళలో అలా ఒకటొకటిగా బయటకు తీస్తూ 'అమ్మా! మన్నించు, భుక్తి కొరకు భక్తి తో చేసే పని' అని నేల తల్లికి మొక్కుతూ పోగేసినవి దాదాపుగా 10 పెద్ద దుంపలు, ఐదారు చిన్నవి. మిగిలిన తీగె ఆకులు జాగ్రత్తగా బాగ్ లో దాచాను, కమ్యూనిటీ కలక్షన్ వారికి ఇవ్వటానికి (కంపాస్ట్ చేస్తారు) ఇక నిద్రపోతే ఒట్టు ఆ రాత్రంతా.. నాన్నగారు, అన్నయ్య కి ఫోన్లు, లోకల్ కాల్స్, వాటిని రకరకాలుగా కిచెన్ ఐలెండ్ మీద పేర్చి, ఫోటోస్ తీసుకుని, నాలుగు నాకు ఉంచుకుని తెలిసినవారికి వెళ్లి ఇచ్చి, మర్నాడు జాన్ దగ్గరకి పరిగెత్తుకుని వెళ్లి చెప్పాను. "ఓ! నిజమా" అని తాను అరిచిన ఆ అరుపుకి మిగిలిన నలుగురూ లగెత్తుకు వచ్చారు. ఇక ఒక హరికథ లా మొదలెట్టి, బుర్రకథకి మార్పిడి చేసి, పాడిందే పాట లా ఒక వారం పాటుగా నేను ఆ దుంపల సాగు ఎలా చేసాను, నాకు అత్యంత అధికమైన ఆ దిగుబడి ఎలా సాధ్యం అయింది అనే అంశం మీద మా అధ్యయనం సాగింది. సంగతి ఏమిటంటే వాళ్లెవరి తీగెలకీ పూత తప్పా దుంప రాలేదు. జాన్ వాళ్ళ అబ్బాయి/అమ్మాయి కాకపొతే భార్యో ముందుగా పెకిలించి తీసేసరికి లేత దుంపలు ఓ నాలుగు మాత్రం వచ్చాయి.

కనుక నేను మరొకమారు కాలర్ ఎగరేసి కనుబొమ్మలు కూడా కలిపి కళ్ళతో నవ్వుతూ కలకాలమని కోయిల లా పాడుతూ ఒక పక్షం వరకు చిలకడ దుంపల వంటకాలు చేసి (లావయ్యాను అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే) సగం చిక్కిపోయా పిల్లదానికి తినిపించి.. చూస్తూ చూస్తూ నేను తినలేక. (ఎంతైనా తొలి పంట అప్పుడు కాస్త తల్లితనపు తత్తరపాటు వస్తుంది). ఒక దుంప మాత్రం నెల పైనే అట్టిపెట్టాను. ఎందుకంటే Thanksgiving పండుగ అనాది సాంప్రదాయాన్ని అనుసరించి ఈ దుంపలు, మొక్కజొన్న వంటలు తప్పనిసరి. 

ఇవాళ అమెరికా అంతా అన్ని జాతీయులు దాదాపుగా ప్రతి పిల్లాపాప సంతోషంగా గడుపుకునే ఈ పండుగకి ఒక విశేషం ఉంది. మన సంక్రాంతి మాదిరిగా పంట ఇంటికి వచ్చాక సంబరంగా, తిరునాళ్ళగా జరిపేవారుట.. ప్రతి ఇంటా సమృద్ధిగా పాడిపంటలు ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలుపుతూ. అలా Native People జరుపుకునే ప్రాచీన వ్యవసాయ సాంప్రదాయ వేడుకలోకి స్పానిష్ వారి రాకతో కొంత మార్పు, చివరిగా 1621 లో Mayflower నౌక ఐరోపా/ఇంగ్లండ్ నుంచి బయల్దేరాక- సముద్ర పయనం లో ఎన్నో ఇక్కట్లు పాలయి, రోగాలతో ఎందరో చనిపోయి- చాలా మందిని కోల్పోయి మిగిలిన కాందిశీకులు విచ్చేసినప్పుడు స్థానికులు వారికి ఎదురేగి విందు భోజనం పెట్టటంతో ఆ విందులు, వినోదాలు కలగలిసి మరింత చారిత్రిక ప్రాముఖ్య కలగలుపుకుని నేటికీ పాత కొత్తల మేళవింపుతో సాగుంతోంది. ఈమధ్య చివరిగా 2014 లో నేను 90 సంవత్సరాల వృద్ధులతో గడిపాను, వారిలో ఒకరు హిట్లర్ సమకాలీనులైన తాత మామ్మల అనుభవాలతో ఒక నవల రచించిన పోలిష్ రచయిత్రి.

నేను దుంపలు కాల్చి తినటం, ఉడకబెట్టి తినటం కాకుండా కాక పులుసు, వేపుడు, మా వైపు కాజాలో మడతల నడుమ ఉడికించిన దుంపల పేస్ట్ రాయటం, సిడ్నీలో శ్రీలంక తమిళుల వలన పాయసం, ఇక్కడ sweet potato casserole, sweet potato fries and mashed sweet potatoes చేస్తూ ఉంటాను.

(సమస్త జగతికి, సకల జీవకోటికి కృతజ్ఞత తెలుపుతూ నా పాట, కవిత జతపరుస్తున్నాను.)
మీ అందరికీ Thanksgiving సందర్భంగా నా నెనర్లు! మీ మాటలకి మప్పిదాలు.
-1-
పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూచేను?
మా పెరటితోటలో చిలకడ పూచేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను

కాచేనమ్మ కాచేనమ్మ
ఏమి కాచేను?
మీ ఇంటి ముందరి గులాబీ కాయ కాచేనూ...
కాదు కాదు కానే కాదు
నీలాకాశాన వెన్నెల కాచేను

పండేనమ్మ పండేనమ్మ
ఏమి పండేను?
మా అత్తగారి బీరపాదుకి పండు పండేనూ...
కాదు కాదు కానే కాదు
నేను కన్న కలలు పండేనూ

-2-
దేహమే శిలువగా మోసుకుంటూ, లేదా
దేహపు గదిలో బందీ అయిన ఆత్మగా
విశ్వపు ఒడికై ఆర్తి చెందుతూ
విడుదల కొరకై వేచి ఉంటాను

గోడల్ని ఒరుసుకు మొలిచిన రావిఆకులు
కదులుతాయి, కంటి చూపుని కదుపుతాయి
నీటిలో పడ్డ కిరణాల పరావర్తనమో, వక్రీభవనమో
మెరుపు నీడలై కనులెదుట నిలుస్తాయి
వార్తాహరులు వచ్చిపోతున్నట్లే ఉంటుంది

కమ్ముకుని కట్టిపడేసిన భయపు కౌగిలి లో
ఊపిరి అందని ఉక్కిరిబిక్కిరి లో
దిగంతపు దిశ గా, ఏవేవో ఆనవాళ్ళ వెంట
చివరి మజిలీ కి తరలిపోతుంటాను

గాలి ఊయలులు సేద తీరుస్తాయి
కెరటాల వీవెనలు కుదుటపరుస్తాయి
ప్రకృతిలో మనుషులు, మనుషుల్లో ప్రకృతి
పలుకరిస్తాయి, గృహానికి చేరిన భావన ఇస్తాయి
ఇవన్నీ నిండిన లోకపు వాకిలి లో నిలిచి,

కృతజ్ఞతల తోరణాలు కట్టిపోతాను.