తనలోని తానైన తను

ఒక పరి

వెర్రెత్తి పీల్చుకున్న సంద్రాన్ని ఎత్తి విసిరి ఆకాశం వరకు పారేస్తుంది
చంచల చిత్తయై, వర్ష నాళికల వేయి నాలుకల లాలాజలమై సొంగలు కారుస్తూ
మబ్బుల ఉదరం పిండుకుని ఉరుములై పిడుగులై వ్రక్కలై ఎదురౌతుంది
నేల కి ఇనికిన నీరే జీవమై జవసత్త్వమై చివురాకుల మొగ్గల పిందెల వన్నెలలో ఉపశమిస్తుంది
ఇంకొక పరి వైరాగ్యమా, త్యజించటమా- ఎవరెరుగని పోకడ

రేకులు రాల్పుకుని వసంతం ఊరు వాడలు విడిచి పోయే వరకు వడగాడ్పు గాలుల రమిస్తూ
పండుటాకులు విసర్జించుకున్న ఋతువు రాకపోకలు సాగే వరకు
ఉందనిపించే అందం ఆగదనిపించే చందం...
ప్రశాంత గగనం, తేలిక పడ్డ వనం తనకు మిగిలే- వరకు ప్రకృతి
తాను నేను...నేనైన తానో, తనౌతున్న నేనో?

ఎరుక

కొన్ని దుఃఖాలు 
నీలో కొన్ని మరణాంతర యానాలకి 
సాగరాలై సంగమిస్తాయి
మరి కొన్ని పూలు 
నీలో ఎన్నో భవ/భావన అగాధాలలో 
ఎగిరే మిణుగురులై ఎదురౌతాయి. 
ఒక నిష్క్రమణ నిర్దయగా 
కన్నీటి కడలిలో ముంచెత్తుతూ 
నడుమ నడుమ తన తాలూకు కొత్త పరిమళపు గాలులలో సేదతీరమని వీలునామా వదిలి పోతుంది...
ఎన్నో వేల పూలలో 
ఆచూకీలు వెదుక్కున్నప్పుడు 
ఎరుకకి వస్తుంది జ్ఞాపకాలు అలా పూలగా 
రూపప్రక్రియకి లోనయ్యే 
ఘటనలు మటుకు గాయపూరితమేననీ, 
ఎన్నో పూల చెట్లు మొక్కలు నీ కనుమరుగయ్యాయని, 
నీలో ఒకానొక కడలి కూడ ఉప్పుదేరి 
బరువైన స్ఫటికలుగా మారిందని,
 మరొకటీ గ్రహణకి వస్తుంది- 
కొత్త కడలి పాత కడలికి మరుజన్మనిస్తుంది, 
ఒక్కొక్క శోకం 
మరిచామన్న వాటిని పూడిక తీసి పారేలా తీస్తాయని. 
దుఃఖాలు పూలు ఒక జత అని- 
రెంటికీ నీలో ప్రేమ మాత్రమే ధాతువని...

ఎందరో ?

గాజు దేహపు  గుండె తిత్తి లో 
ఒక పురిషెడు జలం ఉండొచ్చునని
జీవమై, జీవనరాగమై దేహవాటికలో పారుతుందనీ- 
ఆశ, ఆసరా కలేసి అనుభవైక్యం చేసున్నా
ఘటనగా, మాటగా తొలుచుకుంటూ ఆ పాత్ర- 
వంటిలో భాగమో, 
బతుకులో భాగమో- 
నామరూపాలు కాలం మార్చివేసాక
తొణికిన చుక్కలన్నీ 
కంటి పల్లం దిక్కుగా జారిపోయాక 
పొడిగుండెల సవ్వడితో 
ఒక నేను, ఒక తను, మరెవరో,మరెందరో...