ఎలా!?

నిన్నటి మేఘం కరిగి నిన్నూ నన్నూ ముసాబు లోకి నెట్టి వెళ్ళాక-

రాలిన వేప రేకుల చేదు
నానిన మావి టెంకల తీపి
వాసనలు మనసు ముంగిట గాఢం గా...

గిల్లికజ్జాల సడి
ఆగక కొట్టుకునే కిటికీ తలుపుల్లో
మళ్ళీ రాని మాటల సందడి
మూయని ద్వారపు తోరణాలలో

కురిసీ కురియని వాన పాయలు గుండె నిండా పరుచుకుంటూ-

ఉండీ ఉండి ఇంకా ఉరిమే ఆకాశం
ఆగి ఆగి కంటిలో మెరిసే అనురాగం

ఇంకోసారి
మునుపటి మునిమాపు గోలలు,
నిన్నా మొన్నటి మాగన్ను మూగ వేదనలు
పలకరించి పలవరించి పోతాయి

ఇకప్పుడు
'మబ్బు కమ్మాలి, ముసురు పట్టాలి' ఆశ పడుతూ
తడిసిన కలలు తుడుచుకుంటూ
తడారిన చేతులు కలుపుకుంటూ...

మనమిలా!

కడపటి వందనం

ఒక చల్లని చీకటి రేయిలో తడికళ్ళ శైత్యం మరింత వణికిస్తే-
గాజుల సడి, జాజుల స్పర్శగా
నుదుటన అద్దిన కుంకుమ గా
అమ్మ జాడ నాకు వీడ్కోలు పలికింది

ఆ తెలవారిన వెచ్చని పొద్దుతో పోటీగా కంటినీటి ఉష్ణోగ్రత
నిర్జీవ దేహపు నివాళి అననా!?
అంతిమ చూపుకి సమర్పణమా...
గాజు బొట్టు పూవు ఫలం- ఇవే చేతులు, మరప్పుడు నా నుంచి అమ్మకు

పుష్కర కాలం ప్రవాహమై, పదిలపరిచిన జ్ఞప్తులు పొరల భారంతో పొదగబడి
అమ్మని వెదుకుతూ నాన్న నడిచి వెళ్ళిపోయాక ఇక అనాధ నామం నా నుదుటివ్రాతగా
నిట్టూర్పు నిప్పుల సెగలు, రాజీ తప్పని దినసరి వెతలు నడుమ
ఇప్పుడూ అవే ఆనవాళ్ళు- తాంబూలాలుగా, ప్రసాదాలుగా- ఇంటి కంచాల మారుగా పంచిన విస్తళ్ళలో

శీత శ్రవణం

చిదుగులు  రాలుతుంటాయి, ఏదో ఒక దిక్కు నుంచి గాలి వీస్తుంటుంది

మాగిన పూరేకులు, పలకమాగిన పళ్ళు కంటి చూపు మేరా-
రంగులు మారిన ఆకుల వెనుగ్గా ముసురు తాకిళ్ళ ఆకాశం  
చిగురు తొడుగుతున్న తీగకిక సమయం లేదు
విచ్చీ విచ్చని మొగ్గలూ ముగిసిపోతాయిక...

వడిలిపోతున్న ఆకులు, వెచ్చని ఉభయ సంధ్యలు సెలవు తీసుకోనున్నాయి

గుబులుగా ఉడుతలటూ యిటూ  తిరుగాడుతూ పికాన్ నట్స్ పోగేసుకుంటూ
కుదురుగా పిట్టలూ అదే పనిగా మట్టి గుట్టల్లో, చెట్టు తొర్రల్లో తవ్వితోడిపోస్తూ
ఉన్ని దుస్తులు, తోలు పాదరక్షలు వెలికి తీసి ఉసూరంటూ అందరమూ
వచ్చి పోయే శీతువు ని ఎప్పుడూ కొత్త ఋతువుగానే ఊహిస్తూ...

నిరుడు, ఆ మునుపటేడూ ఇవే మాటలు చెప్పుంటాను,  ఊసులు రాసి పోగుపడుతుందిలా మరి!

(ప్రచురణ కౌముది 100వ సంచిక ఏప్రిల్, 2015)