వెఱ్ఱి తల్లి లాలి పాట!

ఏడ్వమ్మ ఏడ్వమ్మ బుల్లి మా వల్లి,
ఏడుస్తూ నీవలా నీలాలు కార్చమ్మ.
నీ ఏడ్పునాపంగా
నేనెంతదాననే,
ఆపైన నవ్వంటే నేర్పమంటే నావల్లనవునా చిట్టి తల్లీ ?


నీ కంటి నీలాలు తన దోసిటన పట్టే తోడురావాల..
తన ముత్యాల మూటలు నీ చెవిన పడాల..
నే పాడితే లోకమంత పచ్చనని
నీకనిపించు
పాటగ, బ్రతుకాటగ నోటి మాట ముద్దుకైనా నీకొద్దమ్మ


నీ రూపు, చూపు, మనసు, మమత అన్నీ వెతలంటారు వోర్వలేనోళ్ళు
నీవౌవుతావు సూర్యముఖి, చంద్రముఖి....... నువ్వవ్వాలి ఒక జ్వాలాముఖి
వెనుతిరగని గుండె దిటవు నీవు చూపేటి ప్రగతి మార్గం,
మా అందరి గుండె కోత నీకు చూపించే దిశా నిర్దేశ మవ్వని నా చిట్టితల్లి


పుడుతూనే తల్లివి, బొమ్మల పెళ్ళికి పెద్దవి కదమ్మ
బువ్వలాటలో నీ బుల్లి కడుపొకటే నిండనిది
నీ పేరు ఆడదమ్మ, అయినా అంటారట ఆడబొమ్మ ని
అవునమ్మ మీ అమ్మ వెఱ్ఱిదేనమ్మ, అచ్చంగా వాళ్ళమ్మలాగే


కలకన్నావా, వద్దొద్దమ్మా, రంగు నీ చూపుకంటుతుంది
ఇలమరిచిపోయావా, అసలొద్దమ్మా, కాలం ఆగిపోతుంది
మరిక యేముందంటావా, కొత్త పాట కట్టాల్సివుంది కాదామ్మా?
పాతపాట కొత్తపదాలతో మార్చి కట్టి నీ బిడ్డకి పాడవామ్మా?

పాటంటే పదాలు కాదని, అణువణువున జీవమని ఎలుగెత్తవా?
జ్వలించే కాంతి కిరణం వరించే ధైర్య ధరిత్రి నీ తోడు రాగా
సాగవమ్మా కొత్త దారుల అమ్మలందరికి కొంగ్రొత్త పాటవై
ధరణీ తలాన నూతన రాగమై..నా దీవెనల చలవ తోడుగా..

మరుజన్మ

దప్పికగొన్న జలధార హిమగిరికి వినతి నిచ్చిందనేమో
జలపాతాన్ని ఇముడ్చుకున్న కోన మూతి ముడిచింది
మేటలేసిన కూన మింటి వంక మోర చాపిందనా
అడగక అన్నీ ఇచ్చే నేల తల్లి నెర్రలుగ విచ్చిందనో
పాతాళగంగ వేయి పడగలెత్తి పరుగిడివచ్చింది
ముడుచుకున్న కోన హరితవనాల పక పక లాడింది

జలధార పరవళ్లలో పుష్కరాలొచ్చాయి

ప్రకృతి నైజం నదిని నిలవనీకపోయిందా?
నురగలుగక్కుతూ ఒడ్డుని ఒరుసుకుంది
గట్టులెక్కి తొక్కుడుబిళ్ళలాడింది
పాకుడురాళ్ళెక్కి జారుడుబండ జారింది
తామసికి తలవంచి తన పుటుక మరిచింది

ఉప్పెనై ఎగిసింది, ఉరుకురికి దూకింది

గుండెలవిసే వేగాన వూర్లమీద పడింది
అలిసాక ఆగింది, అదుపు తప్పాననుకుంది
ముంపులోని మాగాణిపైరు చూసి వెరచింది
శవాల గుట్టల దుర్గంధాన్ని పీల్చి వణికింది
బురదమట్టి కాలువల్లో ముక్కలైన తనువున ముగిసింది

గట్టు పక్కన కొండ గుండె పగిలింది

శిలలోని నీరు చితాభస్మానికి గంగ జల్లులై తాకింది
నది కడుపు మళ్ళీ పండింది, శిల ముద్దుబిడ్డైంది
కన్నెగా బతుకు ముగిసి తల్లిగా పుట్టింది
వెనకటి జన్మల పాపపుణ్యాలు సరిలెక్కలయ్యాయి
తృళ్ళింత నడక మందగమనగ మారింది

తడిమిన శిలని అక్కున చేర్చుకు వూయలూపింది
నోరు చాచిన జీవికి రొమ్ము కుడిపి తరించింది
పచ్చిక బైళ్ళలో లేడికూన నెమరువేతైంది
పాలకంకి పైన పిట్టనోటి కూతైంది
మావి చిగురులో లేత మెరుపైంది
మల్లియలో, మరువంలో మంచి గంధమైంది

కలలో కాంచనిది ఇలలో చూసి మురిసింది
మరో జన్మ ఇక వద్దని భూమిసుత నది కదిలింది.

ఆనంద హేల

నేల తోడుకని మొరపెట్టుకుందనా
గడ్డిపోచగ ఓ గుండె పలికింది?

ఎడద పరిచి ఆలాపించిందనా
కన్నయ్య రాధ కనులెదుట నిలిచింది?

నిద్రాణమైన బీజం నిర్వాణం చెందిందా
అనుభూతి అంకురం వటవృక్షమైంది?

మాను జిగురుధారల విలపించిందనా
కొమ్మ చిగురాకులు తొడిగింది?

శిల బీటలిచ్చి తనలోకి చేరిందనా
ఉలి తానై నది గులకరాయిగ మలిచింది?

కడలి ఆటై పోటై తోసుకువచ్చిందా
ఉప్పుటేరుల శోకం వెంటతీసుకుపోను?

ప్రకృతంతా పరుచుకుని ఆనందం నర్తించిందా
అనురాగధారని అక్షరపాదాలుగ మార్చి?