ఆర్తి

నిలువరించలేని మనసుకి నిలకడైన నిశీథికి నడుమ
నిశ్శబ్దబేధి టిక్ టిక్మనే గోడగడియారం
పలుమార్లు పరికించినా పలుకరింపులేవీ మోసుకురాని నా జీవితకొలమానం
సెగల పొగల వీడిపోయే నీటి ఆవిరి వెంట
పొంగి పొర్లిపోయే పాలలా నిట్టూర్పుగానం
వెతల నంటి కమ్ముకొచ్చే కలత చెంత కరిగి చెదిరే కన్నీటిశోకం
విన్నపాలు వినిపించుకో మనసమ్మా?
సొమ్మసిల్లిపోకే చివురుకొమ్మలా, ఎండమావి తీర్చునా నీ దాహార్తి?
కడలి కదులునా తన దరికి రాని నది కొరకు?
సాగి సాగి అలసి సొలసి ఆగి సాగి తానె చేరాలి కాని.

అంబరచిత్రం


కనకాంబరంతో పోటి పడ్డట్లు
అంబరం వన్నెనే అద్దుకుంది క్షణం,
కంటి కుంచె మనసు ఫలకంపై తళుకులద్దే క్షణం
మరి దొరకలేదా వీక్షణం,
మాయదారి సూరీడు మబ్బుతెర విసిరి
వడి వడి అడుగుల పరుగిడి వచ్చి తన చిత్రం గీస్తున్నడాక్కడ,
చుప్పనాతి చిన్నోడు ఎప్పుడూ ఇంతే!

"జాషువాని స్మరించిన రాత్రి మేలుకొలిపిన ఉదయపు ఉనికిది!"

శిశిరాన వాన, మంచు క్రమ్మిన వేకువ

అప్పుడప్పుడు కలియచూస్తూ కదిలేప్పుడు అప్పటికప్పుడు జాలువారే అక్షర మాలలివి...
***
కాలంతొ తరిగిన వన్నెలు, రాలిన ఆకులు... కొమ్మ రెమ్మ మూగవోతుంటే, అమ్మ వేరు మాత్రం కదిలి పొగిలిపోతుందేమో, గాలి చెలికాని తోడుచేసుకొని విలయతాండవంతో విలపించినట్లు తనువెల్లా వణికిస్తొంది

***
పచ్చల పతకం నిలువు దొపిడీగా మొక్కుకుందేమో పిచ్చి నా చిట్టి మొక్క, ఒకటొకటిగా ఆకు రాలుస్తూ మంచు చీరకప్పమని కాలాన్ని ప్రార్ధిస్తుందేమో?

***
గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా
మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు
ఆకసాన అదో అందం
రేయి తొలగి వెళ్ళివస్తానంటున్నా
హత్తుకున్న తీపి తలపులు ఎద వీడి వెళ్ళమన్నట్లు
పరవశాన మదిదీచందం